Archive for ఫిబ్రవరి, 2010

హేరీ పాటర్ ఎక్కడ? మనం ఎక్కడ?


దాదాపు మూడేళ్ళ క్రితం నాటి మాట. అప్పట్లో హేరీపాటర్ పుస్తకం అమెరికాలో రిలీజయిన సందర్భంలో రాసిన వ్యాసం ఇది. ఆంధ్రభూమి, సాహితి లో వచ్చింది.

హేరీ పాటర్ ఎక్కడ? మనం ఎక్కడ?

తెలుగులో బాల సాహిత్యం చందమామని దాటి పోలేదు. పూర్వం చాలా పత్రికలు బాల సాహిత్యానికొక పేజీ కేటాయించేవారు. ఇప్పుడదీ లేదు. “పిల్లల కోసం ఒక నవల రాస్తాను. మీరు ప్రచురిస్తారా?” అని పత్రికల చుట్టూ తిరిగితే కాళ్ళరిగి, మన పిల్లలు వృద్ధులయ్యే కాలం వచ్చేస్తుంది.

సరైన సాహితీ అభిరుచి లేని వారు సంపాదకులుగా చెలామణీ అవుతూంటే ఇటువంటి సాహిత్యానికి విలువుండదు.

“యథా సంపాదకా, తధా పాఠకా” అని ఓ నిట్టూర్పు విడవడం తప్ప చేయ గలిగిందేమీ లేదు.

తెలుగులో మరలా బాల సాహిత్యం బ్రతికి బట్టకడుతుందన్న ఆశయితే నాకు లేదు.

బాలారిష్టాలతో బాలసాహిత్యం ఎప్పుడో వెనకబడిపోయింది.

ప్రకటనలు

14 వ్యాఖ్యలు

అపార్ట్ మెంట్ – నాటకం

జాజర


పరుచూరి పరిషత్ నాటక పోటీల్లో ప్రదర్శింపబడ్డ నాటకం “అపార్ట్ మెంట్“. ఈ నాటకం 2008లో ఏప్రిల్ 29న, మంగళవారం సాయంత్రం 6:30 నిమిషాలకి రవీంద్రభారతిలో ప్రదర్శించారు.

పూర్వం ఇళ్ళన్నీ దూరంగా ఉండేవి. మనుషులు మాత్రం దగ్గరగా జీవించేవారు. ఇప్పుడు ఇళ్ళన్నీ ఒకే చోటున్నా, మనుషులు మాత్రం అందనత దూరంలో ఉంటున్నారు.
జీవితంలో వేగం ఎంతలా పెరిగిందీ, ముఖ్యంగా పిల్లలపై దాని ప్రభావం ఏమిటీ అన్నదే ఈ నాటకసారాంశం.

ఈ నాటకం నంది నాటక పోటీలకీ సెలక్టయ్యింది. కొన్ని అనివార్యకారణాల వల్ల ప్రదర్శించలేదు. ఈ నాటక దర్శకులు కృష్ణేశ్వరరావు గారి ఆరోగ్య కారణాల వల్ల ప్రదర్శన చాలా ముందుగానే విరమించుకోవలసి వచ్చింది. ఆతరువాత పరుచూరి పరిషత్ లో వేసారు. నాటకానికి చాలా మంచి స్పందనొచ్చింది. ఈ నాటకంలో ఉత్తమ సహాయనటి, ఉత్తమ బాలనటి వంటి బహుమతులు గెల్చుకుంది.

నాటకంలో వికాస్ అన్న అబ్బాయి పాత్రని అమ్మాయిగా మార్చి నాటకం వేసారు. అదొక్కటే వాళ్ళు చేసిన మార్పు. మిగతా నాటకం తొంభై శాతం యధాతధంగా వేసారు.

ఈ నాటకం మూల ప్రతి ఇక్కడ చదవ్వచ్చు. మూల ప్రతిలో అక్కడక్కడ అచ్చుతప్పులున్నాయి. వాటిని చూసి నన్ను తిట్టుకోకుండా, క్షమించేసి చదవండి. అలాగే హర్ష నార్మల్ ఫాంటు వాడడం వల్ల దీని మరలా యూనికోడ్ లోకి మార్చడం కుదర్లేదు.

సాక్షి పత్రికలో ఈ నాటకంపై వచ్చిన వార్త ఇక్కడ చూడవచ్చు.

వ్యాఖ్యానించండి

టిక్కట్లు అమ్మబడును – (హాస్య నాటిక)


సుమారు ఆరేళ్ళ క్రితం నేను రాసిన ఓ హాస్య నాటిక:


టిక్కట్లు అమ్మబడును


అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఈ నాటకం ప్రదర్శించారు. అమెరికాలో అయిదు చోట్ల ప్రదర్శించారు.

అప్పటి (రాసిన కాలం 2003-2004) సంఘటనలు బట్టి రాసిందయినా, ఇప్పటికీ ఇది వర్తిస్తుంది.

ఈ నాటకం తెలుగుపీపుల్.డాట్.కాం లో కూడా వచ్చింది.

వ్యాఖ్యానించండి

ద్రౌపది గురించే మరోసారి…

జాజర


మతగ్రంధాలనీ, కావ్యాలని ఏ విధంగా చదవాలీ, వాటిపై వచ్చే కాల్పానిక సాహిత్యాన్ని ఎలా చూడాలీ అన్న విషయాలపై సౌదాహరణంగా రాసిన వేలూరి వేంకటేశ్వర రావు గారి వ్యాసం వివిధ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. చాలా మంచి వ్యాసం.
ఈ క్రింది లింకులో చదవ్వచ్చు.


ద్రౌపది నవలపై మరో కోణం నుంచి… – వేలూరి వేంకటేశ్వర రావు


సాహిత్య అకాడమీ సభ్యుల్ని నేను ప్రశ్నించినట్లుగానే ఈయనా అడిగారు. పెద్ద మనిషి తరహాగా ప్రశ్నించారు, కమిటీ సభ్యులు వివరణిస్తే బాగుంటుందని.

బహుమతులు ముట్టజెప్పడమే కానీ, అవొచ్చిన రచనలు ఎందుకార్హత పొందాయో చెప్పే ఆనవాయితీ తెలుగు సాహిత్యంలో అంతగా అలవాటు లేదు. ఎవరికెవరూ జవాబుదారీలు కారు.

వాళ్ళెవ్వరూ పెదవి విప్పరు. కానీ వేరే కొంతమంది వచ్చే వారం ధ్వజమెత్తే అవకాశాలున్నాయి. మంచిదే! ఈ రకంగానయినా మంచి సాహితీ చర్చ జరుగుతుంది. ముందు ముందు సాహిత్య అకాడమీ అవార్డులిచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు వారికి వారే ప్రశ్నించుకునే సందర్భం కలిగించినట్లవుతుంది.

5 వ్యాఖ్యలు

ద్రౌపది అవార్డు వెనుక కథ – జవాబుదారీలు

జాజర


తెలుగు సాహిత్యంలో ఈ మధ్యకాలంలో వేడి వేడి చర్చాంశం ద్రౌపది నవల. ఈ నవలకి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారన గానే తెలుగు నాట ఈ పుస్తకంపై రాని విమర్శలేదు. రాయని పత్రికలేదు. ఎవరి వాదన్ని వారు వినిపిస్తూ ఎవరి దృక్పథం ప్రకారం వాళ్ళు రాస్తున్నారు. ద్రౌపది నవల చదివాక వేరే కోణంలో అర్థం చేసుకునే భాగ్యం కలిగిందని కొంతమంది రాస్తే, మూలాన్ని వక్రీకరించీ సొంత అభిప్రాయాలూ, విలువలూ ద్రౌపదికి ఆపాదించారంటూ మరికొంతమంది విరుచుకు పడుతున్నారు. మంచి నవలా అని వకాల్తా ఇచ్చే వాళ్ళు ద్రౌపది నవల చదవండీ, మనకి తెలీని కొత్త ద్రౌపదిని చూడచ్చని సలహా ఇస్తున్నారు. ఈ సలహా ఇచ్చే వారే వ్యాసుడు ద్రౌపదిని ఎలా చిత్రీకరించాడో చదివరా? చదివితే ఇలాంటి ఉచిత సలహాలిచ్చుండే వారు కారు. పోనీ వ్యాసుడక్కర్లేదు. కనీసం కవిత్ర విరచిత భారతాన్నయినా పూర్తిగా చదివి ద్రౌపది గురించి తెలుసుకొని అప్పుడు మూలంలో ఉన్నవీ, నవల్లో లేనివీ రెండూ బేరీజు వేస్తూ విమర్శ చేస్తే బావుంటుంది. కానీ తెలుగు సాహిత్యంలో విమర్శ కేవలం అభిప్రాయ పరామర్శగానే మారుతోంది. బావుందీ, బాగోలేదూ అని చెప్పడానికి మరో పేరుగా విమర్శ చెలామణీ అవుతోంది. పుస్తక సమీక్షలో విమర్శ కూడా ఒక భాగం. సమీక్ష అంటే ఏమిటి? పుస్తకం మంచీ చెడుల గురించి చెప్పడమే కదా? అంటే ఏఏ అంశాలు బావున్నాయో, ఏవి గాడి తప్పయో, ఎక్కడ విషయ వక్రీకరణ జరిగి అపోహలకీ, అనుమానాలకీ దారి తీస్తోందో చెప్పగలగాలి. ప్రస్తుతం పుస్తక సమీక్ష అంటే ఆహా ఓహో వ్యవహారంలా తయారయ్యింది. రాసిన వారి బంధువులో,మిత్రులో సమీక్ష చేయడానికి నడుం కడుతున్నారు. అందువల్ల తొంభై శాతం చప్పట్లతోనూ, మరీ అంతగా పొగిడేస్తే బావుండదని మొహమాటానికి ఒకటో అరో చిన్న చిన్న తప్పులు సూచించి చేతులు దులిపేసుకుంటున్నారు. అంతే తప్ప సమీక్షలో సరైన విమర్శ భాగం కావడం లేదు.

సమీక్షకులూ, విమర్శకులూ సరే! అసలు రచయిత వీటికి ఎలా స్పందిచాడు. ఆయన జవాబులేమిటి? ఏ దృక్పథంతో నవల రాసారు? రాసిన వాటికి అన్నీ కాకపోయినా మూల గ్రంధంలో ఏ విషయాన్ని బట్టి పాత్రల చిత్రీకరణ జరిగిందీ వంటి విషయాలు వచ్చినట్లు లేదు. ఎంత విమర్శా, రభసా జరిగితే రచయితకి అంత మంచిది. చక్కగా ఓ పది కాపీలెక్కువ అమ్ముడవుతాయి. ద్రౌపది నవల మీద వచ్చిన అన్ని వ్యాసాలూ చూసాక రచయిత మీడియా మైకుల ముందు స్పందించడమే తప్ప, ఎక్కడా లిఖిత పూర్వకంగా రాసినట్లు చూళ్ళేదు. నేను రాయదల్చుకుంది రాసాను. ఇష్టముంటే చదవండి. లేకపోతే లేదని రచయిత చెప్పచ్చు. దీన్నెవరూ కాదనరు.

రచయిత సరే, అసలీ అవార్డుని సిఫార్సు చేసిన ప్రముఖులయినా స్పందించారా అంటే అదీ లేదు. ఎందుకొచ్చిన గొడవా, ఊరుకోడమంత ఉత్తమం లేదు; బోడిగుండంత సుఖం లేదని అనుకున్నారో ఏమో, రాతలు సరే కనీసం ఎవరూ నోరు కూడా మెదపడం లేదు. అసలీ అవార్డు అప్పగింతలో ఒక విషయం మాత్రం అంతుబట్టడం లేదు. అందరూ రాసిన రచయితపై అవాకులూ, చివాకులూ పేలుస్తున్నారు తప్ప, ఈ అవార్డుకి సిఫార్సు చేసిన వారిని మాత్రం ఎవరూ ప్రశ్నించడం లేదు. ఏ ప్రతిపాదికన ఈ పుస్తకాన్ని నిర్ధారించారు? ఏ విషయంలో ఇదొక మంచి నవలని అనుకున్నారు? లేక వచ్చిన వాటిల్లో అల్లులో మల్లులా భావించి ఇచ్చారా? వీటన్నింటికీ జవాబుదారీలు ఈ సాహిత్య అకాడమీ అవార్డు సభ్యులు. అందరూ రచయిత మీద అరుస్తున్నారు తప్ప వీళ్ళనెవరూ నిలదీయడం లేదు. అసలు సంజాయిషీ రచయిత కాదు. వీళ్ళిచ్చుకోవాలి. రచయిత తను మెచ్చిందీ, నచ్చిందీ రాస్తాడు. రాసే హక్కూ, ప్రచురించే హక్కూ రచయితకుంది. అందరికీ ఆమోద యోగ్యంగా రాయనవసరం లేదు. కొన్ని వర్గాలకి నచ్చచ్చు. మరికొంతమందికి నచ్చకపోవచ్చు. ఏటా కొన్ని వందల నవల్లొస్తున్నాయి. అందులో అత్యుత్తమమైనవాటిగా భావించిన కొన్నిటికి అవార్డుకి ప్రతిపాదించచ్చు. కానీ ఆ ప్రతిపాదనకి ప్రేరేపించిన అంశాలు ఏమిటి? ఎందుకీ నవల వచ్చిన వాటిలో అత్యుత్తమమైనదని భావించారు? సభ్యులందర్నీ అంతగా ఆకట్టుకున్న అంశాలేవిటి? ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత సభ్యులకీ వుంది. కేవలం నోటి పలుకులేనా లేక లిఖిత పూర్వకంగా చెప్పారాన్నది తెలీదు. అమెరికాలో అయితే అవార్డు కమిటీ సభ్యులు లిఖిత పూర్వకంగా రాసిస్తారు. మరి సాహిత్య అకాడమీ వారి పద్ధతేమిటో స్పష్టంగా తెలీదు.

పత్రికల్లో పనిజేసే ఒక మిత్రుడితో పైన చెప్పినవని, ఇదే విషయం ఆరా తీస్తే, ఆంధ్రాలో పత్రికల వాళ్ళ మధ్య తిరుగుతున్న ఓ వార్తని చెప్పాడు. ప్రతీ భాషలోనూ సాహిత్య అకాడమీ వాళ్ళు ఆ ఏడు వచ్చిన నవలల్లో ( ద్రౌపది నవల గురించి కాబట్టి నవలల గురించే ప్రస్తావిస్తాను. ) ఓ పది నవలలు ఎంపిక చేస్తారు. ఆ జాబితాని ఆయా భాషల్లో నియమితులైన సభ్యులకీ, ఆ కమిటీ అధ్యక్షులకీ పంపుతారు. సభ్యులు ఆ వచ్చినవన్న్నీ కూలంకషంగా చదివి అందులో ఓ నాలుగు నవలల్ని ఒకటి రెండు మూడు క్రమంలో సూచిస్తూ మార్కులేస్తారు. సభ్యులు ఎంపిక చేసిన వాటిల్లో ఎక్కువ వోట్లొచ్చిన పుస్తకాన్ని సదరు అధ్యక్షుల వారు సాహిత్య అకాడమీ వారికి అందజేస్తారు. అది చూసి వాళ్ళు అవార్డు ప్రకటిస్తారు. ఇదీ ఎంపిక జరిగే పద్ధతి. కానీ ఈ ద్రౌపది విషయంలో జరిగింది వేరు. కమిటీ సభ్యులందరూ వారి వారి జాబితాని అందజేసారు. వాటిల్లో ఏ సభ్యుడూ ద్రౌపదిని మొదటి స్థానంలో ఇవ్వలేదు. ఒకళ్ళు రెండో స్థానం ఇస్తే, మరొకరు నాలుగో స్థానం ఇచ్చారు. మరొకరు మూడో స్థానమిచ్చారు. మొదటి, రెండు స్థానాల్లోనూ వచ్చిన నవలలు ఏ ఒక్కరివీ కలవలేదు. కానీ అందరి జాబితాల్లోనూ ఈ ద్రౌపది నవలుంది. ద్రౌపది తప్ప, మిగతా ఒక్కరి జాబితా కలవలేదు. ఇటువంటప్పుడు ఒకరు మొదటి స్థానమిచ్చిన నవలని అవార్డుకి ప్రతిపాదిస్తే, మా జాబితాలో మొదటి నవలకెందుకివ్వలేదన్న ప్రశ్నొస్తుంది. గొడవలు మొదలవుతాయి. అందరికీ ఆమోద యోగ్యంగా ఉన్న నవలిదొక్కటే మిగిలింది కాబట్టి దీన్నే అవార్డుకి ఎంపిక చేయడం జరిగిందని చెప్పాడు. ఆ కమిటీ సభ్యుల్లో ఒకరు ఈ నవలకి అవార్డివ్వడం దండగని అభ్యంతరం పెడితే, ఎంపికయిన వాటిల్లో అందరికీ ఏకాభిప్రాయం లేదు కనుక సాహిత్య అకాడమీ వారు ఈ ఏటికి పూర్తిగా అవార్డు రద్దు చేసే అవకాశముంది కాబట్టి, తెలుగు నవలకి కనీసం ఒక్క అవార్డు ఇవ్వలేదని అందరూ నవ్వుకుంటారనీ, వేలెత్తి చూపుతారనీ భావించి ద్రౌపదిని సూచించడం తప్పలేదని చెప్పాడు. అలా ద్రౌపది ఎన్నికయ్యిందని చెప్పాడు. మిగతా విషయాలెలా వున్నా ఇందులో ఒకటి మాత్రం నిజం. సభ్యులెవరూ ఇంతగా ప్రతిఘటనొస్తుందని ఊహించలేదు. ఆంధ్రభూమిలో వచ్చిన విమర్శా వ్యాసమే ఈ ప్రతిఘటనకి కొబ్బరికాయ కొట్టిందనీ, మిగతా పత్రికలన్నీ దాన్ని అంది పుచ్చుకున్నాయనీ వివరించాడు. తరువాత జరిగిన సంగతి అందరికీ తెలుసు. ఇవేమీ కాదు. ఈ అవార్డుకి పైరవీలు చాలా జరిగాయన్న వాదన కూడా ఒకటుంది. జరిగింది కమిటీ సభ్యులకీ, కేంద్ర సాహిత్య అకాడమీ వారికీ తప్ప మరొకరికి తెలీదు.

ఇప్పటి వరకూ వచ్చిన వ్యాసాలు చూస్తే అందరూ రచయిత మీదే దాడి చేస్తున్నారు. కనీసం ఈ సభ్యుల్ని ప్రశ్నించిన పాపాన పోలేదు. ఆంధ్రభూమిలో ఒక వ్యాసంలో చిన్నగా కారా మాస్టారుని (కాళీ పట్నం రామారావు) ప్రశ్నించారు తప్ప, మిగతా సభ్యులు అక్కిరాజు వారినీ, బేతవోలు గారినీ, మాజీ గవర్నరుగా పనిజేసిన రమాదేవి గారినీ ఎవరూ నిలదీయ లేదు. రచయిత నవలవరకే జవాబు దారీ! కానీ వీళ్ళు అవార్డు ఎంపికకు జవాబుదారీలు. కాదంటారా? నవల నచ్చిందీ, నచ్చలేదన్నది పక్కనబెట్టి ఇందులో నాణ్యతాంశాల ప్రతిపాదికా వివరాలు చెబితే బావుండేది. అందరూ తాంబూలిచ్చేసాం తన్నుకు చావండన్నట్లున్నారు.

నిజానిజాలు పక్కనబెడితే, ఈ ఎంపిక విధానానికి సాహిత్య అకాడమీ కూడా ముందు ముందు సరైన పద్ధతి అవలంబిస్తే బావుంటుంది. ఎంపిక చేసిన పుస్తకాలపై కనీసం రెండు పేజీలు తక్కువకాకుండా ఆ పుస్తకం ఎందుకు అవార్డుకి అర్హత కలిగిందో సభ్యులని రాసిమ్మని కోరితే ( ఎందుకంటే సభ్యులందరూ విధిగా రచయితలే అయ్యుంటారు కాబట్టి ) ఇటువంటి వివాదాలు ముందు ముందు వచ్చే అవకాశం లేదు.

మహాభారతంలోనే కాదు, సాహిత్యంలో కూడా వివాదానికి గురవుతోంది ద్రౌపది. బహుశా ఆ పేరులోనూ, వ్యక్తిత్వంలోనూ ఉన్న గొప్పదనం వల్లనేమో?

8 వ్యాఖ్యలు

పంచమ ధర్మం – పద్య నాటకం – నంది 2005 – వీడియో

జాజర


తిరుపతిలో జరిగిన నంది నాటక పోటీలకి ఎన్నికై, ప్రదర్శించిన పద్య నాటకం.

ఈ నాటకాన్ని రవీంద్ర భారతి ( హైద్రాబాదు ), అజో విభో ఫౌండేషన్ నాటకోత్సవం ( నిజామాబాద్ ), తుమ్మలపల్లి కళాక్షేత్రం – విజయవాడలలో ప్రదర్శించారు.

దూరదర్శన్ – సప్తగిరిలో పలు మార్లు టెలీకాస్ట్ చేసారు.

ఈ నాటకానికి కీ.శే.ఎం.వి.రమణ మూర్తి దర్శకత్వం వహించారు. సంగీతం జి.ఎల్.ఎన్ శాస్త్రి గారందించారు. ఎర్రాప్రగడ పద్యాలకి ( కొన్ని ) మంచి సంగీతం అందించారు.

తిరుపతిలో పలువురి ప్రముఖుల నుండీ అనేక ప్రశంసలు పొందింది.
ఈ నాటకం వీడియోని ఇక్కడ చూడచ్చు.

మొదటి భాగానికి మాత్రం కాస్త నాణ్యతా లోపముంది. క్షమించ గలరు. మిగతావి అన్నీ సక్రమంగానే ఉన్నాయి.

రెండు గంటల నిడివి కల నాటకం. కాస్త ఓపిగ్గా చూడాలి.

యూ ట్యూబ్ లో పది నిమిషాల వీడియోలు మాత్రమే అనుమతిస్తారు. అందువల్ల పదికి పైగా విడగొట్టాల్సొచ్చింది.

పార్ట్ 3b – 4a విభాగాల్లో జమునారాయలు కొన్ని పద్యాలు చాలా బాగా పాడారు. ఈవిడ నటన్ని చాలామంది మెచ్చుకున్నారు. అలాగే ఇందులో ధర్మవ్యాధుడి అనుచరుడు నకులుడుగా నటించిన రఘువీర్ అనే కుర్రాడికి నాటకం వేసిన ప్రతీచోటా ఉత్తమ సహాయనటుడిగా బహుమతులొచ్చాయి. ఈ పాత్రకి మొత్తం నాటకంలో అతి తక్కువ ( ఒక రకంగా లేవనే చెప్పచ్చు ) మాటలున్నాయి. నటన మాత్రం చాలా బాగా చేసాడు.

అలాగే వృద్ధ దంపతులుగా వేసిన హైమవతీ, లక్ష్మి ప్రసాదుల నటన చూసి తిరుపతి ఆడిటోరియంలో కన్నీళ్ళు పెట్టుకున్న ప్రేక్షకుల్ని చూసాను. సినిమాలు చూసి ఏడ్చే ప్రేక్షకుల్ని చూసాను కానీ నాటకం చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళని చూడ్డం అప్పుడే ప్రథమం. నాటకం చూస్తే నేను చెప్పినవన్నీ మీరూ ఏకీభవిస్తారు.

పద్య నాటకాలు ఇష్టమున్నా లేకున్నా, నాటకంగా చూసినా మీరూ ఆనందిస్తారు. చూసి చెప్పండి.

వ్యాఖ్యానించండి