Archive for మార్చి, 2011

ప్రపంచ రంగస్థల దినోత్సవం – మార్చి 27

జాజర


“కావ్యేషు నాటకం రమ్యమ్” అన్నది భారతీయ సాహిత్యంనుండి పుట్టిన అతి రమణీయమైన వాక్యం. కావ్యాలలో నాటకానికున్న ప్రాధాన్యతనీ, ప్రాచుర్యాన్నీ చెబుతుందిది. ఈ నెల అంటే మార్చి 27న అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా నాటక ప్రియులు పెద్ద ఎత్తున సభలూ, సమావేశాలూ జరుపుకునే రోజు. నాటకరంగ కృషికి అందరూ పండగ జరుపుకునే రోజు.

ప్రాచీన కళల్లో నాటకానుకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. చరిత్ర చూస్తే ఈ నాటక కళ వివిధ దేశాల్లో, ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా విడివిడిగా ఎదిగిన కళ. సుమారు నాలుగో శతాబ్దంలో “ది పెర్సియన్స్” నాటికని గ్రీకులు వేసారని చెబుతారు. ప్రపంచంలో మొట్టమొదటి నాటకాన్ని ఎథెన్స్ నగరంలో దైనోసిస్ అనే ధియేటర్లో ప్రదర్శించారని చరిత్ర చెబుతోంది. భారతదేశంలో క్రీ.పూ నాల్గవ శతాబ్దంలో భరతముని రాసిన నాట్య శాస్త్రమే నాటకానికి స్ఫూర్తి అన్న మరో వాదన కూడా వుంది. అతి ప్రాచీనమయిన కళల్లో నాటకం ఒకటి. భారతీయ రంగస్థలం రుగ్వేద కాలం నుండీ ఉందని అంటారు. మొట్ట మొదటి నాటకం అక్షరరూపం దాల్చింది మాత్రం సంస్కృత భాషలోనే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం, భవభూతి రచించిన మాలతీమాధవీయం, ఉత్తరరామ చరిత్ర ప్రాచీన నాటికలయినా ఇప్పటికీ అవి అపురూపమైనవి. ఆయా నాటకాలు నేటికీ ఆదరణీయమైనవే!

సుమారుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పట్లో లాగ అప్పట్లో దేశాల మధ్య రాకపోకల్లేవు. అసలు దేశం ఉనికే తెలీదు. అలాంటిది ఒకే ప్రక్రియ రెండూ వేర్వేరు చోట్ల ప్రాణం పోసుకోవడానికి ముఖ్య కారణం మానవ సంబంధాలూ, సమాజమూనూ. నాటకం వీటినుండే పుట్టింది. గడిచిపోయిన దాన్ని కళ్ళముందు జరిగుతోందన్న భ్రమని కలగజేయడమే నాటకం. ఆ భ్రమకి వాస్తవ రూపం ఇచ్చేది నాటక రచన అన్నది నిర్వివాదం. నాటకం సర్వజననీయం; సర్వకాలీనం. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ రూపం మారుతుంది తప్ప అంతర్లీనంగా నాటక మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే! అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియ. ప్రస్తుతమున్న నాటకం కాల క్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం పుట్టింది.

అంతర్జాతీయంగా మార్చి 27న ప్రపంచ రంగస్థల దినంగా ప్రకటించారు. ఇది 1961లో ప్రపంచ రంగస్థల సంస్థ ద్వారా శ్రీకారం చుట్టబడింది. ఈ రోజు పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా నాటక ప్రదర్శనలూ, సభలూ జరుగుతాయి. ఆ విషయాలందరూ పంచుకుంటారు. అర్వి కివిమా అనే హెలెన్‌స్కీ జాతీయుడు మొట్ట మొదటి సారిగా 1961లో వియన్నాలో ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన తీసుకొచ్చాడు. వియన్నా లో ప్రపంచ రంగస్థల సంస్థ యూక కార్యక్రమానికి అనేక దేశాలనుండీ నాటకప్రియులు విచ్చేసారు. కివిమా ప్రతిపాదన నచ్చి, అందరూ అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది. అప్పటినుండీ అప్రతిహతంగా ఈ రంగస్థల దినోత్సవం జరుపుతూనే ఉన్నారు. ప్రతీ ఏటా ప్రపంచవ్యాపతంగా నాటక రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని ఆ ఏడాదికి సంచాలకుడిగా నియమిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రంపంచంలోని నాటక ప్రియులు తమ తమ అనుభవాలని పంచుకుంటారు. నాటక రంగ కృషికి కొత్తొ కొత్త ఆలోచనలు చేస్తారు. అలాగే ప్రతీ దేశం నుండీ ఒక ప్రముఖ వ్యక్తిని ఆ సంస్థ సలహాదారుగా నియమిస్తారు. భారత దేశం నుండి ప్రముఖ నాటకకర్త గిరీష్ కర్నాడ్‌ని ఈ సంస్థ నాటక ప్రతినిధిగా నియమించారు.

గతంలో రాయల్ షేక్‌స్పియర్ కంపెనీ తరపున నాటకాలు వేసిన ప్రఖ్యాత నటీమణి జేమ్ జూడె డెంచ్‌ ఈ ఏటి రంగస్థల దినోత్సవ ప్రతినిధి.

రంగస్థలం వినోద ప్రదేశమే కాదు; వివిధ సంస్కృతుల్నీ. జాతుల్నీ, మనుషుల్నీ ఒకటిగా కలిపే ప్రక్రియ. దానిక్కావలసింది రంగస్థలం, నాటకాభిమానులూ. అక్కడే మనం ఆనందిస్తాం;దుఃఖంలోకి నెట్టబడతాం; ఆలోచనలకి అంకురార్పణ చేస్తాం; స్ఫూరి చెందుతాం. ఇదీ రంగస్థల మహత్యం.” అని ప్రపంచ రంగస్థల దినోత్స్వవ సందర్భంగా జూడీ డెంచ్ అంటారు.

ప్రపంచ రంగస్థల దినోత్సవవం అంటే రంగస్థల అనుభవాలని పంచుకోడం కాదు. ఈ సందర్భంగా ప్రాంతీయ నాటక రంగ అనుభవాన్ని ప్రపంచానికి తెలియ చెప్పే రోజు. నాటక ప్రక్రియపై మక్కువతో నాటక ప్రియులందరఊ కలసి అభిమానంగా పండగ జరుపుకునే రోజుగా ఈ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకోవాలి. దీన్ననుసరించి ఈ ఏడాది ( 2010 లో ) కెనడాలోని వాంకోవర్లోనూ, అమెరికాలో న్యూయార్కులోనూ,షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి ప్రముఖ నగరాల్లోనూ, మెక్సికోలోనూ, జపాన్‌లోనూ, లండన్, నార్వే, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ ఎంతో వైభవంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారి వారి భాషల్లో నాటకాలు ప్రదర్శిస్తారు. ప్రతీ ఏటా వివిధ దేశాల నుండీ ఒక ముఖ్య నాటకానికి బహుమతి అందజేస్తారు. ఆది ఆ నాటక ప్రదర్శనా నిమిత్తం ఇస్తారు తప్ప వ్యక్తులకీ, సంస్థలకీ కాదు.

ప్రపంచం నలుమూలలా నాటకం అభివృద్ధి చెందింది, ఒక్క తెలుగు నాట తప్ప. పూర్వపు నాటకాలకీ ఇప్పుడు ప్రదర్శించే నాటకాలకీ చాలా తేడా వుంది. రచనా పరంగా, రంగస్థల పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. నటన అన్నది స్థల,కాలాల్ని బట్టీ మారుతుంది. కేవలం వినోదం అన్న స్థాయి నుండి నాటకం ఒక అనుభవం అన్న స్థాయికి ఎదిగింది. విదేశాల్లో ఈ అనుభవాన్ని పొందడానికి ఎంతైనా ఖర్చుపెడతారు. తెరతీయగానే మనల్ని జుట్టు పట్టుకొని నాటకంలోకి లాక్కెళ్ళిపోతుంది. ఆ సన్నివేశం పైకప్పు మీదుండి వీక్షిస్తున్నామన్న అనుభూతి కలిగిస్తుంది. మనం కూడా నాటకంలో ఒక పాత్రధారులమేనన్న భ్రమ కలిగిస్తుంది. ఈ విధంగా నాటకం ఎదిగింది. సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. రంగస్థలం మీదే వర్షమూ, తుఫానూ, మంటలూ, మంచూ చూపించడమూ, మేఘాలు రప్పించడం వంటి ప్రక్రియలు చేకూర్చి రంగస్థలాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్ళింది సాంకేతిక విజ్ఞానం. మామూలుగా అమెరికా వంటి దేశాల్లో సినిమా చూడడానికి పది లేదా పదిహేను డాలర్లు ఖర్చుపెట్టే ప్రేక్షకుడు, రంగస్థల అనుభవాన్ని పొందడానికి ఏభై నుండి వంద డాలర్ల వరకూ వెచ్చిస్తారు. నాటకం వచ్చిందీ అంటే ఎగబడి మరీ చూస్తారు. బ్రాడ్‌వే షోలకీ, ధియేటర్‌కీ ఉన్న ఆదరణ ఇంతా అంతా కాదు. ఇదీ పాశ్చాత్య దేశాల్లో నాటకానికున్న విలువ.

మరాఠీ, బెంగాలీ, కన్నడ నాటకరంగాలు మినహాయిస్తే తెలుగు నాటక రంగం మాత్రం ఏమాత్రం ఎదగలేదు. ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్న చందంగా మిగిలింది. పరిషత్తులూ, ప్రదర్శనలూ పెరిగాయి తప్ప నాణ్యత ఏమాత్రం లేకుండా, పూర్వం వేసిన నాటకాలే మెరుగ్గా వున్నాయన్న అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. రంగస్థలానికి కావల్సిన సౌకర్యాలు సున్నా. సరైన ధియేటర్లు లేవు. ఏదో ఒక హాలు తీసుకొని నాటకం వేయ్యాల్సిన పరిస్థితే ఇప్పుడుంది. నాటకం వేయడానికి అతి ముఖ్యమైన మైకులూ, స్పీకర్ సిస్టములూ ఉండవు. ఉన్నా సరిగా పనిచేయవు. మైకులు మొరాయించని నాటకం ఉండదూ అంటే అతిశయోక్తి కాదు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశమూ ఒకటి. అయినా పరిస్థితి అరవయిల్లో నాటకాలు దాటి పోలేదు. రచనా పరంగా, నటనా పరంగా కూడా అదే పరిస్థితి. రాశి పెరిగింది కానీ వాసి లేదు. నాటక రంగం మంచి నటుల్ని తయారు చెయ్యలేకపోతోంది.

తెలుగు వారికి నటులూ అంటే సినిమా నటులే అన్న ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. సినిమాల్లో నటన ముక్కలు ముక్కలుగా చిత్రీకరించబడుతుంది. నాటకంలో ఏకబిగిన మొత్తం సన్నివేశంలో నిమగ్నమై నటించాలి. అది చాలా కష్టం. నాటకాలు వేసిన వాళ్ళు సినిమాల్లో రాణిస్తారేమో కానీ, సినిమా నటులు నాటకాల్లో రాణించడం అంత సులభం కాదు. ఏటా నంది నాటకాలు పేరు చెప్పి ఓ పది పదిహేను నాటకాలు వేయించి ప్రభుత్వమూ చేతులు దులిపేసుకుంటుంది. నాటకరంగ అభివృద్ధి బహుమతుల ద్వారా జరగదన్న చిన్నవిషయం ఎందుకు అర్థం కాదో తెలీదు. నాటక ప్రదర్శనకి అన్ని సౌకర్యాలూ, సదుపాయాలతో మంచి ధియేటరు కావాలి. కేవలం కళా ప్రదర్శనకే పరిమితమైన ధియేటర్లు మనకి లేవు. సంతాప సభకీ, సత్కార సభకీ రవీంద్ర భారతే దిక్కు. రాజధాని నగరమే ఇలా వుంటే విశాఖపట్టణం, వరంగల్లూ, విజయవాడా, తిరుపతి వంటి నగరాల గురించి చెప్పనవసరం లేదు. నాటక రంగాన్ని మరో మెట్టుకి తీసుకెళ్ళాలంటే ప్రభుత్వమే కాదు, నాటక ప్రియులూ నడుం కట్టాలి. ముఖ్యంగా ప్రదర్శనలని ఆదరించి ప్రేక్షకులూ వారివంతు చేయూత ఇవ్వాలి. ప్రపంచ రంగష్తల పటంలో తెలుగు నాటకానికీ ఒక స్థానం కల్పించాలి. ప్రపంచ రంగస్థల ఉద్దేశ్యం కూడా అదే! ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. అంతవరకూ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని తప్పనిసరిగా విధి తప్పకుండా నాటకప్రియులందరూ జరుపుకుంటారని కోరుకుందాం.

గతంలో ఈమాటలో నేను “తెరమరుగవుతున్న తెలుగు నాటకం” పేరున నాటకం పుట్టు పూర్వోత్తరాలు మొదలుకొని ప్రస్తుత నాటకం గురించీ రాసాను. మధ్యలో కొన్ని నాటకాల గురించి ప్రస్తావించలేదని కొంతమంది అన్నారు. వీలు చూసుకొని రాయాలి.

తెరమరుగవుతున్న తెలుగు నాటకం -1

తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

తెలుగు నాటకం అనేది ప్రదర్శన స్థాయినుండి అనుభవ స్థాయికెదగాలని కోరుకుంటూ…

నాటకరంగం భుజం తట్టుదాం!

నామ మాత్రపు నంది నాటకాలు – ఆంధ్రజ్యొతి

ప్రకటనలు

Comments (1)

చిర స్మర(మ)ణీయం

జాజరచిర స్మర(మ)ణీయం


నవ్వడం ఆరోగ్యం.
నవ్వకపోడం అనారోగ్యం.
నవ్వించడం మహాభాగ్యం.

మొదటిది వెంటపడితే వస్తుంది. రెండోది వద్దన్నా వస్తుంది. మూడోదానికి మాత్రం అదృష్టం కావాలి.
ప్రస్తుతం ఆ మహాభాగ్యం హఠాత్తుగా అదృశ్యమయిపోయింది. తెలుగునాట అక్షర గ్రహణం పట్టింది. ఉన్నట్టుండి సాహితీకారుల మదిలో చీకట్లు కమ్ముకున్నాయి. తెలుగువారికి కానీ ఖర్చులేకుండా ఇన్నాళ్ళూ హాస్యరసాన్ని పంచిచ్చిన అక్షరవైద్యులు బుద్ధిమంతుడిలా,రాజాధిరాజు మల్లే పెట్టేబేడా సర్దుకుని, చెప్పపెట్టకుండా బుల్లెట్లాగా, తిరుపతి వేంకట రమణ సాక్షిగా, ముళ్ళపూడి మీదుగా “శ్రీరామరాజ్యా“నికి చెక్కేసారు.

మొన్నటికి మొన్న తెలుగునాట ముత్యాల ముగ్గులేసీ, నిన్నటికి నిన్న పెళ్ళీడు పిల్లలకి సీతాకళ్యాణమంటూ పెళ్ళిపుస్తకాలు అచ్చేసీ, కళ్యాణ తాంబూలాలు పూలరంగడిలా పదిమందికీ పంచిచ్చీ, మగాడిదలందరూ మిస్టర్ పెళ్ళాలూ, అపార్థసారధులూ అని సెలవిచ్చీ, దాంపత్యపు దాగుడుమూతల్లో ఆడవాళ్ళే జీవనజ్యోతిలని గిరీశం చేత బల్లగుద్ది చెప్పించి, బ్రతుకు గోరంతదీపానికి చిరునవ్వే వెలుగంటూ చడీ చప్పుడూ లేకుండా చీకట్లోకి వెళిపోయారు. తెలుగుమొహాలన్నీ ఒక్కసారి విస్తుపోయాయి. ఇన్నాళ్ళూ అప్పనంగా లభించిన హాస్య సంపదకి చిల్లుపడిందనీ, తెలుగు సాహిత్యానికి “డబ్బు” చేసిందనీ విలవిల్లాడాయి.
గుర్తుగా వదిలిన ఆయన వంశ వృక్ష ప్రతీకలు బుడుగూ, సీగానపసూనాంబ, రెండుజెళ్ళ సీత, రాధ, గోపాళం, పక్కింటి పిన్నిగారి మొగుడు, బుచ్చికక్కిలని అనాధల్ని చేసి పోయారని వాపోయాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదు. మరీ ఇలా ఆయన్ని నమ్ముకున్న అప్పుల అప్పారావునీ, కాంట్రాక్టరునీ, గుర్నాధాన్నీ, తుకారాన్నీ ఇలా తెలుగువారి మీద వదిలేసి ఆయనకాడికి ఆయన రెస్టు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు.

మా అందరికీ అన్యాయం జరిగిపోయింది కదండీ? ఇహ గిరీశంగారికి లెక్చర్లివ్వడానికి స్క్రిప్టెవరు రాసిస్తారూ? అప్పారావుకి అప్పుపుట్టడానికి చిట్కాలెవరిస్తారూ? బుడుగూ, సీగానపెసూనాంబల కోతికొమ్మచ్చి ఆటకి ఎవరు తీర్పు చెబుతారు? మా సంగతి సరే! రక్త సంబంధంకన్నా “సృష్టిలో తీయనిది స్నేహం” అని నమ్మిన ప్రాణస్నేహితుడిక్కూడా చెయ్యిచ్చాసారు కదండీ. పొరపాటనిపించలేదూ?

ఏమో! మీకేం కష్టం వచ్చిందో? ఎవరాకలి వారిదన్నట్లు ఎవరి బాధ వారిది. మీరు బాధపడడం మేం తట్టుకోలేం. బ్రతికినంతకాలమూ హాయిగా నవ్వుతూ “సంపూర్ణ రమణీయం” లా గడిపారు. మా అందరికీ హాస్యం పంచిచ్చారు. అదే పదివేలు మాకు.

మా ఏడుపుమొహాలకి ఇహ నవ్వు టానిక్ ఎక్కడ దొరుకుతుంది? విసుర్లతో నాలుగు మొట్టికాయలు మొట్టీ, వ్యంగ్యంగా చెంప చెళ్ళుమనిపించీ, బాధల కోతి పుండుని మాటల కత్తులతో కోసి, అక్షరలేపనాలు పూసీ, విసుర్ల నొప్పి తెలీకుండా హాస్యపు కుట్లేసి, ఫీజు ఎగ్గొట్టిన్నా చిరునవ్వుతో చెప్పిచ్చుక్కొట్టే డాక్టరు, తెలుగు మొహాలకిక దొరకమన్నా దొరకరు. భలే వైద్యులండీ మీరు?

మీ పేరు ముందు డాక్టర్ అని లేదనుకున్నారో ఏమో మీ ఇంటిముందు ఆ బోర్డయినా తగిలించాలన్న జ్ఞానం ఈ తెలుగు మొహాలకి లేకపోయింది. పుట్టగొడుగుల్లా మాకు చచ్చేటన్ని విశ్వవిద్యాలయాలున్నాయి. అందరూ మీ చేతి హాస్య టానిక్కులు లాగించినవారే తప్ప, ఏ ఒక్కరికీ మీకో నూలుపోగిద్దామన్న ఆలోచన కూడా తట్టలేదు. ఏం చేస్తాం చెప్పండి? టెల్గూ వాడికి టెల్గూ వాడే శత్రువు.

‘‘ఈ భూ ప్రపంచంలో ఎదుటివాడిలో కృతజ్ఞత ఆశించేకన్నా ఆంధ్ర రాజకీయ నాయకుల్లో ఐకమత్యాన్ని ఆశించు… ఆంధ్రుల్లో కార్య శూరత్వాన్ని ఆశించు’’ అని మెరెలాగూ చెప్పారు. అది వినయినా మాకు బుద్ధి రాలేదు. కోతి బుద్ధులుకదండీ? కనీసం మీ “కోతి కొమ్మచ్చి” చదివినా కూడా బుద్ధి రాలేదు. హోలు మొత్తానికే “లేదు” లెండి. అప్పులూ, అవార్డులూ అడుక్కుంటే కానీ ఇవ్వకూడదన్న నియమం తెలుగువారికుందని ఆమాత్రం తెలీని అమాయాకుల్లా వున్నారు మీరు. “బిరుదూలూ, పదవులపైనా, పరనారీ పెదవులపైనా దృష్టంతా నిలిపేవాడు బూడిదై పోతాడన్నా!” అన్న మీ అందాల రాముని మాటలు విని భయపడ్డారా ఏవిటి? కనీసం మీ గడపకి పద్మాలనయినా కట్టలేక పోయారు. మీ ఇంటి ముందు అవార్డు ముగ్గు కూడా వేయలేక పోయారు. తెలుగువాళ్ళకి కొన్ని మంచి గుణాలబ్బాయి. స్వచ్చంగా సంపూర్ణ జీవితంగడిపే వారి జోలికి పోరు. నోట్లో నాలికలేని వాళ్ళని లెక్కపెట్టరు. అయినా మీరు స్థితప్రజ్ఞులు. నా రాతింతేనని సర్దిపుచ్చుకోగల పెద్దమనుషులు.

కన్నప్ప గారు కన్ను పొడిచి వాసాలు విరిచినా ఆ బాధలో కూడా సంతోషం వెతుక్కోగల మహానుభావులు. “కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన” అన్న కృష్ణావతార సారాన్ని ఆచరణలో చూపించారు మీరు. జీవితాన్ని వడకాచి కష్టాలని కాల్చి బ్రతుకు బంగారంలా మలుచుకున్నారు. ఎంతైనా మీరు ధన్యజీవులు. మీ హస్తవాసి అందిన మేం అదృష్టజీవులం.

ఏం రాతండీ మీది? వాగ్దేవిని మీ ఇంట్లో బందీ చేసారా ఏవిటి? అచ్చ తెలుగు నుడికారం మీ ఇంటే పుట్టిందాన్నట్లు అక్షరాకే నడకనేర్పారు. మాటల తూటాలు మీ ఇంట్లోనే తయారవుతాయో ఏమిటో? శివకాశీ టపాసులయినా తుస్సుమంటాయేమో కానీ మీ ఒక్క మాటా ఎప్పుడయినా పేలకపోవడం జరిగిందా? “ఆయనకి డబ్బు చేసింది!”, “వాడు నవ్విచ్చుక్కొట్టాడు!” వంటి తూటాలు ఎవరు పేలుస్తారు చెప్పండి? “సిఫార్సులతో కాపురాలు చక్కబడవన్న” జీవిత సత్యాలు ఇహ ఏ పెళ్ళిపుస్తకంలో దొరుకుతాయి?

వెళితే వెళ్ళారు; వెళ్ళబోయేముందు మాత్రం ఓ మంచి పని చేసారు. మీ బతుకుపుస్తకాన్ని మిఠాయి పొట్లంలా కొమ్మకు కట్టి అందిచ్చారు. కోతికొమ్మచ్చని మీరన్నారు కానీ మాకు మాత్రం అది “కోటి” కొమ్మచ్చి. “తెలుగువాడిగా పుట్టడం అదృష్టం. ఎదగడం దురదృష్టం. నిలదొక్కుకోడం మహాకష్టం” అని ఇంకోటి కొమ్మకొమ్మకూ చుట్టి మరీ సెలవిచ్చారు.

తెలుగువాడిగా మీరు సదా స్మరణీయులు; మీ రాతలు చిరస్మరణీయాలు.
కాదనే దమ్ము ఏ తెలుగువాడికీ లేదు. అందుకే మీరు చిరస్మ”రమణీయులు”.

-సాయి బ్రహ్మానందం గొర్తి

Same Text in BAPU font

వ్యాఖ్యానించండి

ముళ్ళపూడికి జ్ఞాపకాల పూమాల

జాజరఅక్షరం ఆగిపోతే
కుంచె కన్నీరు కార్చింది.

రాలే ప్రతి బిందువూ
కొండంత నిశ్శబ్దాన్ని
కడుపారా కావాలించుకుంది.

వేటాడిన మృత్యువుని
జ్ఞాపకం తరిమికొట్టింది.

నిన్నటి తలపే
రేపటి వాక్యానికి
రంగులద్దుతుంది.


( రెండేళ్ళ క్రితం బాపూ గారి పుట్టిన రోజుకి నేను పై గీతని గీసి పంపాను. ఆ బొమ్మ దాచుకోలేదు. మరలా ఇంకోసారి కెలికాను; రాయలేనంత బాధగా! )

Comments (1)

కోనసీమ కథలు – ఆకాశం వారి మేడ

జాజర


కోనసీమ కథలు – ఆకాశం వారి మేడ

కోనసీమ కథల పేరున నా చిన్నతనంలో చూసిన, ఎరిగిన సంఘటనలనీ, వాస్తవాలనీ చిత్రించాలన్న వుద్దేశ్యంతో రాస్తున్న పరంపరలో మూడో కథ – ఆకాశం వారి మేడ

1980కి ముందున్న కోనసీమ జీవితాన్నీ. వ్యక్తుల్నీ చూపించే ప్రయత్నమే ఇది. కాబట్టి ఈ కధలకి హీరోలు ఉండరు. ప్రతీ కధా విడిగా చదువుకున్నా ఆనాటి జీవితాన్ని ప్రతిబింబించేలా వుంటుంది.

ఈ “ఆకాశం వారి మేడ” కధకి ఒక వాస్తవ సంఘటనే ప్రేరణ.

ఈ కథ ఈమాట వెబ్ పత్రికలో ఇక్కడ చదవండి.

 

వ్యాఖ్యానించండి