Archive for ఏప్రిల్, 2012

కథ – 2010 పై సమీక్ష – పాలపిట్టలో

జాజర


క్రితం ఏడాది నవంబరులో రాసిన వ్యాసం ఈ ఏప్రిల్ నెల పాలపిట్టలో వచ్చింది.

కథ – 2010 పై సమీక్ష

OOOOOOOOOOOOOOOOOOOOOOOOOO

సుమారు నలభయ్యేళ్ళ క్రితం నండూరి రామ్మోహన రావు గారు “మన కథా పరిశ్రమ” అని ఒక వ్యాసం రాసారు. అందులో మంచి ప్రతిపాదనొకటి చేసారు. అదేవిటంటే ఏటా దాదాపుగా అన్ని పత్రికల్లో మూడువేల పై చిలుకు కథలు వస్తున్నాయి కదా, వాటిలో కొన్ని మంచి కథలు ఏరి ఒక పుస్తకంగా వేస్తే బావుంటదన్నది ఆయన సూచన. ఇది అందిపుచ్చుకోవడానికి మరో ఇరవయ్యేళ్ళ జాప్యం జరిగినా, వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకరూ గత ఇరవయ్యేళ్ళగా నిరాటంకంగా ఈ పని చేస్తున్నారు. ఇది మెచ్చుకో తగ్గ విషయం. ఏటా వచ్చిన కథల్ని కాచి వడబోసి “కథా సాహితి” పేర ఒక సంకలనం తీసుకొస్తున్నారు. ఈ వడబోత కార్యక్రమంపై అనేక విమర్శలు వచ్చినా, నిరాటంకంగా ఎంతో చిత్తశుద్ధితో ఈ పనిజేయడం ముదావహం. నండూరి వారు ఇంకో సలహా కూడా చెప్పారు. సరియైన అభిరుచి గల సంపాదకులని నియమించి, అంతర్జాతీయ ప్రమాణాలతో కథల నిర్ణయం జరిపిస్తే, కథా సాహిత్యం ఏటా సాధించిన విజయాలు ముందుతరాలకి రెండు అట్టల మధ్య శాశ్వతంగా ఒక విలువైన జ్ఞాపిక అవుతుందని చెప్పారు. ఈ కథాసాహితి ప్రచురణగా “కథ – సంవత్సరం” పేరున ఒక పుస్తకం కథాప్రియులని అలరిస్తోంది. ఈ పరంపరలో కథ-2010 ఈ మధ్యనే విడుదలయ్యింది. అందులో వివిధ అంశాలపై మొత్తం పదమూడు కథలున్నాయి. కథాభిమానిగా ఆ కథల గురించి ఒక పరిశీలనే ఇది. కేవలం కథలమీదే ఈ పరిశీలనా, సమీక్షా తప్ప ఆయా రచయితలమీదా, ప్రచురణకర్తల మీదా కాదని ముందే మనవి చేసుకుంటున్నాను. ఇది కేవలం వస్తు విమర్శే; వ్యక్తి విమర్శ కాదని గమనించండి. ఈ పుస్తకంలో కథలు ప్రచురించబడ్డ రచయితలందరూ గతంలో ఎన్నో మంచి కథలు రాసారు;రాస్తున్నారు;రాయబోతారు కూడా. కానీ ఈ వ్యాస లక్ష్యం కేవలం కథా పరామర్శే తప్ప మరొకటి కాదన్నది దయచేసి గమనించ ప్రార్థన.

ఈ కథా సాహితి ప్రచురణల్లో ఇంతవరకూ వచ్చిన పుస్తకాలలో చాలావరకూ మంచి కథలున్నా, వాటి ఎన్నికపైన చాలా విమర్శలొచ్చాయి. కథల మీద విమర్శకంటే ఎంపిక మీదే విమర్శలొచ్చాయి. ఈ ఎంపిక విధానానికి ప్రమాణాలు ఏవిటి? ఏ ఏ అంశాలు పరిగణనలోకి తీసుకొని కథల్ని ఎన్నుకున్నారన్న ప్రశ్నలు తలెత్తాయి. కథలకి ప్రమాణాలు ఇవీ అంటూ వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి వారు విమర్శా వ్యాసాలు రాసినా, అవి ఎంపికైన కథలకి ఎలా నప్పాయో ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. అందరూ ప్రమాణాలు అంటూ పదే పదే వల్లిస్తున్నారు తప్ప ‘మంచి కథలకి ఇవి ఉండి తీరాలి’ అని ఎక్కడా నిర్థారించడం కనిపించదు. కాబట్టి ఈ ఎంపిక వస్తు పరంగా జరుగుతోందా, లేక ఇంకేమయినా అంశాలు చూస్తున్నారా? అన్నది ఇదమిత్థంగా పదిమందిమందికీ తెలియదు. ఒకటికి వందమార్లు మంచి కథలు, ఉత్తమ కథలూ అంటూ వల్లె వేస్తున్నారు తప్ప, ఆ మంచి గురించీ ఎక్కడా ముచ్చటిస్తున్నట్లుగా లేదు. రెండు మూడు సభల్లో ఎవరైనా ఒకటి రెండు కథల గురించి ప్రస్తావించ వచ్చు గాక. కానీ ఎక్కడా వీటిపై సమగ్ర విశ్లేషణ జరగడం లేదు.

కథ అనేది మన ప్రపంచాన్ని వదిలి మరొక కొత్త ప్రపంచంలో చేసిన ఒక గాఢమైన, సంక్షిప్త సందర్శన. మనల్ని మనం వదిలేసి వేరొక రూపంలో పరకాయ ప్రవేశం చేయించే సరికొత్త వాతావరణాన్నే కథ కల్పిస్తుంది. అందులో వ్యక్తులూ, ప్రదేశాలూ, కాలమూ, పరిస్థితులూ, సంఘటనలూ – ఇవన్నీ గాఢమైన సాన్నిహిత్యాన్నీ, సంవేదననీ అందిస్తాయి. కథలో ప్రవేసించనంత సేపూ ఆ ప్రపంచానికి సాక్షిగా, ఒక అదృశ్య పాత్రగా పాఠకుణ్ణి మిగులుస్తుంది. ఆ పాత్రలతో కలిసి పాఠకుడూ పరవశిస్తాడు;ఆనందిస్తాడు;దుఃఖిస్తాడు. ఇదీ చిన్న కథ కల్పించే ఒక అనిర్వచనీయమైన అనుభూతి. కానీ పాఠకుడి అనుభూతికి ప్రథాన హేతువు కథ చెప్పే గొంతు – అందులోంచి వచ్చే భాష. కథకుడి గొంతులో ఎంతో నిజాయితీ, వాస్తవమూ కనిపిస్తే కానీ పాఠకుడు ఆ స్థితికి చేరడు.

కథకుడి నిజాయితీ, కథ చెప్పే తీరులోనూ, ఎన్నుకున్న వస్తువులోనూ అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది. పాత్ర చిత్రీకరణలోనూ, సంఘర్షణలోనూ వాస్తవాన్ని పాఠకుడే పసిగడతాడు. కాబట్టి కథకుడి ప్రభావం ముందు కథా వస్తువు మీద పడి తద్వారా పాఠకుడిమీదకు పరావర్తనం చెందుతుంది. వస్తువు ఎంత నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటే, పాఠకుడికీ దృశ్యం అంతే అందంగా కనిపిస్తుంది. కానీ వస్తువొక్కటే పాఠకుణ్ణి ఆకట్టుకోదు. దానికీ ఒక కథనం కావాలి. అదీ సహజంగా ఉండాలి. అలాగే కథ నడిపించే పాత్రలూ పొసగినట్లుండాలి. నేపథ్యం అమరాలి. చివరదీ, ముఖ్యమైనదీ – కథకుడి గొంతు, అంటే కథకి వాడే భాష సహజంగా, సున్నితంగా, క్లుప్తంగా సాగాలి.

పైన చెప్పిన వన్నీ సమపాళ్ళల్లో కుదిరితేనే కథ పాఠకుల మస్తిష్కంలో నిలుస్తుంది. పాఠకుణ్ణి వెంటాడుతుంది. కాకపోతే పాఠకులని వెంటాడే కథలనీ మంచి కథలా అన్నది నిర్ధారణగా చెప్పలేం. జిహ్వకో రుచి అన్నట్లు కొన్ని వస్తువులు కొంతమందికి నచ్చుతాయి. మరికొన్ని వేరేవారికి నచ్చుతాయి. కేవలం వస్తువే కాకుండా కథనం మెప్పించవచ్చు. మనిషి జీవితంలో మంచీ చెడులు ఎంత సాపేక్షమో, ఈ చిన్నకథల్లో ప్రమాణాలు కూడా అంతే! ఒకరికి మంచి అనిపించింది, వేరొకరికి కాకపోయే అవకాశం ఉంది. కాబట్టి మంచీ, చెడుల నిర్ణయాలకి కొన్ని ప్రమాణాలు ఎంచుకోవాలి. ఈ ప్రమాణాలు వెతికి, పరిశీలించే వాళ్ళనే విమర్శకులూ అంటూంటాం. విమర్శ అనేకంటే పరామర్శ అంటే బావుంటుందేమో? మంచీ అనబడే లేదా అనుకునే కథలో ఏ ఏ ప్రమాణాలు అనుసరించ బడ్డాయో పరామర్శించడమే విమర్శకుల ప్రథాన లక్ష్యమూ, ధ్యేయమూ కావాలి.

పాఠకుడు కథని ముందు నుండి వీక్షిస్తే, విమర్శకుడూ పైనుండి పరామర్శిస్తాడు. అందులో పాఠకుడూ ఒక పాత్రే! ప్రపంచంలో మిగతా భాషల్లో వచ్చినంత కథా విమర్శ తెలుగులో అంతగా జరగడం లేదు. కారణాలు ఏమయినా కథా పరమర్శ సవ్యంగా సాగడం లేదు. ఈ కథాసాహితి వారు కూడా మంచి కథలూ, లేదా ఈ ఏటి ఉత్తమ కథలూ అని అచ్చువేస్తున్నారే కానీ, వాటిని పరామర్శించడం లేదు. అందువల్ల మంచి కథల పేరున కథలు నిక్షిప్తమవుతున్నాయి కానీ ముందు తరాలకీ, కొత్త కథకులకీ దిశా నిర్దేశం చెయ్యలేకపోతున్నాయి. ముందు మాటలోనో, వెనుక మాటలోనో వస్తుపరంగా మంచి కథలని ముక్తాయింపుగా చెబుతున్నారే తప్ప, అంతకు మించి మాట్లాడడం లేదు. కథకులు విమర్శని తట్టుకోలేక పోవడం కూడా ఒక కారణం కావచ్చు. లేదా అనవసర సంఘర్షణలకి దారితీస్తాయన్న మీమాంస అయ్యుండచ్చు.

ఈ సారి కథ-2010 మా మాటలో – “…ఇవి మాత్రమే ఉత్తమ కథలూ అనలేం కానీ, ఇవి మా దృష్టిలో ఉత్తమ కథలు. కథల ఎంపికలో మా పద్ధతిలో మేం కొన్ని ప్రమాణాలు పాటిస్తున్నాం…” కథా సాహితి వారు ఎప్పటిలాగే చెప్పారు. కానీ ఆ పద్ధతిలూ, ప్రమాణాలూ చెబితే బావుండేది. అవి అందరికీ ఉపయోగపడేవి. ఈ సంకలనాలకీ ఒక సార్థకత కలిగించేవి. ఈసారి కథ-2010లో వచ్చిన పదమూడు కథల్లో దాదాపు సగానికి పైగా కథలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ తక్కువ స్థాయి అని ఎందుకు అంటున్నానది ముందు ముందు వివరిస్తాను. వస్తుపరంగానూ, కథన పరంగానూ, శైలి పరంగానూ, అన్నిటికన్నా ముఖ్యంగా భాష పరంగానూ తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇది చాలా నిరాశ కలిగించిన విషయం.

దాదాపుగా అన్ని కథలూ సమకాలీన సమస్యల మీద రాసినవే! పైగా సింహభాగం కథకులు వస్తువు మీదే దృష్టి కేంద్రీకరించి అందరికీ పరిచయమున్న సమస్యలనే ఆవిష్కరించారు తప్ప, ఆయా సమస్యల్లో కొత్త కోణాలు చూపడానికి ప్రయత్నించినట్లు కనబడలేదు. చాలా మంది సమస్యని చూపెట్టడమే కాకుండా వాటిపై కథకుల వ్యాఖ్యానాలు కూడా కథలో భాగం కావడంతో మొత్తం చదివాక ఒక వ్యాసం చదివిన అనుభూతి కలిగింది. ఎప్పుడైతే కథకుడు పాత్రల మధ్య ప్రవేశించాడో అక్కడే కథ సగం వీగిపోతుంది. కథలో పాత్రలు మాట్లాడాలి. వాటి తరపున కథకుడు వకాల్తా పుచ్చుకోకూడదు. ఈ చిన్న విషయం కథా ఎంపికలో పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఎన్నుకున్న వస్తువుల్లో కూడా ఎక్కడా వైవిధ్యం కనిపించలేదు. తెలంగాణా వాదం, బీటీ వంకాయ సమస్యా, ప్రసార మాధ్యమ పాత్రా, అపార్టుమెంటు కల్చరూ, గ్లోబలైజేషనూ వంటి అందరికీ పరిచయమున్న కథా వస్తువులే ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. మనిషి జీవితం కేవలం సమస్యల మయమేనా? ఇంకేవీ ఉండవా? జీవితంలో ప్రేమా, ఎదుగుదలా, సామరస్యం, సంతోషం, ఆప్యాయతా, ఉద్యోగ పరిణామాలూ, మారుతున్న సాంఘిక వాతావరణమూ, సమాచార ప్రవాహమూ, ప్రేరణా, ఇవేవీ కథలకి వస్తువులు కావా? కాకూడదా? సమాజంలో సమస్యలు చర్చించడానికి వార్తా పత్రికలున్నాయి. మేధావులున్నారు. ప్రసార మాధ్యమాలున్నాయి. అయినా మనకి తెలిసిన సమస్య చుట్టూనే కథా వస్తువు తిరగడం ఆశ్చర్యం కలిగించింది. పోనీ కథనమయినా విభిన్నంగా ఉందా అంటే అదీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే పాత కథా వస్తువుల్నే మరో సారి జాడించినట్లుగా అనిపిస్తుంది.

ముఖ్యంగా కథకులకి ఉండాల్సిన ప్రథమ లక్షణం సునిశిత పరిశీలన. కేవలం సమస్యనే కాకుండా చుట్టూ ఉన్న అన్నింటినీ పరిశీలించినప్పుడే మంచి కథని అల్లగలుగుతారు. ఈసారి ఎన్నుకున్న చాలా కథల్లో, ముఖ్యంగా చిత్రలేఖ, ట్రోజన్ హార్స్, ఇన్సైడర్, అతీతం వంటి కథల్లో పరిశీలనా లోపాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. కథల్లో పాత్రలకంటే మితిమీరిన వ్యాఖ్యానాలు కథని దెబ్బతీసాయి. కొన్ని కథల్లో అక్కర్లేని అసందర్భ ఉపమానాలు కొట్టచ్చినట్లు జొప్పించారు.

ఈ మొత్తం సంకలనంలో బాగున్నాయి అని చెప్పగలిగిన కథలు ముచ్చటగా మూడంటే మూడు; అవి వి.చంద్రశేఖర రావు హెచ్.నరశింహం ఆత్మహత్య, తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారడీ, వాడ్రేవు చినవీరభద్రుడు గారి “పాఠాంతరం”. మిగతా కథల్లో పరవా స్థాయికి చెందినవిగా – కాశీభట్ల వేణుగోపాల్ “నిశ్శబ్దస్వరం”, మహమ్మద్ ఖదీర్ బాబు “గెట్ పబ్లిష్డ్”, మథురాంతకం నరేంద్ర “చిత్రలేఖ” వస్తాయి.

ఇహ చదవడానికి ఇబ్బంది కలిగించని కథల్లో రామా చంద్రమౌళి గారి “అతీతం”, భగవంతం గారి “చిట్టచివరి సున్నా”, చింతపట్ల సుదర్శనం గారి “ఇన్సైడర్”, సతీష్ చందర్ గారి “కాక్టెయిల్” వస్తాయి. ఏ రకంగా చూసినా ఇవి కథలు అనడానికి వీల్లేని వర్గానికి చెందినవి – పసుపులేటి గీత “ట్రోజన్ హార్స్”, బెజ్జారపు రవీందర్ “కొత్త రంగులద్దుకున్న కల”, పెద్దింటి అశోక్ కుమార్ గారి “రణనినాదం అను 7 ఎపిసోడ్ల కథ”.

ఈ మొత్తం కథల్లో, బావున్నాయనుకున్న కథలతో కలిపి, ఏ కథలోనూ చెప్పుకోదగ్గ పాత్రలూ వాతావరణమూ కనిపించలేదు. కొన్ని కథల్లో వాక్యాలయితే మరీ అసంబద్ధంగా ఉన్నాయి. చదవడం ముగిసాక ఏ ఒక్క కథా పాఠకుణ్ణి వెంటాడదు. కొంతమంది కథల్లో టెక్నిక్ మీద శ్రద్ధ పెట్టారు కానీ ఇతివృత్తం పట్టించుకోలేదనిపించింది. మరికొన్ని కథల్లో వ్యాఖ్యాన సహిత ఉపన్యాసాలు చికాకు కలిగిస్తాయి. సూటిగా చెప్పిన కథ ఒక్కటీ లేదనిపించింది. ఉన్నవాటిలో కాస్త మెరుగనిపించిన “హెచ్.నరశింహం ఆత్మహత్య” కథా, “గారడీ” కథా పాఠకుల కళ్ళకీ, కాళ్ళకీ అడ్డపడకుండా సజావుగా సాగాయి.

తెలంగాణా నేపథ్యంలో జరిగిన ఆత్మహత్యలు ఇతివృత్తంగా ఎంచుకొని చెప్పబడిన ఒక ప్రేమ కథ – “హెచ్.నరశింహం ఆత్మహత్య”. సాధారణ జన జీవితంలో ఉద్యమాల ప్రభావం మీద ఎంతో సంయమనంతో చెప్పిన కథ. అన్యాపదేశంగా హైద్రాబాదుతో ముడిపడిన జీవితాల గురించి చెప్పిన కథ. కథనం చదివించేలా ఉన్నా, అక్కడక్కడ కొన్నిచోట్ల వాక్యాలమీద శ్రద్ద పెట్టలేదన్నట్లుగా అనిపిస్తుంది. ఈ వాక్యం చూడండి: “…జీతం గురించి, కొలీగ్స్ గురించి ముఖ్యంగా మగ కొలీగ్స్ గురించి, మొదటి నెల జీత వచ్చినప్పుడు, బైక్ను, ఒక మూల రోడ్డు చివరన ఆపి, నన్ను దగ్గరకు తీసుకొని, ముద్దు పెట్టుకొని, ఆ ముద్దులో తీవ్రత లేదు. గాఢమైన, సముద్రం అల ఫెడేల్మని చుట్టిముట్టినట్లుండే నరశింహం మార్కు ముద్దు కాదది…..” అని వుంది. ఇందులో మొదటి వాక్యం చివర ‘నన్ను ముద్దు పెట్టుకొన్నాడు’ తో వాక్యం ముగియాలి. ఆ తరువాత వాక్యం “ఆ ముద్దులో తీవ్రత లేదు” అని వస్తే చదవడానికి బావుండేది. అన్నీ కలిపేసి, ఒక సుదీర్ఘ వాక్యంగా చెప్పేసరికి భావ నిర్మాణం కోల్పోయిందనిపించింది. అలాగే సముద్రం అల ఒకటిగా తాకదు. అలలెప్పుడూ గుంపుగానే ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కథకులు పట్టించుకోలేదనిపించింది ఈ కథలో. ఇదేమంత పెద్ద లోపం కాకపోయినా కథ ఆసాంతం చదివిస్తుంది. చిన్నగా బాధ కలిగిస్తుంది.

కడుపుకోసం గారడీ చేసే బ్రతికే వాణ్ణి గారడీ చేసే మనుష్యుల కథ గారడీ. పాత తరం కథకుల తీరులో రాసిన కథ. ఇందులో చెప్పుకోతగ్గ విషయమేమీ లేకపోయినా కథనం బావుంది. వాక్యాలతోనూ, భాషతోనూ ఎక్కడా పేచీ లేదు ఇందులో.

ఈ మధ్య కాలేజీ అమ్మాయిలపై జరుగుతున్న యాసిడ్ దాడుల మీద రాసిన కథ “పాఠాంతరం”. కథమొదట్లో
షేక్స్పియర్ “హేమ్లెట్” నాటకం మీద చర్చతో మొదలవుతుంది. దానిమీద ప్రథాన పాత్రల మధ్య రెండు మూడు పేజీల చర్చ జరుగుతుంది. ఇది క్లుప్తంగా ఉండి సూటిగా కథలోకి వెళితే మరింత బావుండేది. ఈ హేమ్లెట్ చర్చే కథని సాగతీసి కాస్త గతి తప్పించిందీ అనిపించింది. హేమ్లెట్ నాటకంలో కరప్ట్ స్టేట్ నిర్మూలించే అవకాశం హేమ్లెట్ కి వచ్చినా, అది అతను సరిగా వినియోగించుకోలేకపోయాడన్న ట్రాజిడీ పాయింటునే కథలో చివర్న ముడి వేసినా, మొదట్లో జరిగిన సాగదీపుడు చర్చ వల్ల అది సూటిగా హత్తుకోక పోవడం ఈ కథకి పెద్ద లోపం అనిపించింది.

ఇహ పరవాలేదనుపించుకున్న వాటిల్లో చిత్రలేఖ కథొకటి. అపార్టుమెంటు కల్చరుమీదా, అక్కడ జరిగే సంఘటనలపై ప్రసార మాధ్యమాల స్పందన తీరు మీద రాసిన కథ. ఈ కథలో వైవిధ్యం ఏవిటంటే ఏ పాత్రకీ పేర్లుండవు. జుబ్బా రచయితా, ఇంటి గలాయన, విలేకరీ, అగంతకురాలూ ఇలా పాత్రలుంటాయి. కథ మొత్తమూ చిత్రలేఖ అన్న పేరుగల వ్యక్తి చుట్టూ తిరుగుతుంది తప్ప ఆమె కథలో పాత్ర కాదు. ఈ టెక్నిక్తో గతంలో చాలా కథలొచ్చాయి. సినిమాల్లో కూడా చూసాం. టైలరు అప్పారావు, సిలోన్ సుబ్బారావు వంటి పాత్రలు ( ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, కనక మహలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ) అందరికీ చిర పరిచయమే!
ఇది కాకుండా ఇంకోక ప్రత్యేకత వుంది. అది ఏవిటంటే ఈ కథలో లిఫ్టు కూడా ఒక పాత్రగా మలచడానికి కథకుడు ప్రయత్నించారు. కానీ అది చాలా కృతకంగా అనిపించింది. అసలు కథ మొదలవ్వడమే – “దయచేసి తలుపులు మూయండి…ప్లీజ్ క్లోజ్ ది డోర్స్..థాంక్యూ…” నాలుగో అంతస్థులో తన నోరు తెరవగానే లిఫ్టు మాట్లాడడం మొదలు పెట్టేసింది – వాక్యంతో మొదలవుతుంది. లిఫ్టులోంచి ఎవరొచ్చినా ఇదే వాక్యం లిఫ్టు చెబుతుంది. చూడ్డానికి కొత్తగా ఉన్నా, ఈ ప్రయోగం వల్ల కథకి చేకూరిన లాభం ఏవీ లేదు. కథలో లిఫ్టు కూడా ఒక పాత్రగా భావించండి అన్నట్లు ఒకటికి పదిసార్లు పాఠకుల్ని ఒప్పించడానికన్నట్లుగా వుంది. సాధారణంగా ( నూటికి ఎనభై శాతం ) అపార్టుమెంట్లల్లో రెండేసి డోర్లున్న లిఫ్టులు వుండవు, మరీ పెద్దవి అయితే తప్ప; ముఖ్యంగా చిన్న పట్టణాల్లో. కథ చెప్పిన సందర్భాన్ని బట్టి అది చిన్న అపార్టుమెంటేనని భావిస్తే, లిఫ్టుకి ఒక తలుపే ఉంటుంది. దాన్ని బట్టి – “దయచేసి తలుపు మూయండి…ప్లీజ్ క్లోజ్ ది డోర్!..” అని రాయాల్సుంటుంది. కథకులు కథ చెప్పే తాపత్రయంలో చిన్న చిన్న విషయాలు గాలికి వదిలేయడం ఉత్తమ లక్షణం కాదు. కథకులకి పరిశీలన కావాలి. పరిసరాలని అత్యంత సహజంగా చెప్పగలగాలి.
అలాగే ఈ కథలో అక్కర్లేని ఉపమానాలు చాలా వున్నాయి. వీటి వలన కథకి చేకూరిన ప్రయోజనం శూన్యం. ఉదాహరణకి – “… తూర్పు వైపునుంచి నాలుగు ఫ్లాట్లూ, పడమటి వైపునుండి నాలుగు ఫ్లాట్లూ అదుపులేని కొవ్వులా ముందుకు పెరగడంతో, మధ్యలో మిగిలిన పాసేజ్ అని పిలబడే నడవా రక్త నాళంలా సన్నబడిపోతోంది…”. ఇలాంటివి కథనిండా చాలా ఉన్నాయి. మొదటి సారి చదివితే, కథలో ఏం చెప్పదలిచారో?, ఏం చెబుతున్నారో? అర్థం కాదు. కథలో – “…లోపల ఈడియట్ బాక్స్ నా కొంగు పట్టుకు లాగుతోంది” అంటూ పక్కింటావిడ తల తలుపుల్ని లాక్కోబోయింది, – వంటి వాక్యాలు ఎంతో కృత్రిమమగా అనిపించాయి. పాత్రలు మామూలు భాషే మాట్లాడు కుంటున్నప్పుడు కథ మధ్యలో ఇలాంటి ప్రయోగాలు ఓ పట్టాన మింగుడుపడవు. సరికదా, చెప్పదలుచుకున్న విషయాన్ని పలచన చేస్తాయి. అందువల్ల కథకి కావాల్సిన గాఢత లోపించింది. ఈ తరహా వాక్యాలు కథలో ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించారు. వైవిధ్యంగా చెప్పడమే ఉత్తమ కథ ప్రధాన లక్షణం అనుకుంటే, ఈ కథ ఆ కోవకి చెందుతుందని సరిపెట్టుకోవాలి.

నిశ్శబ్దస్వరం కథలో ఖాదర్ అనే ఒక వేణువాద సంగీతకారుడి యొక్క జీవిత సారాన్ని అతని ప్రత్యేకమైన స్వాభావికమైన గుణాలతో చెప్పిన తీరు బావుంది. కళాకారుడికి మతం ఉండదు. కళని ఆస్వాదించడానికి పెద్ద మనసుంటే చాలు. అది మతాలకతీతంగా గొప్ప వ్యక్తుల్ని తయారు చేస్తుందన్న భావన కలుగుతుంది, ఈ కథ చదివితే.
కాకపోతే ఈ కథలో చాలా భావాలు పునరావృతమయ్యాయి. “వేణూ సుషిరాల్లోంచి…” అన్న పదప్రయోగం పదే పదే వచ్చింది. కథా వస్తువు పక్కన బెడితే, ఈ కథలో అసంపూర్ణ వాక్యాలు చాలా ఇబ్బంది కలిగించాయి. “…పిచ్చిదాన్ని భరించలేక తానే తుంగభద్రలో తోసేసి చంపేసి పీడ వదుల్చుకున్నాడనే కొందరి అపవాదును…ముళ్ళ కిరీటంలా ధరించిన ఖాదర్ ఏసయ్య…” వంటి రీతిలో కథ సాగుతుంది. ఈ కథలో నిరాశ కలిగించిన విషయం కూడా ఇదే.

వాక్యాలు రాసేటప్పుడు ప్రతీ భాషకీ కొన్ని గుర్తులూ, విరామ చిహ్నాలూ ఉంటాయి. అవి సరైన పద్ధతిలో వాడితేనే వాక్యానికి తగిన అర్థం వస్తుంది. చాలామంది కథకులు “…” అనే గుర్తుని తప్పుగా వాడుతున్నారు. “…” అనే గుర్తు ఒక పాత్ర పలికే సంభాషణలో జాప్యాన్ని చూపించడానికి వాడతారు. అంటే మనం మాట్లాడుతున్నట్లుగా అనిపించడానికీ, లేదా అసంపూర్ణ సంభాషణ చెప్పడానికే వాడాలి. మిగతా చోట్ల ఎక్కడా వాడకూడదు. కానీ ఈ కథా సంకలనంలో సగానికి పైగా కథల్లో వాక్యాలన్నీ “…” గుర్తుతోనే ముగుస్తాయి.

కథలు రాసే వాళ్ళు కథా ప్రక్రియకే కాదు, భాషకీ గౌరవం చూపించాలి. దానిమీద పట్టు సాధించాలి. కథా దర్పణానికి భాషే కళాయి పూత. అదే ఒక దృశ్యాన్ని చూపడానికి దోహదపడుతుంది. ఉత్తమ కథకులెప్పుడూ అది విస్మరించరు. ఇప్పటికీ చాసో, శ్రీపాద, రావిశాస్త్రి, కుటుంబరావూ, చలం వంటి వారి కథా రచనలని ఎంతో హాయిగా ఆస్వాదించడానికి ( వస్తువొక్కటే కాకుండా ) ఇదే ప్రధాన కారణం అని నేను భావిస్తాను.

ముంబై తాజ్ హొటలుపై జరిగిన మారణకాండ నేపథ్యంలో ముస్లిములు ఎలా సమిధలుగా మారుతున్నారో చెప్పిన కథ “గెట్ పబ్లిషెడ్”. సగం మామూలు కథాశైలి లోనూ, మిగతా సగం సినిమా స్క్రీన్ప్లే లాగ సాగుతుందీ కథ. చాలా చాలా పెద్ద కథ. అందరికీ పరిచయమయిన వస్తువే కాబట్టి సులభంగా అర్థమవుతుంది. మత మారణహోమాల మీద జర్నలిస్టుల కోణంలో కథ చెప్పమంటే ఎలావుటుందో అలాగ వుంటుందీ కథ. కానీ నిడివి పెరగడం వలన విసుగు పుట్టే అవకాశముంది.

ఇహ కథలో ఏం చెప్పదలుచుకున్నారో తెలియని అయోమయస్థితికి పాఠకుణ్ణి లాక్కెళ్ళెన కథలు రెండున్నాయి. అవి – ఇన్సైడర్, మరోకటి కాక్టెయిలు. ఈ కథలు చదవించడంలో ఇబ్బంది కలిగించకపోయినా, ఏం చెబుతున్నారో అర్థం కాదు. నిజానికి ఈ రెండు కథలూ అసహజ నేపధ్యంలో, కృత్రిమంగా ఉన్నాయి.

ఇన్సైడర్ కథ ఎందుకు రాసారో అర్థం కాలేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఒక సెల్ఫోను ఆన్ చేసి అడిగితే ఏదైనా ఇస్తుంది. కానీ ఎర్రటి అంకెలు మూడు రాత్రుళ్ళు కనపడితే, ప్రాణాలకే ప్రమాదముంది. ఆ అంకెలు రాకుండా వెలిగినప్పుడే ఏదైనా కోరుకోవాలని చెబుతారు. ఈ సెల్ఫోనో కథానాయక పాత్రధారి గోవాలో కొనుక్కుంటాడు. చివరకి అదే తనకి ముప్పుగా మారితే దాన్ని హుసేన్ సాగర్లో పడేస్తాడు. సాఫ్టువేరు ఉద్యోగుల నేపధ్యంగా రాసిన కధిది. స్థూలంగా ఇదీ వస్తువు. కానీ కథ చివర్లో – “అదృష్టాన్నే నమ్ముకున్నవాళ్ళకోసం, జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశపడేవాళ్ళఅకోసం, ఏ స్ట్రగులూ లేకుండా ఎగ్జిస్టు అవాలనేవాళ్ళకోసం, గుర్రాల్లాంటి కోరికలున్నవాళ్ళ కోసం…” – మీకింకా అర్థం కాకపోతే ఇదీ ఈ కథ ప్రధాన సందేశం అంటూ కథకుడే చెప్పేస్తారు. సాఫ్టువేరు ఉద్యోగలంటే చాలా చులకన అభిప్రాయం వ్యక్త పరిచిన కథది. శ్రమ ఎవరిదైనా శ్రమే! శరీర కష్టం చేసేవాడిదే శ్రమా, విజ్ఞాన శాస్త్ర వేత్తల పరిశోధన శ్రమ కాదన్నట్లుగా వాదన ఉండకూడదు. సాంకేతిక ప్రగతి వల్లే కదా అందరికీ సెల్ఫోనులు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ పనిచేసేది సాఫ్ట్వేరు వల్లే! ఏ సాధనాన్నయినా దుర్వినియోగం చెయ్యడం కనిపిస్తే అది తయారుచేసిన వాడి దోషం కాదు. అది వాడే వారి అవగాహనాలోపం.

పైగా ఈ కథలో కొన్ని వాక్యాలు మరీ పేలవంగా ఉంటాయి. ఉదాహరణకి – “భూమి తన చుట్టూ తాను ఓ రౌండు వేసుకుంది.”, “పొద్దుట్నుంచీ పెట్రోలు తాగుబోతుల్ని మోసి అలసిపోయిన రోడ్లు నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా అక్కదో ఇక్కడో హారను మోతకి ఉలిక్కి పడుతూనె ఉన్నాయి.” వంటి వాక్యాలు కథనిండా పుష్కలంగా ఉన్నాయి. అసలీ కథ ఏ కోవకి చెందుతుందో చెప్పడం కష్టం. ఆసాంతం చదివాక కథ అని అనడానికి మాత్రం మనసొప్పదు.

ఇహ కాక్టెయిల్ కథ కూడా అసహజంగానే సాగుతుంది. “వచ్చింది చావుకి. ఈ పెళ్ళి కళేవిటి?” అని మొదలయ్యే అసహజ ప్రేమకథకి ముక్తాయింపుగా చివర్లో – “చావు దగ్గర పెళ్ళి చూపులా తప్పు కదూ?” అన్న సంభాషణతో కొనసాగిస్తూ, “అమృతం పుచ్చుకున్నవాడు చావును జయిస్తాడు. విషం తాగిన వాడు బతుకుని గెలుస్తాడు. వీళ్ళు రెండూ కలిపి తాగేసినట్లున్నారు.” అంటూ కథా తాత్పర్యాన్ని అరటి పండు వలిచి అందించే ప్రయత్నంలో ముగుస్తుంది. ఈ కథ నిడివి తక్కువవడం పాఠకులకి పెద్ద ఉపశమనం.

ఈ సంకలనంలో చాలా కథలు అనవసర సాగతీతకు గురయినవే! కథకి ప్రధాన లక్షణం క్లుప్తత. అది బాగా లోపించిందనిపిస్తుంది, ఇవి చదివితే! కథని సాగతీస్తే అది పాఠకుడి నెత్తిమీద గుదిబండగా మారుతుందన్న దానికి పెద్ద ఉదాహరణ “చిట్ట చివరి సున్నా” కథ. పాత న్యూస్ పేపరు పొట్లాంలో కనబడిన ఆత్మహత్యా పత్రం కథానాయకుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది. “జీవిత సత్యాన్ని తెలిపే ‘ఆ’ పదార్థంతో పులుసు వండుకొని చివరి సారిగా తృప్తిగా భోంచేసి వెళ్ళపోవాలి,” అన్న వాక్యం చదివి, “ఆ” పదార్థం ఏమిటో కనుక్కోవాలనుకొని అన్వేషణ మొదలెడతాడు. హైదరాబాద్లో, డిల్లీలో ఫుడ్ ఫెస్టివల్సులో ఆ పదార్థం గురించి ఆరా తీసి, అది ఏమిటో తెలుసుకోలేక, చివరకి సొంతూరు కొత్తగూడెం చేరుకున్నాక అతనికి పరిచయమున్న హొటలు సర్వరు ద్వారా తెలుస్తుంది – ఆ పదార్థం – ఆనియన్ అని. జీవితాన్ని ఉల్లిపాయతో ముడేసే తత్వదృష్టితో కథ ముగుస్తుంది. చక్కగా నాలుగైదు పేజీల్లో ముగించాల్సిన కథ, రమారమి పదిపేజీల పైన యధాశక్తి సాగతీయబడింది. చివరికి ఎప్పుడైపోతుందిరా అన్న భావన కలిగిన తరువాత ఇంకా నాలుగు పేజీలు సాగి అప్పుడు ‘శుభం’ కార్డు పడుతుంది. ఇది ఆనియన్ కథ కాదు; జీడిపాకం కథ. ఓ పట్టాన తెమలదు.

జర్నలిస్టులు కథలు రాస్తే ఎలా కథలుంటాయో ట్రోజన్ హార్సూ, గెట్ పబ్లిష్డ్ కథలు వివరిస్తే, కవిత్వం రాసే వాళ్ళు కథలు రాస్తే ఇలా ఉంటుందన్న కోవకి చెందే కథ, “అతీతం”. ఈ “అతీతం” అనబడే కథ అల్జీమర్స్ అనబడే వ్యాధి మనుషుల జీవితాలపై చూపే ప్రభావం మీద చెబుదామని ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది. కాకపోతే ఈ కథలో పాత్రలూ, సంభాషణలూ సహజంగానే వుంటాయి. కొత్త వస్తువు నెంచుకుని కథ చెప్పే తాపత్రయంలో అసలు వస్తువు యొక్క లక్షణాలను ఉపేక్షించినట్లుగా అనిపించింది. కథకులకి అల్జీమర్స్ వ్యాధి గురించిన అవగాహనాలోపం ఈ కథ చెప్పకనే చెబుతుంది. మతిమరపు లేదా గత జ్ఞాపకాలని మరిచిపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. దీని వల్ల మతిభ్రమణా, మాట కోల్పోవడం వంటి లక్షణాలు రావు. కానీ ఈ కథలో ప్రధాన పాత్రధారి రిటైర్డ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్కి, చుట్టూ ఉన్న కుళ్ళిన సమాజంలో పెరుగుతున్న అవకతవక అంశాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ మతిభ్రమణా, మాటకోల్పోవడం వంటివి వస్తాయి. దాన్నే అల్జీమర్స్ అని చెప్పడం జరిగింది. ఇది సరి కాదు. కథా వస్తువు ఎన్నుకునేటప్పుడు దానికి సంబంధించిన విషయాల పైన కూడా కథకులు శ్రద్ధ పెట్టకపోతే కథ పేలవంగా తయారవుతుంది. పైగా పుస్తకాలు చదువుతూ, మనసుని సదా ఉత్సాహంగా ఉంచే వారికి ఈ వ్యాధి సోకడం చాలా చాలా అరుదుగా జరుగుతుంది.

ఈ కథకి వస్తు అవగాహనాలోపమే పెద్ద లోపం. ఇహ ఈ కథలో మరీ ఇబ్బంది కలిగించిన విషయం ఒకటుంది. అవి అసంపూర్ణ వాక్యాలు, అసందర్భ విరామ చిహ్నాలు. తెలుగు కథకులకి “…” వంటి వ్యాకరణ గుర్తు అంటే వల్లమాలిన అభిమానంలా వుంది. కథలో దాదాపుగా ప్రతీ వాక్యమూ ఈ గుర్తుతోనే ముగుస్తుంది. ఉదాహరణకి – “అరవై ఏళ్ళ నిర్మల నీళ్ళు నిండిన కళ్ళతో…అలా…అచేతనంగా..ఆ పక్షుల వంక చూస్తూనే ఉంది” అన్న వాక్యంతో ప్రారంభమయిన కథ – “విలువలు…విలవలకోసం మనిషి జీవించడం…ఒక పరంపర…ఒక నిరంతర పయనం,…” అంటూ ముగుస్తుంది. మొత్తం కథనిండా ఈ చుక్కల ముగ్గే కనిపిస్తుంది. ఈ మూడు చుక్కల వ్యసనం ఆధునిక కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తుంది. చాలామందికి ఈ వ్యాకరణ చిహ్నాలపైన సరైన అవగాహనున్నట్లు కనిపించదు. చుక్కకీ, ప్రశ్నార్ధకానికీ, కామాకీ ఎలాంటి స్థానముందో, “:”, “;”, “….” వంటి గుర్తులక్కూడా ప్రత్యేక స్థానాలు నిర్దేశించబడ్డాయి. ఈ గుర్తులన్నీ మనం పాశ్చాత్యుల నుండే గ్రహించాము కాబట్టి, అవి నిర్దేశించబడినట్లే వాడాలి. మనకి తోచినట్లు మనం వాడడం ఒక్క తెలుగులోనే కనిపిస్తోంది. ఈ దిగువ వాక్యం చూడండి. “శివంకు జ్ఞాపకశక్తి నశించిందా…స్పృహ ఉండి…చేతన ఉండి…ధారణలేని అనుభవం ఒక చర్యాశకలమై…మెరిసి మాయమై, మళ్ళీ సూన్యమై మిగుల్తోందా…” అన్న ఈ వాక్యంలో, ప్రశ్నార్ధకంతో ముగియాల్సిన ‘నశించిందా’, ‘మిగుల్తోందా’ వంటి పదాలు చుక్కలతో సరిపెట్టుకున్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కథకి భాషే వాహకం. అది కథని సజావుగా నడిపించాలి కానీ వక్రభ్రమణం చెయ్యకూడదు. కవిత్వం రాసినట్లుగా కథ రాయాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేమీ అనిపించదు ఈ కథలో.

ప్రత్యేక తెలంగాణా నేపధ్యంలో వచ్చిన మరో రెండు కథలని కూడా పరిశీలిద్దాం. మొదటిది “కొత్త రంగులద్దుకున్న కల”. ఇది కథో, ఉపన్యాసమో, వ్యాఖ్యానమో చెప్పడం కష్టం. చదువుతున్నంతసేపూ ఓ పట్టాన అర్థం కాదు. ఈ కథలో జ్ఞానుల రూపంలో రాజకీయనాయకులూ, జనం రూపంలో తెలంగాణా ప్రజలూ ఉంటారు. ఒక పెద్దమ్మ అనబడే అమ్మలగన్నయమ్మ మెప్పుకోసం మరో జ్ఞాని రాజీనామా, చేసే సన్నివేశం ఒకటుందీ కథలో. ఈ పెద్దమ్మ సోనియాగాంధీ అనీ, ఆ జ్ఞాని కే.సి.యార్ అని మనం అనుకోవాలి. సగం నాటక ఫక్కీలోనూ, మిగతా సగం స్వగత ఉపన్యాసాలతోనూ ముగుస్తుందీ కథ. పైగా ఈ కథకి ఎన్నుకున్న నేపథ్యం నాటకం రిహార్సల్స్. అసంబద్ధపు ఉపమానాలతో చెప్పదలుచుకున్న విషయం పక్క త్రోవ పట్టింది. “…ఉన్నట్లుండి అడవులు మొలుస్తున్నాయి. మొండి గోడల వూర్లు మొలుస్తున్నాయి…” వంటి ఉపమానాలతో విప్లవ కవిత్వ ధోరణిలో సాగుతుందీ కథ. “రిహార్సల్స్ జరుగుతున్న రేకుల షెడ్డు పోత పోసిన దుఃఖంలా మారిపోయింది మళ్ళీ…” వంటి వాక్యాలు ఓ పట్టాన అర్థం కావు. అంతగా ఉపమానాలు వాడాలనుకుంటే పోత పోసిన దుఃఖ మూలం చెప్పి దాన్ని షెడ్డుకి అన్వయించాలి. కేవలం పోలిక లక్షణంతో మాత్రమే ఉపమానాలు ఉండవు. “కాలిన వెదురు వనపు విషాద ఈలలూ, కాంతిని ఖననం చేసిన చోటూ…” వంటి అర్థం పర్థంలేని పద ప్రయోగాలు ఈ కథలో చాలా వాడారు.

ఇంకా, ఈ కథలో ఒక పాత్ర ద.ర అంటూ చూపించడం కనిపిస్తుంది. ద.ర అంటే దర్శక రచయిత అని ముందే చెబుతారు. నాటక దర్శకుడు అంటే అందరికీ సులభంగానే అర్థమవుతుంది. కానీ ఈ పాత్ర ప్రస్తావనొచ్చినప్పుడల్లా ద.ర అనే ఉంటుంది. ఇలా ప్రతీ సారీ ఈ పాత్రని ప్రస్తావించడంలో కథకి ఏం ప్రయోజనమో అర్థం కాలేదు. ఇలాంటి సంక్షిప్త పద ప్రయోగాలు పాఠకుల పఠనాన్ని ఇబ్బంది పెడతాయి. సహనాన్ని పరీక్షిస్తాయి. కథా పఠనం హాయిగా సాగే ప్రయాణం కావాలి కానీ, అమేజాన్ అడవిలో చిక్కుకున్న అనుభవం పాఠకులకి కలగకూడదు. ఇది కథ కోవకి ఎలా చెందుతుందో అర్థం కాలేదు. అలాని ఉపన్యాసమూ అనలేము. నాటకంగానూ భావించలేం.

తెలంగాణా నేపథ్యంలో వచ్చిన రెండవది “రణనినాదం అను 7 ఎపిసోడ్ల కథ”. కథ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. వాడిన టెక్నిక్ బావుంది. ఇది కూడా సగం సినిమా స్క్రీన్ప్లే లాగానే ఉంటుంది. ఎన్నుకున్న వస్తువు కూడా సినిమా కథే. కోడల్ని రాచి రంపాన పెట్టి, బానిసగా, బందీ చేయబడ్డ ఒక కోడలి కథ. జీవితాంతమూ దోచుకోబడ్డ ఆ కోడలు అత్తామావల్ని ధిక్కరించీ, విడాకులొద్దని చివరికి తెరమీద నుండి ప్రజల మధ్యకొస్తుంది. స్థూలంగా ఇదీ కథ. “స్క్రీన్ మీద మాయమైన పాత్ర జనంలో తేలింది. డైరక్టరుకీ జనంకీ మధ్య ఉన్న తెర తొలగిపోయింది. ఆమెను ఆడించి ఆడుకున్న దర్శకుడూ, నిర్మాతా, పాత్రధారులూ, స్పాన్సర్లూ ఇప్పుడు జనంకు ఎదురుగా స్పష్టంగా కనిపిస్తున్నారు. కోట్ల జనం గొంతులో ఇప్పుడు రణనినాదమై ఆమె ఊరేగుతోంది. జై తెలంగాణా నినాదమై మారుమోగుతోంది.” అని కథ ముగుస్తుంది. కథ ఆసాంతమూ ఎక్కడా తెలంగాణా ప్రస్తావన రాకుండా కథ చెప్పిన కథకులు చివర్లో ఉగ్గపెట్టు కోలేకపోవడం చివర వాక్యం చెప్పకనే చెబుతుంది. అన్యాపదేశంగా తెలంగాణా గురించి భావన కలిగేలా చెబితే కథ చెడేది కాదు. ఎప్పుడైతే కథ చివర్లో కథకుడు పాత్రయ్యాడో అక్కడే ఈ కథ వీగి పోయింది. చదువుతున్నంత సేపూ సజావుగానే సాగుతుందీ కథ. ఇంకాస్త ఓపిగ్గా ఈ కథని చిత్రిక పడితే మంచి కథయ్యుండేది.

బి.టి వంకాయ సమస్య పై రాసిన మరో కథ ట్రోజన్ హార్స్ . ఇది కథా పరంగా అన్ని విధాలా నిరాశ పరిచిన కథ. జర్నలిస్టులు కథకులుగా మారితే కధలెలా రూపాంతరం చెందుతాయో చెప్పడానికీ కథే పెద్ద ఉదాహరణగా చెప్పచ్చు. పైగా ఈ బి.టి వంకాయ మీద ఇప్పటికే చాలా కథలొచ్చాయి. ఒక నవల కూడా వచ్చింది. మరి ఈ కథలో కొత్తదనం ఏవిటో చదివిన వారికి అర్థం కాదు కాక కాదు. పైగా కథమొత్తమూ పనికి రాని ఉపమానాలూ, వ్యాఖ్యానాలూ. అన్ని విధాలా అతి తక్కువ స్థాయిలో ఉన్న వ్యాస కథనం, కథ పేరుతో పిలవబడుతూ ఈ సంకలనం ఎక్కిందని మనం భావించాలి. ఈ కథనిండా తప్పుల తడకలు చాలా వున్నాయి. మేజిక్ రియలిజం నేపథ్యంలో సాగే ఈ కథలో బి.టి వంకాయ వలన వ్యవసాయదారులకి కలిగే హాని గురించి చెప్పే ప్రయత్నంగా అనిపిస్తుంది. బి.టి బాక్టీరియా లోని జన్యువుని వంకాయలో ప్రవేశ పెడితే దాన్ని పురుగుల బారినుండి రక్షించవచ్చన్న ధ్యేయంతో బి.టి వంకాయను ప్రవేశ పెట్టాలనుకున్నది గతంలో ప్రభుత్వ నిర్ణయం. దానిపై నిరశన తెలిపుతూ అనేక వ్యాసాలూ, కథలూ వచ్చాయి. అలాంటిదే మరో కథ.

ఈ బి.టి వంకాయల సాగుదల వలన పక్క పంటలకు ప్రమాదం వాటిల్లుతుందన్న ప్రచారం ఒకటుంది. ప్రచారం అని ఎందుకనాల్సొచ్చిందంటే బి.టి వంకాయ వల్ల పక్క పొలాలు నాశనం అవుతాయనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. గాలిలో చేసే సిద్ధాంతాలే తప్ప. వంగతోట ఉన్న ఒక రైతుకి ఓ ఊదారంగు గుర్రం దొరుకుతుంది. అది వంగతోటలో తిరిగినన్నాళ్ళూ ఆ పంట సస్య శ్యామలంగా ఉంటుంది. కానీ పక్కవాళ్ళ పొలాలన్నీ నాశనం అవుతుయి. ఆ తరువాత ఆ రైతుకొక కలలో వంకాయ ప్రత్యక్షమయ్యీ, అందులో ఊదారంగు గుర్రం ఒక ట్రోజన్ హార్స్ లాంటిదనీ, దానిలో బి. టి. ఉన్నాయనీ హెచ్చరిస్తుంది. ఆ తరువాత ఆ ట్రోజన్ హార్స్ ఆ రైతుని వెంబడిస్తే చివరకి అతన్ని “ముసనోబు ఫుకువొకా’ రక్షిస్తాడు. ఇక్కడ ఫుకువొకా అన్నది సహజరీతిలో వ్యవసాయం చేయబడిన జపాన్ దేశంలో ఒక ప్రాంతం. అక్కడుండే మరో రైతు మన రైతుని రక్షిస్తాడు. ఇదీ కథ.

మేజిక్ రియలిజానికి జర్నలిజం జోడిస్తే కథలెలా ఉంటాయో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. కథలో వాడిన కొన్ని వాక్య ప్రయాగాలు చూద్దాం. “…అమెరికన్ తాబేదార్లకి అనుకూలంగానూ, వ్యతిరేకులకి విఫల ప్రయత్నంగానూ కనిపించిన కోపెన్ హేగన్ సదస్సులా ఆ వేళకి మా ఇద్దరి చర్చా అటూఇటూ కాకుండా సాగింది…”, “‘… ఈ ప్రపంచంలో కలలన్నీ మారక ద్రవ్యాలే, వాటికీ ఒక వెల ఉంది…’ అంటూ “బ్రెండేన్ పెర్రీ, లీసా గెరార్డులతో కలిసి సూర్యుడు డెడ్ కెన్ డాన్సుతో సూర్యుడు గొంతు కలిపి ఉద్యమ సంధ్యల్ని అలాపిస్తూ హఠాత్తుగా ఓ రోజు పడమట ఉదయించాడు…” వంటి జర్నలిస్టిక్ వ్యాఖ్యానాలు చాలా వున్నాయి. కొన్ని వాక్యాలకి అర్థం పర్థం లేదు. ఇలాంటివి మచ్చుక్కి మరి కొన్ని. – “…అమ్మలోంచి ఎడ్వర్డ్ మంచ్ ‘స్క్రీమ్’ ప్రతిధ్వనిస్తోంది…”, “…నా రెప్పల కివతల యెహుదా అమిచా కలవరిస్తూ ఉండగానే రెప్పలకవతల హఠాత్తుగా అది మెత్తటి మాంసపు నీలి భీతిలా కదిలింది…”, “దాని మాటల్లో, చూపుల్లో కారిఫోర్నియన్ జిన్ ఫ్రాండెల్ రెడ్ వైన్ నా మీద వెన్నెల వానై కురిసింది…”. రెడ్ వైన్ వెన్నెల వానై కురవడమేమిటో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాదు.

కథకు పెట్టిన పేరు “ట్రోజన్ హార్స్” అంటేనే కథకులకి అవగాహన లేదు. ట్రోజన్ హార్సులో ట్రోజన్స్ ఉండరు. అందులో గ్రీకు సైనికులు దాగుంటారు. కానీ కథలో “ఊదారంగు గుర్రం నుంచి వచ్చిన ట్రోజన్సే” అంటూ రాసి పడేశారు. ట్రోజన్ హార్స్ సరే, మన దేశానికి చెందిన ప్రాణులమీద కూడా కథకులకి అవగాహన తక్కువలా వుంది. కథలో ఒక చోట మండ్ర కప్పలు అని రాసారు. మండ్ర కప్పలు కాదు, మండ్రగబ్బలు అనుండాలి. చివరికి ఇది డి.టి.పి వారి చేతి చలువ అని సరిపెట్టుకోవాలి. అంతే!

ఈ కథకి కొసమెరుపేవిటంటే చివరలో పద సూచిక ( ఫుట్ నోట్స్ ) కూడా జత చేసారు. అందులో రోనాల్డ్ ఎమిరీక్ అంటే ఎవరో, యెహుదా అమిచా అంటే ఎవరో, కిజో మురకమీ అంటే ఏ దేశస్థుడో, నెవర్లాండ్ అంటే ఏవిటో ఇలా చాలా విషయ సూచికలిచ్చారు. ముక్తాయింపుగా “బి.టి వంకాయకు నిరసనగా…” అంటూ కథ ప్రధాన ఉద్దేశ్యం కూడా విడమర్చి మరీ చెప్పారు. కథని కథగా చెప్పడం కాకుండా తమకు తెలుసున్న ప్రతీ విషయాన్ని కథలో చొప్పొంచాలన్న తహతహ నేటి కథకుల్లో తొంగి చూడడం ఎక్కువగా ఉంది. తమ విజ్ఞాన సర్వస్వాన్ని పాఠకులకి అందజేసాయలన్న తపన పాఠకుల మీదున్న గౌరవ స్థాయిని తెలుపుతుంది. చదివే వాళ్ళు రాసే వాళ్ళకంటే ఒక మెట్టు క్రిందనే ఉంటారన్న భ్రమ కథకులకుంటే అది ఎవరికీ మేలు చెయ్యదు. దీనికి పెద్ద ఉదాహరణ ఈ కథే!

చివరగా –
ఇంతకు ముందొచ్చిన వాటికంటే ఈసారి కథా సంకలనంలో కథలు ఏమాత్రమూ ప్రోత్సాహకరంగా లేవు. ఉన్నత ప్రమాణ స్థాయికి చెందిన కథగా ఒకటీ అనుకోలేం. కథకి వస్తువొక్కటే ప్రమాణం కాదు. అలా భావించే అందరూ మన చుట్టూ ఉన్న సమస్యలమీద లేదా రగులుతున్న రాజకీయాలమీద కథలు రాస్తున్నారు. అనేక పార్శ్వాలున్న జీవితం చాలా పెద్దది. అవన్నీ కథలో చూపగలిగినప్పుడే కథ నిలబడుతుంది.

ఈ కథల్లో కొట్టచ్చినట్లు కనిపించేది మితి మీరిన ఇంగ్లీషు పదాల వాడుక. దాదాపు అన్ని కథల్లోనూ ఈ ధోరణి కనిపించింది. ఆఖరికి ఉపమానాలకి కూడా ఇంగ్లీష్ భాషనే ఆశ్రయించడం విచారకరం. ఉన్న పదమూడు కథల్లో నాలుగుకి పైగా ఇంగ్లీష్ శీర్షికలు. కథకి కనీసం తెలుగు పేరు కూడా పెట్టలేరా? అనిపించింది. “ఇంగ్లీషు వ్యామోహంలో పడి తెలుగువారు తెలుగు భాషని పట్టించుకోవడంలేదు; భాష చచ్చిపోతోంది” వంటి ఉపన్యాసాలూ, నినాదాలూ వింటూంటాం. రచయితలే తెలుగుని వాడకపోతే వేరే వాళ్ళని అనుకొని ప్రయోజనం లేదు. కొన్ని పదాలకి తెలుగు పదాలు లేవు. అలాంటి వాటికి ఎవరూ అభ్యంతరం పెట్టరు. ఉదయం అని రాయడానికి బదులు మార్నింగ్ అనీ రాస్తున్నారు. కానీ రాసేది తెలుగు కథ. కాబట్టి కాస్తయినా తెలుగు భాష మీద మమకారం చూపిస్తే బావుంటుంది.

నేను గమనించిన విషయాలూ; కొన్ని సూచనలూ:

• కథా వస్తు విస్తీర్ణత పెరగాలి.

• కథల్లో అనవసర వ్యాఖ్యానాలు తగ్గి తీరాలి. చిన్న కథకి క్లుప్తతే ఊపిరి.

• కథకులు భాషా, వ్యాకరణం విషయంలో మరింత శ్రద్ధ చూపాలి.

• ఎన్నుకున్న అంశాలపై కథకులు మరింత పరిశీలనా, పరిశోధనా చెయ్యాలి.

• కథలు ప్రచురించే సంపాదకులు కథల కుదింపు విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి.
నిక్కచ్చిగా, నిష్కర్షగా మొహమాటం లేకుండా ఎంత పేరున్న రచయితల కథలనయినా సవరించడానికి పూనుకోవాలి.

• కథా విమర్శకి మరింత స్థానం కల్పించాలి. కథలపై నిష్పక్షపాత సమీక్షలు రావాలి. అప్పుడే తెలుగు కథ బతికి బట్ట కడుతుంది. లేదంటే కథ వేరే భాషల్ని వెతుక్కుంటుంది.

క్రమం తప్పకుండా పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్ ఏటా ఈ కథా సంకలనాలని తెస్తున్నారు. ఉత్తమ కథలు అని చెబుతున్నారే తప్ప అవెందుకు ఆ స్థాయిలో ఉన్నాయో చెప్పల్సిన అవసరం కూడా ఉంది. ముందుతరాలకి ఉపయోగపడుతుంది. కొత్త రచయితలు తమ రచనల ప్రమాణాలు పెంచుకోవడానికి దోహద పడతాయి. ఒక పాఠకుడిగా ఈ సంకలనంలో కథల్లో ఇన్ని దోషాలు నాకే కనిపించాయంటే, కథా పరిశీలకులుగా, సంకలనకర్తలుగా, అనుభవజ్ఞులుగా వీరికెన్ని తడతాయో ఊహించగలను. కనీసం తప్పులెంచనవసరం లేకపోయినా ఏ కథలో కథా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయో చెప్పాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవడం భావ్యం కాదనిపిస్తోంది.

ఈ ప్రక్రియలో కొంతమంది నొచ్చుకునే అవకాశముంది. అది పక్కన బెడితే దీని వల్ల మేలు పొందేది మాత్రం భావి తరాల వారే! ఇప్పటికే తెలుగు కథకుల సంఖ్య తగ్గిపోతోంది. రాశి పెరిగినా వాసి ఉండడం లేదు. ఈ కథా సంకలనాలు చదివి కొత్త రచయితలు పుట్టాలి. ఉత్తేజ భరితులై కథలు రాయగలగాలి. ఆ దిశగా ఆలోచిస్తే కథాసాహిత్యానికి మరింత మేలు జేసినా వారవుతారు. కథా ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది మాత్రం అక్షర సత్యం.

-సాయి బ్రహ్మానందం గొర్తి

ప్రకటనలు

3 వ్యాఖ్యలు