Archive for ఆగస్ట్, 2011

ప్రవాస జీవితంలోని బాగోగులు! – ఆంధ్రభూమిలో సరిహద్దు పుస్తక సమీక్ష

జాజర


సరిహద్దు – ప్రవాస జీవితంలోని బాగోగులు! .-పాలంకి సత్యనారాయణ


August 21st, 2011
సరిహద్దు
సాయి బ్రహ్మానందం గొర్తి
వెల: రూ. 100/-, పేజీలు: 199
ప్రతులకు: విశాలాంధ్ర

ఉద్యోగికి దూరప్రాంతం లేదు అన్న నానుడి ఉంది. ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) ధర్మమా అని భారతీయులు అందునా తెలుగువారు అమెరికాలో స్థిరపడడం జరుగుతోంది. ఏ దేశమేగినా మాతృభూమినీ, మాతృ భాషనీ మరువని రచయిత/రచయిత్రులు కథలు రాయడం ద్వారా ప్రవాస జీవితంలోని బాగోగులు, ఇతర సమకాలీనాంశాలని చదువరులతో పంచుకుంటుంటారు. ఈ కోవకి చెందిన ప్రస్తుత కాలిఫోర్నియా వాసి (పూర్వం కోనసీమ నివాసి) గొర్తి బ్రహ్మానందం రాసిన ‘సరిహద్దు’ కథల పుస్తకం పాఠకుల ముందుకు వచ్చింది.

ఈ పుస్తకంలో పాతిక కథలున్నాయి. మనసులోని బాధ ఎవరితోనైనా చెప్పుకుంటే తగ్గుతుందంటారు. ఎవరితో చెప్పుకోవాలి? విన్నవారు దానికి చిలువలు పలువలు చేర్చి ప్రచారం చేస్తే బాధ అనేకరెట్లు పెరుగుతుందేమో నన్న భయం ఉంటుంది. మళ్ళీ కలిసే అవకాశం లేనివారితో చెప్పుకుంటే మంచిదేమోనన్న ఆలోచన కలిగి ‘ఉత్పల’ సాన్ ఫ్రాన్సిస్కో హైదరాబాద్ విమానంలో సహప్రయాణికుడితో పంచుకున్న బాధను తెలుసుకోడానికి ‘అతను’ కథ చదవాల్సిందే.

అతిథిదేవోభవ అన్న నానుడికి కొత్త అర్థం చెప్పిన కథ ‘అతిథి వ్యయోభవ’ భారతదేశం నుంచి అమెరికా తెలుగు సంఘాల ఆహ్వానం మేరకు అమెరికా వెళ్ళిన సినీ నటులకి వారి స్థాయిని బట్టి ఏడు నక్షత్రాల హోటలు నుంచి, డ్రాయింగ్ రూములోని సోఫాకమ్ బెడ్ ఏర్పాటు జరగడం సహజం. నరా (నవ్వులరాజబాబు), కాక (కామెడీ కామాక్షి), కికి (కితకితల కృష్ణయ్య)లకి ఆతిథ్యం ఇచ్చినందుకు స్రవంతి, వెంకట్ దంపతులు మళ్ళీ లేటా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ టోటల్ అమెరికా) సభలకి ఎవ్వరికాతిథ్యం ఇవ్వకూడదని నిశ్చయించుకోవడం కథా వస్తువు.

హత్య చేసినది ఎవరు అన్న ఉత్కంఠ చివరి వాక్యం దాకా ఉన్న కథ ‘సైన్యం’. రాత్రి దీపం (టేబుల్ లాంపు), గడియారం (అలారం టైంపీస్), కేలండరు, మంచం, ‘రామిరెడ్డి’ హత్యలో పోషించిన పాత్ర కథనంలో కొత్తదనం తీసుకు వచ్చింది. కథలో కొస మెరుపు చదువరులను నిశే్చష్టులను చేస్తుంది.

రాజు బ్రదర్స్ అని ఖ్యాతి కెక్కిన రామం, రాజులు రారాజు బ్రదర్స్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులు తెలుసుకోడానికి ‘అహం’ కథ చదవాలి. అవసరానికి అప్పు తీసుకొన్న తిక్కర తాకిన తర్వాత ఆ సంగతి మరచిపోవడం ఈ కలియుగ ధర్మమనిపించేలా రోజువారీ సంఘటనలుంటున్నాయి. ఓడదాటించే వరకూ ఓడ మల్లయ్య – తీరం చేరిన తర్వాత బోడి మల్లయ్య అన్న సామెత ఈ నాటిది కాదు కదా! అప్పు తీర్చమని అడిగినందుకు శత్రువుగా చూడడం కథా వస్తువు. కథ ముగింపు పాఠకుల ఊహకు అందనట్టుగా రాయడం రచయిత నైపుణ్యానికి తార్కాణం.

రెక్కలు వచ్చిన పక్షుల సంతానం గూడు వదిలిపోతే పక్షులు బాధ పడతాయో లేదో తెలియదు కాని పిల్లలు ప్రయోజకులై ఉద్యోగాల కోసం ఖండాంతరాలు వెళ్ళినప్పుడు, కూతురు పెళ్ళయిన తర్వాత అత్తారింటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ‘ఎమ్స్.నెస్ట్ సిండ్రోమ్’తో బాధ పడడం సహజంగా జరుగుతున్నదే. మన పూర్వీకులు ‘వాన ప్రస్థాన్ని’ ఒక పరిష్కారంగా సూచించారు. వార్ధక్యంలో ఉల్లాసంగా ఎలా ఉండాలో ఆచరించి చూపించిన దంపతుల కథే ‘వానప్రస్థం’.

ఒకేమాట మాటాడినప్పటికి సందర్భాన్ని బట్టి భిన్నమయిన స్పందన వస్తోందన్నది సోదాహరణంగా తెలియ చెప్పిన కథ. ‘అబద్ధంలో నిజం’ లేటవుతుంది అని చెప్పిన భర్తని తొందరగా రమ్మన్న భార్య, ఇంకోసారి ఏం ఫరవాలేదు. ఇంకొంత లేటయినా ఫర్వాలేదు అనడం ‘ఈ మధ్యనే’ అన్న పదానికి ఒకసారి రెండేళ్ళు అని, ఇంకోసారి రెండు నెలలు అన్న అర్థం ఇత్యాదులు రచయిత చెప్పినతీరు చదువరుల నాకట్టుకుంటుంది.

కాలిఫోర్నియా రాష్ట్రంలోకి పక్కన ఉన్న మెక్సికో దేశం నుంచి అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య తక్కువేమీ కాదు. వారుపడే పాట్లు కథా వస్తువుగా రాసిన కథ ‘సరిహద్దు’. అమెరికా ఆకర్షణ గురించి. ‘అందమైన వయసులో ఉన్న అమ్మాయి మోహంలో వయసులో ఉన్న కుర్రాడు పడ్డట్టు అందరూ ఈ దేశపు (అమెరికా) మాయలో పడిపోతారు’’ అన్న వాక్యాం నిష్ఠూర సత్యమే కదా!
రాజ్యాలేలే రాజుల కథలుంటాయి. వాళ్ళెల్తే కూలీలకి కథలుంటాయి. జీవితం అనే చీకటి గుహలో ప్రయాణం చేసే నైపుణ్యం కలవారికి కథావస్తువుల లోటు ఉండదు. రచయిత కలం నుంచి అనేక మంచి కథలు వస్తాయన్న నమ్మకం ‘సరిహద్దు’ పుస్తకం కల్గిస్తుంది.

AVKF Online BOOK Store

PDF Version

ప్రకటనలు

వ్యాఖ్యానించండి