Archive for మే, 2013

ఆంధ్రజ్యోతిలో నా కథ – థాంక్స్ గివింగ్!


థాంక్స్ గివింగ్

థాంక్స్ గివింగ్ -సాయి బ్రహ్ర్మానందం గొర్తి

హైవే 101 మీద బి.ఎం.డబ్ల్యూ కారు స్పీడ్ లిమిట్ దాటి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు “నెట్ గురు” కంపెనీ అధినేత జే.పీ. అసలు పేరు జయ ప్రకాశ్ అయినా జేపీ అనే అందరికీ చెబుతాడు. ఇంజనీరింగ్ చేసి అమెరికా వచ్చిన జేపీ, సాఫ్ట్ వేర్ వ్యాపారవేత్త అవతారం దాల్చిన ఎంతో మంది భారతీయుల్లో ఇతనూ ఒకడు. సిలికాన్ వేలీ ఫార్ట్యూన్ 500 కంపెనీల్లో అతనిదీ ఒకటి. ఇల్లు సమీపిస్తూండగా జేపీ ఫోన్ మ్రోగింది. ఒకచేత్తో స్టీరింగ్ మీద చేయ్యేసి మరో చేత్తో ఫోన్ తీసి, హలో అన్నాడు.
“హాయ్! స్టీవ్! హౌ డిడ్ ఇట్ గో?” అంటూ పలకరించాడు.
” జేపీ! ఇప్పుడే గూగుల్ కి వెళ్ళి మన కోట్ ఇచ్చి వచ్చాను. చాలామందే ఈ ప్రోజెక్ట్ కోసం ఎగబడుతున్నారు. సిస్కో, జునిపర్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. అయినా మన ప్రోడక్ట్ క్వాలిటీ బావుందనీ వాళ్ళన్నారు. చూద్దాం మన లక్!…” ఆవతలి నుంచి స్టీవ్ అంతా పూస గుచ్చినట్లు చెబుతున్నాడు.
అంతా శ్రద్ధగా విన్నాక కోపం చిర్రెత్తుకొచ్చింది జేపీకి. స్టీవ్, జే.పీ నెట్గురు కంపెనీకి ఇద్దరూ భాగస్వాములు. ఇంతకుముందు ఇద్దరూ సిస్కోలో కలిసి పనిచేసారు. రెండేళ్ళ క్రిత్రం అంటే 2003లో ఆ ఉద్యోగం వదిలేసి బయటొకొచ్చి ఒక నెట్వర్క్ కంపెనీ పెట్టారు. న్యూయార్కులో 2001 సెప్టెంబరు పదకొండు సంఘటన తరువాత అమెరికా ఎకానమీ ఘోరంగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా పుంజుకుంటోంది. క్రితం ఏడాది 2004లో నెట్గురు లాభాలు అంతగా లేకపోయినా, మార్కెట్లో నిలబడ్డానికి గట్టిగా ప్రయత్నిస్తోంది.
“ఈ పెద్ద కంపెనీలు ఏ ఒక్క ప్రోజెక్టూ వదిలి పెట్టవు. మొన్ననే సిస్కోకి 100 మిలియన్ టెండరు వచ్చింది కదా? ఈ ఎనిమిది మిలియన్ల చిన్న ప్రోజెక్ట్లు కూడా వదిలిపెట్టరా? ఛీ…!” అంటూ చికాగ్గా అన్నాడు.
మాటల్లో జేపీని అర్జంటుగా రమ్మనమని స్టీవ్ చెప్పాడు.
“నో! నేను రాలేను. ఇంటికి ఫ్లోరింగ్ పని వాళ్ళు వస్తున్నారు. వెళ్ళి తీరాలి. రేపు మాట్లాడు కుందాం!”
“ఏవిటి? రెండు మిలియన్ల పెట్టి కొన్న కొత్త ఇంటికి ఏడాది తిరక్కుండా అప్పుడే రిపేర్లా?” స్టీవ్ మాటల్లో నవ్వు ధ్వనించింది.
“మొన్న యూరోప్ టూర్ కి వెళ్ళినప్పుడు, ఒక వాటర్ పైపు లీకయ్యింది. దాంతో ఇల్లంతా ఫ్లడింగ్ అయ్యి నీరొచ్చేసి వుడెన్ ఫ్లోరంతా పాడయ్యింది. ప్రస్తుతం టైల్స్ వేయిద్దామనుకుంటున్నాను. ఈ కాంట్రాకటర్లతో సరిగ్గా మాట్లాడుకోక పోతే కష్టం. వెళ్ళి తీరాలి. మా ఆవిడ రాకపోతే చంపేస్తుంది,” అంటూ తరువాత చూసుకుందామని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
ఇంటికొచ్చేసరికి నలుగురైదుగురు లాటినో పనివాళ్ళు కనిపించారు. వాళ్ళల్లో పొట్టిగా ఉన్న ఒకతను జేపీకి పరిచయం చేసుకున్నాడు. ఇంతకుముందు వచ్చి ఈ పనికి ఎంతవుతుందన్న బేరం కుదుర్చినతను వేరు. ఆ కాంట్రాక్టరుతో వచ్చినట్లు లేడు ఇతను.
కాస్త గోధుమ రంగులో నల్లటి జుట్టుతో ఉన్నతన్ని చూడగానే లాటినో అన్నట్లే ఉన్నాడు. అతని పేరు హోసే అని చెప్పి, పని మొదలు పెడతామనీ, హాల్లో ఉన్న మెట్లని కొట్టి మరలా కొత్తవి వెయ్యాలని చెప్పాడు. సరేనన్నాడు జేపీ.
” పిల్లలిద్దరూ చంపుకు తినేస్తున్నారు. మీరు ఎలాగయినా ఆ ఐపాడ్ మినీ (iPod – Mini) కొనండి. స్కూల్లో అందరికీ ఉందనీ పెద్దాడు ఒకటే గోల. వాణ్ణి చూసి మీ ముద్దుల కూతురూ మొదలు పెట్టింది. వీళ్ళ గోల భరించలేకుండా ఉన్నాను,” మేడ మీదకి రాగానే భార్య సుమ తన గోడు వెళ్ళబుచ్చుకుంది.
“అయినా వేలెడు లేరు, వీళ్ళకి ఐపాడ్ ఎందుకట? ఒక్కొక్కటీ రెండొందల డాలర్లు? ఇవాళ మార్కెట్లోకి ఒకటి వస్టే, రేపు మరొకటొస్తుంది. మొన్ననే గేం బోయ్ కొన్నాను కదా? అంతగా పాటలు వినాలనుకుంటే ఎంపీ3 ప్లేయరు కొనిస్తానని చెప్పు,” చికాగ్గా అన్నాడు జేపీ. అమెరికాలో యాపిల్ కంపెనీ మార్కెట్లోకి వదిలిన ఐపాడ్ మినీ గురించీ, జనాలకి దానిపై ఉన్న మోజు గురించీ జేపీకి తెలుసు. అది మరీ హైస్కూలు పిల్లలక్కూడా అంటిందాని ఆశ్చర్యపోయాడు.
స్కూల్లో తోటి పిల్లల వత్తిడి వల్ల వీళ్ళూ తన బుర్ర తింటున్నారని సుమ చెప్పింది.
“రేపు థాంక్స్ గివింగ్కి వాల్మార్ట్ 140 డాలర్లకి సేల్ పెట్టాడని బాబీ చెప్పాడు. వంద డాలర్లు తగ్గినా తగ్గినట్లే!…” అంటూ ఏకబిగిన చెప్పుకుపోతోంది సుమ. థాంక్స్ గివింగ్ సేల్లో కొంటానని పిల్లల్ని సముదాయించమని చెప్పాడు. పిల్లలమాట దేవుడెరుగు సుమ మాత్రం హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది.
మొహం కడుక్కొచ్చి ఆఫీసు పని చేసుకుందామని లేప్ టాప్ తీసాడు జేపీ. క్రింద రేడియోలో పెద్దగా లాటినో పాటలు వినిపించడంతో చిర్రెత్తుకొచ్చింది జేపీకి. కాస్త వాల్యూం తగ్గించమని అడుగుదామని క్రిందకి వచ్చాడు. ఆ స్పానిష్ సంగీతం కట్టేయమని హోసేపై కోప్పడ్డాడు. అది చూసి హోసే చిన్నబుచ్చుకున్నాడు. వెళ్ళి రేడియో కట్టేసాడు. కొంతసేపటికి అక్కడ మెషీన్ హోరూ, పనిముట్ల చప్పుళ్ళూ ఎక్కువయ్యేసరికి ఆ స్పానిష్ పాటలే మెరుగనిపించింది జేపీకి. క్రిందకొచ్చి హోసేకి పాటలు పెట్టుకోమని చెప్పాడు. హోసే మొహంలో చిరునవ్వు తాండవించింది.

0000000000000000
పిల్లలు స్కూల్ నుండి రాగానే థాంక్స్ గివింగ్ సేలుకి ఐపాడ్ మినీ కొంటానని చెప్పడంతో పిల్లలు ఎగిరి గంతేశారు. వాల్మార్ట్ ఉదయం నాలిగింటికి తెరుస్తాడనీ, రాత్రి పదింటికల్లా వెళ్ళి క్యూలో నిలబడితే గానీ దొరకదనీ బాబీ తండ్రికి ముందుగానే చెప్పాడు. అమెరికాలో థాంక్స్ గివింగ్ సేల్ గురించి జేపీకి తెలుసు. గతంలో ఈ సేల్లో రాత్రి నిలబడి చాలానే ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నాడు.
వారం రోజులుగా ఇంట్లో పని జరుగుతోంది. పెద్ద డబ్బాలాంటి టూ-ఇన్-వన్తో ఉదయం ఎనిమిదికల్లా ప్రత్యక్షమవుతాడు హోసే. వాళ్ళు పాటలు వింటూ పనిచేసు చేసుకుంటారు. జీపీక్కూడా స్పానిష్ సంగీతం నచ్చుతోంది. వచ్చీ రానీ ఇంగ్లీషుతో జేపీతో సంభాషిస్తాడు హోసే. అతనికి వాళ్ళ స్పానిష్ యాస ఒక్కోసారి అర్థం కాదు. మెల్లగా హోసేతో బాగానే పరిచయం అయ్యింది. హోసే మెక్సికో నుండి వచ్చాననీ ఇక్కడ ఇలాంటి కాంట్రాక్ట్ వర్కు చేసుకు బ్రతుకుతున్నాననీ, తను స్పానిష్ పాటలంటే చెవి కోసుకుంటాననీ చెప్పాడు.
“హోసే! ఇంత పెద్ద టేపు రికార్డర్ మోసుకోవడం ఎందుకు? సుబ్బరంగా ఐపాడ్ కొనుక్కోరాదూ?” అంటూ హోసేకి ఉచిత సలహా పారేసాడు జేపీ. హోసే కొడుకూ అది కొనమని గొడవ చేస్తున్నాడనీ, అది చాలా ఖరీదవడం వల్ల కొనలేనన్న తన అసక్తతని వెలిబుచ్చాడు. జేపీ వాల్ మార్ట్ సేల్ గురించి చెప్పాడు. తనూ వెళ్ళి కొనడానికి ప్రయత్నిస్తాననీ అన్నాడు హోసే!
000000000000
చూస్తొండగా థాంక్స్ గివింగ్ వచ్చేసింది. నవంబరుకే చలి చంపేస్తోంది. జేపీ, సుమా పిల్లలతో కలిసి రాత్రి పదింటికల్లా వెళ్ళి వాల్ మార్ట్ కి బయల్దేరారు. బాబీకయితే అదొక థ్రిల్. ఆకలేస్తే తినడానికి సుమ స్నాక్స్ పట్టుకొచ్చింది. కూర్చోడానికి చిన్న మడత కుర్చీ కూడా తెచ్చుకున్నారు. ఎముకలు కొరికే ఆ చలిలో ఆ లైను లో నిలబడ్డారు, సుమా, పిల్లలూ. జేపీ మాత్రం కారులో కూర్చొని లాప్టాప్ మీద పనిచేసుకుంటున్నాడు. అక్కడ చాలామంది చైనీసు వాళ్ళూ, లాటినోలూ, ఇండియన్సూ కనిపించారు. అక్కడక్కడ నల్ల జాతీయులు కూడా కనిపించారు. లైను పెద్దదిగానే ఉంది. బాబీకి మాత్రం చాలా టెన్షన్ గాఉంది. తనకి ఐపాడ్ మిని దొరుకుతుందో లేదోనని. వీళ్ళ వెనక్కాలే ఒక లాటినో స్త్రీ ఉంది. ఆమెతో పాటే ఇద్దరు పిల్లలూ ఉన్నారు. ఇహ పావుగంటలో వాల్మార్ట్ తలుపులు తెరుస్తారనగా జీపీ వచ్చి లైనులో నిలబడ్డాడు. అంతే ఆ స్పానిష్ స్త్రీ లైను మధ్యలో దూరుతున్నాడని జీపీతో గొడవ పెట్టుకుంది. మొత్తానికి జీపీ సర్ది చెప్పాడు. కానీ ఆ స్పానిష్ స్త్రీ మాత్రం గుర్రుగానే చూస్తోంది జేపీని.
వాల్మార్ట్ తలుపులు తెరవగానే బిల బిలమంటూ అందరూ పరిగెత్తారు. సుమా, జీపీ, పిల్లలూ ఎలక్ట్రానిక్స్ విభాగం వైపు పరిగెత్తారు. అక్కడ ఐపాడ్ మిని కోసం జనం ఎగబడుతున్నారు. అక్కడున్న పెద్ద పెట్టెలో అందరూ తలొకటీ తీసుకుంటున్నారు. ఇహ మూడే మిగిలాయి. జీపీ, సుమా చెరొకటీ తీసుకున్నారు. ఇహ మిగిలిందాన్ని బాబీ, ఇంతకుముందు లైన్లో ఉన్న లాటినో పిల్లాడూ లాక్కోబోయారు. జీపీ ఇద్దర్నీ విదిలించే ప్రయత్నం చేస్తూండగా ఆ పిల్లాడు క్రింద పడిపోయాడు. బాబీ వేంటనే క్రింద పడ్డ ఐపాడ్ మినీ లాక్కొన్నాడు. ఇంతలో ఆ పిల్లాడి తల్లి వచ్చి కోపంగా చూసి స్పానిష్లో గట్టిగా తిట్టింది జేపీని. ఆమె మాటలేం పట్టించేకోకుండా కౌంటరు వైపు నడిచాడు జేపీ.
మొత్తానికి విజయవంతంగా మూడు ఐపాడ్లు కొన్నాడు జేపీ; పిల్లలిద్దరికీ చెరొకటీ, ఇండియాలో ఉన్న బావమరిదికొకటీ.
000000000000000
ఆ మర్నాడు హోసే వచ్చినప్పుడు ఐపాడ్ చూపించాడు జేపీ. స్పీకర్ పెట్టి పాటలు వినిపించాడు. హోసే ఎంతో ఆశ్చర్యంగా చూసాడు.
తను కొనుక్కుందామనుకున్నాడు కానీ తనకి అంత స్థోమత లేదనీ చెప్పాడు. తను రోజుకి అయిదు డాలర్లు సేవ్ చేసి తన కొడుక్కి పుట్టిన రోజు కానుకగా కొనిస్తానని చెప్పాడు. ఓ నాలుగు రోజుల తరువాత హోసే ఫ్లోరింగ్ పని ముంగించేసాడు. తను స్పానిష్ పాటలు మిస్సవుతున్నానని వెళ్ళే ముందు జీపీ అంటే, తన వద్దనున్న సంచీలోంచి ఒక స్పానిష్ పాటల సీడీ బయటకు తీసాడు హోసే.
“తీసుకోండి. దిసీజ్ మై గిఫ్త్!” స్పానిష్ యాసలో అంటూ జేపీ చేతిలో సీడీ పెట్టాడు.
గత మూడు వారాలుగా స్పానిష్ పాటలు చెవులకి పట్టేసాయి జేపీకి. కాదనకుండా తీసుకున్నాడు.
000000000000
ఓ నాలుగు వారాల తరువాత ఇంట్లో మేడ మీద బాత్రూం పైపింగ్ పోయింది. సుమ ముందుగానే హెచ్చరించినా జేపీ అంతగా పట్టించుకోలేదు. ఓ రోజు ఆ పైపు కాస్తా లీకయ్యి, గదంతా నీరొచ్చేసింది. ఆఫీసునుండి పరిగెత్తుకొచ్చాడు జేపీ. హోసేకి కాల్ చేసాడు, వేంటనే రమ్మనమని. ఆ సాయంత్రం హోసే వచ్చాడు. ఆ మర్నాడే వచ్చి రిపేరు చేస్తానని చెప్పి వెళిపోయాడు.
ఆ మర్నాడు ఉదయం హోసే వచ్చే వరకూ వర్కుకి వెళ్ళలేదు జేపీ. ఎనిమిదింటికల్లా వచ్చే హోసే తొమ్మిదయినా రాలేదు. జేపీకి పదింటికి మీటింగ్ ఉంది. సాధారణంగా టైముకి వచ్చే హోసే అరగంట ఆలస్యంగా వచ్చాడు. వస్తూనే సారీ చెబుతూ తన పనిముట్లని వ్యానులోంచి ఒక్కొక్కటే లోపల పెడుతున్నాడు. అతనితో మాట్లాడుదామనుకూంటూండగా స్టీవ్ నుండి జేపీకి ఫోనొచ్చింది.
“జేపీ! బాడ్ న్యూస్! మనకి గూగుల్ ప్రోజెక్ట్ రాలేదు!”
“షిట్! గూగుల్ వాళ్ళు మనకే ఇస్తామని, కాంట్రాక్టు మనదేనని చెప్పారు! బెంచ్ మార్క్స్ అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయనారు కదా?” గట్టిగా కోపంతో అన్నాడు.
“అవుననుకో! కానీ సిస్కో వాళ్ళు ఏం చెప్పారో తెలీదు. ఆ కాంట్రాక్ట్ సిస్కోకే వెళ్ళింది,” స్టీవ్ గొంతులో నిరాశ ధ్వనించింది.
“ఛీ! ఈ పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలని బ్రతనివ్వవు. మరీ చిన్న ప్రోజక్ట్లకి కూడా కక్కూర్తి పడాలా?” అంటూ విసూరుగా కారు వద్దకు పరిగెత్తాడు.
హోసే తన పనిముట్లని ఒక్కక్కటే లోపలికి తెస్తున్నాడు. అతని వెనుకే చేతిలో పనిముట్లతో ఒక చిన్నపిల్లాడు లోపలకి వస్తూ కనిపించాడు. వాళ్ళని చూసేసరికి పరాగ్గా ఫోను మాట్లాడుతున్న జెపీ దృష్టి వాళ్ళ వైపు మళ్ళింది. ఎక్కడో చూసినట్లు గుర్తొచ్చింది, ముఖ్యంగా ఆ చిన్నపిల్లాణ్ణి.
చేతిలో టేపు రికార్డరుతో ఆ పిల్లాడు లోపలకి ప్రవేశించాడు.
00000000000000

-సాయి బ్రహ్ర్మానందం గొర్తి

ప్రకటనలు

4 వ్యాఖ్యలు