Archive for సెప్టెంబర్, 2012

హిందీ నటుడు బల్రాజ్ సహని అద్భుత ఉపన్యాసం ( JNU – 1972 )

జాజర

హిందీ నటుడు బల్రాజ్ సహని అద్భుత ఉపన్యాసం ( జె.ఎన్.యూ – 1972 )

1972లో, ఒక ప్రముఖ హిందీ నటుణ్ణి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయన ప్రసంగ పాఠమే ఇది. ఈ వ్యాసంలో చెప్పిన విషయాలు ఇప్పటికీ చెక్కు చెదరని వాస్తవాలని నేననుకుంటున్నాను. అప్పటి పరిస్థితికంటే అధ్వాన్నంగా ఉంది నేడు. మన దేశంలో స్ఫూర్తినిచ్చే నాయకులు లేరు. నడిపించే వారు లేరు. సామాన్యుడి జీవితం రెండు ధృవాల మధ్యనే ఇరుక్కుపోయింది. ఒకటి రాజకీయం; రెండు సినిమాలు. దేశమూ, యువతా ఎటు వెళుతున్నాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామనిపిస్తోంది. ప్రతిభావంతుడికీ, పనికిరానివాడికీ వ్యత్యాసం లేకుండా పోతోందనిపిస్తోంది. మంచికీ, చెడుకీ భేదం చెరిగిపోతోందన్న సంశయం ఆవరించుకుంటోంది. ఇటువంటి సమాజంలో ఉన్న మనమందరం, కొన్ని క్షణాలు వెచ్చించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఈ ప్రసంగంలో ఉన్నాయి. ఈ ప్రసంగానికి నలభయ్యేళ్ళు దాటినా ఇందులో చాలా విషయాలు ఇప్పటికీ వర్తిస్తాయని నేననుకుంటున్నాను.

ఎంతో స్ఫూర్తిదాయకమయిన ఆ ప్రసంగం చేసిన ప్రముఖ హిందీ నటుడి పేరు, బల్‌రాజ్ సహని.

సాధారణంగా నేను అనువాదాలు చెయ్యడానికి ఇష్టపడను. అనువాదం ఒక ప్రత్యేక కళ. నాకది లేదని నా నమ్మకం.
కానీ బల్రాజ్ సహ్ని ప్రసంగ పాఠం చదివాక ఆపుకోలేక ఎలాగయినా తెలుగు వారికి ఇది తెలియాలన్న తపనతో చేసిన అనువాదం. దురదృష్టం ఏవిటంటే తెలుగునాట ఏ పత్రికా ఇది ప్రచురించడానికి ముందుకు రాలేదు. ఆంధ్రభూమి వాళ్ళు వేస్తామన్నా ఇంత పెద్దది వేయలేమని చెప్పారు. ప్రతీ తెలుగువారూ తప్పక చదవాల్సిన ప్రసంగం.

ఎనభయ్యో పడిలో వున్నా, ఇంకా గెంతుతానూ, పలానా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుంది ( పెళ్ళి సభా మర్యాద, లోపల మాత్రం అనుభవించాలనే ) వంటి నటులున్న మనకి, ఇటువంటి ప్రసంగం వినే అదృష్టం ఎప్పటికయినా వస్తుందా? డాక్టరేట్లూ, బిరుదులూ అన్నీ అమ్మకానికి కొనుక్కునే నటచక్రవర్తులే నేటి యువతకి ప్రేరణ కలిగించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కనీసం నూటికొక్కరయినా ఇది చదివితే నా శ్రమ ఫలించినట్లే!

ప్రసంగ పాఠం పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.

మచ్చుక్కి కొన్ని అచ్చుతునకలు – ఇప్పటికీ చెక్కు చెదరని కొన్ని వాస్తవాలు:

“స్వేచ్ఛా వాతావరణంలో పెరిగిన ఒక మనిషి ఆలోచనలకీ, దాస్యానికి గురైన మనిషి దృక్పథానికీ మధ్యనున్న తేడా అప్పుడు తెలిసింది. ఆ క్షణం నా కళ్ళు తెరుచుకున్నాయి. స్వేచ్ఛ ఉన్నవాడికి ఆలోచించి, నచ్చిన నిర్ణయం తీసుకునే శక్తి వుంటుంది. బానిసలకు అది వుండదు. ఎప్పుడూ పక్కవారి సలహాలపైనే ఆధారపడుతూ, డోలాయమానంగా నిర్ణయాలు స్వీకరిస్తూ, అందరూ వెళ్ళే దారిలోనే ప్రయాణించాల్సి వస్తుంది.”

“కవిత్వంలో కూడా వస్తువు ఉత్తమమైనదే కానీ, రూపం దేశీయం కాదు. పాశ్చాత్యుల నుంచి తెచ్చుకున్న అరువు. పాశ్చాత్యులు వృత్తము, ప్రాస వదిలేశారు కాబట్టి పంజాబీ కవి కూడా త్యజించాలి. అతను కూడా అభ్యుదయ భావ కవిత్వమే ఎంచుకోవాలి. శబ్దమూ, ఆవేశమూ కాగితం వరకే అంకితమవుతోంది. అదే భావజాలం ఉన్న ఏ కొద్దిమందికో ఆ కవిత్వం పరిమితమయిపోతోంది. ప్రేరణ పొంది, మార్పుకి గురి కావల్సిన ప్రజలకీ, పల్లెవారికీ, శ్రామికజనానికీ, ఈ కవిత్వంలో తలా తోకా కనిపించదు. చివరికి వారు ఉదాసీనతకి గురవుతున్నారు. గాభరా మిగులుతోంది. ఈ నవీన కవిత్వపు పిడికిలిలో మిగతా భారతీయ భాషలూ చిక్కుకున్నాయని నేనంటే అది తప్పు కాదని అనుకుంటాను.”

“మొన్ననే నా సహనటుడు జానీ వాకర్ – ‘ఇప్పుడు హిందీలో వార్తలు వినండి’కి (అబ్ హిందీ మే సమాచార్ సునియే) బదులుగా ‘ఇప్పుడు వార్తల్లో హిందీ వినండి’ (అబ్ సమాచార్ మే హిందీ సునియే) అని చెప్పాలని అన్నాడు.”

“మంగలి వ్యాపారాన్ని దెబ్బతీసేలా ఫేషన్ పేరుతొ గుండు కొట్టించుకొని, మీసాలూ, గెడ్డాలూ తీసేయమని ఏ విద్యార్థికయినా చెప్పే ధైర్యం మనకుందా? కానీ ఇవాళ రేపు యోగా పేరుతో యూరపులోని విద్యార్థులందరూ గుండు కొట్టించుకుంటే, మర్నాడే కనాట్ సర్కస్ అంతా గుండ్లతో నిండిపోతుందని ఘంట వాయించి మరీ చెప్పగలను. యోగా ఇంట గెలవాలంటే పక్కవాడి (యూరోపు) ప్రశంసాపత్రం అవసరం.”

“ఈ మంత్రుల మీద ఎలుగెత్తి అరిచే ఇదే పెద్దమనుషులు ఏ ఒక్క చిన్న వేడుకనీ ఈ మంత్రులు ప్రారంభించకుండా, లేదా ముఖ్య అతిథిగా అధ్యక్షత వహించకుండా జరపలేరు. ఒక్కోసారి సినిమా తార అధ్యక్షుడు గానూ, మంత్రిగారు అతిథిగానూ ఉంటారు. మరోసారి వారి స్థానాలు తారుమారు కావచ్చు. ఎవరో ఒక పెద్ద తలకాయ ఉండాలి. ఎందుకంటే అది వలసవాద సాంప్రదాయం.”

( శ్యామ్‌కి కృతజ్ఞతలతో – సాయి బ్రహ్మానందం గొర్తి

ప్రకటనలు

వ్యాఖ్యానించండి