Archive for ఫిబ్రవరి, 2012

“సరిహద్దు” – కథావలోకనం

జాజర

తెలుగునాడి పత్రికలో “సరిహద్దు” సమీక్ష – ఇక్కడ చదవండి.

సరిహద్దు కథావలోకనం

సరిహద్దు కథా పుస్తకం అచ్చేసి ఆర్నెల్లు దాటింది. తెలుగు నాట దాదాపు అన్ని పత్రికల్లోనూ సమీక్షలు వచ్చాయి. పుస్తకం చదివి కొంతమంది నేరుగా నాకు తమ అభిప్రాయాల్ని రాసారు. అమెరికావాసులు ఫోన్ చేసి మరీ చెప్పారు. ఇండియానుండీ ఫోన్లూ, మెయిళ్ళూ వచ్చాయి. కొన్ని కొత్త పరిచయాలు అయ్యయి. మరికొన్ని స్నేహాలు కలిసాయి. కానీ మూడు సంఘటనలు మాత్రం కించిత్ ఆశ్చర్యానికీ, కాస్త ఆనందానికీ గురిచేసాయి. ఇవి నేనూహించని విషయాలు. కొన్ని నిరాశ కలిగించిన విషయాలూ ఉన్నాయి. అవి చివర్లో చెబుతాను.

మొదటిది:

ప్రముఖ కథా రచయిత శ్రీపతి గారు తానా సభలకి వచ్చినప్పుడు పుస్తకం ఇచ్చాను. ఆయన నెలరోజుల తరువాత స్వదస్తూరీతో మొత్తం కథల మీద తన అభిప్రాయాలని పది పేజీల ఉత్తరం రాసారు. చదివి కించిత్ ఆశ్చర్యానికీ, కాస్త ఆనందానికీ గురయ్యాను. నాకోసం ప్రత్యేకంగా సమయం వెచ్చించి రాసినందుకు సంతోషం వేసింది. తానాకి వచ్చే వరకూ ఆయనకీ, నాకూ పరిచయం లేదు. పైగా ఆయనకి నేనెవరో కూడా తెలీదు. అతి తక్కువ పరిచయం ఉన్న వ్యక్తినుండి ఉత్తరం రావడం ఊహక్కూడా అందలేదు.

రెండోది:

రెండు వారాల క్రితం హఠాతుగా హైద్రాబాదు నుండి కాలొకటి వచ్చింది. ఎవర్రా అని చూస్తే సినిమా డైరక్టరు వంశీ గారు. ఆయనకి సరిహద్దు కథలు బాగా నచ్చాయనీ నన్ను అభినందించడానికి చేసారాని చెప్పారు. చాలా సంతోషం కలిగింది. వాసిరెడ్డి నవీన్ గారు ఆయనకి పుస్తకం ఇచ్చారనీ చెప్పారు. ఒక తోటి రచయతని మెప్పించడం ఎవరికైనా ఇష్టమే కాదు; కష్టం కూడా. వీటికంటే ఎదుటివారి రచనలు చదివి నచ్చిందనిపిస్తే పిలిచి మరీ చెప్పడానికి తీరికే కాదు, పెద్ద మనసే కావాలి. రచనా ప్రక్రియ పట్ల మర్యాద ఉంటేనే మెచ్చుకోలు సంస్కారం అలవడుతుంది. ఇలా అంటే మెచ్చుకోని వాళ్ళు సంస్కారహీనులని కాదు. ముఖస్తుతికోసం కాకుండా, నచ్చిన విషయాన్ని ఏ భేషజం లేకుండా చెప్పడం ఎంతో మానసిక పరిపక్వత ఉంటే కానీ అబ్బని గుణం.

మూడోది:

ప్రముఖ కథా రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు గారు. ఆయన ఈ మధ్య అమెరికా వస్తే కలిసినప్పుడు పుస్తకం ఇచ్చాను. మూణ్ణెల్ల వరకూ అయనకి చదవడానికి కుదరలేదట. ఆయన దగ్గర పుస్తకాన్ని వాళ్ళింట్లో ఎవరో చదివి బావున్నాయని చెబితే మరలా తీసుకొని చదివానాని చెప్పారు. ఆయనకీ బాగా నచ్చాయని చెబుతూ హిందీలోకి అనువాదం చేస్తానని చెప్పారు. లక్ష్మీ ప్రసాదు గారుకి నేను కౌముదిలో రాస్తున్న నేహల బాగా నచ్చింది. మొదట పది భాగాలూ చదివి, మొత్తం నవలగా వేయమని చాలాకాలం క్రితమే చెప్పారు.

పైన చెప్పిన అందరూ వారి కాలాన్ని వెచ్చించి నాకోసం ప్రత్యేకంగా కాల్ చేసి మరీ అభినందించడం వారి మర్యాదనీ, సంస్కరాన్నీ, పెద్ద మనసునీ తెలుపుతుంది. వారి ప్రశంసకి నేను తగినవాణ్ణో కాదో తెలీదు; కానీ వారి అభినందనలు ఖచ్చితంగా ఊతం ఇస్తాయని నమ్ముతున్నాను.

మొదట్నుంచీ కథలు రాయాలనే తప్ప అవన్నీ గుదిగుచ్చి ఓ పుస్తకం వేయాలన్న ఆలోచన నాకెప్పుడూ లేదు. చాలా కాలం క్రితం కేతు విశ్వనాథ రెడ్డి గారు అమెరికా వచ్చిన సందర్భంలో నా కథలు చదివి పుస్తకం వేయమని చెప్పారు. ఆయన సలహాని అంతగా తీసుకోలేదు నేను.

కథ-2009లో నా కథ వచ్చాక చాలామంది నేను రాసిన కథల గురించి అడిగారు. నవీన్ గారు కూడా పుస్తకం వేయమని పదే పదే చెప్పడంతో సరే వేద్దామనుకున్నాను. అసలు దీనికంటే ముందుగా త్యాగరాజు పుస్తకం రావాలి. కానీ దగ్గరుండి ప్రింటింగ్ అవీ చూసుకోవలనీ, హార్డ్ బౌండ్ వేద్దామనీ ఇలా రకరకాల ఆలోచనలతో కాలం గడిచిపోయింది.

ఈలోగా తానాలో నేను సాహిత్య విభాగ సంధానకర్తగా ఉండడంతో ఆ సమయానికి కథలపుస్తకమే మేలన్న అభిప్రాయంతో ముందు కథల పుస్తకమే అచ్చేసాను. త్యాగరాజు పుస్తకం ప్రత్యేకంగా ఒక శాస్త్రీయ సంగీత కచేరీలో విడుదల చెయ్యాలన్న అలోచన వుంది. చూద్దాం. ఏమవుతుందో?

తానాకీ వస్తూ కాత్యాయని గారూ, మృణాలిని గారూ కొన్ని ప్రతులు తీసుకొచ్చారు. తానాలో రిలీజు చేద్దామని నేననుకోలేదు. మరలా నవీన్ గారే చెయ్యాలి అని పట్టు పట్టడంతో సరేనన్నాను. ఒక చిన్న విరామ సమయంలో రిలీజు చేసాను. వేలూరి గారూ, నవీన్ గారూ, జంపాల గారూ పుస్తకాన్ని విడుదల చేసారు. నా దగ్గరున్న కొన్ని కాపీలు అక్కడున్న కొంతమందికి ఇచ్చాను. ఆ సందర్భంలోనే శ్రీపతి గారు తనకీ ఒక కాపీ ఇమ్మని అడిగారు. ఆ సమయానికి నా దగ్గరున్నవి అయిపోయాయి. అప్పుడు నవీన్ గారి వద్దనున్న పుస్తకాన్ని ఆయనకి ఇచ్చాను. అప్పుడే శేఖర్ కమ్ములకీ, గొల్లపూడి వారికీ చెరోక పుస్తకమూ ఇచ్చాను.

ముందు చెప్పినట్లు పరిచయమున్న వారికంటే, పరిచయం తక్కువున్న వారినుండే పుస్తకంపై అభిప్రాయాలు ఎక్కువగా వచ్చాయి. తానా సభల్లో, పుస్తకం అట్ట చూసి మృణాళిని గారు “పుస్తకం కవరు పేజీ మాత్రం బ్రహ్మాండంగా వుంది” అని జోక్ చేసారు. “మాత్రం” అన్నది “ఒక్కటే” అన్న ధ్వనిస్తోందని నేనంటే అక్కడున్న వాళ్ళు గొల్లుమని నవ్వారు. ఆ తరువాత ఇదొక పెద్ద జోకుగా నేనే చాలామందికి చెప్పాను. కానీ ఇండియా వెళ్ళిన తరువాత మృణాలిని గారు పుస్తకం చదివి, కథలు నచ్చాయి, ముఖ్యంగా భాష, కథనం తనకి ప్రత్యేకంగా నచ్చాయని” ఈ మెయిలు పంపారు. “ఆట్టే కాదు; అట్ట క్రింద సరుకు కూడా బావుంది. సరుకు నాణ్యత తక్కువయినప్పుడే ప్యాకింగ్ అందంగా వుంటుందన్న అపోహకి భిన్నంగా ఉందని చెప్పారు. “పుస్తకంలో కథలు నచ్చాయి; కవరు పేజీతో సహా!” అని రెండో వాక్యాన్ని వత్తి పలుకుతూ జోక్ చేసారు.

ఈ సందర్భంలోనే ఇంకో విషయం చెప్పాలి. తానా సభలకి “కాత్యాయని విద్మహే” గారికి వీసా పేపర్లు పంపే సందర్భంలో, ఆవిడనీ, మృణాలిని గారినీ “వుమెన్స్ ఫోరం” కి ప్రత్యేకంగా స్త్రీల సమస్య గురించి మాట్లాడమని చెప్పారు. “ఏవుంది లెండి. మీ ఆడాళ్ళందరూ చేరి మగాళ్ళని ఆడిపోసుకుంటారు,” అంటూ నేను చాలా జోకులు వేసాను. ఆవిడ అవన్నీ విన్నాక “నేనొక పురుషాహంకారి”నని అనుకున్నాననీ, స్త్రీలంటే తక్కువ భావం ఉందనీ భావించారనీ చెప్పారు. ఆవిడ కొన్ని పుస్తకాలు తనతో పాటు తానా సభలకొస్తూ తెచ్చారు. ప్రయాణంలో సరిహద్దు పుస్తకంలో స్త్రీల గురించి రాసిన కొన్ని కథలు చదివి ఆశ్చర్యపోయాననీ అన్నారు. ఫోనులో మాట్లాడినప్పుటికీ, ఈ కథలు చదివికా నన్ను చూసాక మాట్లాడినప్పటికీ మధ్య తన అభిప్రాయం మారిందనీ సరదాగా చెప్పారు.

తానా జరిగిన నెల్లాళ్ళకి మరో మిత్రుడు పాతిక కాపీలు పట్టుకొచ్చాడు. అవన్నీ నాకు తెలిసిన కొంతమంది రచయిత మిత్రుల అడ్రసులు సంపాదించి అందరికీ పంపాను. మా వూరి దగ్గరున్న వారికి మాత్రం నేనే ఇచ్చాను. దూరప్రాంతాల వారికి పంపినప్పుడే కాస్త నొచ్చుకున్నాను. ఎందుకంటే కొంతమంది అందిందనీ కూడా ఈమెయిల్ ఇవ్వలేదు, నేనే మరలా ప్రత్యేకంగా గుర్తుచేసే వరకూ! కొంతమంది ఈమెయిలిక్కూడా జవాబివ్వలేదు. పుస్తకం కొనుక్కోమని ఎవర్నీ అడగలేదు. కానీ నేనే పోస్టేజీ చార్జీలు మహాయితే రెండు డాలర్లవుతాయనుకొని, అది నాకు లెక్క కాదనుకొని పంపాను. కొంతమంది చదివి చెబుతామని అన్నారు. ఇంతవరకూ ఒక్కరంటే ఒక్కరు వారి అభిప్రాయాన్ని చెప్పలేదు.

నేనేదో పెద్ద కథకుణ్ణీ, మహారచయితననీ భ్రమలూ, అపోహలూ నాకు లేవు. అందరికీ అన్నీ నచ్చాలన్న రూలూ ఏవీ లేదు. “మీ కథలన్నీ ఈమాటలో ఎప్పుడో చదివేసాను. మరలా ప్రత్యేకంగా చదవ నవసరం లేదు,” అని సాటి కథకుడు చెప్పారు. ఆ పుస్తకంలో వున్న పాతిక కథల్లో ఈ మాటలో వచ్చినవి ఆరో, ఏడో ఉన్నాయి. చాలా కథలు తెలుగు వార, మాస పత్రికల్లో అచ్చయినవే! నేనేమీ రెట్టించలేదు. ఆ ప్రస్తావన పొడిగించలేదు.

దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో రివ్యూలు వచ్చాయి. ఒక మిత్రుడు అందులో కొన్ని చదివి, “మీరు పి.ఆర్ బాగానే చేశారు!” అని వ్యంగ్యం విసిరాడు. “నేను కథలు రాస్తాను. వాటిని మోయను,” ఇదీ నా జవాబు.
అది విని ఆయనకి ఏవనాలో తెలీలేదు. నిజానికి రివ్యూ కోసం నేను ఏ పత్రికనీ ఆశ్రయించలేదు.
పరిచయమున్న ఎవర్నీ రివ్యూ రాయమని అడగలేదు. అది నా పద్ధతికి విరుద్ధం. పత్రికల వాళ్ళకి రెండేసి కాపీలు మెయిల్లో ( పోస్టులో ) పంపే ఏర్పాటు మాత్రమే చేసాను.

ఇష్టంలేని పని బలవంతాన కదలదు; అలాగే ఇష్టమున్న పనికి ఎవరూ, ఏదీ అడ్డు కాదు. నాకు రాయాలనిపించిందీ, తోచిందీ రాసాను. నచ్చినా నచ్చకపోయినా అవన్నీ నా దృష్టిలో గతం. మరలా మార్పులు చేయను. ఏదైనా రచన కానీ, చిత్రం కానీ ప్రజల మధ్య వదిలితే రాళ్ళూ పడచ్చు; రత్నాల హారమూ వేయచ్చు. పొగడ్తలూ ఉంటాయి;పేడ విసుర్లూ ఉంటాయి. రెంటికీ రచయితలూ, కళాకారులూ సిద్ధపడే వుండాలని నేను గాఢంగా నమ్ముతాను. సత్తా వుంటే దాన్ని కాలమే మోస్తుంది. లేదంటే ఉక్కుపాదాలతో నలిపేస్తుంది. ఆ స్థాయికి ఎదగాలంటే నిరంతర కృషి కావాలి. రాయడం పట్లా, చదివే వారి ఎడలా గౌరవం ఉండాలి. ఇది నా అభిప్రాయం.

ఈ “సరిహద్దు” చాలా మంది కొత్త మిత్రులని పరిచయం చేసింది. మిత్రుడి విన్నకోట రవిశంకరుకీ తానా కొచ్చినప్పుడు పుస్తకం ఇచ్చాను. ఆయన “మేడికో శ్యామ్”కి చదవమని ఇచ్చారట. శ్యామ్ పుస్తకం చదివి, కొన్ని కథలు నచ్చీ నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. తరువాత మంచి స్నేహమూ కలిసింది. ఈ మధ్యనే కుటుంబరావు గారి అమ్మాయి శాంతసుందరి గారినీ, ఆవిడ భర్త గణేశ్వరరావు గారినీ కలవడం జరిగింది. వారికీ సరిహద్దులో కథలు నచ్చాయనీ చెప్పారు. ఇలా ఎంతోమంది తమ అభిప్రాయాలని చెప్పారు.

కొంతమంది కొన్ని కథలు ప్రచురించకుండా ఉండాల్సిందని అన్నారు. నేను 1979-80లో రాసిన రెండు కథలూ ఇందులో వేయలేదు. అలాగే రెండు మూడు హాస్య కథలూ అందులో పెట్టలేదు. ఎవరి చేతనయినా ముందుమాట రాయించకపోయారాని మరికొంతమంది అడిగారు. నాకు “ముందు మాటలు” మీద నమ్మకం లేదు. ముఖ్యంగా కథలకి. అట్ట వెనుక అందుకే కేతు విశ్వనాథ రెడ్డిగారిదీ, వేలూరి గారిదీ, నవీన్ గారిదీ “పొగడ” వాక్యాలు పెట్టాను. “పొగడ” ఎక్కువయితే పొగతో ఊపిరాడదు. నాక్కాదు. పాఠకులకి.

కథల నేపథ్యం చెబుతూ “నా మాట” రాయలేదేవని ఇంకొకాయన అడిగారు. మొదట్లో నాలుగంటే నాలుగు వాక్యాలు కెలికాను కదా, అది చాలని చెప్పాను. ఇంకొకరు అచ్చు తప్పులు బాగానే ఉన్నాయని చెప్పారు. మనకి తెలుగులో స్పెల్ చెకర్స్ ఉంటే ఎంత బావుణ్ణు కదానిపించింది.

నచ్చినా, నచ్చకపోయినా ఎదుటవారి అభిప్రాయాన్ని గౌరవిస్తాను. తప్పులు తెలిస్తే మరలా అటువంటివి ముందు ముందు జరక్కుండా చూసుకునేలా జాగ్రత్త పడతాను.

ఏవయినా సరిహద్దు కథాయానం ఒక మంచి అనుభూతి. ఊహించని స్పందన ఆశ్చర్యానికి గురిచేసింది.
తమ అమూల్యకాలాన్ని వెచ్చించీ నాకు ఫోన్ చేసిన వారికీ, మెయిల్ ఇచ్చిన వారికీ, ఎదుటపడినప్పుడు చెప్పిన వారికీ కృతజ్ఞతలు.

మొదటి కథ పదో తరగతిలో ఉండగా ఆంధ్ర ప్రభలో అచ్చయ్యింది. దాని పేరు “అసత్య వ్రతం”. రెండోది ఇంటరు చదువుతూండగా “జయశ్రీ” అనే మాస పత్రికలో వచ్చింది. అది “పాపం! సుబ్బారావు”
మూడోదీ అచ్చయ్యిందని చెప్పగా విన్నాను. చూళ్ళేదు. దొరకలేదు. దాని పేరు – “పతివ్రత”. అవి రాసిన పాతికేళ్ళ తరువాత మొదలయ్యిందీ “నలభైల్లో రచనా వసంతం!”

0000000000000000

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

చిరుత – విపులలో వచ్చిన కథ

జాజర

ఫిబ్రవరి నెల విపులలో అచ్చయిన నా కథ:

చిరుత

రాసిన ఏడాది తరువాత పత్రికా గుహల్లోంచి బయటకొచ్చింది, ఈ “చిరుత”.

సినిమా చిరుతకీ, దీనికి అస్సలు సంబంధం లేదు.

జాజర

Comments (1)