Archive for మే, 2010

FIFA World Cup 2010 – సాకర్ ఆటలో రెప రెప లాడిన సాహిత్యం

జాజర


ఈ నెల జూన్ 11న సౌతాఫ్రికాలో పుట్బాల్ ( సాకర్ ) ప్రపంచ పోటీలు జరుగుతాయి. ప్రపంచంలో అతి ప్రాచుర్యమైన ఆటల్లో సాకర్ ముందుంటుంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా వంటి దేశాల్లో ఎంతో ప్రజాదరణున్న ఆటిది. జాతీ, రంగూ, మతాలకతీతంగా ఈ సాకర్ పోటీలు జరుగుతాయి. ఈ సాకర్ పోటీల్లో (2010 ) యావత్తు ప్రపంచాన్నీ ఎంతగానో ఆకర్షించిన విషయమొకటుంది. అది ఆటలకి సంబంధించింది అనుకుంటున్నారేమో? కాదు. క్రీడామైదానంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన ఒక పాట గురించి.

ఈ సారి ఆటలు ప్రారంభంకాక మునుపే అక్కడ సాహిత్యం రెప రెపలాడింది. ఓ సాహితీ గళం గొంతెత్తి ఆ ఆటలకి పాటగా మారి క్రీడాభిమానులకి స్వాగతం పలుకుతోంది. సొమాలియా దేశానికి చెందిన ఒక నల్ల జాతీయుడి గొంతులో జీవం పోసుకుంది. ఆ పాట స్వయంగా రాసి పాడింది – కీనాన్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు. అగ్రరాజ్యాల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ఓ నల్లకోకిల పలికిన ముత్యాల స్వరాలవి. అది కేవలం పాట కాదు. ఆఫ్రికా ఖండంలో జాత్యాహంకారానికి గురైన ఓ నల్ల జాతీయుడి అంతర్వేదన. ఇతడు రాసిన “వెన్ ఐ గెట్ ఓల్డర్, దే కాల్ మి ఫ్రీడం” అనే పాట వచ్చే నెలలో ( జూన్ 2010 ) జరిగే ప్రపంచ సాకర్ పోటీలకి అధికారిక గీతంగా ఎన్నుకోబడింది. ఈ ప్రకటన జనవరి నెలలో వచ్చింది. అప్పటినుండీ యావత్తు ప్రపంచాన్నీ ఉర్రూత లూగిస్తున్న పాటిది. సంగీతమూ, సాహిత్యమూ రెండూ సమపాళ్ళల్లో రంగరించిన గేయం.

సాధారణంగా కవిత్వం వచన రూపం కన్నా పాట రూపంలో ప్రజల హృదయ్యాల్లో వేగంగా ఇంకుతుంది. ఏ పాటకయినా మాధుర్యమూ, లయా ముఖ్యం. అవి పాటని ఒక స్థాయికి తీసుకెళతాయి. కానీ అందులో సాహిత్యం మంచిదయితే మరో మెట్టుకి తీసుకెళుతుంది. సరిగ్గా కీనాన్ రాసిన పాటలో అదే జరిగింది.

ఈ పాట రాసింది ఇంగ్లీషులో నయినా ఈ క్రింది నా స్వేచ్ఛానువాదం ఇస్తున్నది సాహిత్యం గురించి చెప్పడానికే!

వయసొచ్చాక
కండలు పెరుగుతాయి.
రెప రెపలాడే పతాకంలా
అందరూ నన్ను స్వేచ్ఛ అని పిలుస్తారు.
చరిత్ర ఒక్కసారి వెనక్కి పారిపోతుంది.

దేవుని వంశాకురాన్ని
రోము కన్నా బలవంతుణ్ణి
హింసకు తలవంచినవాణ్ణి
బీదరికమే నా ప్రపంచం
అదే నా ఇల్లు
అదొక్కటె నాకు తెలుసు
అక్కడే తిరిగాను
ఆ వీధులే నా నేస్తాలు.

నిశీధి ప్రయాణంలో
అంతులేని దూరం నడిచొచ్చాను.
ఎందరిలాగో బ్రతికి బట్ట కట్టాను
కొణగారిన ఆశల బాటలో
ఆ వీధుల్లోనే
ఓటమి ఎరుగని
బ్రతుకు పోరాటం
నేర్చుకున్నాను.

అనుదినమూ ఆకలి యుద్ధమే
ఎప్పటికో ఈ శృంఖలాల విముక్తి?
ఆరోజు కోసమే
సహనం ఎదురుచూస్తోంది
ఆ మాటలే వల్లె వేయిస్తోంది.

లెక్కలు తీర్చుకునే
ఎడతెరిపిలేని యుద్ధాలు
ప్రమాణాలు మోసుకొస్తాయి.
బీదరికం పంచుతాయి.
వాళ్ళు – ప్రేమే జీవితం అంటారు.
ప్రేమే పరిష్కారమని
నమ్మబలికిస్తారు.
వాళ్ళ యుద్ధాలు మేం చేస్తాము.
విజయాలు వాళ్ళు పంచుకుంటారు.
నియంత్రణ గుప్పిట్లో
బంధించడానికి ప్రయత్నిస్తారు.
మేము పట్టు చిక్కని
దూసుకుపోయే బఫెలో సైనికుల ప్రతినిధులం.
అనుదినమూ ఆకలి యుద్ధమే
ఎప్పటికో ఈ శృంఖలాల విముక్తి?
ఆరోజు కోసమే
సహనం ఎదురుచూస్తోంది
ఆ మాటలే వల్లె వేయిస్తోంది.

అందరూ గొంతెత్తి పాడతారు.
నువ్వూ నేనూ వంత పాడతాము
మనమందరం ఒకే గొంతుతో పాడుతాం!

ఇంగ్లీషు పాట ఇక్కడ వినచ్చు. .

అమెరికా దేశం ఈ మధ్యకాలంలో చేసిన ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల తీరుని ఎండగడుతూ రాసాడు. యుద్ధాల వల్ల ప్రజలకి బీదరికం తప్ప ఒరిగేదేమీ లేదని చెప్పే పాట. స్వేచ్ఛ జాతీయ పతాకాల రెప రెపల్లో ఉండదు. ప్రజల్లో మిళితమయ్యుంటుంది. సమానత్వంలో దాగి వుంటుంది. బీదరికపు వీధుల్లో గడిపిన జీవితాలకి ఎప్పటికి స్వేచ్ఛ లభిస్తుంది? అంటూ ఎలుగెత్తి పాడిన కీనాన్ ఆవేదనా గీతం ఈ పాట.

ఈ పాట ఒక చరణంలో “బఫెలో సైనికుల” ప్రస్తావనొస్తుంది. పద్దెనిమిదో శతాబ్దంలో అమెరికన్ సివిల్ వార్లో పనిజేసిన సైనికులకి మరో పేరు బఫెలో సోల్డియర్సు. ఆ సైనికులందరూ నల్ల జాతీయులే! మీ ( అమెరికన్ ) స్వేచ్ఛ కొరకు ప్రాణాలర్పించిన నల్ల సైనికులం మేమే అని గట్టిగా చెబుతాడు.

ఈ కీనాన్ సొమాలియా-కెనడా దేశస్థుడు. ఇతను రాప్ తరహా జానపద పాటలు పాడుకునే వ్యక్తి. గతంలో ఇతను రెండు మూడు ఆల్బంస్ పాడాడు. పాశ్చాత్య సంగీత ప్రియులకితని పాటలు పరిచయమే! ఇతని పూర్వీకులు సొమాలియా నుండి కెనడా దేసానికి వలస వచ్చారు. ఇతని చిన్న తనమంతా సొమాలియా లోని మొగాడిషు అనే ఊళ్ళేనే గడిచింది. బాల్యంలో సొమాలియా ప్రజా యుద్ధాన్ని కళ్ళారా జూసాడు. ఇతను ముస్లిం మతస్థుడు. సొమాలీ భాషలో కీనాన్ అంటే “సంచారి” అని అర్థం. పదమూడేళ్ళ వయసులో తల్లీ, సోదరలతో కలిసి కెనడా దేశంలోని ఆంటారియో కి వలస వచ్చాడు. అక్కడే మిగతా శేష జీవితమంతా సంగీతంలోనే గడిపాడు.

ఇతను రాసిన “వెన్ ఐ గెట్ ఓల్డర్, దే కాల్ మి ఫ్రీడం” పాట ట్రబడొర్ అనే ఆల్బం నుండి ఎన్నుకోబడింది. ట్రబడొర్ అంటే జానపదం అని అర్థం. ఈ ఆల్బంకి ప్రపంచ వ్యాప్తంగా చాలా పేరొచ్చింది. ముఖ్యంగా ఆఫ్రికాలో! ఈ పాటని ఎన్నుకోమని అనేక అభ్యర్థనలొచ్చాయి. వత్తిళ్ళకు తలొగ్గ కుండా ఈసారి ఆఫ్రికా ఖండ ప్రజల పాటగా ఇది ఎన్నిక కావడం చారిత్రాత్మకం. ఈ పాట ఆఫ్రికన్ జాతీయులకే కాదు. సమస్త దేశాలకీ వర్తిస్తుంది. ప్రతీ మనిషీ తప్పక తనని తాను ఈ పాటలో వెతుక్కుంటాడు. సాహిత్యం బలమే ఆ పాట గొప్పతనం. అదే ఈ సారి సాకర్ ఆటకి ప్రాణం పోసింది.

ఎవరు ఓడినా, గెలిచినా విజయ కేతనానికి ఈ పాటే ఒక రాట అవుతుంది. హృదయాకాశంలో రెప రెప లాడుతుంది.

వ్యాఖ్యానించండి

Older Posts »