Archive for జనవరి, 2012

కోనసీమ ప్రభల తీర్థం – మా కుటుంబం – అనుబంధం

జాజర

దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది.
కొబ్బరాకుల నడుమనున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చే వన్నె వేరు.
సంక్రాంతికి మాత్రం కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది.
ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచు జిల్లై కురుస్తుంది. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి.

సంక్రాంతి వేడుకల్లో కోనసీమకొక ప్రత్యేకత ఉంది. అది – భోగి, పెద్ద పండుగల తర్వాత కనుమనాడు జరిగే జగ్గన తోట ప్రభల తీర్థం. అదొక ప్రత్యేకమైన వేడుక. విశేషమైన పండగ సంబరం.
కోనసీమ వాసులకి జగ్గన్న తోట ప్రభల తీర్థం పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధం. అందిరికీ పరిచయమున్న ఈ ప్రభల తీర్థానికీ మా కుటుంబానికీ తరతరాలుగా పెనవేసుకున్న ఒక అమూల్యమైన అనుబంధం ముడిపడుంది. అది పదిమందితో పంచుకోవాలన్నదే నా వుద్దేశ్యం.

కోనసీమ చుట్టుపక్కనున్న సుమారు 90 గ్రామాల నుండీ ప్రజలు ఈ ప్రభలతీర్థంలో పాలుపంచుకుంటారు. అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఉన్న ఏడెకరాల కొబ్బరితోటలో ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. ఇక్కడ ఏ గుడీ ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలూ కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరితోట. రైతులు నమ్మే భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం.

శివుని వాహనంగా భావించబడే వీరభద్రునిగా కోనసీమ వాసులు ఈ ప్రభలని భావిస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పరమేశ్వర రూపాలని ఈ ప్రభలని అలంకరించి మేళ తాళాలతో “అహోం- ఓహోం” అని తలస్తూ, తమ భుజ స్కంధాలపై మోస్తూ ఊరేగింపుగా ఈ జగ్గన్న తోటకి తీసుకొస్తారు. ఈ ప్రభలని వెదురు కర్రలతో చేసి, రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరించీ, వేదమంత్రాల మధ్యా గంటలు మ్రోగిస్తూ మోసుకు వస్తారు. కుల మతాలకతీతంగా ఈ ప్రభలని మోయడం పరమేశ్వర సేవగా భక్తులు తలుస్తారు.

జాజర

సుమారు నాలుగొందల ఏళ్ళపైగా ఈ జగ్గన్నతోట తీర్థం జరుగుతోందని అంటారు. నాలుగొందల ఏళ్ళగా జరుగుతోందన్నది చెప్పలేంగానీ సుమారు వందేళ్ళగా ఖచ్చితంగా జరుగుతోందని చెప్పగలను. దానికి మా కుటుంబమే ఒక పెద్ద ఆధారం. ఈ ప్రభల తీర్థం గురించి చదివాకా ఎందుకోనన్నది అందరికీ అర్థమవుతుంది. ఈ ప్రభల తీర్థానికొక పురాణ గాధ కూడా వుంది. మొసలపల్లి గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు తరలివస్తాయనీ, లోక కళ్యాణార్థమై వారందరూ ఇక్కడ కలుస్తారని ప్రజల విశ్వాసం. దీన్ని ఏకాదశ రుద్రసమావేశంగా ప్రజలు భావిస్తారు.

ఈ ప్రభల తీర్థానికి జగ్గన్నతోట ప్రభల తీర్థమన్న పేరురావడానికీ వేరొక కథ చెబుతారు. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఒక ఏక సంధాగ్రాహి ఉండేవాడట. ఆ గ్రామాన్నానుకుని ప్రవహించే కౌశికలో స్నానం చేసీ, పూజాపునస్కారాలు ముగించుకొని అక్కడే ఉన్న మర్రి చెట్టుకింద భోజనం చెసేవాడట. అలా చేస్తూ ఈ చెట్టునానుకున్న అమ్మ వారిని మైల పరుస్తున్నాడని భావించీ కొంతమంది స్థానికులు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఈయన్ని అడ్డుకున్నారట. ఈ సందర్భంలో జగ్గన్న నిజాం నవాబుని కలిస్తే, జగ్గన్న పాండిత్యాన్ని చూసి మెచ్చుకొని ఆ మర్రిచెట్టుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చారట. తనపై ప్రజలు ఫిర్యాదు చేయబట్టే తనకీ భూమి లభించింది కాబట్టి వారికోసమే ఈ ప్రభల తీర్థం జరిపాడనీ అంటారు. దేవుడికీ గుళ్ళూ గోపురాలూ అవసరం లేదనీ, మైలా మాపూ దేవుడికుండవనీ పదిమందికీ చెప్పడంకోసం ఈ ప్రభలపై దేవుణ్ణి ఎవరైనా మోసుకు రావచ్చని చెప్పే నిమిత్తమై ఈ తీర్థం మొదలయ్యిందనీ అంటారు.

జాజర

ఈ ప్రభలు ప్రజలు నడిచే దారంట రావు. రాళ్ళూ, రప్పలూ తోసుకుంటూ, గోతులనూ, కుప్పలనూ దాటుకుంటూ పొలాల మధ్యగా ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.
చుట్టు పక్కలగ్రామాలనుండీ ప్రభలు మోసుకు రావడమొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ తీర్థానికి మరొక వేశేషం కూడా వుంది. అదేమిటంటే పాలగుమ్మి పక్కనే ఉన్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలు పీకల లోతు కౌశిక దాటుకుంటూ, పొలాల మధ్యనుండి వస్తాయి. ఈ ప్రభలు కౌశిక దాటడం చూడ్డం కోసం వేలాది మంది తరలి వస్తారు. ఒక్కసారి ఎత్తేకా ఈ ప్రభలు క్రిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలని తాకించకూడదు. కౌశిక దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవ కూడదు. నీళ్ళ చుక్క కూడా ప్రభ మీదా, పైనున్న దేవుడి మీదా పడకూడదు. ఇవి మోయడానికి పాతిక మంది వ్యక్తులు సరిపడ్డా, కౌశిక దాటించడానికి మాత్రం నలభైమంది పైగా ఉంటారు. ఎంతో ఏకాగ్రతతో ఏ మాత్రం కంగారు లేకుండా జాగ్రత్తగా కౌశిక దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి చేరుస్తారు. తీర్థమయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలు ఎంతో బరువున్నా కౌశిక దాటించేటప్పుడు అవలీలగా దాటించడం మాత్రం దైవానుగ్రమే అంటారు అది మోసే వాళ్ళు. ఈ కౌశిక దాటించడం మాత్రం చూసి తీరాల్సిన ఘట్టం. గంగలకుర్రూ, అగ్రహారం ప్రభపై చెన్నమల్లేశ్వర స్వామీ, వీరేశ్వర స్వామీ విగ్రహాలని అలంకరిస్తారు.
జాజర

ఇహ మాకుటుంబానికి సంబంధించిన ఒక గాధ:

మా పూర్వీకుల స్వగ్రామం గంగలకుర్రు అగ్రహారం. మా పితామహుల ( తాత గారి) పేరు గొర్తి పళ్ళయ్య పంతులు. ఈయన సుమారు వందేళ్ళు బ్రతికారు. ఈయన 1956లో పోయారు. ఈయన బడిపంతులు. మొదట్లో అంబాజీ పేటలో బ్రిటీషు వాళ్ళు కట్టించిన ఒక హైస్త్కూలు ఒక్కటే ఈ చుట్టు పక్కల గ్రామాలకున్న విద్యా సౌకర్యం. అప్పట్లో రోడ్లూ, రహదారులూ సరిగా లేక వర్షాకాలంలో విద్యార్థులు స్కూలుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడే వారట. ప్రభుత్వానికి చెబితే ఫలితం లేకపోతే మా తాత గారు అంబాజీపేట స్కూల్లో ఉద్యోగం వదిలేసి ఆయనింట్లోనే ఒక స్కూలు మొదలుపెట్టారు. ఆ స్కూలికి ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఉచిత పాఠశాల. ఉపాధ్యాయునిగా మా తాతగారికున్న పేరు చూసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పిల్లలు ఈయన దగ్గరకే వచ్చి చదువుకునేవారట. రెండేళ్ళు గడిచాక ఈ విషయం బ్రిటీషు వారికి తెలిసి మా తాతగార్ని స్కూలు మూసేయమని ఆర్డరిస్తే, చుట్టుపక్కలెక్కడైనా ఒక స్కూలు కట్టిస్తే తన స్కూలు మూసేస్తానని మా తాతగారు చెబితే వాళ్ళు ఒప్పుకొనీ ఆ స్కూలికి మా తాతగారినే హెడ్ మాస్టారుగా నియమించారు. ఆయన చలవ వల్లే పాలగుమ్మి హైస్కూలు వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఆ స్కూలు శతసంవత్సర వేడుకలు కూడా జరిపారు. ఇదంతా 1905 ప్రాంతంలో జరిగింది. మా నాన్నగారూ కూడా అప్పటికి పుట్ట లేదు.

అప్పట్లో పిల్లలకి పుస్తకాలు కొనుక్కోవడమూ కష్టంగా ఉండేది. అలాగే వాళ్ళకి చెప్పడానికీ ఏ మాత్రం పరికరాలూ ఉండేవి కావు. మా తాతగారు బొమ్మలు బాగా వేసే వారట. ఆయనే స్వయంగా బొమ్మలేసి దేశ చిత్రపటాలూ, సైన్సుకి సంబంధించిన పటాలూ గీసి చెప్పేవారట. ఆయన లెక్కల్లో మేధావి. ఆయన దగ్గర చదువుకున్న ప్రతీ కుర్రాడికీ లెక్కలు మాత్రం బాగా వచ్చేవని మా నాన్న చెప్పేవారు. అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కాలేజీకి జి.పి.రామేశంగారని ఒక ప్రినిస్పాలుండేవారు. నేను కాలేజీలో చదివినప్పుడు కూడా ఆయనే ప్రిన్సిపాలు. ఆయన లెక్కల్లో మద్రాసు యూనివర్శిటీ ఫస్టట. ఆయన మా తాతగారి వద్దే చదువుకున్నారు. ఇంటర్ లో నాకు లెక్కలు కాలేజీ ఫస్టు వచ్చింది. ఆ సందర్భంగా కలిసినప్పుడు ఆయన మా తాతగారి గురించే చెబుతూ ఆయన మనవణ్ణిని తెలిసీ చాలా సంతోషించారు. ఇది మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఇదిక్కడాపి ప్రభల తీర్థం విషయానికి వస్తాను.

ఈ గంగలకుర్రు అగ్రహారం ప్రభ కట్టే పని పెద్ద పండగనాడు మొదలుపెడతారు. రాత్రి తెల్లవార్లూ కూర్చుని ప్రభని కడతారు. గత వందేళ్ళుగా మా తాతగారు కట్టించిన ఇంటిముందే ఈ ప్రభని కట్టడం ఒక పెద్ద ఆనవాయితీగా వస్తోంది. మా నాన్న్న 1976లో ఆ యిల్లు అమ్మేసినా ఇప్పటికీ ఆ యింటిముందే ప్రభకడతారు. ఈ ప్రభ కట్టడం మా తాతగారు బ్రతికున్నన్నాళ్ళూ ఆయన ఆధ్వర్యంలోనే జరిగేదట. ఇప్పటికీ ఆ గ్రామానికీ, చుట్టుపక్కల ఊళ్ళకీ ఆయన చేసిన సేవకి చిహ్నంగా గంగలకుర్రు అగ్రహారం ప్రభపై ఆయన చిత్రం పటం పెడతారు. అది లేకుండా ప్రభ కదలదు. ఒకసారి ఆ ఫొటో వర్షానికి తడిసి పాడయితే కొత్త ఫోటో కావాలంటూ, కుటుంబ కారణాల రీత్యా కాకినాడలో ఉన్న మా అమ్మగారి వద్దకొచ్చి ఫొటో కావాలని రాత్రికి రాత్రి కాకినాడ వచ్చి మరీ పట్టుకెళ్ళారట. ఇదీ తరతరాలుగా మా తాతగారు ఆ వూరికి చేసిన మంచి పనికి దక్కిన గౌరవం. మనిషి పోయి ఏభై ఏళ్ళు దాటినా ఇంకా ఆ గ్రామం మర్చిపోలేదంటే ఎంత నిస్వార్థ సేవో అయితే కానీ ఇన్ని తరాలు గుర్తు పెట్టుకోరు.
ఈ ప్రభల ఫొటోలని పరీక్షగా చూస్తే మా తాతగారి ఫోటో కూడా కనిపిస్తుంది. ఇదీ జగ్గన్న తోట తీర్థానికీ మా కుంటుంబానికీ ఉన్న బంధం.
జాజర

మా తాత గార్ని నేను చూడ లేదు. ఆయన పోయిన పదేళ్ళక్కానీ నేను పుట్టలేదు. అందువల్ల ఈ సంగతులన్నీ మా మామ్మా, నాన్నా, అమ్మా చెబితే తెలిసినవే తప్ప చూసినవి కావు. ఇంకో విషయం. ఈ ప్రభలు కౌశిక దాటించి తీసుకెళ్ళడానికింకో కథ చెబుతారు ఆ వూళ్ళో వాళ్ళు. అగ్రహారానికీ, పాలగుమ్మికీ మధ్య ఈ కౌశిక ఉంది. దానిపై డెబ్భైఏళ్ళ క్రితం వంతెన కట్టారు. అంతవరకూ కౌశికలోంచి తీసుకెళ్ళిన ప్రభని ఆ ఏడాది మాత్రం వంతెన మీదుగా తీసుకెళ్ళారట. ఆ ప్రభ తిరిగి తీసుకొచ్చిన రాత్రి ఎవరైతే ఆ ప్రభని మోసారో వాళ్ళందరి ఇళ్ళూ అంటుకు పోయాయట. అది ఒక అశుభంగా తలచి మరుసటి ఏడాది నుండి మాత్రం యధావిధిగా కౌశిక దాటించే ప్రభని తీసుకెళతారు. ఇప్పటికీ ఇదే ఆచారం నడుస్తోంది.
క్రమం తప్పకుండా 1985 వరకూ వెళ్ళాను. ఆ తరువాత మళ్ళీ ప్రభల తీర్థానికి వెళ్ళడం పడలేదు. ఎప్పటికైనా మా పిల్లలకిది చూపించాలని వుంది. చూద్దాం. ప్రతీదానికీ ఒక సమయం వుంటుంది.
జగ్గన్నతోట ప్రభల తీర్థం చెబితే తెలియదు; చూసి తీరాలి. ఇదివరకూ వార్తా పత్రికల్లో ఎక్కడో ఒక మూల చిన్న వార్తొచ్చేది. ప్రస్తుతం టీవీల పుణ్యమాని అందరికీ తెలుస్తున్నాయి.
జగ్గన్నతోట ప్రభల తీర్థం అదొక అనిర్వచనీయమైన వేడుక. మరలా ఎప్పుడు చూసే అదృష్టం దొరుకుతుందో? ఏమో? కాలమే కరుణించాలి.
అంతవరకూ…అంతే!

(ఈ ఫొటోలు క్రితంసారి ఎవరో బ్లాగులో పెడితే “కాపీ యే రైటు” అని సిగ్గు విడిచి తస్కరించాను )

ప్రకటనలు

4 వ్యాఖ్యలు

ఎవరికోసం ఈ సంక్రాంతి శుభాకాంక్షలు? సంక్రాంతి “శుభా”స్పామ్

జాజర


సంక్రాంతి శుభాకాంక్షల పేర ఇప్పటివరకూ వందకి పైగా మెయిళ్ళొచ్చాయి. కొన్ని స్నేహితులనుండీ, మరికొన్ని బంధువులనుండీ, తెలుసున్నవాళ్ళ నుండీ, మిగతావి ముక్కూ మొహం తెలియని వారినుండీ. చివరిన రాసిన వారినుండి వచ్చిన సంఖ్యే చా…..లా పెద్దది.

అందరూ సంతోషాన్ని పంచుకోవడానికే ఈ శుభాకాంక్షలు పంపుతారనీ తెలుసు. మీరు కూడా అలా భావించి పంపి వుండచ్చు.

కానీ మీరు పంపే రెండు లేదా మూడొందల మంది ఈమెయిళ్ళల్లోకి SPAM పంపుతున్నారన్న చిన్న విషయం గమనించండి. ఇలాంటి స్పాముల వల్లే వైరసు పాములు మన కంప్యూటర్లలోకి చొరబడతాయి. కంప్యూటర్ నిండా విషం చిమ్ముతాయి. ఈ చిన్న విషయం తెలుసుకుంటే అందరికీ మంచి చేసిన వారవుతారు. ఎదుటివారికి మంచి చేద్దామనుకుంటూనే తెలియ కుండా ఎంత చెడు జరుగుతోందో ఒక్క సారి ఆలోచించండి.

భూమ్మీద ఈమెయిలున్న ప్రతీ తెలుగువాడికీ శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదు.
నిజంగా మీరు చెప్పాలనుకుంటే అమ్మకో,నాన్నకో, చెల్లెకో, అన్నకో, అక్కకో లేదా మీ సన్నిహితులకో చెప్పండి.
ఈమెయిలు ద్వారా కాదు.
వాళ్ళని పలకరించి పండగ చేయండి.
ఓ చిన్న కరచాలనం ఇవ్వండి.
వాళ్ళ మొహాల్లో చిరునవ్వు వెలిగించండి. వారితో కొన్ని క్షణాలు గడిపి సంతోషం కలగచేయండి.

నాకు తెలుసున్న ఒకాయన ఉన్నారు. ప్రతీ పండక్కీ అందరికీ ఈమెయిలు ఠంచనుగా పంపుతారు. ఫోను చేస్తే తీయరు. ఆయనంతట ఆయన సొంత గొంతుతో పలకరించరు. ఎప్పుడైనా మన ఖర్మ కాలి ఏ పార్టీలో నయినా, మరెక్కడయినా కలిస్తే “మీకు గ్రీటింగ్స్ పంపాను.జవాబివ్వలేదేం?” అంటూ నిష్టారంగా, వెక్కిరింపుగా మాట్లాడతాడు. ఇలాంటివారికి ఏం చెప్పాలో తెలియదు. సాంకేతిక విజ్ఞానం మనందరినీ దగ్గర చేస్తోంది. ఊహకందనంత దగ్గరగా మనుషుల్ని కలుపుతోంది. కానీ దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో ఆలోచిస్తే బావుంటుంది.

మేం ఎవరినీ తిట్టలేదు కదా? శుభాకాంక్షలు చెబితే కూడా తప్పా? ఈ గోలేవిటని మీకనిపించవచ్చు. ప్రపంచమంతటికీ మంచి జరగాలనీ, అందరూ సంతోషంగా ఉండాలన్న ఆశా, ఆశయమూ, ఆలోచనా మంచివే. కానీ ప్రతీ మనిషి ప్రపంచం అంటే సన్నిహితుల, స్నేహితుల, బంధువూల సమూహం చిన్నదిగానే ఉంటుంది. ఎంతో మంది పరిచయమున్నా, మన ప్రపంచంలోకి అందర్నీ కాలెట్టనివ్వం. రకరాకల గీతలు గీసి ఎదుట వారిని నిలువరిస్తాం. ఈ చిన్న విషయం గమనిస్తే మనందరికీ మంచిది.

అంతే కానీ ఇలా అందరికీ పంపడంలో ఎవరికీ ఒరిగేదేమీ లేదు. సగానికిపైగా అందరూ చూడకుండానే చింపి పారేస్తారు. ఇలా రాస్తున్నానని మీరు నన్ను తిట్టుకోకండి. ఈ కంప్యూటర్లో స్పాముల పాములోళ్ళకి ఇలాంటి ఈమెయిళ్ళే పండగ. మన అవివేకాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. మరోలా భావించకండి. దయచేసి సామూహిక శుభాకాంక్షలకి శలవు ఇప్పించండి.

మీ అందరికీ సంక్రాంతి సందర్భంగా సూక్తిముక్తావళి వినిపించడం నా వుద్దేశ్యం కాదు. నిన్న ఒక మిత్రుడికి సంక్రాంతి శుభాకాంక్షల మెయిలుతో వచ్చిన గ్రీటింగ్ చూద్దామని విప్పగానే వైరస్ బాంబు పేలి, కంప్యూటర్ నాశనమయ్యిందనీ, దాన్ని బాగుచేసుకోవడానికి పది గంటలు కాలం వెచ్చించినా బాగుపడలేదనీ, తనకీ విధంగా భోగి పండగ జరిగిందనీ, మెయిలు పంపిన మహాశయుణ్ణి తిట్ల శతమానంతో దీవించాడు. ఈ విషయం నాకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుదావని చేసిన ఫోను సారాంశం. అతన్ని చూస్తే జాలేసింది. కానీ ఏవీ చెయ్యలేం. ఇదే పరిస్థితి మరికొంతమందికి కలగవచ్చు.

ఈ ఈమెయిళ్ళన్నది కూడా ఒక పెద్ద అంతుచిక్కని వల లేదా మాయా వలయం. ఒకాయన అయిదొందలమందికి “హేపీ పొంగల్” అంటూ సంక్రాంతి శుభాకాంక్షలు పంపుతాడు. వేంటనే మరొకాయన చూసీ చూడగానే “రిప్లై ఆల్” నొక్కేసి కసి తీర్చుకుంటాడు. ఇలా మొదటి వ్యక్తి పంపిన మిగతా నాలుగొందల తొంభై తొమ్మిది మందో లేదా వేలమందో “రిప్లై ఆల్” కొట్టారనుకోండి. తెల్లారి చూస్తే మీ ఈమెయిలు ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా ఒక్కోటి అందిస్తుంది. అవన్నీ డిలీట్ చేసుకోడానికి మీకు అరగంట పైగా పట్టచ్చు. కాదని కంప్యూటర్ వాడే నాధుడెవడూ అనలేరు. ఒక్కోసారి ఈ ట్రాష్లోకి మనకి పనికొచ్చే మెయిలో, సమాచారమో కూడా కట్ట కట్టేసే ప్రమాదముంది. కాదంటారా?

ప్రపంచానికి కంప్యూటర్ శుభాకాంక్షలు చెప్పడానికి రకరకాల పద్ధతులున్నాయి. బ్లాగులూ, ఫేసుబుక్కులూ, ట్విట్టర్లూ, మన్నూ, మశానమూ చాలా వున్నాయి. అవి వాడితే అందరి కంప్యూటర్ జీవితాలకీ మంచిది.

నా మాటల పటాసులు మీకు గోలనిపిస్తే దీన్నీ మసో, మటాషో చేసి పారేయండి.

సంక్రాంతి అనే కాదు. ఏ పండగొచ్చినా ఈమెయిల్ “శుభా”స్పామ్ కి స్వస్తి చెప్పడం అందరికీ శ్రేయస్కరం.

-సాయి బ్రహ్మానందం గొర్తి

3 వ్యాఖ్యలు

ఈరోజు : నాద సుధాంబుధి ‘త్యాగరాజు’ వర్ధంతి


ఈరోజు నాద సుధాంబుధి ‘త్యాగరాజు’ వర్ధంతి.


తిధుల ప్రకారం పుష్య పంచమీ నక్షత్రాన పరమపదించారు. తేదీల ప్రకారమయితే జనవరి 6 1847న స్వర్గస్థులయ్యారు.

అరవదేశంలో అచ్చ తెలుగు వాహకంపై కర్ణాటక సంగీతానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు.
కర్ణాటక సంగీతం పేరు చెప్పి ఎంతోమంది జీవనోపాధికి కారణభూతుడు.
త్యాగరాజు పెట్టిన సంగీత భిక్షే ఎంతోమంది కళాకారులకి నేటికీ జీవనాధారం.
అందుకే త్యాగరాజు కారణజన్ముడు.

కర్ణాటక సంగీతమున్నంత కాలమూ త్యాగరాజు జీవించుంటాడు. త్యాగరాజు సంగీతమున్నంత కాలమూ తెలుగు భాషా ప్రతీ ఒక్కరి నోళ్ళలోనూ నానుతూనే ఉంటుంది. ఇది మాత్రం అక్షర సత్యం.

తిరువయ్యారులో త్యాగరాజు సమాధి:


జాజర


తానా సావనీరు “తెలుగు పలుకు” కోసం రాసిన వ్యాసం – (PDF File) నాద సుధాంబుధి – త్యాగరాజ సన్నిధి.

సంగీత మపి సాహిత్యం

“గీతం వాద్యం తధా నృత్యంత్రయం సంగీత ముచ్యతే” అనేది అనాదిగా వస్తున్న ఒక నానుడి. అంటే గీతమూ, వాద్యమూ, నృత్యమూ ఈ మూడింటీనీ కలిపి సంగీతం అన్నారు. ఈ మూడింటి సమ్మేళనమే భరతముని రచించిన నాట్యశాస్త్రం! కాలక్రమంలో ఈ మూడింటికీ ఒక నిర్దిష్ట రూపం వచ్చింది. మూడూ వేర్వేరు పాయలుగా అభివృద్ధి చెందాయి.
ప్రస్తుతం మనం ప్రత్యేక కళలుగా చెప్పుకునే సంగీతమూ, నాట్యమూ వేర్వేరు కావు. ఇక్కడ గీతమూ అంటే పాట, నాట్యమూ అంటే లయ. మెల్ల మెల్లగా గీతానికీ ఒక శాస్త్ర రూపం వచ్చింది. నాట్యానికీ ఒక పద్ధతీ సమకూరింది.
నారద విరచిత “స్వరార్ణవం”, ప్రతాప శైలుడి “సంగీత చూఢామణీ”, ముమ్మటాచార్యుడి “సంగీత రత్నమాల” ఇవన్నీ మనకున్న సంస్కృత సంగీత రచనలు.

సంగీతానికి సంబంధించీ మొట్టమొదటి తెలుగు రచన చేసిన ఘనత పెదకోమటి వేమారెడ్డికి చెందుతుంది. ఆ తరువాత తెలుగు వారు సంగీతానికి చేసిన సేవా, కృషీ ఇంతా అంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న కర్ణాటక సంగీతానికి ఒక రూపూ, రేఖా ఇచ్చింది ఖచ్చితంగా తెలుగు వారేనని గట్టిగా చెప్పచ్చు. అంటే మిగతా భాషల వారి కృషీ, సహకారం లేదని కాదు. సంగీతంలో తెలుగువారి కృషికి దీటుగా వేరెవరిదీ కనబడదు.


ఎందరో మహానుభావులు…


తన పద సంకీర్తనలతో ప్రజాపథం వైపు సంగీతాన్ని మలుపు తిప్పిన అన్నమయ్యా, కృష్ణలీలా తరంగిణి రాసిన నారాయణ తీర్థులు వారూ, భామాకలాప సృష్టికర్త సిద్ధేంద్ర యోగీ, ప్రస్తుతమున్న మేళకర్త రాగ చక్ర సంయోజన కర్తా, చతుర్దండి ప్రకాశిక రచించిన వేంకటమఖీ, పద రచన కర్త క్షేత్రయ్యా, కీర్తనాచార్యుడు రామదాసూ, తాళ్ళపాక చిన్నయ్యా, త్యాగయ్యా, ఇంకా తూము నర్సింహ దాసూ, శ్యామశాస్త్రీ, మునిపల్లె సుబ్రహ్మణ్య కవీ, ఇలా ఎంతో మంది సంగీతకారుల అవిర్గళ సృజన వల్లే ప్రస్తుతం కర్ణాటక సంగీతం జనరంజకంగా ప్రసిద్ధి చెందింది. తెలుగు భాషనే వాహకం పైనే వీరందరి సంగీతమూ జనబాహుళ్యంలోకి చేరింది. కర్ణాటక సంగీతాన్నీ, తెలుగు వారినీ, తెలుగు భాషనీ వేరు చేసి చూడడం ప్రస్తుతం అసాధ్యం.
పైన ఉదహరించిన అందరిలోనూ, కర్ణాటక సంగీతాన్ని ఒక పెద్ద మలుపు తిప్పిన ఘనత మాత్రం కర్ణాటక సంగీత శిరోమణీ త్యాగయ్యకే చెందుతుంది. ఒకటీ రెండూ కాదు, వందల కొద్దీ రాగాల్లో సంగీతాన్ని ప్రజలకందించాడు. శాస్త్రీయ సంగీతాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళాడు. పండితులూ, పామరులూ పాడుకునేలా సర్వజన సమ్మేతంగా కర్ణాటక సంగీతాన్ని మలిచాడు. కర్ణాటక సంగీతం అంటే త్యాగరాజూ, త్యాగరాజంటే కర్ణాటక సంగీతమూ అనే స్థాయిలో ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు.


సంగీత శాస్త్ర జ్ఞానమూ…

ప్రస్తుతం మనం వినే కర్ణాటక సంగీతం కాస్త పరిచయమున్న వారెవరూ కర్ణాటక సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడలేరు. త్యాగరాజు ముందు వరకూ కర్ణాటక సంగీతం అంటే లాగుడు పీకుడు రాగాలాపన చేసే సంగీతకారుల సంగీత శాస్త్ర కళ అనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. జానపదాలూ, భక్తి పాటలూ జనాల మధ్యనలిగినా శాస్త్రీయ సంగీతం వైపు సామాన్యులెవరూ కన్నెత్తి చూసేవారు కారు. సరిగ్గా అటువంటి సమయంలో శాస్త్రీయ సంగీతంలో ఉండే మాధుర్యాన్నీ, మత్తునీ చూపించీ, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినవాడు త్యాగరాజు. అప్పట్లో కచేరీ అంటే పొద్దున్న మొదలెడితే సాయంత్రం ఎప్పటికో తేలేది. ఎనిమిది గంటలు పైగా ఒకే రాగాన్ని పాడేవారట. అటువంటి సంగీత కచేరీల పద్ధతి మార్చి మామూలు జనం కూడా సంగీతాన్ని ఆస్వాదించేలా చేసి, ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాడు త్యాగరాజు. అంతవరకూ సంస్కృత భాషలోనే ఎక్కువగా నలిగిన సంగీతానికి, అతి సరళమైన రచనలతో అచ్చ తెలుగు నుడికార సొబగులు దిద్దిన వాడు త్యాగరాజు. త్యాగరాజుకంటే ముందుకాలం వాడయిన అన్నమయ్యా అచ్చ తెలుగులోనే కీర్తనలు రచించినా వాటిలో సంగీత మాధుర్యం మనకెవరికీ తెలీదు. ఎందుకంటే ప్రస్తుతం అన్నమయ్య కీర్తనలకి సాహిత్యమూ, దానికి సంబంధించిన రాగల పేర్లూ లభించినా స్వరాలు తెలియవు. స్వరాలు లేకుండా పాట ఎలాపాడేవారో మనం చెప్పడం కష్టం. ఒకే రాగంలో ఒకే పాటని చాలా రకాలుగా పాడచ్చు. త్యాగరాజు వరకూ వస్తే అటువంటి ఇబ్బంది కనిపించదు. వేలకి పైగా సంగీత రచనలు చేసారన్న ప్రచారమున్నా, మనకు లభించిన 900 పైచిలుకు రచనలకి స్వరాలున్నాయి. తద్వారా ఆ పాట ఎలా స్వరపరచబడిందో కూడా ఖచ్చితంగా తెలుసు. అందువల్లే ఎంతో వైవిధ్య సంగీత రచనలయిన త్యాగరాజు కృతులు జనబాహుళ్యంలోకి దూసుకు పోయాయి. సంగీత కచేరీకి ఒక దిశానిర్దేశం చేసాయి. దీనికంతటికీ ముఖ్య కారకులు త్యాగరాజు శిష్యులు.బంటురీతి కొలువు…

త్యాగరాజు అడిగిన వాళ్ళకి కాదనకుండా సంగీతం నేర్పాడు. ఆయనకి దాదాపు పాతిక మంది పైగా ప్రధాన శిష్యులున్నారు. అందరికీ ఉచితంగా సంగీత విద్య నేర్పాడు. తనవద్ద అంటే తనింట్లోనే వాళ్ళందరికీ నివాసం కలిపించి మరీ సంగీతం నేర్పాడు. ఆ రోజుల్లో ఇంతమందికి భోజనమూ, వసతి సౌకర్యాలు కలిపించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా ఎవ్వరి వద్దా ఒక్క పైసా ఆశించకుండా విద్య నేర్పడం అనుకున్నంత సులభం కాదు. ఎక్కడెక్కడనుండో వచ్చిన వారందరికీ తనింట్లోనో రెండేసీ, మూడేసేళ్ళు ఉంచుకొనే విద్య నేర్పాడు. ఇది నచ్చినవారినే శిష్యులుగా స్వీకరించాడు. ఇదొక్కటే కాదు. ఇంకో విచిత్రమైన నియమం కూడా ఉండేది. అది తెలుగు భాష నేర్చుకోవడం. తన రచనలన్నీ తెలుగులోనే ఉంటాయి కనుక, కృతి సాహిత్యం అర్థమయితే కానీ పాడేటప్పుడు దాని భావాన్ని పూర్తిగా తమ గొంతులో పలికించడం అసాధ్యం కనుక భాషా కూడా ఖచ్చితంగా తెలియాలన్న నియమం కూడా విధించాడు. వీటికన్నింటికీ సిద్ధపడిన వారికే సంగీతం నేర్పాడు. సాధారణంగా సంగీతం నేర్పేటప్పుడు స్వరాలు చెప్పి తరువాత సాహిత్యం పాడించడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. త్యాగరాజు ఈ పద్ధతికి విరుద్ధంగా ముందు సాహిత్యంతోనే పాట నేర్పేవాడనీ, ఆ తరువాతే స్వరాలు చెప్పేవాడనీ ఆయన శిష్యులు రాసారు. తన సంగీత పరంపరని శిష్యులకీ, వారి శిష్యులకీ కూడా అందిచడం అనితర సాధ్యమైన విషయం. గురుభక్తితో, కృతజ్ఞతా భావంతో ఆ శిష్యులే త్యాగరాజు సంగీతాన్ని పదిమందికీ అందించారు.

త్యాగరాజు వద్ద సంగీత శిష్యరికం చేసిన వాళ్ళల్లో అందరూ తమిళులే అయినా, ఇద్దరు మాత్రమే తెలుగు వాళ్ళు. వారిద్దరిలో ఒకరు ఈ తంజావూరు రామారావు. మరొకరు మనంబుచవాది వెంకట సుబ్బయ్యర్. అప్పట్లో తంజావూరు ప్రాంతంలో తెలుగు రాజ భాషగా ఉన్నా, తమిళమే ఎక్కువగా మాట్లాడేవారు. ఏదైతేనే త్యాగరాజు ధర్మమాని తమిళ నాటా, నోటా తెలుగు పదం సుందరంగా నిలిచింది.
త్యాగరాజు శిష్యుల్లో ముఖ్యులైన వేంకట రమణ భాగవతారూ, వీణా కుప్పయ్యరూ, మనంబుచవాది వేంకట శేషయ్యరూ,
తంజావూరు రామారావూ త్యాగరాజు రాసిన కృతులెన్నో తాళపత్రాలకెక్కించీ పొందుపరిచారు. ఇవన్నీ మదురై సౌరాష్ట్రసభలో ఉన్నాయి. కొన్ని తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో ఉన్నాయి.

వీరిలో వేంకటరమణ భాగవతారు, తంజావూరు రామారావుతో కలిసి త్యాగరాజు జీవిత చరిత్ర రాయడానికుపక్రమించాడు. అది పూర్తికాకుండానే వేంకట రమణభాగవతారు చనిపోయాడు. ఆ తరువాత వేంకట రమణభాగవతారు కొడుకు కృష్ణభాగవతార్ తండ్రి అసంపూర్తిగా వదిలేసిన కార్యాన్ని పూర్తిచేద్దామని సంకల్పించాడు. ఆయనా అది పూర్తిచేయలేదు. ఆ తరువాత కృష్ణభాగవతారు కొడుకాపని స్వీకరించాడు. అదీ పూర్తికాలేదు. చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు రాసిన జీవిత చరిత్రల్లోనూ చాలా తేడాలున్నాయి. ఒకే సంఘంటన్ని వేర్వేరుగా ఉటంకించారు. దాంతో ఏది సరైనదీ, ఏది కాదూ అన్నది తెలీకుండా పోయింది. వేంకట రమణభాగవతారు మాత్రం త్యాగరాజు కనుసన్నల్లో సంగీతం నేర్చుకున్నాడు. దాదాపు ముఫ్ఫై ఏళ్ళు త్యాగరాజుతో గడిపాడు. కాబట్టి ఆయన చెప్పినదానికి సాధికారత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే వీరందరూ హరికధా భాగవతార్లు అయినందువల్ల త్యాగరాజుని దైవాంశ సంభూతుడిగా స్తుతించారు. ప్రతీ సంఘటనికీ మహిమలూ, మహత్యాలూ అద్దారు. ఈ ఒరవడిలోనే త్యాగరాజు జీవిత చరిత్ర మీద చాలా రచనలొచ్చాయి. రామ భక్తుడైన త్యాగరాజుని కాస్తా దేవుణ్ణి చేసేసారు. అందువల్ల మనకు తెలిసిన త్యాగరాజు కథల్లో అన్నీ మహిమలే కనిపిస్తాయి. నిజా నిజాలు ఆ రాముడికే ఎరుక.రామభక్తి సామ్రాజ్యమూ…

విజయనగర సామ్రాజ్యం 1565 లో ముక్కలయ్యింది. అంతకుముందు దక్షిణాన్నున్న చాలా రాజ్యాలు ముస్లిం రాజుల చేతులనుండి తప్పి విజయనగర రాజుల పాలన కిందకొచ్చాయి. దానికి ముందు ముస్లింలు చోళ రాజ్యలపై దండెత్తి వాటిని ఆక్రమించుకున్నారు. అవి తిరిగి హిందూ రాజుల ఆధీనమయ్యాయి. వాటిలో తంజావూరు, మదురై రాజ్యాలకి తెలుగు వారైన నాయక రాజులు సైన్యాధిపతులుగా ఉండేవారు. ఎప్పుడైతే విజయనగరం విరిగిపోయిందో అప్పుడే వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తికల రాజులుగా ప్రకటించుకున్నారు. ఆ విధంగా మధురై, తంజావూరు నాయక రాజుల పాలన కిందకొచ్చాయి. 1600 కాలంలో త్యాగరాజు పూర్వీకులు రాయల సీమలోని కర్నూలు నుండి తంజావూరు వలస వచ్చినట్లు చెప్పబడింది.

తంజావూరు రాజ్యాన్ని 1675 నుండీ మరాఠా రాజులు పాలించారు. 1758 వ సంవత్సరంలో ఫ్రెంచి వాళ్ళు తంజావూరు పై దండెత్తి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. 1793 లో బ్రిటీషు వాళ్ళ ఆధీనంలోకి తంజావూరు వచ్చింది. పేరుకు తంజావూరు మరాఠా రాజుల పాలనలో ఉన్నా బ్రిటిషు వాళ్ళ చేతుల్లోనే పరిపాలన జరిగేది. ఒక రకంగా తంజావూరు రాజులు బ్రిటీషు వారి చేతిలో కీలుబొమ్మలు. బ్రిటిషు వారి కనుసన్నల్లో మరాఠా రాజుల వేలిముద్ర పాలన సాగింది. అప్పటి వరకూ తమిళ భాష రాజభాషల్లో ఒకటిగా ఉన్నా, మరాఠా రాజులు సంస్కృతానికీ, తెలుగుకే పెద్ద పీట వేసారు.

త్యాగరాజు సర్వజిత్ నామ సంవత్సరంలో పుష్యమీ నక్షత్రాన, చైత్ర శుక్ల సప్తమి నాడు (మే 4, 1767) తిరువారూర్ లో జన్మించాడు. తండ్రి రామబ్రహ్మం. తల్లి సీతమ్మ. రామాయణ,భారత, భాగవతాలు బాగా అధ్యయనం చేసిన రామబ్రహ్మం, అప్పట్లో తంజావూరు రాజైన తుల్జాజీ కొలువులో రామాయణం పఠనమూ, వ్యాఖ్యానమూ చేసేవాడు. ఇదే అతని జీవన భృతి. త్యాగరాజు తిరువారూర్ లో జన్మించాడు. కొంతకాలం తరువాత రామబ్రహ్మం తిరువైయ్యారు కి మకాం మార్చాడు.

తుల్జాజీ రామబ్రహ్మానికి బహుమానంగా ఇచ్చిన ఇంట్లోనే త్యాగరాజు నివసించాడు. అక్కడే ఆయన జీవితం పూర్తిగా గడిచింది. తిరువైయ్యార్ లో తిరుమంజన వీధిలో ఇదే ఇల్లు ఇప్పటికీ ఉంది. త్యాగరాజుకి తండ్రి పెట్టిన పేరు త్యాగబ్రహ్మం. అది త్యాగరాజుగా ఎలామారిందో, ఎవరికీ తెలీదు. చిన్నప్పటినుండీ రామభక్తి సాంప్రదాయంలో పెరిగాడు త్యాగరాజు. తల్లి ద్వారా రామదాసు కీర్తనలూ, తల్లి వైపు తాత వీణ కాళహస్తయ్య వద్ద సంగీతమూ నేర్చుకున్నాడు. ఆ విధంగా సంగీత మూలాలు త్యాగరాజులో నాటుకున్నాయి.

త్యాగరాజు చిన్నతనంలోనే అంటే ఎనిమిదో ఏటే ఉపనయనం చేసినప్పుడు తండ్రి రామబ్రహ్మం రామ తారక మంత్రాన్ని జపించమని త్యాగరాజుకి మంత్రోపదేశం చేసాడు. ప్రతీ ఏటా రామబ్రహ్మం చేసే రామనవమి ఉత్సవాలకి విచ్చేసిన శ్రీ రామకృష్ణానంద స్వామి “నమో నమో రాఘవాయ” అనే మంత్రాన్ని త్యాగరాజుకి ఉపదేశించాడు. ఈ విధంగా త్యాగరాజులో రామభక్తి బీజం నాటుకుంది. భక్తికి సంగీతం తోడయ్యింది.సంగీత జ్ఞానమూ – భక్తి వినా…

తంజావూరు రాజు తుల్జాజీ ఆస్థానంలో శొంఠి వేంకటరమణయ్య అనే సంగీత విద్వాసుడుండేవాడు. సంగీతంలో త్యాగరాజు ఆసక్తి గ్రహించి రామబ్రహ్మం త్యాగరాజుని శొంఠి వేంకటరమణయ్య దగ్గర శిష్యుడిగా చేర్పించాడు. త్యాగరాజు పదిహేనేళ్ళ వయసులో ఉండగా కొంతకాలం గురువు వద్దుండి, తంజావూరులోనే సంగీత విద్య నభ్యసించాడు. అప్పటికింకా త్యాగరాజుకి వివాహం కాలేదు. గురువు వద్ద సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. అతి తక్కువ కాలంలోనే అందులో ప్రావీణ్యం సంపాదించాడు.

త్యాగరాజుకి 18వ ఏట (1785 లో) పార్వతనే అమ్మాయినిచ్చి వివాహం చేసారు. త్యాగరాజు 20 వ ఏట తండ్రి రామబ్రహ్మం కాలం చేసాడు. సరిగ్గా తండ్రి పోయిన మూడేళ్ళకి త్యాగరాజు భార్య పార్వతి మరణించింది. ఆ తరువాత రెండేళ్ళకి పార్వతి చెల్లెలు కమలాంబని త్యాగరాజు రెండో పెళ్ళి చేసుకున్నాడు.

“నమో నమో రాఘవాయ” అన్న సంస్కృత కృతిని దేశి తోడి రాగంలో త్యాగరాజు 13వ ఏట స్వరపరిచాడనీ చెబుతారు.

త్యాగరాజు సంగీత ప్రాభవం రోజు రోజుకూ పెరుగుతూ, ఆనోటా, ఈనోటా ఈ విషయం గురువుగారైన శొంఠి వేంకటరమణయ్య వరకూ ప్రాకింది. ప్రతీ ఏడూ ఉగాది పర్వదినాన తంజావూరు దర్బారు హాలులో సంగీత కచేరీలు జరిగేవి. కేవలం ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసులకే అందులో పాడే అవకాశం లభించేది. ఒక ఉగాది సంగీత కచేరీకి గురువుగారి నుండి త్యాగరాజుకి ఆహ్వానమొచ్చింది. త్యాగరాజుకి గురువంటే ఉన్న భక్తి వలన కచేరీ చెయ్యడానికి వెళ్ళాడు. ఆ సభలో త్యాగరాజు చూపించిన సంగీత విన్యాసం చూసి ఆశ్చర్యపోయారందరూ. ఈ సంగీత సభలో రాగాలాపన, నెరవులు లాంటి మనోధర్మ ప్రక్రియలను ప్రకటిస్తూ, “జానకీ రమణా”, “దొరకునా ఇటువంటి సేవ” కృతుల్నీ పాడాడు. త్యాగరాజు ప్రతిభ చూసి అమితానందభరితుడైన శొంఠి వేంకటరమణయ్య, పండితులందరి ముందూ అతన్ని సత్కరించాడు.

ఈ సభలోనే “ఎందరో మహానుభావులు” అనే ఘన రాగ పంచరత్న కృతి పాడినట్లుగా ఇంకో ప్రచారం ఉంది. ఆ కృతిలో ఎంతో మందిని స్మరించినందువల్లా, ఆ సందర్భానికది కుదిరినందువల్లా ఎందరో మహానుభావులు కృతే పాడుండచ్చనీ చాలా మంది ఊహాగానం చేసారు (త్యాగరాజు సినిమాలో, కొన్ని పుస్తకాల్లో కూడా). కాకపోతే ఇది మాత్రం సరికాదు. ఎందుకంటే త్యాగరాజు ఘన రాగ పంచరత్న కీర్తనలు నలభై ఏళ్ళు దాటిన తరువాతే రచించాడు. త్యాగరాజు బాల్య మిత్రుడూ, శిష్యుడూ అయిన తంజావూరు రామారావు ప్రోద్బలం తోనే త్యాగరాజు పంచరత్న కీర్తనలు రాసాడని ఆధారాలున్నాయి.
ఇలాగే త్యాగరాజు జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలకీ, త్యాగరాజు కృతులకీ ముడేసి అనేక కథలు పుట్టుకొచ్చాయి. పలానా కృతి పలానా సందర్భంలో పాడాడూ అంటూ చాలామంది ఊహాగానాలూ చేస్తూ రాసారు. త్యాగరాజు ఏ సందర్భంలో ఏ కృతి రాసాడూ అన్న తేదీలూ, వివరాలూ తాళపత్ర గ్రంధాల్లో లేవు.

త్యాగరాజు 35వ ఏట తంజావూరు రాజు శరభోజి నుండి సంగీత కచేరీకి ఆహ్వానం వచ్చింది. త్యాగరాజు ప్రతిభ విని, అతని చేత కూడా తనపై కొన్ని కీర్తనలూ, కృతులూ కట్టించుకొనే ఉద్దేశ్యంతో రాజాస్థానానికి ఆహ్వానిస్తూ కబురు పంపాడు.తనపై ఒక కృతి రాసి పాడమని రాజు ఆదేశించడం త్యాగరాజుకి నచ్చలేదు. రాజాహ్వానాన్ని తిరస్కరించాడు. ఈ రాజ తిరస్కారమే త్యాగరాజు కుటుంబంలో చీలికలు తెచ్చింది. తండ్రి పోయిన తరువాత త్యాగరాజు కుటుంబమూ, తల్లీ, అన్నగారు పంచనదయ్య కుటుంబమూ అందరూ ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలా ఉండేవారు. పై సంఘటన జరిగిన తరువాతే శరభోజి కానుకలిచ్చి సేవకుల్ని త్యాగరాజింటికి పంపాడు. అవి వద్దని అన్నగారి ఎదుటనే తిరస్కరించడంతో అన్నదమ్ములిద్దరి మధ్యా విబేధాలు తారాస్థాయి నందుకున్నాయి. ఆ సందర్భంలోనే “నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగ పల్కు మనసా” అనే కృతి రచించాడనీ చెబుతారు. ఈ ఉమ్మడి కుటుంబం చీలిపోయిన సందర్భంలోనే “నాదుపై పలికేరు నరులు” అనే కీర్తన రాసినట్లు కూడా చెబుతారు.

ఆ తరువాత త్యాగరాజు ఉంఛవృత్తి స్వీకరించాడు. ఈ ఉంఛవృత్తి నియమం ప్రకారం కచేరీలు చేసినప్పుడు ఆహార పదార్థాలు అంటే కూరలూ,పప్పులూ వంటివి వారానికి సరిపడా మాత్రమే స్వీకరించేవాడు.

త్యాగరాజు వద్దకి ఎంతో మంది శిష్య్లు వచ్చి సంగీతం నేర్చుకోడం అన్నగారికి కంటగింపుగా ఉండేది. ఓ సారి త్యాగరాజు పూజించే సీతా రామ విగ్రహాలు పక్కనే ఉన్న కావేరీ నదిలో పరేసాడు. ఆ సందర్భంలో “ఎందెందు వెదికేరా” అన్న కృతిని రాసాడనీ అంటారు. చివరికి ఆ రాముడే కనిపించి కావేరీలో వెతకమని చెప్పాడన్న కథకూడా ఉంది. మొత్తానికి ఆ విగ్రహాలు కావేరీ నదిలోనే త్యాగరాజుకి లభించాయనీ చెబుతూ, అప్పుడే “రార మా ఇంటి దాకా” అన్న కృతిని పాడాడనీ కొంతమంది రాసారు. నిజానికి ఆ కృతి త్యాగరాజు రాసిన నృత్యనాటిక “ప్రహ్లాద చరిత్రం” లోనిది. ఇలా ప్రతీ కృతికీ ఒక సందర్భాన్ని జతకట్టారు.రాగ సుధా రస పానము…

కర్ణాటక సంగీతానికి త్యాగరాజొక కొత్త ఒరవడి చూపించాడని పండితుల అభిప్రాయం. శాస్త్రీయ సంగీతం త్యాగరాజుకి ముందూ ఉంది. ఆయనున్నప్పుడూ ఉంది. అంతకు ముందు మేళకర్త రాగ విభజన చేసిన వేంకటమఖి లాంటి ఎంతో మంది సంగీతకారులున్నారు. తన కాలంలో గురువు వెంకటరమణయ్య వాళ్ళూ వున్నారు. మరయితే ఈ త్యాగరాజు గొప్పతనం ఏమిటి? సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా త్యాగరాజుని ఎందుకు కీర్తించారు? వీటికి కారణం త్యాగరాజు కృతి అన్న ఒక రచనలో సంగతి అనేదాన్ని ప్రవేశ పెట్టాడు. ఇప్పటికీ కీర్తననీ, కృతినీ పర్యాయపదాలుగా వాడటం చూస్తూ ఉంటాం. కృతి వేరు;కీర్తన వేరు.

త్యాగరాజు ముందు కాలంలో రాగాలాపనా, పల్లవినీ కలిపి రాగం-తానం-పల్లవి అని పాడేవారు. ఇప్పటికీ ఇదొక అంశంగా కచేరీల్లో పాడడం ఒక రివాజు. ఈ పల్లవిలో ఒకటీ లేదా రెండు వాక్యాలుంటాయి. దాని చుట్టూ రాగ విస్తారణతో ప్రారంభించేవారు. ఈ పల్లవిననుసరించి అనుపల్లవి ఉంటుంది. ఇందులో పల్లవిలో చెప్పిన ఉద్దేశ్యానికి ఒక దృక్పథం ఏర్పడుతుంది. అంటే అనుపల్లవిలో భావం ఇంకాస్త విశదీకరించబడుతుంది. ఆ తరువాత ప్రతీ చరణంలో పల్లవీ, అనుపల్లవిలో చెప్పినవి ధృవీకరించబడతాయి. సాధారణంగా కృతుల్లో రెండూ లేదా ఇంకాస్త ఎక్కువగా చరణాలుండాలన్న నియమం వుంది. చివరి చరణంలో ఆ భావం పూర్తి చేయబడుతుంది. సంగీత కచేరీల్లో గాయకుడి ప్రతిభని చూపించుకోవడానికి, రాగ రసపోషణ చెయ్యడానికి, ముందుగా రాగాలాపనా, ఆ పైన స్వరకల్పన, తద్వారా చేసే లయవిన్యాసమూ అవకాశం ఇస్తాయి. సాహిత్యం (పల్లవి కానీ కృతికానీ) వీటన్నిటికీ ఒక వంతెనగా మిగిలింది తప్ప, సంగీత సభల్లో దానికంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోలేక పోయింది. రాగతాళాల కసరత్తు లాంటి ఈ కచేరీలని సంగీత శాస్త్రపు లోతులు తెలిసిన వారు తప్ప సామాన్యులు ఆనందించలేక పోయేవారు. త్యాగరాజు కృతినొక చట్రంగా వాడుకొనీ, అందులో రాగాల్నీ, వాటి స్వరూపాల్నీ అందంగా అమర్చాడు.

ఇలా ఉన్న కృతిలో, త్యాగరాజు ‘సంగతి’ అనే ఒక కొత్త ప్రయోగాన్ని ప్రవేశపెట్టాడు. ఇది త్యాగరాజుకి ముందూ ఉంది. సాహిత్యం లేకుండా ఆలాపనలో భాగంగా పాడేవారు. కానీ త్యాగరాజు సంగతిని ఆలాపనలోంచి బయటకు తీసి సాహిత్యంతో అనుసంధానంచేసి కృతికి పరిపుష్టత వచ్చేలా చేసాడు.

సంగతి అంటే తెలుగులో విషయమని అర్థం. పల్లవిలో సంగతి చెప్పడం అంటే విషయ విశదీకరణ చేయడం. సాధారణంగా కృతి పాడేటప్పుడు పల్లవినొక శ్రావ్యత (మెలడీ) తో పాటని ఎత్తుకుంటారు. అదే పల్లవిని వివిధ రకాల శ్రావ్యతలతో పాడడం మొదలెడతారు. ఇలా కొన్ని సార్లు అదే తిప్పి పాడతారు. ఇక్కడ పల్లవి సాహిత్యం మారదు. కేవలం శ్రావ్యత మాత్రమే రూపాంతరం చెందుతుంది. ఉదాహరణకి ‘నాద లోలుడై’అనే కృతి వినండి. అందులో పల్లవి వేర్వేరు రకాలుగా మారుతూ వస్తుంది. మారినప్పుడల్లా భావాన్ననుసరించి (టోన్) ఒక ప్రత్యేక రాగభావం ఆవిష్కరింపబడుతుంది. త్యాగరాజు ఎవరూ ఈ సంగతుల్ని మార్చడానికి వీలులేకుండా ప్రతీ కృతిలోనూ స్థిరంగా బంధించేసాడు. కాబట్టి ఉత్తరోత్తరా ఎవరైనా ఆయన కృతులు పాడితే త్యాగరాజు స్వరపరిచిన విధంగానే పాడి తీరాలి. ఈ సంగతుల ప్రయోగం వల్ల వినేవారికి సాహిత్యపరంగా రసానుభూతి కలుగుతుంది. మనసుకి హత్తుకుంటుంది. ఈ విధంగా త్యాగరాజు కృతుల్లో సంగతులు చొప్పించి సంగీతాన్ని జనరంజకంగా చేసాడు. శుద్ధ సావేరి రాగంలో ‘కాల హరణ మేలరా’ కృతిలో అనుపల్లవిని సంగతులతో ఈ క్రిందివిధంగా పాడతారు.
1. కాల హరణ మేల
2. కాల హరణ మేలరా?
3. కాల హరణ మేల రామా?
గమనిస్తే సాహిత్యం ఎలా మారుతూ వస్తోందో తెలుస్తుంది. దాన్ననుసరించీ శ్రావ్యత (మెలడీ) ఎలా మారుతుందో వింటే అర్థమవుతుంది. ఈ రెండూ కలిస్తే కొత్త అర్థం ఎలా పుట్టుకొస్తుందో గోచరమవుతుంది.
సుమారు 215 రాగాల్లో త్యాగరాజ కృతులున్నాయి. కొన్ని మరుగున పడ్డ రాగాలు వెలికి తీసాడు. కొన్ని కొత్త కొత్త రాగాలు కనుక్కున్నాడు. ఎవరూ ముట్టని రాగాల్లోనూ, అసాధారణ రాగాల్లోనూ కృతులు కట్టాడు. ఈ అసాధారణ రాగాల్లో స్వరపరిచిన వాటినే ఏకరాగ కృతులన్నారు. సుమారు 100కి పైగా ఏక రాగ కృతులు స్వరపరిచాడు.

త్యాగరాజు కాలం నాటికే బ్రిటీషు వారు తంజావూరులో తిష్ట వేసారు. ఇంగ్లీషు బ్యాండు ఆధారంగా శంకరాభరణ రాగంలో ‘గత మోహాశ్రిత’, ‘వరలీల గానలోల‘, కుంతలవరాళి లో ‘శర శర సమరైకశూర‘, ‘కలి నరులకు మహిమలు’, బంగాళ లో ‘గిరి రాజ సుత తనయ’, సుపోషిణి లో ‘రమించు వారెవరురా‘ కీర్తనలూ స్వర పరిచాడు. కేవలం వరుస (Tune) వరకే ఇంగ్లీషు బ్యాండుని పోలి వుంటాయి. రాగాలు మాత్రం స్వచ్ఛమైన కర్ణాటక సంగీతంలోవే! త్యాగరాజు కాలంలో శరభోజి గురువుగా ష్వార్ట్జ్ అనే ఒక ఆంగ్లేయుడు శరభోజి రాజుకి ఇంగ్లీషు బ్యాండుని పరిచయం చేసాడు. అప్పట్లో తంజావూరు వీధుల్లో ఈ బ్యాండు వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఊరేగింపుగా వెళ్ళేవారు. ఇంగ్లీషు బ్యాండులో తాళానికి (beat) ప్రాముఖ్యతెక్కువ. అది కర్ణాటక సంగీతంలో వాడే తాళాలకి వేరుగా ఉంటుంది. ఓసారి ఈ ఇంగ్లీషు బ్యాండు వాళ్ళు ఊరేగింపుగా తిరువయ్యార్ వీధుల్లో వెళితే, త్యాగరాజు శిష్యుడొకడు ఆ పాటకి తాళం వేయడం చూసి మన సంగీతంలో కూడా ఇవున్నాయని చెప్పడానికి, త్యాగరాజు రమించు వారెవరురా కీర్తన రాసాడనీ చెబుతారు.

త్యాగరాజు కంఠం గంభీరంగా ఉండేదట. తాదాత్మ్యం చెందుతూ ఎంతో శ్రావ్యంగా పాడేవాడనీ, వింటున్నంత సేపూ ఎవరూ తలకూడా తిప్పేవారు కారని ఆయన శిష్యులే రాసారు. నిత్యజీవితంలో పదిమందినీ గౌరవిస్తూ, ఎంతో ప్రేమగా మాట్లాడే త్యాగరాజు సంగీతం వరకూ వచ్చేసరికి మాత్రం చంఢశాసనుడిలా వుండేవాడట. పాడేటప్పుడు ఏమాత్రం తేడాలొచ్చినా ఊరుకునే వాడు కాదనీ చెబుతారు. చివరి క్షణంవరకూ సంగీతంలోనే మమేకమయ్యాడు.అట్ల పలుకుదువిట్ల పలుకుదు…


త్యాగరాజు సంస్కృత రచనలతో మొదలు పెట్టినా సింహభాగం తెలుగులోనే రాసాడు. తనకి తమిళ భాష క్షుణ్ణంగా వచ్చినా ఒక్కటంటే ఒక్క కృతికూడా తమిళంలో రచించలేదు. అంతెందుకు పరభాషా పదాలని కూడా ఎక్కడా వాడలేదు. మొత్తం కృతులన్నీ వెతికితే హరామి, కారుబారు ( కారో-బార్), రాజీ వంటి కేవలం మూడంటే మూడు ఉర్దూ పదాలు కనిపిస్తాయి. అలాగే లాంతరు ( లాంట్రెన్కి తెలుగు పదం) అన్న ఆంగ్ల పదం తప్ప పరభాషా పదాల జోలికే పోలేదు.

తెలుగు సాహిత్యంలో వాడే వివిధ ప్రక్రియలూ, త్యాగరాజు తన కృతుల్లో వాడాడు. ఈయన కృతుల్లో అర్ధాలంకారాలున్నాయి. అనుప్రాసా యమకాల్లాంటి శబ్దాలంకారాలున్నాయి. ద్వితీయాక్షర ప్రాసా, అంత్య ప్రాసా వాడాడు. సామెతలూ, జాతీయాలూ విరివిగా కనిపిస్తాయి. యక్షగానాలైన ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరిత్రంలో కంద, సీస పద్యాలు కనిపిస్తాయి. దరువులున్నాయి. వీటన్నింటినీ మించి సరళమైన భాష వుంది. వ్యవహారిక భాషలో సామాన్యులకర్థమయ్యేలా ఈ కృతులుంటాయి. రామదాసూ, అన్నమయ్యల పద్ధతిలోనే తేట తెలుగులో రచించాడు.

సంగీతం వరకూ త్యాగరాజు ప్రతిభకి దీటు లేదనేది పండితుల, సంగీత కారుల అభిప్రాయం. సంగీతమున్నంత స్థాయిలో సాహిత్యం లేదన్నది తెలుగు సాహితీకారుల వాదన. ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలతో పోలిస్తే సాహిత్యం ఓ అడుగు వెనకబడే వుందన్న అభిప్రాయం వెలిబుచ్చారు.

సంగీతంలో సాహిత్యాన్ని ఎంతగానో మేళవించినా తెలుగు సాహితీకారులెందుకు త్యాగరాజ కృతుల్లో సాహిత్యాన్ని తగినంతగా మెచ్చలేదు? సంగీతంలో ఒక్క అపస్వరమొచ్చినా సంగీతకారులు ఎలా తట్టుకోలేరో, అలాగే సాహిత్యంలో ఒక్క వ్యాకరణ దోషం కనిపించినా సాహితీ వేత్తలు ఒప్పరు. సంగీతంలో సాహిత్యం బంధించే ప్రక్రియలో త్యాగరాజు కొన్ని వ్యాకరణ నియమాలు ఉల్లంఘించాడన్న ఒక వాదనుంది. రామభక్తినీ, సంగీతాన్నీ ఒక ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్ళిన త్యాగరాజు, సాహిత్యంలో కవిత్వాన్ని పెంపొందిచలేకపోయాడు అంటూ ప్రముఖ సంగీత విద్వాంసుడూ, సాహిత్యకారుడూ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు అభిప్రాయపడ్డారు. సంగీతంలో తాళానికి సరిపడేందుకు కొన్ని పదాలు కుదించాడని వీరి వాదన. నృత్యనాటికల్లో రాసిన కొన్ని కంద, సీస పద్యాల్లో చందస్సు భంగమయ్యిందని వేలెత్తి చూపించారు. వ్యాకరణ దోషాలున్నా, త్యాగరాజు కృతుల్లో భావ ప్రకటన్ని అందరూ మెచ్చుకున్నారు. సాహిత్యం అతి సరళంగా ఉండడం వల్లా, నిత్యమూ వాడుకలో ఉన్న పదాలుండడం వల్లా త్యాగరాజు సంగీతం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది.


కన కన రుచిరా…


త్యాగరాజు అసమాన ప్రతిభ చూసి కొంతమంది సంగీత విద్వాంసులకి అప్పట్లో అక్కసుగా ఉండేది. ఆ రోజుల్లో సంగీతకారులు కీర్తనలూ, స్వరజతులూ, లక్షణ గీతాలూ, వర్ణాలు ఎక్కువగా స్వరపరిచేవారు. వర్ణం స్వరపరచని వాడు వాగ్గేయకారుడు కాలేడని ఒక నిందా ప్రచారం మొదలు పెట్టారు. త్యాగరాజు తన సంగీతాన్ని కేవలం కీర్తనలకీ, సంకీర్తనలకీ, కృతులకే పరిమితం జేసాడు. ఒక్క వర్ణం కూడా స్వరపరచలేదు. దాంతో త్యాగరాజు కృతులు జనరంజకంగా ఉన్నా పండితుల్ని అంతగా మెప్పించలేదు. ఒకసారి ఓ సంగీత విద్వాంసుడు వర్ణాలు త్యాగరాజు వల్లకాదని ఒక శిష్యుడి వద్ద హేళన చేసాడు. ఇది విన్నాక తాన వర్ణాల రీతిలో పెద్ద కృతుల్ని రచించాలని అనుకున్నాడు. వాటి కంటే ఘనంగా స్వర పరచాలన్న ధ్యేయంతో – ఆరభి రాగంలో ‘సాధించెనే’, శ్రీ రాగంలో ‘ఎందరో మహానుభావులు’, గౌళ రాగంలో ‘దుడుకుగల’, వరాళి రాగంలో ‘కన కన రుచిరా’, నాట రాగంలో ‘జగదానంద కారక’ అనే కృతులు కూర్చాడు. వీటినే ఘనరాగ పంచరత్న కీర్తనలనీ అంటారు.
త్యాగరాజ కృతులకీ ఎన్నో ప్రక్షిప్తాలున్నాయి. ప్రతీ సంగీతకారుడికీ, సాహిత్యకారుడికీ పాడే విధానంలోనయినా, రాసే సరళిలోనైనా వారికి ప్రత్యేకతను తెచ్చే ఒక ఒరవడుంటుంది. అలా పేరొందిన వారి సరళిని అనుసరించి వారి ముద్రతోనే ఉన్న రచనలని ప్రక్షిప్తాలంటారు. మహాభాగవతం రాసిన పోతనకీ, పద సంకీర్తనలు చేసిన అన్నమయ్యకీ, ఇలా ఎంతో మంది కవులకీ, వాగ్గేయకారులకీ ఈ ప్రక్షిప్తాల బెడద తప్పలేదు.
త్యాగరాజు ఈ ఘనరాగ పంచరత్న కీర్తనలన్నీ నలభై ఏళ్ళు దాటాకనే కట్టాడు. ఈ రీతిలోనే కోవూరు పంచరత్న కీర్తనలు కూడా. ఉత్తరాది యాత్ర సందర్భంగా తిరుపతీ, కంచీ, మద్రాసూ, శ్రీరంగపట్టణం వంటి క్షేత్రాలని దర్శించీ కృతులు స్వరపరిచాడు. మద్రాసులో బస చేసిన వీణకుప్పయ్యర్ ఇల్లు మొన్నమొన్నటివరకూ ఉంది కూడా. ఈ ఉత్తరాది యాత్ర మాత్రం 65ఏళ్ళు దాటాకనే చేసాడు. ఈ యాత్రకు సంబంధించీ అనేక కథలున్నాయి.


గాన మూర్తే…


త్యాగరాజు కాలంలోనే నివసించిన ముత్తుస్వామి దీక్షితారూ, శ్యామ శాస్త్రిలని కలిపి సంగీత త్రిమూర్తులంటారు. చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురూ ఒకే ఊళ్ళో అంటే తిరువారూరులోనే జన్మించారు. అందరిలోకీ త్యాగరాజు వయసులో పెద్ద వాడు. అందరికంటే ముందు చిన్నవాడైన దీక్షితార్ పోయాడు. శ్యామశాస్త్రి తరువాత పోయాడు. త్యాగరాజు మాత్రం ఎనభైనాలుగేళ్ళు జీవించాడు. చివర్లో సన్యాసం స్వీకరించి పరమహస పరివ్రాజక శ్రీ బ్రహ్మానంద స్వామి గా సిద్ధిపొందాడు.

ఒకే ప్రాతంలో జీవించారు కాబట్టి ఈ త్రిమూర్తులు ఎప్పుడైనా కలిసారా? అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. శ్యామశాస్త్రీ, త్యాగరాజు మంచి స్నేహితులని చెబుతూ తరచు వీళ్ళిద్దరూ కలిసే వారన్నట్లుగా అనేకమంది రాసారు. ఈ విషయం 1930 తరువాతొచ్చిన రచనల్లోనే ఇది ఎక్కువ భాగం కనిపిస్తుంది. త్యాగరాజు శిష్యులు పొందుపరిచిన వివరాల్లో ఇది లేదు. ఇద్దరూ దగ్గరూళ్ళలోనే ఉండడం వల్ల ఒకరి గురించొకరికి ఖచ్చితంగా తెలిసే అవకాశముంది. అది కేవలం ముఖ పరిచయమేనా లేక సంగీత పరిచయం కూడా ఉందన్న విషయం రూఢిగా తెలీదు. కాకపోతే శ్యామశాస్త్రి కొడుకు సుబ్బరాయశాస్త్రి తండ్రిపోయాక త్యాగరాజు వద్ద శిష్యరికం చేసాడు.

ఈ సంగీత త్రిమూర్తులన్న ప్రచారం 1920 తరువాతనే మొదలయ్యింది. త్యాగరాజుతో సమంగా ఆయన పక్కనే పీటవేసి శ్యామశాస్త్రినీ, దీక్షితార్ని కూర్చో బెట్టడాన్ని చూసి మంచాళ జగన్నాధరావూ, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మా అభ్యంతరాలు తెలిపారు. త్యాగరాజుతో సమంగా క్షేత్రయ్య, అన్నమయ్య ఉండాలని వారి అభిప్రాయం.గురు లేకయెటువంటి గుణికి…

తిరువయారులో త్యాగరాజు సమాధి ప్రంతంలో ప్రతీ ఏటా జనవరి మాసంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు గత డెబ్బయ్యేళ్ళగా జరుగుతున్నాయి. దీనికి మూల కారణం ఒక మహామనీషి. ఆమెని గుర్తుచేసుకోకుండా త్యాగరాజు గురించి చెప్పుకోవడం భావ్యం కాదు.
ఆవిడ పేరు బెంగుళూరు నాగరత్నమ్మ. మైసూరు సంస్థానంలో దేవదాసీగా ఉండేది. ఈవిడకి కర్ణాటక సంగీతం బాగా వచ్చు. త్యాగరాజు కృతులూ నేర్చుకుంది. అప్పట్లో మద్రాసు సంగీత విద్వాంసులకి నిలయంగా ఉండేది. చివరికి ఈ బెంగుళూరు నాగరత్నమ్మ మద్రాసులో స్థిరపడి సంగీత కచేరీలు ఇచ్చేది. ఓ రోజున ఉమైయాల్పురం పంచాపకేశ భాగవతార్ సంగీత కచేరీకని మద్రాసు వచ్చి కలిసినపుడు నాగరత్నమ్మ ఆయన వద్ద త్యాగరాజు చిత్రపటాన్నొకటి కొనుక్కుంది. ఓ రోజు రాత్రి నాగరత్నమ్మకి కలలో త్యాగరాజు కనిపించాడడన్న విషయాన్ని సంగీత సమాజ కార్యదర్శి మునుస్వామి నాయుడుకి చెప్పింది. సరిగ్గా అదే సమయానికి తంజావూరు నాగరాజ భాగవతార్ హరికథా కాలక్షేపం నిమిత్తమై మద్రాసు వచ్చారు. వారితో కలిసి నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళి, సమాధిని సందర్శించింది. సమాధి సమీపంలో తుప్పలూ, మొక్కలూ పెరిగి అస్తవ్యస్తంగా కనిపించి, ఇక్కడ త్యాగరాజు మందిరం నిర్మిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన చేసి, 1925లో పదిమందినీ సంప్రదించి, తన దగ్గరున్న కొంత ధనాన్ని వెచ్చించి సమాధి కట్టించింది. ఆ ప్రాంతంలోనే త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరగడానికి ఎంతో కృషి చేసింది.

ప్రస్తుతం తిరువయ్యారు తిరుమంజన వీధిలో త్యాగరాజు నివసించిన ఇల్లు వుంది. దాన్ని మరమ్మత్తు చేయించి అదొక మ్యూజియంలా మలచాలన్న ఆలోచనతో కొంతమంది పూనుకొన్నారు. వేరెవరో కోర్టులో కేసు వేసి ఆ పనులు ఆపించేసారు. తీర్పు ఎప్పుడొస్తుందో ఆ రాముడికే ఎరుక.

త్యాగరాజు కర్ణాటక సంగీతానికి అపారమైన సేవ చేసాడు. అడిగినవారికి కాదనకుండా ఏమీ ఆశించకుండా సంగీతం నేర్పాడు. నిధికన్నా రాముని సన్నిధి మిన్న అని భావించాడు. నాదలోలురైతేనే సంగీత సిద్ధి లభిస్తుందని నమ్మాడు. ప్రస్తుతం సంగీత కచేరీల్లో త్యాగరాజు కృతులే పలు విద్వాంసులూ పాడతారు. ఆయా కచేరీలకీ భారీగా సొమ్ము వసూలు చేస్తారు. త్యాగరాజుని స్తుతిస్తారు కానీ, ఆయన పాటించిన విలువల్ని వదిలేస్తున్నారు. కొన్ని కచేరీల్లో అయితే త్యాగరాజు కృతులు పాడతారు కానీ, స్వరకర్త పేరు చెప్పడానికి వెనకాడతారు. త్యాగరాజు పెట్టిన స్వర భిక్షే చాలామంది సంగీత కారులకి జీవనోపాధయ్యిందన్న అక్షర సత్యాన్ని విస్మరిస్తున్నారు.

ప్రస్తుతం త్యాగరాజుకి దక్కిన స్థానానికీ, గౌరవానికీ మూల కారణం తమిళ సోదరులే! తెలుగువారికి త్యాగరాజంటే మనవాడన్న అభిమానం లేదు. శాస్త్రీయ సంగీతమంటే అసలు ఆసక్తే లేదు. సినిమా సంగీతమే సంగీతమన్న భ్రమలో తెలుగుజాతి వుంది.

ఎవరేమన్నా, కర్ణాటక సంగీతం ఉన్నంత వరకూ త్యాగరాజూ జీవిస్తాడు. త్యాగరాజున్నంతవరకూ తెలుగు నుడికారమూ అందరి గొంతులోనూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది కర్ణాటక సంగీత గళానికి త్యాగరాజు ప్రసాదించిన రాగ రత్న మాలిక.

00000000000000000000

త్యాగరాజు గురించి ఇంకా సమగ్రంగా చదవాలనుకుంటే –


మనకు తెలియని మన త్యాగరాజు – 1

మనకు తెలియని మన త్యాగరాజు – 2

మనకు తెలియని మన త్యాగరాజు – 3

మనకు తెలియని మన త్యాగరాజు – 4

మనకు తెలియని మన త్యాగరాజు – 5

5 వ్యాఖ్యలు

సరిహద్దు సమీక్ష, ఆదివారం వార్తలో


సరిహద్దు సమీక్ష, ఆదివారం వార్తలో

జాజర


సరిహద్దు ఆవతలి వేదన PDF Version

కథల పుస్తకం ఇక్కడ దొరుకుతుంది:

AVKF Online BOOK Store

Kinige Online BOOK Store

జాజర

వ్యాఖ్యానించండి