Archive for నవంబర్, 2010

కథ-2009 – నేను రాసిన “అతను” కథ

జాజర

జాజర

ఈసారి కథ-2009 ఆవిష్కరణ ఈ నెల 21న తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతుంది.

ఈ కథ-2009 లో నేను క్రితం ఏడాది రాసిన “అతను” కథ కూడా చోటు చేసుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

ఆ వివరాలిక్కడ ఇస్తున్నాను. హైద్రాబాదులో ఉంటే ఔత్సాహికులైన వాళ్ళు వెళ్ళండి. కథలగురించి చర్చలు జరుగుతాయి. కాస్తో కూస్తో కొత్త విషయాలు తెలుస్తాయి.


ఆహ్వానం

ఈ “అతను”కథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ మధ్య కథల క్రింద రచయితల ఫోన్ నంబరు కానీ, ఈమెయిలు కానీ ఇస్తున్నారు. అందువల్ల పాఠకులు నేరుగా రచయితతో తమ అభిప్రాయాలని పంచుకునే అవకాశముంది. ఈ “అతను” కథకి అప్పట్లో పాఠకులనుండి చాలా అంటే 200 పైగా ఈమెయిళ్ళు వచ్చాయి. ఆ పరంపర చూసి చాలా ఆశ్చర్యపోయాను. అవన్నీ దాచిపెట్టాను. ఎప్పటికయినా కథా సంకలనం వేస్తే అందులో అవి ప్రచురిస్తాను.

పరిచయంలేని పాఠకులు కథపై విశ్లేషణలు చేస్తూ రాసారు. వ్యక్తుల పరిచయం లేనప్పుడు నిర్భయంగా, నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పడానికి వీలుంటుంది. అదే పరిచయమున్న వ్యక్తులూ, మిత్రులయితే భిన్నంగా ఉంటుంది. తోటి రచయితలయితే చెప్పనవసరం లేదు. నొచ్చుకుంటారనో, ఎక్కడ రిలేషన్లు చెడుతాయనో అసలేం చెప్పరు. ఎప్పుడైనా కలిసినప్పుడు కొంతమందిని “నా కథ ఆంధ్రజ్యోతిలోనో, ఆంధ్రభూమిలోనో వచ్చిందని చెప్పామనుకోండి, “అలాగా? చదవలేదంటారు”. మరికొంతమంది రచయితలయితే “మేం ఇంకోళ్ళ రచనలు చదవం; చదివితే వాళ్ళవి చూసి ఇంఫ్లూయన్స్ లేదా ప్రభావితమయ్యే అవకాశముందని” చెప్పడంతో ఎవరికీ నా రచనల గురించి చెప్పడం మానేసాను. కనిపిస్తే వాళ్ళే చదువుతారులే అనుకుంటాను.

చాలాసార్లు రచనకీ, పాఠకుడికీ మధ్య రచయితొచ్చి కూర్చుంటాడు. రచన్ని దాని వస్తు నాణ్యతని బట్టి కాకుండా రచయితమీద పాఠకుడికుండే అభిప్రాయాన్ని బట్టి బేరీజు వెయ్యడం తరచు చూస్తూ ఉంటాం. అందువల్ల వ్యక్తిగతంగా కిట్టనివాళ్ళు ఏం రాసినా చెత్తలాగానే ఫీల్ అవుతారు. అభిప్రాయాలు మారితే తప్ప అలాంటివాళ్ళని ఓపట్టాన ఒప్పించలేరు. అలాంటి ప్రయత్నం చేయడం కూడా వ్యర్ధం. ఇంకొంతమందుంటారు. ఎదుటివారి రచన బావుందంటే వాళ్ళు ఓ మెట్టు క్రిందకి పడిపోయామనుకొని బెట్టుగా “బానే వుంది; ముగింపే ఇంకోలా ఉండివుంటే బావుండేది. మీరు పలానా వారి కథలు చదవండి. కథలెలా రాయాలో తెలుస్తుంది.” అంటూ కథోపదేశం చేస్తారు.
ఏ రచన్నయినా రచయిత తన భుజాల మీద ఎంతకాల మొయ్యగలడు? రచనలు నిలవాల్సింది రచయితల భుజాల మీద కాదు; పాఠకుల మనసుల్లో!

ఏ రచనయినా దానికాళ్ళ మీద అది నిలబడినప్పుడే దాని గొప్పతనం బయటపదేది. మొహమాటపు మెచ్చుకోళ్ళూ, బలవంతపు పొగడ్తల కంటే దూరంగా ఉన్న నిశ్శబ్దపు చప్పట్ళే రచయితలకి కాస్త వూతమిస్తాయి.

కొంతమంది చదవకుండానే పొగడ దండలేసి ఉక్కిరిబిక్కిరి చేస్తేస్తారు. పొగడ్త ధూపమయితే పరవాలేదుకానీ, పొగయితే ఊపిరాడదు.

ఈ ప్రపంచంలో పొగడ్తలు కిట్టని వారెవరుంటారు? పైకి వద్దాన్నా మనసెప్పుడూ అర్రులు చాచుతూనే వుంటుంది. స్థితప్రజ్ఞత అన్న పదం కళాకారుల నిఘంటువులో ఉండదు. దీనికి మినహాయింపెవ్వరికీ వుండదు; నాతో సహా!

పొగడ దండలేసినా వెయ్యకపోయినా, ఏ రచనయినా, ముఖ్యంగా కథలు, ఏ ఒక్క పాఠకుణ్ణయినా ఒక్క నిమిషంపాటు ఆలోచింపచేసినా ఆ రచనకి సార్ధకత లభించినట్లే!

5 వ్యాఖ్యలు

Older Posts »