Archive for డిసెంబర్, 2012

15-40, బ్రేక్ పాయింట్ – కథ ( తెలుగు వెలుగు పత్రిక లో)

జాజర


ఈ కథకి నేను పెట్టిన పేరు – 15-40, బ్రేక్ పాయింట్ !

తెలుగు వెలుగు పత్రిక సంపాదక మహాశయులు ఇంగ్లీషు పేరని “బతుకాట” గా మార్చేసారు. టెన్నిస్ ఆటలో 15-40 స్కోరుని బ్రేక్ పాయింటనే అంటారు. అంతెందుకు క్రికెట్టు పిచ్చున్న తెలుగునాట Sixerని సిక్సరనే అంటారు కదా? మరి బ్రేక్ పాయింట్ అంటే అభ్యంతరం ఎందుకో బుర్ర ఎంత చించుకున్నా అర్థం కాలేదు. తెలుగు కథలకి ఇంగ్లీషు పేర్లు నాకూ నచ్చవు. కానీ ఈ కథకి నేపథ్యం – టెన్నిస్ ఆట. అందుకే దానికి సంబంధించిన పేరు ఉంచాను.

కథో భిన్న రుచి!

పాఠకో విభిన్న రుచి!!

సంపాదకో వీర భిన్న రుచి!!! 
000000000000000000

“నువ్వేమీ మారలేదు. మంచి ఫిట్నెస్‌తో ఉన్నావు, ఒక్క బట్ట తల తప్ప!” వెట్రివేలు నాకేసి చూస్తూ అన్నాడు.

నేను నవ్వేసి వూరుకున్నాను. నిజానికి వెట్రివేలులో చాలా మార్పొచ్చింది. విపరీతమైన వళ్ళు, పెద్ద పొట్టతో చూడ్డానికి కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నాడు.

వెట్రివేలూ, నేనూ పాతికేళ్ళ క్రితం బెంగుళూరు విప్రోలో కలిసి పనిజేసాం. ఆ తరువాత నేను అమెరికా వచ్చేశాను. ఇద్దరం ఒకే వయసు వాళ్ళం. వట్రివేలు చివరకి మద్రాసులో స్థిరపడ్డాడు.

కారు అడయారు వైపుగా వెళుతోంది. చెన్నై నగరం చాలా మారింది. రెండేళ్ళ కోసారి ఇండియా వచ్చినా, చెన్నై మాత్రం రాలేదు.

జవాబివ్వకపోయే సరికి తనే అన్నాడు.

“ఎక్సర్సైజు చేసే తీరిక లేదు నాకు. ఈ బిజినెస్సులతోనే సరిపోతోంది,” తన పొట్టకేసి చూసుకుంటూ ఆన్నాడు.

“నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుందిలే! ఏంటి మద్రాసులో పెద్ద బిజినస్ కింగ్ పిన్ అని విన్నాను, నిజమేనా?” అడిగాను.

“మద్రాసు కాదు, చెన్నై!” అంటూ నన్ను సవరించాడు. ఈ కొత్త పేర్లు నాకు తెలీవు. మద్రాసుగానే నా మనసులో స్థిరపడిపోయింది. అదే చెప్పాను.
విప్రో వదిలేసి సొంతంగా సాఫ్ట్వేరు బిజనస్ మొదలు పెట్టానని చెప్పాడు. చెన్నైలో చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూటులు కూడా ఉన్నాయి.

వెట్రివేలుని కలిసి కూడా చాలా ఏళ్ళయ్యింది. అమెరికా వెళ్ళాక ఒక్కసారి కలిసానేమో? ఈ మధ్య ఫేస్బుక్లో మరలా కలిసాం. అనుకోకుండా మా కంపెనీ చెన్నైలో వేరే కంపెనీని కొనడంతో నేను రావాల్సిన పని పడింది. నేను వస్తున్నానని వెట్రివేలుకి చెప్పడంతో నన్ను కలవడానికి నా హొటల్కి వచ్చాడు.

వెట్రివేలు వయసులో ఉన్నప్పుడు టెన్నిస్ బాగా ఆడేవాడు. విప్రోలో ఉండగా మేం శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో పెద్ద ప్రోజక్ట్ చేసాం. అప్పుడు నేను ఏడాది పాటు మద్రాసులో ఉన్నాను. వెట్రివేలు ఇల్లు అడయారు దాటాక బీసెంట్ నగర్లో ఇల్లుంది. అప్పుడు నేను వాళ్ళింటి దగ్గరే ఒక ఇంట్లో అద్దెకుండేవాణ్ణి. వెట్రివేలు నాన్న తమిళుడు. అమ్మది మాత్రం గుంటూరు. అందువల్ల వీడికి తెలుగు బ్రహ్మాండంగా వచ్చు.

అప్పటికి మా ఇద్దర్లో ఎవరికీ పెళ్ళి కాలేదు. బలాదూరుగా కలిసి తిరిగేవాళ్ళం. ప్రతీ శనాది వారాలు టెన్నిస్ ఆడేవాళ్ళం.
వెట్రివేలు బీసెంట్ నగర్ టెన్నిస్ క్లబ్బులో మెంబరు. నన్ను కూడా మెంబరుగా చేర్చాడు.

“నువ్వు టెన్నిస్ వదిలేసావేమో కానీ, నేను మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నా ఆట కాస్త మెరుగు పడింది. అమెరికాలో టెన్నిస్ లీగ్స్ ఆడుతున్నాను కూడా!” నవ్వుతూ చెప్పాను.

“ఆటకేం వచ్చింది? అప్పట్లో బాగానే ఆడేవాడివి కదా? ఈ మధ్య క్లబ్బుకి వెళ్ళి చాలా రోజులయ్యింది. ఎప్పుడైనా రాహుల్ ప్రాక్టీసుంటే చూడ్డానికి వెళ్ళేవాణ్ణి. నువ్వు సరైన టైము కొచ్చావు. మావాడు నెక్స్ట్ వీక్ చెన్నై ఓపెన్లో ఆడుతున్నాడు. నువ్వు మాతో రావచ్చు,” నవ్వుతూ అన్నాడు.

నేనెలాగూ ఇక్కడ పదిరోజులు పైగా ఉండాలి. సరేనన్నాను. వెట్రివేలుకి రాహుల్ ఒక్కడే కొడుకు. టెన్నిస్ బాగా ఆడతాడనీ, ఇంటనేషనల్ లెవల్లో ఆడించాలన్నదే తన ధ్యేయమని చెప్పాడు. బ్రిటానియా టెన్నిస్ అకాడమీలో తర్ఫీదు తీసుకుంటున్నాడనీ, మంచి మంచి కోచ్లున్నారనీ చెప్పాడు.

“రాహుల్ బాగానే ఆడతాడు. వాడు పేస్, భూపతిలతో ఒకటి రెండు సార్లు ఆడాడు. వాళ్ళూ మెచ్చుకున్నారు. ఒక పెర్మనెంట్ కోచ్ కోసం చూస్తున్నాను,” చెప్పాడు.

“మీ వాణ్ణి ఫ్లారిడాలో బాలట్టరీ అకాడమీకి పంపు. టెన్నిస్ ప్రో కావాలంటే ఇండియాలో ఉంటే కష్టం,” చెప్పాను.
మన దేశం నుండి కూడా పేస్, భూపతి, సానియా మీర్జా వంటి ప్లేయర్లు వచ్చారు కదా? మనవాళ్ళకేం తక్కువయ్యిందని వాదించాడు.

“పేస్, భూపతి సింగిల్స్లో రాణించలేదు. డబుల్స్కి అంత పాపులారిటీ లేదు. పైగా వీళ్ళకి ఆట ఉంది కానీ స్టామినా లేదు. పైగా వన్ డైమన్షన్ గేమ్స్. సానియా మీర్జాదీ ఇదే తీరు. మంచి కోచ్ కావాలి. యూరోపియన్ కానీ, సౌత్ అమెరికన్ వాళ్ళని కానీ ట్రై చెయ్యి,” అంటూ నాకు తెలుసున్నదంతా చెప్పాను.

ఇంతలో కారు బీసంట్ నగర్ టెన్నిస్ క్లబ్ ముందుగా వెళ్ళింది. ఒక్కసారి పాత రోజులు గుర్తుకొచ్చాయి. చీకటి పడినా ఫ్లడ్ లైట్లలో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అప్రయత్నంగా మున్నుస్వామి గుర్తుకొచ్చాడు నాకు. ఎందుకో ఒక్కసారి చూడాలనిపించింది.

“రేపు ఉదయం ఒక సారి క్లబ్బుకి వెళదామా? మునుస్వామిని కలుద్దామని,” నా ప్రశ్న విని ఆశ్చర్యపడ్డాడు. దేనికని ప్రశ్నించలేదు.

అలాగే నన్నట్లు తలూపాడు. కారు బీసంట్ నగర్ లోకి ప్రవేశించింది.

000000000000000000000

జెట్లాగ్ వల్ల ఆ తెల్లవారు ఝామునే మెలకువ వచ్చేసింది. ఉదయం ఏడు కావస్తున్నా వెట్రివేలు నిద్ర లేవలేదు. ఆదివారం సాధారణంగా లేటుగా నిద్ర లేస్తారని వెట్రివేలు భార్య చెప్పింది. ఇహ నేనొక్కణ్ణే రాహుల్ తెన్నిస్ రాకెట్ తీసుకొని క్లబ్బుకి బయల్దేరాను. టెన్నిస్ కంటే కూడా మునుస్వామిని చూడ్డం కోసం బయల్దేరాను.

నా కొత్త మొహం చూసి ఎవరా అన్నట్లు అందరూ నాకేసి చూసారా క్లబ్బులో. నేను వెట్రివేలు పేరు చెప్పేసరికి నన్ను లోపలకి వెళ్ళడానికి ఒప్పుకున్నారు.

మునుస్వామి ఈ క్లబ్బులో కోర్టు క్యూరేటర్ గా పనిజేసేవాడు. ఆ క్లబ్బులో ఉన్న రెండు కోర్టులనీ చదును చేయడం, నీళ్ళు జల్లడం వంటివన్నీ అతనే చూసేవాడు. మేం ఆడుతున్నప్పుడు బాల్ అందించడం వంటి పన్లు చేసేవాడు. అతను చాలా నెమ్మదస్తుడు. క్లబ్బుకొచ్చిన కొంతమంది విసుక్కునేవారు. ఇంకొంతమంది తిట్టేవారు. ఎప్పుడూ ఏమనేవాడు కాదు. మొదట్లో నాకు టెన్నిస్ అంతగా రాదు. వెట్రివేలు ఎలా ఆడాలో చెప్పాడు కానీ సరిగ్గా చెప్పలేదు. నన్ను చూసి వట్రివేలు, అతని స్నేహితులూ నవ్వేవారు. దాంతో చాలా డీలా పడిపోయాను ఒకరోజు.

“సార్! బాధ పడకండి. మీకు నేను ఆట నేర్పుతాను. నాకంత బాగా రాదు కానీ, నాకు తెలుసున్నది చెబుతాను. వీలు కుదిరితే సాయంత్రం రండి,” అని చేయందిచ్చాడు. ఆ తరువాత నేను టెన్నిస్ లో వెనక్కి తిరిగి చూసింది లేదు.

ఆ క్షణంలో మునుస్వామి నాకు రేకట్ గ్రిప్ ఎలా పట్టుకోవాలో దగ్గర్నుండి, సెర్వ్ ఎలా చెయ్యాలో అన్ని మెలుకవలూ చెప్పాడు. ఆ క్లబ్బుకొచ్చిన డబ్బు బలిసిన వాళ్ళు మునుస్వామిని ఎప్పుడూ ఆడించే వారు కాదు. ఎందుకంటే అతని కొట్టే బంతులకి శరీరం తూట్లు పడాల్సిందే! అంత గట్టిగా కొట్టే వాడు.
ఒక రకంగా మునుస్వామి నా టెన్నిస్ గురువు.

క్లబ్బుకి వెళ్ళీ వెళ్ళగానే నా కళ్ళు మునుస్వామి కోసం వెతికాయి. ఎక్కడా కనిపించలేదు.

మునుస్వామి గురించి అడిగాను. అతను ఇక్కడ పనిజేయడం మానేసాడనీ అడయారు క్లబ్బులో చేస్తున్నాడనీ అక్కడున్న ఒకతను చెప్పాడు.
అసలు వెట్రివేలు ఇంటికి రావడానికి కారణమే మునుస్వామి. చాలా నిరుత్సాహ పడ్డాను. నా మొహంలో నిరాశ చూసి అక్కడున్నతను -కావాలంటే అతని సెల్ నంబరుకి కాల్ చేస్తానని తమిళంలో చెప్పాడు. చెయ్యమన్నాను.

మునుస్వామి గొంతు విని చాలా ఏళ్ళయ్యింది. నా పేరు చెప్పగానే గుర్తు పట్టాడు. ఎక్కడుంటున్నాననీ, నా వివరాలు అడిగాడు.
నన్ను అక్కడే ఉండమని వేంటనే వస్తున్నాననీ చెప్పాడు. ఓ అరగంట తరువాత మునుస్వామి వచ్చాడు.

నల్లగా, పీలగా ఉండే మునుస్వామిలో అంత పెద్ద మార్పు ఏమీ కనిపించలేదు. జుట్టు మాత్రం పల్చబడింది. నన్ను చూసీ చూడగానే దూరనుమండే నమస్కరించాడు. అతని కళ్ళల్లో సంతోషపు కాంతి గమనించాను.

కుశలప్రశ్నల తరువాత నా గురించి చెప్పాను. నేను ఏ హొటల్లో బస చేసానో అడిగాడు. అతని గురించీ చెప్పాడు. అతనికి ఇద్దరు పిల్లలనీ, అమ్మాయికి ఈ మధ్యనే పెళ్ళి చేసాననీ, అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడనీ చెప్పాడు.

“మున్నుస్వామీ, నా ఆట చాల మారింది. నేనిప్పుడు నీతో సమంగా ఆడగలను,” అంటూ చెప్పాను. తనేమంత గొప్ప ఆటగాణ్ణి కాదనీ, ఏదో క్లబ్బులో పనిజేసి నేర్చుకున్నదేనని అన్నాడు.

“నీతో కొంత సేపయినా ఆడాలనుంది, ఆడుతావా?” అనడిగాను. లేదన్నట్లుగా తలూపాడు. షూస్ లేవేమోననుకొని అతని పాదాల కేసి చూసాను. ఓ పాతబడిన, మాసిన షూ వేసుకున్నాడు.. కానీ అది కారణంగా అనిపించలేదు. క్లబ్బులో మానేసినందుకు వాళ్ళేమయినా అభ్యంతరం చెబుతారేమోననాని అడిగాను. ఈ క్లబ్బుకి ప్రెసిడెంటు వట్రివేలే!

“ఇంకోసారెప్పుడయినా చూద్దాం సార్! అయినా ఈ మధ్య ఆడడం మానేసాను,” అని చెప్పి, కాదన్నాడు.
కొంతసేపు మాట్లాడాక వెళ్ళొస్తానని చెప్పి వెళిపోయాడు.

ఎలాగూ వచ్చాను కదాని అక్కడ పని చేసే ఒక కుర్రాణ్ణి ఆడుతావాని అడిగాను. వాడితో ఓ అరగంట సేపు ఆడాను. ఇంతలో వేరేవాళ్ళు రావడంతో ఆపేసాను.

నాతో ఆడిన కుర్రాడికి ఏమైనా కొనుక్కోమని వందరూపాయిలిచ్చాను. వద్దన్నాడు కానీ గట్టిగా చెబితే తీసుకున్నాడు.

వెళుతూండగా ఓ విషయం చెప్పాడు.

“సార్! మునుస్వామి ఆడటం మానేయ లేదు. అబద్ధం చెప్పాడు,” అని.

ఈ క్లబ్బులో పని మానేయడం వల్లనేమోనని అనుకున్నాను. ఎంతైనా ఆత్మాభిమానం వుంటుందికదా?

00000000000000000

ఇంటికొచ్చే సరికి వెట్రివేలు నిద్ర లేచే ఉన్నాడు. నేను టెన్నిస్ ఆడటానికి వెళ్ళానని చెప్పగానే నవ్వాడు.

“నువ్వు రాహుల్ ఆట చూడాలి. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి తయారవ్వు. మా వాడు ఎస్డాట్ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తున్నాడు. స్పెయిన్నుండి వెరడాస్కో, సెర్బియా నుండి టిప్సారవిచ్ లాంటి ప్లేయర్లతో ప్రాక్టీసు చేస్తాడు,” అంటూ చెప్పాడు.

ఓ రెండు గంటల తర్వాత మమ్మల్నందర్నీ వ్యానులో తీసుకెళ్ళాడు వెట్రివేలు.

రాహుల్ ఆట చూసాను. బాగానే ఉంది కానీ, ఇంకా మెరుగు పడాలి. ఫిట్నెస్స్ సరిగ్గా లేదు. మంచి కోచ్ ఉంటే ఆట మెరుగుపడే అవకాశం వుంది. రాహుల్కి పంతొమ్మిదేళ్ళు. అతను టెన్నిస్ ప్రో కావడానికి ఇంకో రెండు మూడేళ్ళు పట్టచ్చు. కనీసం ఒకటి రెండు చాలంజర్ టొర్నమెంట్లయినా నెగ్గాలి.

విదేశీ ఆటగాళ్ళతో ఆడిన ప్రాక్టీసు సెట్లలో ఒక్క గేం కూడా రాహుల్ గెలవలేదు.

ఆట మధ్యలో బాత్రూంకెళ్ళినప్పుడు ఎవరివో మాటలు నా చెవిన బడ్డాయి.

“రాహుల్ వాళ్ళ నాన్న రికమండేషన్తో వైల్డ్ కార్డ్ తెప్పించుకున్నాడు. నిజానికి వాడికంత సీన్ లేదు.”

రాహుల్ టోర్నమెంట్ వైల్డ్ కార్డ్ ప్లేయరన్న విషయం నాకు వెట్రివేలు చెప్పలేదు.

ఇంటికి తిరిగి వెళుతూండగా – “ఒరేయ్! వేలూ! మీ అబ్బాయికి నిజంగా టెన్నిస్ సీరియస్ అయితే అర్జంటుగా బోలెట్టెరీ టెన్నిస్ అకాడమీలో చేర్చు. ఇక్కడ లాభం లేదు,” మొహమాటంలేకుండా చెప్పాను.

“ఇవాళ ఎందుకో వాడు సరిగ్గా ఆడలేదు,” అని సర్ది చెప్పాడు. నేనేం మాట్లాడలేదు.

000000000000000000

ఆ మర్నాడు ఆఫీసులో పని వత్తిడి వల్ల మరలా వెట్రివేలుని కలుసుకోలేదు. వచ్చే ఆదివారం రాహుల్ మ్యాచ్ చూడ్డానికి వస్తానని మాత్రం చెప్పాను. ఈ శనివారం మాత్రం నాతో అమెరికా నుండి వచ్చిన వాళ్ళతో మహాబలిపురం వెళదామనుకున్నాను. శనివారం ఉదయం లంచ్ చేసి బయల్దేరుదామని నిర్ణయించుకున్నాం.

శనివారం ఉదయం నాకోసం ఎవరో వచ్చారని రిసెప్షెన్ నుండి ఫోనొచ్చింది. పొద్దున్నే ఎవరా అనుకుంటూ అక్కడే వెయిట్ చెయ్యమని చెప్పాను. కారు డ్రైవరయ్యుంటాడని అనుకొని మరలా పడుక్కున్నాను. కళ్ళు లాగుతున్నాయి తప్ప నిద్ర మాత్రం రాలేదు. కొంతసేపయ్యాక లేచి స్నానం చేసి క్రిందకొచ్చాను.

అక్కడ రిసెప్షన్లో మునుస్వామిని చూసి ఆశ్చర్యపోయాను.

“నువ్వా వచ్చింది? కారు డ్రైవరనుకున్నాను. నీ పేరు చెప్పచ్చు కదా?” అని అంటే మీరు నిద్రపోతున్నాడని చెప్పడంతో పేరు చెప్పొద్దన్నాననీ అన్నాడు. అతనితో పాటు కొడుకునీ తీసుకొచ్చాడు.

“మా అబ్బాయి. కార్తీక్. ఇంజనీరింగ్ రెండో ఏడు చదువుతున్నాడు. మీకు చూపిద్దామని…” అంటూ పరిచయం చేశాడు.

బ్రేక్ఫాస్ట్ తిన్నావాని అడిగాను. ఇంట్లో పొద్దున్నే సాంబారన్నం తినొచ్చాననీ చెప్పాడు.

“సార్! మీరు నాతో ఆడాలన్నారు కదా? మా క్లబ్బుకి వెళదాం రండి. అందుకనే వచ్చాను,” మెల్లగా అన్నాడు.

నాకూ ఆడాలని ఉంది కానీ ఇంకో రెండు గంటల్లో మహాబలిపురం వెళ్ళలని చెప్పాను. వాళ్ళ క్లబ్బు ఇక్కడేనని రమ్మనమని బలవంత పెట్టాడు. సరే ఒక గంట ఆడేసి వచ్చేయచ్చనుకొని కారులో బయల్దేరాను.

“సార్! ఆరోజు మీరు ఆడమంటే కుదర్దని అన్నాను. క్షమించండి, సార్! నేను ఆ క్లబ్బులో ఆడితే వెట్రివేలు సార్ ఒప్పరండీ! తెలిస్తే చంపేస్తాడు. ఆయన పేరున్నాయన. పెద్దమనిషి సార్!” అంటూ దారిలో అన్నాదు. పరవాలేదని ఆ మాత్రం అర్థం చేసుకోగలనని చెప్పాను.

అడయారు క్లబ్బుకెళ్ళాక కొంతసేపు మునుస్వామి ఆడాడు. అతని ఆట ఇంకా పెరిగిపోయింది. చెప్పద్దూ నన్ను అవలీలగా ఉతికి పారేసాడు.

చివర్లో మరీ ఒక్క గేమయినా గెలవకపోతె బావుండని అనుకున్నాడో ఏవిటో నాకు ఓ రెండు గేములిచ్చాడు.

“సార్! మీరు నాతో కాదు సార్! మా అబ్బాయితో ఒక్క సారి ఆడండి సార్! ప్లీజ్!” అంటూ ప్రాదేయపడ్డాడు.

సరేనని ఆడటం ప్రారంభించాను. కార్తీక్ అక్షరాలా మునుస్వామి కొడుకు. వాడి ఆట చూసి ముగ్ధుణ్ణయ్యాను. వాడు అంత చిన్న వయసులో చాలా గొప్పగా ఆడుతున్నాడు.

“మీ వాడితో నేను ఆడలేను. మీరిద్దరూ ఆడండి. చూడాలని వుంది,” అనడిగితే మునుస్వామి, కార్తీక్ ఆడటం ప్రారంభించారు.

కార్తీక్ ధాటికి మునుస్వామి ఆగలేకపోయాడు. 6-0 స్కోరుతో చిత్తుగా ఓడిపోయాడు. ఆశ్చర్యం వేసింది నాకు.

“మీ వాడు మంచి ప్లేయర్ అవుతాడు. మీ వాణ్ణి బ్రిటానియానికి రికమెండ్ చెయ్యమని వెట్రివేలుకి చెబుతాను…” అంటూండగా మధ్యలో మునుస్వామి అడ్డుపడ్డాడు.

“వద్దు సార్! మా వాడు టెన్నిస్ కాలక్షేపం కోసం ఆడుతాడు తప్ప చెన్నై ఓపెన్ ఆడటానికి కాదు సార్,” అంటూ వద్దన్నట్లుగా తలాడించాడు. అతని మాటల్లోనే కాదు, కళ్ళలోనూ భయం కనిపించింది. ఏమన్నట్లుగా చూసాను.

“టెన్నిస్ గొప్పోళ్ళ ఆట సార్! మాలాంటోళ్ళకి రెక్కాడితేకానీ డొక్కాడదు. ఈ ఆటలు కూడు పెట్టవు సార్! ఈ క్లబ్బులో పనిజేయడం వల్ల ఆడటం వచ్చింది తప్ప సొంతగా నేర్చుకున్నది కాదు. ఏదో సరదాకి ఆడుతాం…అంతే!” మెల్లగా అన్నాడు.

ఏదో జరిగిందన్న అనుమానం వచ్చి, గుచ్చిగుచ్చి అడిగితే మునుస్వామి జరిగింది చెప్పాడు. వెట్రివేలు వాళ్ళబ్బాయిని ఎలాగయినా టెన్నిస్ ప్లేయర్ని చేద్దామని కోచింగలవీ ఇప్పించాడనీ, ఒకసారి చెన్నైలో జరిగిన ఒక టోర్నమెంటులో కార్తీక్ చేతిలో రాహుల్ చిత్తుగా ఓడిపోవడంతో, అది అవమానంగా భావించి వెట్రివేలు తనని క్లబ్బులో ఉద్యోగం నుండి పీకేసాడనీ చెప్పాడు. వట్రివేలు తన పలుకుబడితో తనకి ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తే, చివరికి ఎలాగో ఆయన్ని కాళ్ళా వేళ్ళా బ్రతిమాలితే తనకి అడ్డురాననీ, కార్తీక్ని మాత్రం ఏ టోర్నమెంటూ ఆడకూడదని అన్నాడనీ చెప్పాడు.

హుతాశుణ్ణయ్యాను. ఆరోజు మునుస్వామి ఎందుకు ఆడలేదో అర్థమయ్యింది. నేను వెట్రివేలు దగ్గర మునుస్వామి విషయం ఎత్తినా అతను మాట మార్చడం గుర్తొచ్చింది.

ఇదంతా చూసి నాకు చాలా బాధ కలిగింది. వెట్రివేలు మీద కోపం వచ్చింది. ఏం చెప్పాలో తెలీలేదు.

నేను వచ్చే సోమవారం అమెరికా తిరిగి వెళిపోతున్నాననీ చెప్పి శలవు తీసుకున్నాను. హొటల్కొచ్చాక కార్తీక్కి ఓ రెండు వందల డాలర్లు ఇచ్చాను. వద్దని మునుస్వామి అన్నా నేనూరుకోలేదు. వెళ్ళే ముందు కార్తీక్ ఈమెయిల్ తీసుకున్నాను. నా విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను.

వెళుతూండగా మునుస్వామి చేతులు జోడించి – “సార్! మిమ్మల్ని కలిసినట్లుగా మాట మాత్రం కూడా వెట్రివేలు సార్ దగ్గర అనకండి. తెలిస్తే మమ్మల్ని బ్రతకనివ్వరు,” కళ్ళ నీళ్ళ పర్యంతమవుతూ అన్నాడు.

“డోంట్ వర్రీ!” అని చెప్పి పంపేసాను.

రాహుల్కీ, కార్తీక్కీ ఉన్న తేడా ఏవిటి? ఇన్నాళ్ళూ డబ్బు అసమానతలు పెంచుదనుకునే ధోరణిలో ఉండేవాణ్ణి. ఇప్పుడది అవకాశాలని కూడా మింగేస్తోందన్న అనుభవం నా ఊహక్కూడా తట్టలేదు.

మనిషికేం కావాలి? కడుపు నిండితే కామం; అది తీరాక కాసులు; అదీ చిక్కాక కీర్తి. మొదటి రెంటికీ విరక్తి ఉండచ్చు; చివరి రెంటికీ విశ్రాంతి లేదు.

ఒక్కసారి తలుచుకుంటేనే బాధ కల్గింది. వెట్రివేలు అంటే కోపం, అసహ్యం పెరిగిపోయాయి నాకు.

మునుస్వామిని తలుచుకుంటే జాలేసింది. జాలి ఇతరులకి మేలు చేస్తుందా? ఏమో తెలీదు.

000000000000

ఆఫీసులో అనుకోకుండా పని పడటంతో నేను రాహుల్ మ్యాచ్ చూడ్డానికి వెళ్ళడం పడలేదు. వెట్రివేలుకి రాలేపోతున్నందుకు సారీ చెప్పాను.

రాహుల్ మొదటి రౌండ్ నెగ్గాడనీ, రెండో రౌండులోకి వచ్చాడనీ చెప్పాడు. బెస్టాఫ్ లక్ చెప్పాను. బాలిట్టరీ అకాడమీ వివరాలు కనుక్కొని చెప్పమని అన్నాడు సరే నన్నాను.

ఆ మర్నాడే నేను తిరిగి అమెరికా వెళిపోయాను. ఓ రెండ్రోజుల తరువాత, వర్కులో ఉండగా శ్రీమతి కాల్ చేసింది.

“మీకు టెన్నిస్ ఎక్స్ప్రెస్ వాడు కాల్ చేసాడు. మీరు ఆర్డరు చేసిన టెన్నిస్ రేకట్లు షిప్పింగ్ చార్జెస్ మూడొందల డాలర్లవుతుందనీ, షిప్పింగ్కి ముందు మీతో మాట్లాడాలని అన్నాడు. అయినా తెలీక అడుగుతాను, ఇండియాలో టెన్నిస్ రాకెట్లు ఎవరికి? టెన్నిస్ రాకెట్లకి రెండు వేల డాలర్లా? మీ ఫ్రెండు వెట్రివేలు ఆ మాత్రం కొనుక్కోగలడు,” శ్రీమతి మాటల్లో అర్థం సూటిగానే తాకింది.

“వెట్రివేలుక్కాదు. ఇంటికొచ్చాక చెబుతానులే! మళ్ళా టెన్నిస్ ఎక్స్ప్రెస్ వాడు కాల్ చేస్తే సరే నని చెప్పు,” అని చెప్పి ఫోన్ పెట్టేసాను.

ఇంటికొచ్చి తలుపు తీయగానే శ్రీమతి మొట్టమొదటి ప్రశ్న టెన్నిస్ రాకెట్లు ఎవరికి పంపారని. వివరం చెప్పాను.

“రాకెట్లు పంపించేస్తే సిస్టమ్ మారిపోతుందా? మనుషులు మారిపోతారా?” శ్రీమతి ఎదురు ప్రశ్నించింది.

“బురదలో వజ్రం దొరికితే బురదని చూసి పారేయం,” పైకి చెబుదామన్న జవాబు గొంతులోనే ఆగిపోయింది.

మౌనంగా లోపలకి నడిచాను.

రాత్రి పడుకోబోయే ముందు చప్పున గుర్తుకొచ్చి చెన్నై బ్రిటానియా అకాడమీకి కాల్ చేసి వివరాలు తీసుకున్నాను. అక్కడ కోచింగ్కి ఎంతవుతుందో కనుక్కున్నాను. నెలకి వెయ్యి డాలర్లు అవుతుందనీ చెప్పారు. ఆన్ లైన్ అప్ప్లికేషన్ పూర్తి చెయ్యడానికి సిద్ధమయ్యాను.

సరిగ్గా అప్పుడే వెట్రివేలు నుండి ఈమెయిల్ వచ్చింది. అదేవిటో చూడకుండానే ఈమెయిల్ చెత్తబుట్టలో పారేసాను.

ఓ నెల్లాళ్ళ తరువాత మా ఆఫీసునుండి ఒక మెయిల్ వచ్చింది. నా పేరున ఒక పెద్ద పాకేజ్ వచ్చిందని. మర్నాడు చెన్నై కాల్ చేసి అది విప్పి చూడమన్నాను. మునుస్వామికి నేను పంపిన రాకెట్లు. దానితో పాటే ఒక చిన్న నోట్ కూడా ఇంగ్లీషులో ఉంది. మునుస్వామికి ఇంగ్లీషు రాదు. బహుశా కార్తీక్ రాసుంటాడు. చదవమని మా కొలీగ్కి చెబితే మొత్తం చదివి వినిపించాడు. అది విని నోట మాట రాలేదు.

ఆకలితో ఉన్నవాడికి కొత్త చొక్కా కడుపు నింపదు. నా అవివేకాన్ని చూసి నన్ను నేనే నిందించుకున్నాను.

మొత్తం లెటర్లో కొన్ని వాక్యాలు మాత్రం నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.

“టెన్నిస్ గొప్పోళ్ళ ఆట సార్! ఈ ఆటలన్నీ ఉన్నవాళ్ళ వినోదానికే సార్! మాకు బ్రతకడమే పెద్ద ఆట. ఒక్క చిన్న మిస్హిట్ చాలు, బ్రతుకంతా ఓటమే!”

ఇప్పటికీ టీవీలో టెన్నిస్ మాచ్ చూసినప్పుడల్లా కార్తీక్ గుర్తుకొస్తూనే ఉంటాడు.

0000000000000000000

ప్రకటనలు

వ్యాఖ్యానించండి

కథ2011 – ఆవిష్కరణ సభలో “సరిహద్దు” కథానేపథ్యం

కథ2011 – ఆవిష్కరణ సభలో “సరిహద్దు” కథానేపథ్యం

జాజర

కథ2011 – ఆవిష్కరణలో “సరిహద్దు” కథానేపథ్యం ప్రసంగ పాఠం ఇది. నా తరపున చదివి వినిపిస్తున్నందుకు వాసిరెడ్డి నవీన్ గారికి కృతజ్ఞతలు.

తిరుపతి నుండి మధురాంతకం నరేంద్ర, వారి మిత్రుల ఆధ్వర్యంలో ఏటా వచ్చే – కథావార్షిక-2011 లో కూడా ఈ సరిహద్దు కథ వచ్చింది.


0000000000000000000

తెలుగు కథా సాహిత్యాన్ని తమ రచనలతో పరిపుష్టత కలిగించిన ఇంత మంది లబ్ధప్రతిష్టులైన కథామహులను ఉద్దేశించి నా ఈ నాలుగు మాటలు చెప్పడం నిజంగా పెద్ద సాహసమే! ఒక చిన్న కథ కల్పించిన ఇంత పెద్ద అవకాశమూ, ఆనందమూ, సందర్భమూ నా వరకూ ఎంతో గొప్పవి.

ముందుగా – గత ఇరవయ్యేళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతీ ఏటా కథ పేరున ఒక పుస్తకం తీసుకొస్తున్న శ్రీ వాసిరెడ్డి నవీన్, శ్రీ పాపినేని శివశంకర్ల కృషి ప్రశంసనీయం. నాలుగు వాక్యాలు తీరిగ్గా కూర్చుని చదవడానికే సమయం చిక్కని ఈ వేగ భరితమైన జీవితంలో – ఆ ఏడు వచ్చిన కథల్ని శ్రద్ధగా చదివి, ఏరి, వడబోసి ఒక సంకలనం తీసుకురావాడం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి ఎంతో శ్రద్ధా, ఓపికే కాదు; కథంటే అంకిత భావం కూడా కావాలి. అప్పుడే ఇలాంటివి చేయగలుగుతారు. అందుకు వీరిరువురినీ ప్రత్యేకంగా అభినందించాలి.

చాలా కథలు అప్పటి కాలాన్నీ, యుగలక్షణాలనీ పట్టి చూపిస్తాయనడంలో సందేహం లేదు. ఆ కాలం నాటి నాగరిక జీవనాన్ని ప్రతిబింబిస్తూనే అందులో లోపించిన సంస్కారాన్నీ, విలువల్నీ సూచన ప్రాయంగా ఎత్తి చూపిస్తాయి. అలా చూపించడంలో ఊహకందని నిజాయితీ, నిబద్ధతా ఉన్న కథలే చాలా కాలం గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రస్తుత స్థితిగతులు మారినా, ఆ కథా రచనలో ఉన్న నిజాయితీ పాఠకుల్ని గతంలోకి జుట్టు పట్టుకొని లాక్కెళుతుంది. అప్పటి వాతావరణంలో పాఠకుణ్ణి ఆలోచన్ల లోయలోకి తోసేస్తుంది. కథ జీవితంల్లోంచే పుట్టినా ఒక సరికొత్త రూపంలో జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే ఇప్పటికీ చాసో కథలూ, కుటుంబరావూ, చలం శ్రీపాద వారి కథలూ చదివి వాటిల్లో మమేకం అవుతాం. దేశకాల పరిస్తితుల బట్టి మనుషుల జీవితాలు మారుతాయి. సమస్యలూ మారుతాయి. సమాధానాలు మారుతాయి. సరిగ్గా ఇటువంటి సందర్భంల్లోంచి పుట్టిన కథే “సరిహద్దు”.

అమెరికా జీవితం అంటే చాలామందికి ఒక విలాస విహార జీవితం. అక్కడి ప్రజలందరూ హాయిగా జీవితాన్ని అనుభవిస్తారన్న ఒక ప్రచారం వుంది. కానీ ఆ జీవితంలో కూడా కష్టం ఉంది. బాధుంది. సంఘర్షణుంది. అంతకు మించి పోరాటం ఉంది. పరాయి దేశం నుండి చట్టబద్ధంగా వచ్చిన నాలాంటి వారి కష్టం కంటే, చట్టవిరుద్ధంగా దేశంలోకి చొరబడిన వారి సంఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. 2001లో సరిగ్గా నాకు ఇటువంటి వ్యక్తి అంటే చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉంటున్న ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతను నేను పనిచేసే కంపెనీలో జానిటర్ పనులు అంటే బాత్రూములు శుభ్రపరిచే పని చేసేవాడు. సాఫ్ట్‌వేరు ఉద్యోగాలకీ వేళాపాళా వుండదు. ఒక సారి రాత్రి ఆలస్యంగ వర్కులో ఉన్న నాకు ఒక జానిటర్ ఇంగ్లీషు చక్కగా మాట్లాడుతూ కనపించాడు. సాధారణంగా ఈ పనులు చేసేవాళ్ళు అంత పెద్దగా చదువుకున్న వాళ్ళు కారు. అతని ఇంగ్లీషు భాష చదువుకున్న వాడి తీరున అనిపించి, వివరాలు అడిగితే అతను అమెరికా రావడానికి పడ్డ యాతన అంతా చెప్పుకొచ్చాడు. అలా మొదలయిన పరిచయంలో నాకు చట్టవిరుద్దంగా అమెరికాలో ఉండే అనేకమంది గురించి తెలిసింది. సాధారణంగా అమెరికాలో చట్టాలు కఠినంగా ఉంటాయి. అందునా దేశంలోకి చొరబడ్డవారిపైన మరింత కఠినంగా ఉంటాయి. పైగా ఇక్కడ వైద్య భీమా అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటివి లేనిదే బ్రతకడం కష్టం. ఇటువంటి పరిస్థిల్లో వచ్చిన వాళ్ళు ఎలా చట్టబద్ధంగా మారుతారు? వీళ్ళని చూసీ చూడనట్లు ఎందుకు వదిలేస్తారు? వీటి వెనుకున్న రాజకీయ కోణం ఏవిటి? ఆ జానిటర్ చెప్పినవి విన్నాక ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తాయి. ఆ జీవితాన్ని నిజాయితీగా చిన్న కథా రూపంలో చూపించడానికి నేను ప్రయత్నించాను. ఒక్కోసారి కథా వస్తువున్నా కథా కథనం ఎలా వుండాలన్నది పెద్ద సమస్యగా మారుతుంది రచయితలకి. అంటే ఏ పాత్ర ద్వారా కథ చెప్పించాలన్నది ఓ పట్టాన తెమలదు. అలాగే ఏ రూపంలో కథ చెబితే అర్థవంతంగా, ఉద్వేగ భరితంగా ఉంటుదన్నది కూడా ముఖ్యమైన విషయం అవుతుంది. ఈ సరిహద్దు కథలో ఏ పాత్ర అయితే సంఘర్షణకి గురవుతుందో ఆ పాత్ర ద్వారా చెప్పిస్తేనే నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటుందనిపించింది. అందుకే ఉత్తరంలో చెప్పించడం అనే ఒక వాహకం ఉపయోగించుకొని ఈ కథని నడించాను. కథ పుస్తకంలో ఈ ఏట వచ్చిన ముఖ్య కథల పక్కన చేరడమే దీనికొచ్చిన ప్రత్యేక ప్రశంస. ఇంతకు మించినది ఏవుంటుంది? పాఠకులు చదవగానే వచ్చే స్పందన రచయితలకి తెలిస్తే వచ్చే ఆనందం ఎలాగూ ఉంటుంది.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ కథని ఒక ప్రముఖ దినపత్రికా, ఒక ప్రముఖ వారపత్రికా బాగో లేదని తిరస్కరించాయి. ఒక పత్రిక మరీ పెద్దదై పోయిందీ, రెండు పేజీలకి కుదిస్తే వేస్తామని అంది. చివరకి సాక్షి పత్రిక తప్పకుండా వేసుకుంటామని చెబుతూ, 14 పేజీల కథని 9 పేజీలకి కుదించమని అడిగాయి. ఆ అంట కత్తెర పని కూడా నాకే అంటగట్టారు. లోకో భిన్న రుచి లాగా కథో భిన్న రుచి అన్నట్లుగా ఈ సరిహద్దు కథ పత్రికా కార్యాలయాలల్లో సంపాదకులను దాటి సరిహద్దులు దాటి
మీ ముందికి ఈ రూపంలో వచ్చింది. ఇదీ నా కథ వెనుక కథ. మీరు చదివి నచ్చితే పదిమందితో పంచుకోండి. నచ్చకపోతే నా చెవిన వేయండి. రాయబోయే కథలకి అది ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం.

సభాముఖంగా మీ అందర్నీ కలవలేకపోయినా, ఇలా అక్షర రూపంలో మిమ్మల్ని పలకరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కథ-2011 పుస్తకంలో వచ్చిన మిగతా కథా రచయితల్నీ మనస్పూర్తిగా అభినందిస్తూ – శలవ్!

– సాయి బ్రహ్మానందం గొర్తి.

2 వ్యాఖ్యలు