Archive for ఏప్రిల్, 2010

నేహల – అయిదో భాగం


జాజర

14వ శతాబ్దంలో స్వేచ్ఛ కోసం చరిత్రకి బలైన ఓ ముగ్ధ కథ – నేహల

విజయనగర మహారాజు దేవరాయలు బహమనీ సుల్తానుల తిరుగుబాటును రాయచూరు వద్ద తిప్పికొడతాడు. ఆ విజయోత్సవాన్ని విజయదశమినాడు జరుపుకుంటూ రాజ్య నలుమూల నుండీ అందర్నీ ఆహ్వానిస్తాడు. ఆ సందర్భంలో జరిగే వేడుకలకి ముద్గల్ వాసులైన వేదరాయశర్మా, ఆయన శిష్యుడు రేవన్నా ఓ నృత్యనాటిక ప్రదర్శనకై విజయనగరం వస్తారు. దేవరాయలు బహమనీ రాజులపై కన్నేసే నిమిత్తమై వేగులని నియమిస్తాడు. కోట విస్తీనార్ణి పెంచడానికి మంచి ముహూర్తం నిర్ణయించమని వేదరాయ శర్మని కోరుకుంటాడు. వేదరాయ శర్మ విజయనగర చరిత్రని రేవన్నకి చెబుతాడు.

బహమనీ సుల్తానుల పాలనలో ఉన్న గుల్బర్గా ప్రాంతానికి
సుల్తాను ఫిరోజ్ షా. అతని రాజవ్వడానికి కారకుడైన మత ప్రవక్త గిసు దరాజ్ యుద్ధాలు మాని ప్రజల్ని మంచిగా చూసుకోమని హెచ్చరిస్తాడు. ఫిరోజ్‌షా తమ్ముడు అహ్మద్‌ఖాన్ ఎలాగైనా విజయనగరాన్ని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశ్యంతో పథకాలు వేస్తూ ఉంటాడు.

రేవన్న విజయనగరంలో విరూపాక్ష దేవాలయం సందర్శిస్తాడు. అక్కడ అతని ప్రియురాలు నేహలకి తన కవిత్వంతో ప్రేమ లేఖని రాయిస్తాడు. స్వచ్ఛమైన అతని ప్రేమని చూసి ఆ దుకాణదారుడు రేవన్నకి పద్మాకారంలో ఉన్న ఒక పతకాన్ని బహూకరిస్తాడు. రేవన్నకి ప్రియురాలు నేహల పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది.

రేవన్నా, వేదరాయశర్మా విజయనగరంలోనే ఉండాల్సొస్తుంది. మిగతా బృందమంతా ముద్గల్ వెనక్కి వస్తారు. స్నేహితురాలు ప్రభ ద్వారా నేహలకి “సావరహే” ప్రేమ లేఖా పత్రం పంపిస్తాడు రేవన్న.

విజయ నగర దేవరాయల్ని ఎదుర్కోవాలంటే రాయచూరు సమీపంలో కోట ఉండాలని భావిస్తాడు అహ్మద్‌ఖాన్. ఈ విషయమై ఫిరోజ్‌షా ని ఒప్పిస్తాడు. గిసుదరాజ్ అభ్యంతరం చెప్పకుండా ఉండడానికి గుల్బర్గాలో నీటి కరువు తీర్చడానికి భీమ నది నుండి కాలవలు తవ్వే ప్రణాలిక ముందుకు తీసుకొస్తాడు. ఫిరోజ్‌షా పేరు మీద ఫిరోజాబాద్ కోటని కడదామన్న ప్రతిపాదన తీసుకొస్తాడు. ఫిరోజ్‌షా ఒప్పుకుంటాడు.

విజయనగర రాజుల వద్ద వేదరాయశర్మ పలుకబడి గ్రహిస్తాడు రేవన్న. తిరుగు ప్రయాణంలో విజయనగర వేగు మసూమ్ వారితో కలిసి ప్రయాణిస్తాడు. వేదరాయశర్మకి విజయనగర రాజ్య వ్యూహాల్లో భాగం ఉందని తెలుస్తుంది రేవన్నకి.

వేదరాయ శర్మా, రేవన్న విజయనగరం నుండి ముద్గల్ తిరిగి వస్తారు. దారిలో మసూమ్ అనే వేగుని రేవన్నకి పరిచయం చేస్తాడు వేదరాయశర్మ. విజయనగరం నుండి తెచ్చిన కానుకగా నేహలకి పద్మాకారం బిళ్ళ వున్న తాయత్తుని చేతికి కడతాడు రేవన్న.

భీమనది నుండి గుల్బర్గాకి నీరు మళ్ళించే పేరుతో ఫిరోజాబాద్ పేరుతో ఒక్కడ ఒక కోట కడదామని ఎత్తు వేస్తాడు అహ్మద్‌ఖాన్. నదీజలాల మళ్ళింపుని గిసుదరాజ్ ప్రోత్సహిస్తాడు. ధనాగారం నిండుకుందన్న నెపంతో ప్రజలపై కొత్త పన్ను విధించడానికి ఫిరోజ్‌షాని ఒప్పిస్తాడు అహ్మద్‌ఖాన్.

వేదరాయశర్మ ఇంటికి నగలన్నీ అలంకరించుకొని వస్తుంది నేహల. అందరూ ఆమె అందం చూసి అబ్బురపడతారు. నేహల అందం ముందు ఏ రాణి వాసపు స్త్రీ పనికిరాదని వేదరాయశర్మ భార్యతో చెబుతాడు.

భీమనది ఒడ్డున కోట నిర్మాణ పనులు మొదలు పెడతారు. రాయచూరునుండి శిల్పుల్ని పనికి కుదిర్చేవాడిగా అహ్మద్‌ఖాన్ వద్ద ఒప్పుకుంటాడు మసూమ్.
ఇదీ ఇంతవరకూ జరిగిన కథ.

కౌముదిలో నెలనెలా సీరియల్‌గా వస్తోంది. – తరువాయి భాగం ఈ క్రింది లింకులో చదవండి.

నేహల – అయిదో భాగం

ఇంతకు ముందు భాగాలు – ఇక్కడ చదవండి.

నేహల – ఒకటో భాగం

నేహల – రెండో భాగం

నేహల – మూడో భాగం

నేహల – నాలుగో భాగం

ప్రకటనలు

వ్యాఖ్యానించండి

నవ భావ శిల్పం ‘ద్రౌపది’ – అవార్డులకి పారదర్శకత అవసరమా?“దొంగ పడిన ఆర్నెల్లకి…” అన్న సామెత చందంగా ద్రౌపది నవల పై బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాసం వచ్చిన నాలుగు వారాల తరువాత ఇది రాసాననుకుని కంగారు పడకండి. బేతవోలుగారి వ్యాసం ప్రచురించిన రోజునే ఇది రాయడం జరిగింది. ఆంధ్రజ్యోతికి పంపాను. వేసుకుంటామన్నట్లుగా సంకేతాలిచ్చారు. సాహిత్యానికి వారానికొక పేజీ. లెక్కల కొద్దీ ఆర్టికల్సు వస్తాయి. ఆ గుట్టలో అడుక్కి పోయిందనుకుంటున్నాను. ఇంతవరకూ వెలుగు చూడక పోయేసరికి బ్లాగుకి తగిలిచాను.అవార్డులకి పారదర్శకత అవసరమా?


ఎట్టకేలకు ద్రౌపది నవలపై బేతవోలు రామబ్రహ్మం గారు స్పందించారు. వ్యాస భారత అడుగుజాడల్లో ఒంపుగా, సొంపుగా నడిచిందనీ, మహోదాత్తంగా మలచబడిందనీ విశదీకరిస్తూ ఒక ప్రశంసా పత్రాన్ని అందించారు. ఆంధ్రజ్యోతి ( 01/03/2010 )వివిధలో బేతవోలు రామ బ్రహ్మంగారి “నవ భావ శిల్పం ‘ద్రౌపది'” అన్న వ్యాసం చదివాక కలిగిన అభిప్రాయమిది. ఈ వ్యాసం కూలంకషంగా చదివితే ప్రశంసాహేతువులకంటే, ప్రశ్నలే ఇందులో ఎక్కువగా కనిపించాయి. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి “ద్రౌపది” నవలా సమీక్షలా కాకుండా వ్యాస భారత సమీక్షలా అనిపించింది. ఇతిహాసాలనీ, పురాణలనీ కాలానుగుణంగా తిరిగి రచించడం కొత్తేమీ కాదు. భవభూతి ఉత్తరరామ చరిత్ర నుండీ, శశిరేఖా పరిణయం వంటి కథల వరకూ రామాయణ, మహాభారతాలే మూలం. ఇవే కాకుండా రామాయణ, మహాభారతాలపై అనేక రచనలొచ్చాయి. వ్యాస, వాల్మీకాలకి భాష్యాలు చెబుతూ అనేకం వచ్చాయి. అలాంటిదే ఈ ద్రౌపది నవల కూడా. మరి వ్యాసభారతంతో పోల్చడంలో ఉద్దేశ్యమేమిటి? ప్రస్తుత నవల వ్యాసభారత అడుగుజాడల్లోనే నడిస్తే. మరి కొత్తగా ఈ నవల్లో చెప్పిందేమిటి? ద్రౌపదిని ఏ కొత్త కోణంలో ఆవిష్కరించారు? వ్యాస భారతాన్నే సింహభాగం అనుసరిస్తే, మరలా ద్రౌపది గురించి తిరగ రాయడమెందుకు? ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిల్చడంతో నిరాశ కలిగింది. వ్యాస భారతంలో సంస్కృత శ్లోకాలు ఉటంకించడంవల్ల ఈ నవల్లో కొత్తగా చెప్పిందేవీ లేదన్న భావన కలిగింది.

నవలా వస్తువుని ఓ క్షణం పక్కన పెడితే, ఇప్పుడు జరుగుతున్న చర్చనండి లేదా రచ్చనండి; ఈ నిరసనలకి కారణం నవలా రచన కాదన్నది నిర్వివాదాంశం. నవల సీరియల్ గా వచ్చి మూడేళ్ళు దాటింది. తెలుగు పాఠకులకి పరిచయమయ్యి చాలా కాలమే అయ్యింది. రెండో ముద్రణ కూడా వచ్చింది. నచ్చిన వాళ్ళు బావుందని మెచ్చుకున్నారు. నచ్చని వాళ్ళు ఇదేమిట్రాని నొచ్చుకున్నారు. మూడేళ్ళ క్రిత్రం నాటి నవలని వెలికితీసి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడంతోనే అసలు గొడవ మొదలయ్యింది. అనుకూల, ప్రతికూలంగా చాలామంది తమ తమ అభిప్రాయాలను రాసారు.
ఇంతవరకూ నోరు మెదపని సాహిత్య అకాడమీ సభ్యుల్లో ఒకరైన బేతవోలు గారు ఆ నవలపై వారి అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పడానికి ఉపక్రమించారు. ఇది తెలుగు సాహిత్య పరంగా చాలా మంచి పరిణామం. ఇంతవరకూ ఈ సభ్యుల ఉద్దేశ్యాలూ, అభిప్రాయాలూ ఈ నవలపై ఎక్కడా రాలేదు. సాధారణంగా ఈ బహుమతీ ప్రదాతల లేదా కమిటీ సభ్యుల ప్రవర్తన – “తాంబూలాలిచ్చేసాం తన్నుకు చావండి” అన్నట్లుగా ఉంటుంది. దీనికి భిన్నంగా బేతవోలు గారు ద్రౌపది నవలని మరోసారి విశ్లేషించడానికి పూనుకోడం ముదావహం.

బేతవోలుగారి వ్యాసం సంస్కృత శ్లోకాల వివరణిస్తూ, అక్కడక్కడ సూచనలిస్తూ,, హెచ్చరికలూ చేస్తూ ద్రౌపదిని వ్యాసభారత పరిధిలోనే రాసారని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. దీనికి సమర్ధింపుగా ఆయనిచ్చిన కొన్ని వివరణలు చూస్తే కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.

వర్ణాశ్రమ ధర్మాలూ వాటి వంకరటింకరలూ వగైరా వగైరా పురాణసామాగ్రి అంతా ఇందులో కనడుతుందని అన్నారు. భౌతిక దృష్టితో చూసినవారు వీటిని పరిహరించారన్న్నారు. అలాగే అక్షౌణీల సైన్యం వంటివి కూడా సందేహాస్పదమేనని చెబుతూ, లోహాల వినియోగమే సంశయాస్పదమైంప్పుదు అంతలేసి ఆయుధాలేమిటని ప్రశ్నించిన వారున్నారంటూ చెప్పారు. రకరాకల వైపరీత్యాలకీ, షోకులకీ దినుసు ఇతిహాసాలంటూ చెప్పి – అలా ఆధునిక పోకడలకి పోకుండా వ్యాసుడి అడుగుజాడల్లోనె ఈ ద్రౌపది నవల నడిచిందన్నారు. ఇలా భౌతిక విమర్శావాదుల తర్కన్ని చూపిస్తూ ఇతిహాసాలపై విమర్శలు కొత్తేమీ కాదని రాసారు. కాబట్టి ఇప్పుడీ ద్రౌపది నవలపై వచ్చిన విమర్శకూడా ఆ కోవలోకే చెందుతుందన్నట్లుగా చెప్పీ చెప్పకుండా వదిలేసారు. దాంతో ఇది పాఠకులని అయోమయంలో పడేసే ప్రమాదం కనిపించింది.

విజ్ఞానశాస్త్ర పరంగా చూస్తే లోహాల పుట్టుక క్రీ.పూ 1500 కాలం నుండే వుంది. ఇనుము ( 1500 BC ), తగరం ( 3500 BC ) రాగి ( 4200 BC ) బంగారం ( 6000 BC ) నాటికే ఉన్నాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. మహాభారత కాలం 3100 BC అని కొంతమంది నిర్ధారిస్తే, మరికొంతమంది 5000 BC కాలం అని ధృవీకరించారు. ఇవి చూస్తే మహాభారత కాలంలో ఈ లోహాల వాడుక ఉందని గ్రహించగలం. వాదనకి దిగేవారు పైన చెప్పిన ప్రశ్నల్ని తర్కంగా చూపిస్తారు తప్ప రుజువుల జోలికి పోరు. వినడానికవి వాస్తవమే నన్న భ్రమ కలిగిస్తాయి. ఈ లోహల వినియోగ చరిత్ర ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడితో వదిలేద్దాం.

ద్రౌపది పుట్టు పూర్వోత్తరాలు చర్చిస్తూ స్వయంగా వ్యాసుడే ద్రుపదుడికీ, ద్రౌపదికీ కరస్పర్శతో దృష్టినిచ్చి పూర్వజన్మ వృత్తాంతాల్ని చెప్పిన తరువాతే, పాండవులతో ఇద్దరూ అంగీకరించారని చెప్పారు. నన్నయ భారతంలో ఈ విధంగా లేదు. “వినగ నిష్టమేని విను మని ద్రుపద చే యూది యింటిలోని కొనర నరిగి, తాను నతడు నేకతను యుండి, వాని కం, తయును జెప్పదొడగె ధర్మవిదుడు” అని ఆదిపర్వంలో ఉంది. కేవలం ద్రుపదుడికే యాజ్ఞసేని వృత్తాతం చెబుతాడు. ద్రౌపదికి చెప్పడమన్నది ఇక్కడ ప్రశ్నార్ధకం. ఇది వ్యాస భారతం నుండే సంగ్రహించబడిందా? లేక ఈ నవల్లో కొత్తగా చెప్పరా? ఇది మాత్రం స్పష్టంగా లేదు.

అలాగే వ్యాసభారతంలో పలుచోట్ల అంతర్లీనంగా సఖీ సాంప్రదాయముందని చెప్పారు కానీ, ఏఏ సందర్భాలలో ప్రస్ఫుటంగా ఉందో చెబితే బావుండేది. సఖి సాంప్రదాయం అంటే మరికాస్త వివరణ అవసరం. అది స్నేహమూ కాదు. అలా అని సహోదరత్వమూ కాదు. ప్రియురాలు కాకపొతే మరి ఈ సఖి అన్న పిలుపుకి నిర్వచనం ఏమిటి? ఇచ్చిన ఒక్క ఉదాహరణా సఖి అన్న పదాన్ని చెలియలుగా ఎలా అర్థం తీసుకున్నారో చెప్పడానికి మాత్రమే వాడారు. బంధుత్వం రీత్యా పాండవులుకి బావ శ్రీకృష్ణుడు. ఆ విధంగా చూస్తే ద్రౌపది చెల్లెల వరసే అవుతుంది. కాబట్టి ఈ సఖీ అన్నది కేవలం ఆధునిక భావజాలనుండి పుట్టిన నిర్వచనమా? లేక కావ్యేతిహాసాల నుండి సంగ్రహించబడిందా? ఈ సఖీ అన్న పిలుపు అనేక కావ్యాల్లోనూ, ఇతిహాసాల్లోనూ విరివిగా కనిపిస్తుంది. మరి అక్కడా అలాంటి అర్థమే తీసుకోవాలా? ఇందులో స్పష్టత చాలా అవసరం. ఎందుకంటే అది ద్రౌపదికీ, కృష్ణుడికీ ఉన్న బంధాన్ని నిర్వచిస్తుంది. వారి మనస్తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ చిత్రీకరిస్తుంది. మనం ఎన్ని అర్థాలు తీసుకున్నా, ద్రౌపది కృష్ణుడికి చెల్లెల వరసే!. ఎవరూ కాదనలేని విషయమిది.

ఈ సఖీ సాంప్రదాయాన్ని ఈ నవల్లో కొత్తగా ప్రవేశబెట్టడం జరిగిందన్నారు. అపార్థాలు వచ్చిపడతాయేమో అన్న భయం ఈ రచయితకుందేమోనన్న అనుమానం వ్యక్తపరుస్తూ ద్రౌపదీకృష్ణులు తమ సఖ్యాన్ని గురించి ప్రస్తావించుకున్న ప్రతి సందర్భంలోనూ ఒక అర్జునుడినో ఒక సత్యభామనో సాక్షిగా నిలబెట్టాడని చెప్పారు. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని చెప్పాలనుకున్నా ముందొచ్చేది వావీ వరసలే! వరసకెలాగూ చెల్లెలే కాబట్టి, ప్రియ సఖీ, ఇష్ట సంఖీ అని సంబోధించడం సాంప్రదాయ విరుద్ధమేమీ కాదు కదా? ఓ పక్క వ్యాస భారతంలో ఈ సఖీ సాంప్రదాయం కనిపిస్తోందని చెబుతూ మరలా ఈ నవల్లో కొత్తగా ప్రవేశపెట్టడం ఏమిటో అర్థం కాదు.

ఇహ ద్రౌపది జీవితంలో శృంగార రసానుభవానికున్న అవకాశమెక్కడుందంటూ, జీవితమంతా అడవిలోనే గడిచిందన్నట్లుగా చెప్పారు. అందువల్ల ద్రౌపది నవలా రచయిత శృంగార రసాన్ని పండిచడానికి పాంచరాత్ర కల్పన చేసినట్లుగా అన్నారు. అక్కడే శృంగారం మోతాదు మించి మనస్తత్వ చిత్రీకరణ లోపించిందన్నారు. అంతా వ్యాసభారతమే మూలమని చెప్పినప్పుడు శృంగారం ఆధునికావసరమా? లేక పాఠక వశీకరణ మంత్రమా? పైగా వ్యాసుడుకూడా దాసీ సంగమ ఘట్టంలో రాసాడు కాబట్టి, ఇక్కడా రాయచ్చనే ధ్వనొచ్చేలా చెప్పారు. వ్యాసుడు చేసాడు కాబట్టి మనమూ చెయ్యచ్చనే వాదన అర్థరహితంగా కనిపిస్తుంది. శృంగారం తప్పు కానప్పుడు అవయవ వాచక ప్రయోగాలు అభ్యంతరకరమెలా అవుతాయి? అవి కూడా శృంగారంలో భాగమే కదా అని వాదించే వారూ ఉంటారు. కావల్సినవి మూలాల్నుండి ఏరుకుంటాం. అక్కర్లేనివి కల్పన చేస్తాం. తప్పు లేదు. ఇలా వ్యాసం మొత్తమూ ద్రౌపది నవలా సమర్థనమీదే నడిచింది. ఒక్క శృంగార పదప్రయోగాల విషయం మీద తప్ప. శృంగార వర్ణనకొచ్చేసరికి నాగరికం, అనాగరికం అన్న ప్రశ్నే లేదు. అనాగరికమని భావించబట్టే కొన్ని శృంగార కావ్యాలని మనవాళ్ళు బూతులుగా అభివర్ణిస్తూ పనికిరాని సాహిత్యంగా జమకట్టేసారు. ఆఖరికి కళాపూర్ణోదయాన్నీ, కుమారసంభవాన్నీ ఇలా శృంగార కావ్యాల గుంజకి కట్టేసి అంతా బూతనే వారూ ఉన్నారు. కొంతమంది పాఠకులు నొచ్చుకుంటారనుకున్నారో ఏమో ఈ శృంగారమే ఈ నవలకొక దిష్టి చుక్కని ద్రౌపదికి దిష్టి తీసి పడేసారు.

నవల బాగోగులూ, వివిధ శిల్పాల ప్రయోగాలూ చెప్పి, ఈ నవల ఏ విధంగా సాహిత్య అకాడమీ అవార్డుకి అర్హత పొందిందో చెబితే బావుండేది. అలాగే మిగతా నవలలని దాటి ఇదెందుకు ముందుకెళ్ళిందో చెప్పగలిగితే ఎంతో సాహిత్య ప్రయోజనం ఒనగూరేది. కానీ అలాంటిదేదీ జరగలేదు. ద్రౌపది నవల గురించి విశేషణాలే తప్ప, విషయ సందర్శన లేదు. ఏ ఏ సందర్భాల్లో ద్రౌపదిని కొత్త కోణంలో చూపించారో చెప్పలేదు. కేవలం వ్యక్తిత్వ సుగుణమే కాకుండా, ద్రౌపదిని ఒక అద్భుతమయిన వ్యవహార ( మేనేజ్మెంట్ వ్యక్తిగా )వేత్తగా చిత్రీకరించాడు వ్యాసుడు. ఎన్ని కోణాల్లో స్పృశించచ్చో అన్నీ పండు వొలిచినట్లే చూపించాడు. అరణ్య పర్వంలో సత్యా ద్రౌపదీ సంవాదం పేరట ద్రౌపది గురించి ఆమె నోటే పలికించాడు. అసాధారణ వ్యవహార ప్రతిభకల స్త్రీగా, ఇల్లాలిగా ద్రౌపది వ్యక్తిత్వం ఎంత పరిపూర్ణమయ్యిందో చిత్రీకరించారు. మరి ఈ నవల్లో ఉన్న కొత్తదనమేమిటి? అది చెప్పలేదు. చెప్పాల్సిన చోట దాట వేసారు. కేవలం ఫ్లాష్బాక్లా కథా రచన్ని సాగించడం ఒక్కటేనా? వ్యాసుడి సంస్కృత శ్లోకాలూ, కవిత్రయ పద్యాలూ సూచించడంవల్ల వాటినే తిరగరాసారన్న భావన కలుగుతుంది. చదివేవారిని గందరగోళంలోకి నెట్టేసింది.

ఈ మొత్తం సాహితీ రభసకి కారణం ఈ అవార్డనే దిష్టిచుక్కే! ఏ ప్రమాణాలు చూసారూ, ఏ నవల్లని పరిగణనలోకి తీసుకున్నారూ, ఏ ఏ అంశాలు స్పృశించారూ అన్నవి ఎప్పుడూ గుప్పిట్లోనే ఉంటాయి. ఎప్పటికీ తెరవరు. ఇందులో ఏ మాత్రం పారదర్శకతుండదు. మనకి విదేశాల్లోలాగ ఈ పది నవల్లూ మా దృష్టిలోకొచ్చాయీ, వీటిపై మా అభిప్రాయాలివీ అని ఏ ఒక్క కమిటీ సభ్యులూ లిఖిత పూర్వకంగా చెప్పిన పాపాన పోరు. చెబితే వాళ్ళని ఎక్కడ పట్టుకుంటారోనన్న భయం కావచ్చు. ఈ ద్రౌపది నవలతోనే పరిగణనలోకి వచ్చిన మిగతా నవలల గురించి కమిటీ సభ్యులకి తప్ప మూడో కంటికి తెలీదు. అవార్డు ప్రకటించే ముందు తెలీకపోయినా తరువాత కూడా వాటి ప్రసక్తే ఉండదు. కాబట్టి మిగతా నవలలకంటే ఈ ద్రౌపది నవల ఎందుకు శ్రేష్టమయినదో తెలిసే అవకాశమే లేదు. సరికదా అనేక అనుమానాలకి దారి తీసింది. అందువల్ల వివాదాస్పద రచనకి అవార్డివ్వడంలో అవకతవకలు జరిగాయోనన్న సంశయం కలిగింది.

పేర్లు ప్రకటించకపోయినా సభ్యుల అభిప్రాయాలు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించే పద్ధతి అవలంబిస్తే ద్రౌపది నవలపై ఇంత రభస జరిగుండేది కాదు. ఎవరికి వారు కారణాలనీ, సంజాయిషీలనే వెతుకుతున్నారు తప్ప, నవలపై విశ్లేషణ చెప్పలేదు. ముఖ్యంగా కమిటీ సభ్యులు. అసమదీయులు ఆహా అంటే, తసమదీయులు తిరస్కరించారు. ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు చేసుకున్నారు.

ఇలాంటి సందర్భంలో బేతవోలుగారు ఈ వ్యాసం రాసి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. వారికీ ద్రౌపది నవలపై ఉన్న పూర్తి అభిప్రాయాన్ని వివరించకపోయినా, కొంతయినా చెప్పగలిగారు. ఇది నిజంగా మంచి సాహితీ పరిణామం. అలాగే మిగతా సభ్యులూ వారి వారి అభిప్రాయాలని చెబితే ఈ అవార్డులిచ్చే పద్ధతుల మీద పాఠకులకి నమ్మకం కలిగించిన వారవుతారు. వారి నిర్ణయాన్ని ఎవరూ కాదనరు. విజ్ఞతనీ శంకించరు. కానీ తమ విశ్లేషణని చెప్పడం వల్ల మంచే జరుగుతుంది. సాహిత్యకాడమీ పద్ధతుల మీద విశ్వాసం కలిగించిన వారవుతారు. నాగరిక సమాజంలో జీవిస్తున్నాం కనుక విశాల దృక్పథానికి బీజం వేసినట్లవుతుంది. కనీసం రాబోయే అవార్డులయినా పారదర్శకతతో ఉంటే తెలుగు సాహిత్యానికి మేలు జరుగుతుందనే నా నమ్మకం.

-సాయి బ్రహ్మానందం గొర్తి
కుపర్టినో, కాలిఫోర్నియా

వ్యాఖ్యానించండి