Archive for వ్యాసాలు

చిత్రం – ‘బాపు’రే విచిత్రం!

జాజర


చిత్రం – ‘బాపు’రే విచిత్రం!

పాశ్చాత్య దేశాల్లో, యూనివర్శిటీలలో చిత్రలేఖనం లేదా పెయింటింగ్ నేర్చుకునే ప్రతీ విద్యార్థికీ పాఠం మొదలుపెట్టే ముందు ఒక వాక్యం చెప్పి మరీ ప్రారంభించడం ఒక ఆనవాయితీ: ‘నాకు నచ్చింది నువ్వు గీసిన చిత్రం కాదు; నీ చిత్రలేఖనం!’ (It is not your paintings I like, it is your painting.) చదవడానికి మామూలుగా కనిపించిన వాక్యమయినా అంతర్లీనంగా చాలా అర్థం వుంది. ఇంకా వివరిస్తే దీని అర్థం – ఒక చిత్రం కాదు ప్రథానం; అది వేయడానికి చిత్రకారుడు పడే అంతర్మధనం. అనుసరించే పద్ధతీ, దాని వెనుక శ్రమా ముఖ్యం. ఈ వాక్యం అన్నది ఏ ప్రసిద్ధ చిత్రకారుడో కాదు. ఒక రచయిత చిన్న కథలో చెప్పిన వాక్యం.

ఆ కథ పేరు – ఆర్టిస్ట్ ఎట్ వర్క్ (Artist at Work). రాసింది ఆల్బేర్ కామూ (Albert Camus).

మిగతా భాగం – ఈమాట వెబ్ పత్రికలో ఇక్కడ చదవండి.

 

ప్రకటనలు

వ్యాఖ్యానించండి

కోనసీమ ప్రభల తీర్థం – మా కుటుంబం – అనుబంధం

జాజర


దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది.
కొబ్బరాకుల నడుమనున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చే వన్నె వేరు.
సంక్రాంతికి మాత్రం కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది.
ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచు జిల్లై కురుస్తుంది. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి.

సంక్రాంతి వేడుకల్లో కోనసీమకొక ప్రత్యేకత ఉంది. అది – భోగి, పెద్ద పండుగల తర్వాత కనుమనాడు జరిగే జగ్గన తోట ప్రభల తీర్థం. అదొక ప్రత్యేకమైన వేడుక. విశేషమైన పండగ సంబరం.
కోనసీమ వాసులకి జగ్గన్న తోట ప్రభల తీర్థం పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధం. అందిరికీ పరిచయమున్న ఈ ప్రభల తీర్థానికీ మా కుటుంబానికీ తరతరాలుగా పెనవేసుకున్న ఒక అమూల్యమైన అనుబంధం ముడిపడుంది. అది పదిమందితో పంచుకోవాలన్నదే నా వుద్దేశ్యం.

కోనసీమ చుట్టుపక్కనున్న సుమారు 90 గ్రామాల నుండీ ప్రజలు ఈ ప్రభలతీర్థంలో పాలుపంచుకుంటారు. అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఉన్న ఏడెకరాల కొబ్బరితోటలో ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. ఇక్కడ ఏ గుడీ ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలూ కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరితోట. రైతులు నమ్మే భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం.

శివుని వాహనంగా భావించబడే వీరభద్రునిగా కోనసీమ వాసులు ఈ ప్రభలని భావిస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పరమేశ్వర రూపాలని ఈ ప్రభలని అలంకరించి మేళ తాళాలతో “అహోం- ఓహోం” అని తలస్తూ, తమ భుజ స్కంధాలపై మోస్తూ ఊరేగింపుగా ఈ జగ్గన్న తోటకి తీసుకొస్తారు. ఈ ప్రభలని వెదురు కర్రలతో చేసి, రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరించీ, వేదమంత్రాల మధ్యా గంటలు మ్రోగిస్తూ మోసుకు వస్తారు. కుల మతాలకతీతంగా ఈ ప్రభలని మోయడం పరమేశ్వర సేవగా భక్తులు తలుస్తారు.

జాజర

సుమారు నాలుగొందల ఏళ్ళపైగా ఈ జగ్గన్నతోట తీర్థం జరుగుతోందని అంటారు. నాలుగొందల ఏళ్ళగా జరుగుతోందన్నది చెప్పలేంగానీ సుమారు వందేళ్ళగా ఖచ్చితంగా జరుగుతోందని చెప్పగలను. దానికి మా కుటుంబమే ఒక పెద్ద ఆధారం. ఈ ప్రభల తీర్థం గురించి చదివాకా ఎందుకోనన్నది అందరికీ అర్థమవుతుంది. ఈ ప్రభల తీర్థానికొక పురాణ గాధ కూడా వుంది. మొసలపల్లి గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు తరలివస్తాయనీ, లోక కళ్యాణార్థమై వారందరూ ఇక్కడ కలుస్తారని ప్రజల విశ్వాసం. దీన్ని ఏకాదశ రుద్రసమావేశంగా ప్రజలు భావిస్తారు.

ఈ ప్రభల తీర్థానికి జగ్గన్నతోట ప్రభల తీర్థమన్న పేరురావడానికీ వేరొక కథ చెబుతారు. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఒక ఏక సంధాగ్రాహి ఉండేవాడట. ఆ గ్రామాన్నానుకుని ప్రవహించే కౌశికలో స్నానం చేసీ, పూజాపునస్కారాలు ముగించుకొని అక్కడే ఉన్న మర్రి చెట్టుకింద భోజనం చెసేవాడట. అలా చేస్తూ ఈ చెట్టునానుకున్న అమ్మ వారిని మైల పరుస్తున్నాడని భావించీ కొంతమంది స్థానికులు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఈయన్ని అడ్డుకున్నారట. ఈ సందర్భంలో జగ్గన్న నిజాం నవాబుని కలిస్తే, జగ్గన్న పాండిత్యాన్ని చూసి మెచ్చుకొని ఆ మర్రిచెట్టుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చారట. తనపై ప్రజలు ఫిర్యాదు చేయబట్టే తనకీ భూమి లభించింది కాబట్టి వారికోసమే ఈ ప్రభల తీర్థం జరిపాడనీ అంటారు. దేవుడికీ గుళ్ళూ గోపురాలూ అవసరం లేదనీ, మైలా మాపూ దేవుడికుండవనీ పదిమందికీ చెప్పడంకోసం ఈ ప్రభలపై దేవుణ్ణి ఎవరైనా మోసుకు రావచ్చని చెప్పే నిమిత్తమై ఈ తీర్థం మొదలయ్యిందనీ అంటారు.

జాజర

ఈ ప్రభలు ప్రజలు నడిచే దారంట రావు. రాళ్ళూ, రప్పలూ తోసుకుంటూ, గోతులనూ, కుప్పలనూ దాటుకుంటూ పొలాల మధ్యగా ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.
చుట్టు పక్కలగ్రామాలనుండీ ప్రభలు మోసుకు రావడమొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ తీర్థానికి మరొక వేశేషం కూడా వుంది. అదేమిటంటే పాలగుమ్మి పక్కనే ఉన్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలు పీకల లోతు కౌశిక దాటుకుంటూ, పొలాల మధ్యనుండి వస్తాయి. ఈ ప్రభలు కౌశిక దాటడం చూడ్డం కోసం వేలాది మంది తరలి వస్తారు. ఒక్కసారి ఎత్తేకా ఈ ప్రభలు క్రిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలని తాకించకూడదు. కౌశిక దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవ కూడదు. నీళ్ళ చుక్క కూడా ప్రభ మీదా, పైనున్న దేవుడి మీదా పడకూడదు. ఇవి మోయడానికి పాతిక మంది వ్యక్తులు సరిపడ్డా, కౌశిక దాటించడానికి మాత్రం నలభైమంది పైగా ఉంటారు. ఎంతో ఏకాగ్రతతో ఏ మాత్రం కంగారు లేకుండా జాగ్రత్తగా కౌశిక దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి చేరుస్తారు. తీర్థమయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలు ఎంతో బరువున్నా కౌశిక దాటించేటప్పుడు అవలీలగా దాటించడం మాత్రం దైవానుగ్రమే అంటారు అది మోసే వాళ్ళు. ఈ కౌశిక దాటించడం మాత్రం చూసి తీరాల్సిన ఘట్టం. గంగలకుర్రూ, అగ్రహారం ప్రభపై చెన్నమల్లేశ్వర స్వామీ, వీరేశ్వర స్వామీ విగ్రహాలని అలంకరిస్తారు.
జాజర

ఇహ మాకుటుంబానికి సంబంధించిన ఒక గాధ:

మా పూర్వీకుల స్వగ్రామం గంగలకుర్రు అగ్రహారం. మా పితామహుల ( తాత గారి) పేరు గొర్తి పళ్ళయ్య పంతులు. ఈయన సుమారు వందేళ్ళు బ్రతికారు. ఈయన 1956లో పోయారు. ఈయన బడిపంతులు. మొదట్లో అంబాజీ పేటలో బ్రిటీషు వాళ్ళు కట్టించిన ఒక హైస్త్కూలు ఒక్కటే ఈ చుట్టు పక్కల గ్రామాలకున్న విద్యా సౌకర్యం. అప్పట్లో రోడ్లూ, రహదారులూ సరిగా లేక వర్షాకాలంలో విద్యార్థులు స్కూలుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడే వారట. ప్రభుత్వానికి చెబితే ఫలితం లేకపోతే మా తాత గారు అంబాజీపేట స్కూల్లో ఉద్యోగం వదిలేసి ఆయనింట్లోనే ఒక స్కూలు మొదలుపెట్టారు. ఆ స్కూలికి ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఉచిత పాఠశాల. ఉపాధ్యాయునిగా మా తాతగారికున్న పేరు చూసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పిల్లలు ఈయన దగ్గరకే వచ్చి చదువుకునేవారట. రెండేళ్ళు గడిచాక ఈ విషయం బ్రిటీషు వారికి తెలిసి మా తాతగార్ని స్కూలు మూసేయమని ఆర్డరిస్తే, చుట్టుపక్కలెక్కడైనా ఒక స్కూలు కట్టిస్తే తన స్కూలు మూసేస్తానని మా తాతగారు చెబితే వాళ్ళు ఒప్పుకొనీ ఆ స్కూలికి మా తాతగారినే హెడ్ మాస్టారుగా నియమించారు. ఆయన చలవ వల్లే పాలగుమ్మి హైస్కూలు వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఆ స్కూలు శతసంవత్సర వేడుకలు కూడా జరిపారు. ఇదంతా 1905 ప్రాంతంలో జరిగింది. మా నాన్నగారూ కూడా అప్పటికి పుట్ట లేదు.

అప్పట్లో పిల్లలకి పుస్తకాలు కొనుక్కోవడమూ కష్టంగా ఉండేది. అలాగే వాళ్ళకి చెప్పడానికీ ఏ మాత్రం పరికరాలూ ఉండేవి కావు. మా తాతగారు బొమ్మలు బాగా వేసే వారట. ఆయనే స్వయంగా బొమ్మలేసి దేశ చిత్రపటాలూ, సైన్సుకి సంబంధించిన పటాలూ గీసి చెప్పేవారట. ఆయన లెక్కల్లో మేధావి. ఆయన దగ్గర చదువుకున్న ప్రతీ కుర్రాడికీ లెక్కలు మాత్రం బాగా వచ్చేవని మా నాన్న చెప్పేవారు. అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కాలేజీకి జి.పి.రామేశంగారని ఒక ప్రినిస్పాలుండేవారు. నేను కాలేజీలో చదివినప్పుడు కూడా ఆయనే ప్రిన్సిపాలు. ఆయన లెక్కల్లో మద్రాసు యూనివర్శిటీ ఫస్టట. ఆయన మా తాతగారి వద్దే చదువుకున్నారు. ఇంటర్ లో నాకు లెక్కలు కాలేజీ ఫస్టు వచ్చింది. ఆ సందర్భంగా కలిసినప్పుడు ఆయన మా తాతగారి గురించే చెబుతూ ఆయన మనవణ్ణిని తెలిసీ చాలా సంతోషించారు. ఇది మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఇదిక్కడాపి ప్రభల తీర్థం విషయానికి వస్తాను.

ఈ గంగలకుర్రు అగ్రహారం ప్రభ కట్టే పని పెద్ద పండగనాడు మొదలుపెడతారు. రాత్రి తెల్లవార్లూ కూర్చుని ప్రభని కడతారు. గత వందేళ్ళుగా మా తాతగారు కట్టించిన ఇంటిముందే ఈ ప్రభని కట్టడం ఒక పెద్ద ఆనవాయితీగా వస్తోంది. మా నాన్న్న 1976లో ఆ యిల్లు అమ్మేసినా ఇప్పటికీ ఆ యింటిముందే ప్రభకడతారు. ఈ ప్రభ కట్టడం మా తాతగారు బ్రతికున్నన్నాళ్ళూ ఆయన ఆధ్వర్యంలోనే జరిగేదట. ఇప్పటికీ ఆ గ్రామానికీ, చుట్టుపక్కల ఊళ్ళకీ ఆయన చేసిన సేవకి చిహ్నంగా గంగలకుర్రు అగ్రహారం ప్రభపై ఆయన చిత్రం పటం పెడతారు. అది లేకుండా ప్రభ కదలదు. ఒకసారి ఆ ఫొటో వర్షానికి తడిసి పాడయితే కొత్త ఫోటో కావాలంటూ, కుటుంబ కారణాల రీత్యా కాకినాడలో ఉన్న మా అమ్మగారి వద్దకొచ్చి ఫొటో కావాలని రాత్రికి రాత్రి కాకినాడ వచ్చి మరీ పట్టుకెళ్ళారట. ఇదీ తరతరాలుగా మా తాతగారు ఆ వూరికి చేసిన మంచి పనికి దక్కిన గౌరవం. మనిషి పోయి ఏభై ఏళ్ళు దాటినా ఇంకా ఆ గ్రామం మర్చిపోలేదంటే ఎంత నిస్వార్థ సేవో అయితే కానీ ఇన్ని తరాలు గుర్తు పెట్టుకోరు.
ఈ ప్రభల ఫొటోలని పరీక్షగా చూస్తే మా తాతగారి ఫోటో కూడా కనిపిస్తుంది. ఇదీ జగ్గన్న తోట తీర్థానికీ మా కుంటుంబానికీ ఉన్న బంధం.
జాజర

మా తాత గార్ని నేను చూడ లేదు. ఆయన పోయిన పదేళ్ళక్కానీ నేను పుట్టలేదు. అందువల్ల ఈ సంగతులన్నీ మా మామ్మా, నాన్నా, అమ్మా చెబితే తెలిసినవే తప్ప చూసినవి కావు. ఇంకో విషయం. ఈ ప్రభలు కౌశిక దాటించి తీసుకెళ్ళడానికింకో కథ చెబుతారు ఆ వూళ్ళో వాళ్ళు. అగ్రహారానికీ, పాలగుమ్మికీ మధ్య ఈ కౌశిక ఉంది. దానిపై డెబ్భైఏళ్ళ క్రితం వంతెన కట్టారు. అంతవరకూ కౌశికలోంచి తీసుకెళ్ళిన ప్రభని ఆ ఏడాది మాత్రం వంతెన మీదుగా తీసుకెళ్ళారట. ఆ ప్రభ తిరిగి తీసుకొచ్చిన రాత్రి ఎవరైతే ఆ ప్రభని మోసారో వాళ్ళందరి ఇళ్ళూ అంటుకు పోయాయట. అది ఒక అశుభంగా తలచి మరుసటి ఏడాది నుండి మాత్రం యధావిధిగా కౌశిక దాటించే ప్రభని తీసుకెళతారు. ఇప్పటికీ ఇదే ఆచారం నడుస్తోంది.
క్రమం తప్పకుండా 1985 వరకూ వెళ్ళాను. ఆ తరువాత మళ్ళీ ప్రభల తీర్థానికి వెళ్ళడం పడలేదు. ఎప్పటికైనా మా పిల్లలకిది చూపించాలని వుంది. చూద్దాం. ప్రతీదానికీ ఒక సమయం వుంటుంది.
జగ్గన్నతోట ప్రభల తీర్థం చెబితే తెలియదు; చూసి తీరాలి. ఇదివరకూ వార్తా పత్రికల్లో ఎక్కడో ఒక మూల చిన్న వార్తొచ్చేది. ప్రస్తుతం టీవీల పుణ్యమాని అందరికీ తెలుస్తున్నాయి.
జగ్గన్నతోట ప్రభల తీర్థం అదొక అనిర్వచనీయమైన వేడుక. మరలా ఎప్పుడు చూసే అదృష్టం దొరుకుతుందో? ఏమో? కాలమే కరుణించాలి.
అంతవరకూ…అంతే!

(ఈ ఫొటోలు క్రితంసారి ఎవరో బ్లాగులో పెడితే “కాపీ యే రైటు” అని సిగ్గు విడిచి తస్కరించాను )

Comments (1)

డయాస్పోరా కథ

వ్యాఖ్యానించండి

ఈ రోజు నాద సుధాంబుధి ‘త్యాగరాజు’ వర్ధంతి.


ఈరోజు నాద సుధాంబుధి ‘త్యాగరాజు’ వర్ధంతి.


తిధుల ప్రకారం పుష్య పంచమీ నక్షత్రాన పరమపదించారు. తేదీల ప్రకారమయితే జనవరి 6 1847న స్వర్గస్థులయ్యారు.

అరవదేశంలో అచ్చ తెలుగు వాహకంపై కర్ణాటక సంగీతానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు.
కర్ణాటక సంగీతం పేరు చెప్పి ఎంతోమంది జీవనోపాధికి కారణభూతుడు.
త్యాగరాజు పెట్టిన సంగీత భిక్షే ఎంతోమంది కళాకారులకి నేటికీ జీవనాధారం.
అందుకే త్యాగరాజు కారణజన్ముడు.

కర్ణాటక సంగీతమున్నంత కాలమూ త్యాగరాజు జీవించుంటాడు. త్యాగరాజు సంగీతమున్నంత కాలమూ తెలుగు భాషా ప్రతీ ఒక్కరి నోళ్ళలోనూ నానుతూనే ఉంటుంది. ఇది మాత్రం అక్షర సత్యం.

తిరువయ్యారులో త్యాగరాజు సమాధి:


జాజర


తానా సావనీరు “తెలుగు పలుకు” కోసం రాసిన వ్యాసం – (PDF File) నాద సుధాంబుధి – త్యాగరాజ సన్నిధి.

సంగీత మపి సాహిత్యం

“గీతం వాద్యం తధా నృత్యంత్రయం సంగీత ముచ్యతే” అనేది అనాదిగా వస్తున్న ఒక నానుడి. అంటే గీతమూ, వాద్యమూ, నృత్యమూ ఈ మూడింటీనీ కలిపి సంగీతం అన్నారు. ఈ మూడింటి సమ్మేళనమే భరతముని రచించిన నాట్యశాస్త్రం! కాలక్రమంలో ఈ మూడింటికీ ఒక నిర్దిష్ట రూపం వచ్చింది. మూడూ వేర్వేరు పాయలుగా అభివృద్ధి చెందాయి.
ప్రస్తుతం మనం ప్రత్యేక కళలుగా చెప్పుకునే సంగీతమూ, నాట్యమూ వేర్వేరు కావు. ఇక్కడ గీతమూ అంటే పాట, నాట్యమూ అంటే లయ. మెల్ల మెల్లగా గీతానికీ ఒక శాస్త్ర రూపం వచ్చింది. నాట్యానికీ ఒక పద్ధతీ సమకూరింది.
నారద విరచిత “స్వరార్ణవం”, ప్రతాప శైలుడి “సంగీత చూఢామణీ”, ముమ్మటాచార్యుడి “సంగీత రత్నమాల” ఇవన్నీ మనకున్న సంస్కృత సంగీత రచనలు.

సంగీతానికి సంబంధించీ మొట్టమొదటి తెలుగు రచన చేసిన ఘనత పెదకోమటి వేమారెడ్డికి చెందుతుంది. ఆ తరువాత తెలుగు వారు సంగీతానికి చేసిన సేవా, కృషీ ఇంతా అంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న కర్ణాటక సంగీతానికి ఒక రూపూ, రేఖా ఇచ్చింది ఖచ్చితంగా తెలుగు వారేనని గట్టిగా చెప్పచ్చు. అంటే మిగతా భాషల వారి కృషీ, సహకారం లేదని కాదు. సంగీతంలో తెలుగువారి కృషికి దీటుగా వేరెవరిదీ కనబడదు.


ఎందరో మహానుభావులు…


తన పద సంకీర్తనలతో ప్రజాపథం వైపు సంగీతాన్ని మలుపు తిప్పిన అన్నమయ్యా, కృష్ణలీలా తరంగిణి రాసిన నారాయణ తీర్థులు వారూ, భామాకలాప సృష్టికర్త సిద్ధేంద్ర యోగీ, ప్రస్తుతమున్న మేళకర్త రాగ చక్ర సంయోజన కర్తా, చతుర్దండి ప్రకాశిక రచించిన వేంకటమఖీ, పద రచన కర్త క్షేత్రయ్యా, కీర్తనాచార్యుడు రామదాసూ, తాళ్ళపాక చిన్నయ్యా, త్యాగయ్యా, ఇంకా తూము నర్సింహ దాసూ, శ్యామశాస్త్రీ, మునిపల్లె సుబ్రహ్మణ్య కవీ, ఇలా ఎంతో మంది సంగీతకారుల అవిర్గళ సృజన వల్లే ప్రస్తుతం కర్ణాటక సంగీతం జనరంజకంగా ప్రసిద్ధి చెందింది. తెలుగు భాషనే వాహకం పైనే వీరందరి సంగీతమూ జనబాహుళ్యంలోకి చేరింది. కర్ణాటక సంగీతాన్నీ, తెలుగు వారినీ, తెలుగు భాషనీ వేరు చేసి చూడడం ప్రస్తుతం అసాధ్యం.
పైన ఉదహరించిన అందరిలోనూ, కర్ణాటక సంగీతాన్ని ఒక పెద్ద మలుపు తిప్పిన ఘనత మాత్రం కర్ణాటక సంగీత శిరోమణీ త్యాగయ్యకే చెందుతుంది. ఒకటీ రెండూ కాదు, వందల కొద్దీ రాగాల్లో సంగీతాన్ని ప్రజలకందించాడు. శాస్త్రీయ సంగీతాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళాడు. పండితులూ, పామరులూ పాడుకునేలా సర్వజన సమ్మేతంగా కర్ణాటక సంగీతాన్ని మలిచాడు. కర్ణాటక సంగీతం అంటే త్యాగరాజూ, త్యాగరాజంటే కర్ణాటక సంగీతమూ అనే స్థాయిలో ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు.


సంగీత శాస్త్ర జ్ఞానమూ…

ప్రస్తుతం మనం వినే కర్ణాటక సంగీతం కాస్త పరిచయమున్న వారెవరూ కర్ణాటక సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడలేరు. త్యాగరాజు ముందు వరకూ కర్ణాటక సంగీతం అంటే లాగుడు పీకుడు రాగాలాపన చేసే సంగీతకారుల సంగీత శాస్త్ర కళ అనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. జానపదాలూ, భక్తి పాటలూ జనాల మధ్యనలిగినా శాస్త్రీయ సంగీతం వైపు సామాన్యులెవరూ కన్నెత్తి చూసేవారు కారు. సరిగ్గా అటువంటి సమయంలో శాస్త్రీయ సంగీతంలో ఉండే మాధుర్యాన్నీ, మత్తునీ చూపించీ, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినవాడు త్యాగరాజు. అప్పట్లో కచేరీ అంటే పొద్దున్న మొదలెడితే సాయంత్రం ఎప్పటికో తేలేది. ఎనిమిది గంటలు పైగా ఒకే రాగాన్ని పాడేవారట. అటువంటి సంగీత కచేరీల పద్ధతి మార్చి మామూలు జనం కూడా సంగీతాన్ని ఆస్వాదించేలా చేసి, ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాడు త్యాగరాజు. అంతవరకూ సంస్కృత భాషలోనే ఎక్కువగా నలిగిన సంగీతానికి, అతి సరళమైన రచనలతో అచ్చ తెలుగు నుడికార సొబగులు దిద్దిన వాడు త్యాగరాజు. త్యాగరాజుకంటే ముందుకాలం వాడయిన అన్నమయ్యా అచ్చ తెలుగులోనే కీర్తనలు రచించినా వాటిలో సంగీత మాధుర్యం మనకెవరికీ తెలీదు. ఎందుకంటే ప్రస్తుతం అన్నమయ్య కీర్తనలకి సాహిత్యమూ, దానికి సంబంధించిన రాగల పేర్లూ లభించినా స్వరాలు తెలియవు. స్వరాలు లేకుండా పాట ఎలాపాడేవారో మనం చెప్పడం కష్టం. ఒకే రాగంలో ఒకే పాటని చాలా రకాలుగా పాడచ్చు. త్యాగరాజు వరకూ వస్తే అటువంటి ఇబ్బంది కనిపించదు. వేలకి పైగా సంగీత రచనలు చేసారన్న ప్రచారమున్నా, మనకు లభించిన 900 పైచిలుకు రచనలకి స్వరాలున్నాయి. తద్వారా ఆ పాట ఎలా స్వరపరచబడిందో కూడా ఖచ్చితంగా తెలుసు. అందువల్లే ఎంతో వైవిధ్య సంగీత రచనలయిన త్యాగరాజు కృతులు జనబాహుళ్యంలోకి దూసుకు పోయాయి. సంగీత కచేరీకి ఒక దిశానిర్దేశం చేసాయి. దీనికంతటికీ ముఖ్య కారకులు త్యాగరాజు శిష్యులు.బంటురీతి కొలువు…

త్యాగరాజు అడిగిన వాళ్ళకి కాదనకుండా సంగీతం నేర్పాడు. ఆయనకి దాదాపు పాతిక మంది పైగా ప్రధాన శిష్యులున్నారు. అందరికీ ఉచితంగా సంగీత విద్య నేర్పాడు. తనవద్ద అంటే తనింట్లోనే వాళ్ళందరికీ నివాసం కలిపించి మరీ సంగీతం నేర్పాడు. ఆ రోజుల్లో ఇంతమందికి భోజనమూ, వసతి సౌకర్యాలు కలిపించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా ఎవ్వరి వద్దా ఒక్క పైసా ఆశించకుండా విద్య నేర్పడం అనుకున్నంత సులభం కాదు. ఎక్కడెక్కడనుండో వచ్చిన వారందరికీ తనింట్లోనో రెండేసీ, మూడేసేళ్ళు ఉంచుకొనే విద్య నేర్పాడు. ఇది నచ్చినవారినే శిష్యులుగా స్వీకరించాడు. ఇదొక్కటే కాదు. ఇంకో విచిత్రమైన నియమం కూడా ఉండేది. అది తెలుగు భాష నేర్చుకోవడం. తన రచనలన్నీ తెలుగులోనే ఉంటాయి కనుక, కృతి సాహిత్యం అర్థమయితే కానీ పాడేటప్పుడు దాని భావాన్ని పూర్తిగా తమ గొంతులో పలికించడం అసాధ్యం కనుక భాషా కూడా ఖచ్చితంగా తెలియాలన్న నియమం కూడా విధించాడు. వీటికన్నింటికీ సిద్ధపడిన వారికే సంగీతం నేర్పాడు. సాధారణంగా సంగీతం నేర్పేటప్పుడు స్వరాలు చెప్పి తరువాత సాహిత్యం పాడించడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. త్యాగరాజు ఈ పద్ధతికి విరుద్ధంగా ముందు సాహిత్యంతోనే పాట నేర్పేవాడనీ, ఆ తరువాతే స్వరాలు చెప్పేవాడనీ ఆయన శిష్యులు రాసారు. తన సంగీత పరంపరని శిష్యులకీ, వారి శిష్యులకీ కూడా అందిచడం అనితర సాధ్యమైన విషయం. గురుభక్తితో, కృతజ్ఞతా భావంతో ఆ శిష్యులే త్యాగరాజు సంగీతాన్ని పదిమందికీ అందించారు.

త్యాగరాజు వద్ద సంగీత శిష్యరికం చేసిన వాళ్ళల్లో అందరూ తమిళులే అయినా, ఇద్దరు మాత్రమే తెలుగు వాళ్ళు. వారిద్దరిలో ఒకరు ఈ తంజావూరు రామారావు. మరొకరు మనంబుచవాది వెంకట సుబ్బయ్యర్. అప్పట్లో తంజావూరు ప్రాంతంలో తెలుగు రాజ భాషగా ఉన్నా, తమిళమే ఎక్కువగా మాట్లాడేవారు. ఏదైతేనే త్యాగరాజు ధర్మమాని తమిళ నాటా, నోటా తెలుగు పదం సుందరంగా నిలిచింది.
త్యాగరాజు శిష్యుల్లో ముఖ్యులైన వేంకట రమణ భాగవతారూ, వీణా కుప్పయ్యరూ, మనంబుచవాది వేంకట శేషయ్యరూ,
తంజావూరు రామారావూ త్యాగరాజు రాసిన కృతులెన్నో తాళపత్రాలకెక్కించీ పొందుపరిచారు. ఇవన్నీ మదురై సౌరాష్ట్రసభలో ఉన్నాయి. కొన్ని తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో ఉన్నాయి.

వీరిలో వేంకటరమణ భాగవతారు, తంజావూరు రామారావుతో కలిసి త్యాగరాజు జీవిత చరిత్ర రాయడానికుపక్రమించాడు. అది పూర్తికాకుండానే వేంకట రమణభాగవతారు చనిపోయాడు. ఆ తరువాత వేంకట రమణభాగవతారు కొడుకు కృష్ణభాగవతార్ తండ్రి అసంపూర్తిగా వదిలేసిన కార్యాన్ని పూర్తిచేద్దామని సంకల్పించాడు. ఆయనా అది పూర్తిచేయలేదు. ఆ తరువాత కృష్ణభాగవతారు కొడుకాపని స్వీకరించాడు. అదీ పూర్తికాలేదు. చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు రాసిన జీవిత చరిత్రల్లోనూ చాలా తేడాలున్నాయి. ఒకే సంఘంటన్ని వేర్వేరుగా ఉటంకించారు. దాంతో ఏది సరైనదీ, ఏది కాదూ అన్నది తెలీకుండా పోయింది. వేంకట రమణభాగవతారు మాత్రం త్యాగరాజు కనుసన్నల్లో సంగీతం నేర్చుకున్నాడు. దాదాపు ముఫ్ఫై ఏళ్ళు త్యాగరాజుతో గడిపాడు. కాబట్టి ఆయన చెప్పినదానికి సాధికారత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే వీరందరూ హరికధా భాగవతార్లు అయినందువల్ల త్యాగరాజుని దైవాంశ సంభూతుడిగా స్తుతించారు. ప్రతీ సంఘటనికీ మహిమలూ, మహత్యాలూ అద్దారు. ఈ ఒరవడిలోనే త్యాగరాజు జీవిత చరిత్ర మీద చాలా రచనలొచ్చాయి. రామ భక్తుడైన త్యాగరాజుని కాస్తా దేవుణ్ణి చేసేసారు. అందువల్ల మనకు తెలిసిన త్యాగరాజు కథల్లో అన్నీ మహిమలే కనిపిస్తాయి. నిజా నిజాలు ఆ రాముడికే ఎరుక.రామభక్తి సామ్రాజ్యమూ…

విజయనగర సామ్రాజ్యం 1565 లో ముక్కలయ్యింది. అంతకుముందు దక్షిణాన్నున్న చాలా రాజ్యాలు ముస్లిం రాజుల చేతులనుండి తప్పి విజయనగర రాజుల పాలన కిందకొచ్చాయి. దానికి ముందు ముస్లింలు చోళ రాజ్యలపై దండెత్తి వాటిని ఆక్రమించుకున్నారు. అవి తిరిగి హిందూ రాజుల ఆధీనమయ్యాయి. వాటిలో తంజావూరు, మదురై రాజ్యాలకి తెలుగు వారైన నాయక రాజులు సైన్యాధిపతులుగా ఉండేవారు. ఎప్పుడైతే విజయనగరం విరిగిపోయిందో అప్పుడే వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తికల రాజులుగా ప్రకటించుకున్నారు. ఆ విధంగా మధురై, తంజావూరు నాయక రాజుల పాలన కిందకొచ్చాయి. 1600 కాలంలో త్యాగరాజు పూర్వీకులు రాయల సీమలోని కర్నూలు నుండి తంజావూరు వలస వచ్చినట్లు చెప్పబడింది.

తంజావూరు రాజ్యాన్ని 1675 నుండీ మరాఠా రాజులు పాలించారు. 1758 వ సంవత్సరంలో ఫ్రెంచి వాళ్ళు తంజావూరు పై దండెత్తి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. 1793 లో బ్రిటీషు వాళ్ళ ఆధీనంలోకి తంజావూరు వచ్చింది. పేరుకు తంజావూరు మరాఠా రాజుల పాలనలో ఉన్నా బ్రిటిషు వాళ్ళ చేతుల్లోనే పరిపాలన జరిగేది. ఒక రకంగా తంజావూరు రాజులు బ్రిటీషు వారి చేతిలో కీలుబొమ్మలు. బ్రిటిషు వారి కనుసన్నల్లో మరాఠా రాజుల వేలిముద్ర పాలన సాగింది. అప్పటి వరకూ తమిళ భాష రాజభాషల్లో ఒకటిగా ఉన్నా, మరాఠా రాజులు సంస్కృతానికీ, తెలుగుకే పెద్ద పీట వేసారు.

త్యాగరాజు సర్వజిత్ నామ సంవత్సరంలో పుష్యమీ నక్షత్రాన, చైత్ర శుక్ల సప్తమి నాడు (మే 4, 1767) తిరువారూర్ లో జన్మించాడు. తండ్రి రామబ్రహ్మం. తల్లి సీతమ్మ. రామాయణ,భారత, భాగవతాలు బాగా అధ్యయనం చేసిన రామబ్రహ్మం, అప్పట్లో తంజావూరు రాజైన తుల్జాజీ కొలువులో రామాయణం పఠనమూ, వ్యాఖ్యానమూ చేసేవాడు. ఇదే అతని జీవన భృతి. త్యాగరాజు తిరువారూర్ లో జన్మించాడు. కొంతకాలం తరువాత రామబ్రహ్మం తిరువైయ్యారు కి మకాం మార్చాడు.

తుల్జాజీ రామబ్రహ్మానికి బహుమానంగా ఇచ్చిన ఇంట్లోనే త్యాగరాజు నివసించాడు. అక్కడే ఆయన జీవితం పూర్తిగా గడిచింది. తిరువైయ్యార్ లో తిరుమంజన వీధిలో ఇదే ఇల్లు ఇప్పటికీ ఉంది. త్యాగరాజుకి తండ్రి పెట్టిన పేరు త్యాగబ్రహ్మం. అది త్యాగరాజుగా ఎలామారిందో, ఎవరికీ తెలీదు. చిన్నప్పటినుండీ రామభక్తి సాంప్రదాయంలో పెరిగాడు త్యాగరాజు. తల్లి ద్వారా రామదాసు కీర్తనలూ, తల్లి వైపు తాత వీణ కాళహస్తయ్య వద్ద సంగీతమూ నేర్చుకున్నాడు. ఆ విధంగా సంగీత మూలాలు త్యాగరాజులో నాటుకున్నాయి.

త్యాగరాజు చిన్నతనంలోనే అంటే ఎనిమిదో ఏటే ఉపనయనం చేసినప్పుడు తండ్రి రామబ్రహ్మం రామ తారక మంత్రాన్ని జపించమని త్యాగరాజుకి మంత్రోపదేశం చేసాడు. ప్రతీ ఏటా రామబ్రహ్మం చేసే రామనవమి ఉత్సవాలకి విచ్చేసిన శ్రీ రామకృష్ణానంద స్వామి “నమో నమో రాఘవాయ” అనే మంత్రాన్ని త్యాగరాజుకి ఉపదేశించాడు. ఈ విధంగా త్యాగరాజులో రామభక్తి బీజం నాటుకుంది. భక్తికి సంగీతం తోడయ్యింది.సంగీత జ్ఞానమూ – భక్తి వినా…

తంజావూరు రాజు తుల్జాజీ ఆస్థానంలో శొంఠి వేంకటరమణయ్య అనే సంగీత విద్వాసుడుండేవాడు. సంగీతంలో త్యాగరాజు ఆసక్తి గ్రహించి రామబ్రహ్మం త్యాగరాజుని శొంఠి వేంకటరమణయ్య దగ్గర శిష్యుడిగా చేర్పించాడు. త్యాగరాజు పదిహేనేళ్ళ వయసులో ఉండగా కొంతకాలం గురువు వద్దుండి, తంజావూరులోనే సంగీత విద్య నభ్యసించాడు. అప్పటికింకా త్యాగరాజుకి వివాహం కాలేదు. గురువు వద్ద సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. అతి తక్కువ కాలంలోనే అందులో ప్రావీణ్యం సంపాదించాడు.

త్యాగరాజుకి 18వ ఏట (1785 లో) పార్వతనే అమ్మాయినిచ్చి వివాహం చేసారు. త్యాగరాజు 20 వ ఏట తండ్రి రామబ్రహ్మం కాలం చేసాడు. సరిగ్గా తండ్రి పోయిన మూడేళ్ళకి త్యాగరాజు భార్య పార్వతి మరణించింది. ఆ తరువాత రెండేళ్ళకి పార్వతి చెల్లెలు కమలాంబని త్యాగరాజు రెండో పెళ్ళి చేసుకున్నాడు.

“నమో నమో రాఘవాయ” అన్న సంస్కృత కృతిని దేశి తోడి రాగంలో త్యాగరాజు 13వ ఏట స్వరపరిచాడనీ చెబుతారు.

త్యాగరాజు సంగీత ప్రాభవం రోజు రోజుకూ పెరుగుతూ, ఆనోటా, ఈనోటా ఈ విషయం గురువుగారైన శొంఠి వేంకటరమణయ్య వరకూ ప్రాకింది. ప్రతీ ఏడూ ఉగాది పర్వదినాన తంజావూరు దర్బారు హాలులో సంగీత కచేరీలు జరిగేవి. కేవలం ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసులకే అందులో పాడే అవకాశం లభించేది. ఒక ఉగాది సంగీత కచేరీకి గురువుగారి నుండి త్యాగరాజుకి ఆహ్వానమొచ్చింది. త్యాగరాజుకి గురువంటే ఉన్న భక్తి వలన కచేరీ చెయ్యడానికి వెళ్ళాడు. ఆ సభలో త్యాగరాజు చూపించిన సంగీత విన్యాసం చూసి ఆశ్చర్యపోయారందరూ. ఈ సంగీత సభలో రాగాలాపన, నెరవులు లాంటి మనోధర్మ ప్రక్రియలను ప్రకటిస్తూ, “జానకీ రమణా”, “దొరకునా ఇటువంటి సేవ” కృతుల్నీ పాడాడు. త్యాగరాజు ప్రతిభ చూసి అమితానందభరితుడైన శొంఠి వేంకటరమణయ్య, పండితులందరి ముందూ అతన్ని సత్కరించాడు.

ఈ సభలోనే “ఎందరో మహానుభావులు” అనే ఘన రాగ పంచరత్న కృతి పాడినట్లుగా ఇంకో ప్రచారం ఉంది. ఆ కృతిలో ఎంతో మందిని స్మరించినందువల్లా, ఆ సందర్భానికది కుదిరినందువల్లా ఎందరో మహానుభావులు కృతే పాడుండచ్చనీ చాలా మంది ఊహాగానం చేసారు (త్యాగరాజు సినిమాలో, కొన్ని పుస్తకాల్లో కూడా). కాకపోతే ఇది మాత్రం సరికాదు. ఎందుకంటే త్యాగరాజు ఘన రాగ పంచరత్న కీర్తనలు నలభై ఏళ్ళు దాటిన తరువాతే రచించాడు. త్యాగరాజు బాల్య మిత్రుడూ, శిష్యుడూ అయిన తంజావూరు రామారావు ప్రోద్బలం తోనే త్యాగరాజు పంచరత్న కీర్తనలు రాసాడని ఆధారాలున్నాయి.
ఇలాగే త్యాగరాజు జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలకీ, త్యాగరాజు కృతులకీ ముడేసి అనేక కథలు పుట్టుకొచ్చాయి. పలానా కృతి పలానా సందర్భంలో పాడాడూ అంటూ చాలామంది ఊహాగానాలూ చేస్తూ రాసారు. త్యాగరాజు ఏ సందర్భంలో ఏ కృతి రాసాడూ అన్న తేదీలూ, వివరాలూ తాళపత్ర గ్రంధాల్లో లేవు.

త్యాగరాజు 35వ ఏట తంజావూరు రాజు శరభోజి నుండి సంగీత కచేరీకి ఆహ్వానం వచ్చింది. త్యాగరాజు ప్రతిభ విని, అతని చేత కూడా తనపై కొన్ని కీర్తనలూ, కృతులూ కట్టించుకొనే ఉద్దేశ్యంతో రాజాస్థానానికి ఆహ్వానిస్తూ కబురు పంపాడు.తనపై ఒక కృతి రాసి పాడమని రాజు ఆదేశించడం త్యాగరాజుకి నచ్చలేదు. రాజాహ్వానాన్ని తిరస్కరించాడు. ఈ రాజ తిరస్కారమే త్యాగరాజు కుటుంబంలో చీలికలు తెచ్చింది. తండ్రి పోయిన తరువాత త్యాగరాజు కుటుంబమూ, తల్లీ, అన్నగారు పంచనదయ్య కుటుంబమూ అందరూ ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలా ఉండేవారు. పై సంఘటన జరిగిన తరువాతే శరభోజి కానుకలిచ్చి సేవకుల్ని త్యాగరాజింటికి పంపాడు. అవి వద్దని అన్నగారి ఎదుటనే తిరస్కరించడంతో అన్నదమ్ములిద్దరి మధ్యా విబేధాలు తారాస్థాయి నందుకున్నాయి. ఆ సందర్భంలోనే “నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగ పల్కు మనసా” అనే కృతి రచించాడనీ చెబుతారు. ఈ ఉమ్మడి కుటుంబం చీలిపోయిన సందర్భంలోనే “నాదుపై పలికేరు నరులు” అనే కీర్తన రాసినట్లు కూడా చెబుతారు.

ఆ తరువాత త్యాగరాజు ఉంఛవృత్తి స్వీకరించాడు. ఈ ఉంఛవృత్తి నియమం ప్రకారం కచేరీలు చేసినప్పుడు ఆహార పదార్థాలు అంటే కూరలూ,పప్పులూ వంటివి వారానికి సరిపడా మాత్రమే స్వీకరించేవాడు.

త్యాగరాజు వద్దకి ఎంతో మంది శిష్య్లు వచ్చి సంగీతం నేర్చుకోడం అన్నగారికి కంటగింపుగా ఉండేది. ఓ సారి త్యాగరాజు పూజించే సీతా రామ విగ్రహాలు పక్కనే ఉన్న కావేరీ నదిలో పరేసాడు. ఆ సందర్భంలో “ఎందెందు వెదికేరా” అన్న కృతిని రాసాడనీ అంటారు. చివరికి ఆ రాముడే కనిపించి కావేరీలో వెతకమని చెప్పాడన్న కథకూడా ఉంది. మొత్తానికి ఆ విగ్రహాలు కావేరీ నదిలోనే త్యాగరాజుకి లభించాయనీ చెబుతూ, అప్పుడే “రార మా ఇంటి దాకా” అన్న కృతిని పాడాడనీ కొంతమంది రాసారు. నిజానికి ఆ కృతి త్యాగరాజు రాసిన నృత్యనాటిక “ప్రహ్లాద చరిత్రం” లోనిది. ఇలా ప్రతీ కృతికీ ఒక సందర్భాన్ని జతకట్టారు.రాగ సుధా రస పానము…

కర్ణాటక సంగీతానికి త్యాగరాజొక కొత్త ఒరవడి చూపించాడని పండితుల అభిప్రాయం. శాస్త్రీయ సంగీతం త్యాగరాజుకి ముందూ ఉంది. ఆయనున్నప్పుడూ ఉంది. అంతకు ముందు మేళకర్త రాగ విభజన చేసిన వేంకటమఖి లాంటి ఎంతో మంది సంగీతకారులున్నారు. తన కాలంలో గురువు వెంకటరమణయ్య వాళ్ళూ వున్నారు. మరయితే ఈ త్యాగరాజు గొప్పతనం ఏమిటి? సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా త్యాగరాజుని ఎందుకు కీర్తించారు? వీటికి కారణం త్యాగరాజు కృతి అన్న ఒక రచనలో సంగతి అనేదాన్ని ప్రవేశ పెట్టాడు. ఇప్పటికీ కీర్తననీ, కృతినీ పర్యాయపదాలుగా వాడటం చూస్తూ ఉంటాం. కృతి వేరు;కీర్తన వేరు.

త్యాగరాజు ముందు కాలంలో రాగాలాపనా, పల్లవినీ కలిపి రాగం-తానం-పల్లవి అని పాడేవారు. ఇప్పటికీ ఇదొక అంశంగా కచేరీల్లో పాడడం ఒక రివాజు. ఈ పల్లవిలో ఒకటీ లేదా రెండు వాక్యాలుంటాయి. దాని చుట్టూ రాగ విస్తారణతో ప్రారంభించేవారు. ఈ పల్లవిననుసరించి అనుపల్లవి ఉంటుంది. ఇందులో పల్లవిలో చెప్పిన ఉద్దేశ్యానికి ఒక దృక్పథం ఏర్పడుతుంది. అంటే అనుపల్లవిలో భావం ఇంకాస్త విశదీకరించబడుతుంది. ఆ తరువాత ప్రతీ చరణంలో పల్లవీ, అనుపల్లవిలో చెప్పినవి ధృవీకరించబడతాయి. సాధారణంగా కృతుల్లో రెండూ లేదా ఇంకాస్త ఎక్కువగా చరణాలుండాలన్న నియమం వుంది. చివరి చరణంలో ఆ భావం పూర్తి చేయబడుతుంది. సంగీత కచేరీల్లో గాయకుడి ప్రతిభని చూపించుకోవడానికి, రాగ రసపోషణ చెయ్యడానికి, ముందుగా రాగాలాపనా, ఆ పైన స్వరకల్పన, తద్వారా చేసే లయవిన్యాసమూ అవకాశం ఇస్తాయి. సాహిత్యం (పల్లవి కానీ కృతికానీ) వీటన్నిటికీ ఒక వంతెనగా మిగిలింది తప్ప, సంగీత సభల్లో దానికంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోలేక పోయింది. రాగతాళాల కసరత్తు లాంటి ఈ కచేరీలని సంగీత శాస్త్రపు లోతులు తెలిసిన వారు తప్ప సామాన్యులు ఆనందించలేక పోయేవారు. త్యాగరాజు కృతినొక చట్రంగా వాడుకొనీ, అందులో రాగాల్నీ, వాటి స్వరూపాల్నీ అందంగా అమర్చాడు.

ఇలా ఉన్న కృతిలో, త్యాగరాజు ‘సంగతి’ అనే ఒక కొత్త ప్రయోగాన్ని ప్రవేశపెట్టాడు. ఇది త్యాగరాజుకి ముందూ ఉంది. సాహిత్యం లేకుండా ఆలాపనలో భాగంగా పాడేవారు. కానీ త్యాగరాజు సంగతిని ఆలాపనలోంచి బయటకు తీసి సాహిత్యంతో అనుసంధానంచేసి కృతికి పరిపుష్టత వచ్చేలా చేసాడు.

సంగతి అంటే తెలుగులో విషయమని అర్థం. పల్లవిలో సంగతి చెప్పడం అంటే విషయ విశదీకరణ చేయడం. సాధారణంగా కృతి పాడేటప్పుడు పల్లవినొక శ్రావ్యత (మెలడీ) తో పాటని ఎత్తుకుంటారు. అదే పల్లవిని వివిధ రకాల శ్రావ్యతలతో పాడడం మొదలెడతారు. ఇలా కొన్ని సార్లు అదే తిప్పి పాడతారు. ఇక్కడ పల్లవి సాహిత్యం మారదు. కేవలం శ్రావ్యత మాత్రమే రూపాంతరం చెందుతుంది. ఉదాహరణకి ‘నాద లోలుడై’అనే కృతి వినండి. అందులో పల్లవి వేర్వేరు రకాలుగా మారుతూ వస్తుంది. మారినప్పుడల్లా భావాన్ననుసరించి (టోన్) ఒక ప్రత్యేక రాగభావం ఆవిష్కరింపబడుతుంది. త్యాగరాజు ఎవరూ ఈ సంగతుల్ని మార్చడానికి వీలులేకుండా ప్రతీ కృతిలోనూ స్థిరంగా బంధించేసాడు. కాబట్టి ఉత్తరోత్తరా ఎవరైనా ఆయన కృతులు పాడితే త్యాగరాజు స్వరపరిచిన విధంగానే పాడి తీరాలి. ఈ సంగతుల ప్రయోగం వల్ల వినేవారికి సాహిత్యపరంగా రసానుభూతి కలుగుతుంది. మనసుకి హత్తుకుంటుంది. ఈ విధంగా త్యాగరాజు కృతుల్లో సంగతులు చొప్పించి సంగీతాన్ని జనరంజకంగా చేసాడు. శుద్ధ సావేరి రాగంలో ‘కాల హరణ మేలరా’ కృతిలో అనుపల్లవిని సంగతులతో ఈ క్రిందివిధంగా పాడతారు.
1. కాల హరణ మేల
2. కాల హరణ మేలరా?
3. కాల హరణ మేల రామా?
గమనిస్తే సాహిత్యం ఎలా మారుతూ వస్తోందో తెలుస్తుంది. దాన్ననుసరించీ శ్రావ్యత (మెలడీ) ఎలా మారుతుందో వింటే అర్థమవుతుంది. ఈ రెండూ కలిస్తే కొత్త అర్థం ఎలా పుట్టుకొస్తుందో గోచరమవుతుంది.
సుమారు 215 రాగాల్లో త్యాగరాజ కృతులున్నాయి. కొన్ని మరుగున పడ్డ రాగాలు వెలికి తీసాడు. కొన్ని కొత్త కొత్త రాగాలు కనుక్కున్నాడు. ఎవరూ ముట్టని రాగాల్లోనూ, అసాధారణ రాగాల్లోనూ కృతులు కట్టాడు. ఈ అసాధారణ రాగాల్లో స్వరపరిచిన వాటినే ఏకరాగ కృతులన్నారు. సుమారు 100కి పైగా ఏక రాగ కృతులు స్వరపరిచాడు.

త్యాగరాజు కాలం నాటికే బ్రిటీషు వారు తంజావూరులో తిష్ట వేసారు. ఇంగ్లీషు బ్యాండు ఆధారంగా శంకరాభరణ రాగంలో ‘గత మోహాశ్రిత’, ‘వరలీల గానలోల‘, కుంతలవరాళి లో ‘శర శర సమరైకశూర‘, ‘కలి నరులకు మహిమలు’, బంగాళ లో ‘గిరి రాజ సుత తనయ’, సుపోషిణి లో ‘రమించు వారెవరురా‘ కీర్తనలూ స్వర పరిచాడు. కేవలం వరుస (Tune) వరకే ఇంగ్లీషు బ్యాండుని పోలి వుంటాయి. రాగాలు మాత్రం స్వచ్ఛమైన కర్ణాటక సంగీతంలోవే! త్యాగరాజు కాలంలో శరభోజి గురువుగా ష్వార్ట్జ్ అనే ఒక ఆంగ్లేయుడు శరభోజి రాజుకి ఇంగ్లీషు బ్యాండుని పరిచయం చేసాడు. అప్పట్లో తంజావూరు వీధుల్లో ఈ బ్యాండు వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఊరేగింపుగా వెళ్ళేవారు. ఇంగ్లీషు బ్యాండులో తాళానికి (beat) ప్రాముఖ్యతెక్కువ. అది కర్ణాటక సంగీతంలో వాడే తాళాలకి వేరుగా ఉంటుంది. ఓసారి ఈ ఇంగ్లీషు బ్యాండు వాళ్ళు ఊరేగింపుగా తిరువయ్యార్ వీధుల్లో వెళితే, త్యాగరాజు శిష్యుడొకడు ఆ పాటకి తాళం వేయడం చూసి మన సంగీతంలో కూడా ఇవున్నాయని చెప్పడానికి, త్యాగరాజు రమించు వారెవరురా కీర్తన రాసాడనీ చెబుతారు.

త్యాగరాజు కంఠం గంభీరంగా ఉండేదట. తాదాత్మ్యం చెందుతూ ఎంతో శ్రావ్యంగా పాడేవాడనీ, వింటున్నంత సేపూ ఎవరూ తలకూడా తిప్పేవారు కారని ఆయన శిష్యులే రాసారు. నిత్యజీవితంలో పదిమందినీ గౌరవిస్తూ, ఎంతో ప్రేమగా మాట్లాడే త్యాగరాజు సంగీతం వరకూ వచ్చేసరికి మాత్రం చంఢశాసనుడిలా వుండేవాడట. పాడేటప్పుడు ఏమాత్రం తేడాలొచ్చినా ఊరుకునే వాడు కాదనీ చెబుతారు. చివరి క్షణంవరకూ సంగీతంలోనే మమేకమయ్యాడు.అట్ల పలుకుదువిట్ల పలుకుదు…


త్యాగరాజు సంస్కృత రచనలతో మొదలు పెట్టినా సింహభాగం తెలుగులోనే రాసాడు. తనకి తమిళ భాష క్షుణ్ణంగా వచ్చినా ఒక్కటంటే ఒక్క కృతికూడా తమిళంలో రచించలేదు. అంతెందుకు పరభాషా పదాలని కూడా ఎక్కడా వాడలేదు. మొత్తం కృతులన్నీ వెతికితే హరామి, కారుబారు ( కారో-బార్), రాజీ వంటి కేవలం మూడంటే మూడు ఉర్దూ పదాలు కనిపిస్తాయి. అలాగే లాంతరు ( లాంట్రెన్కి తెలుగు పదం) అన్న ఆంగ్ల పదం తప్ప పరభాషా పదాల జోలికే పోలేదు.

తెలుగు సాహిత్యంలో వాడే వివిధ ప్రక్రియలూ, త్యాగరాజు తన కృతుల్లో వాడాడు. ఈయన కృతుల్లో అర్ధాలంకారాలున్నాయి. అనుప్రాసా యమకాల్లాంటి శబ్దాలంకారాలున్నాయి. ద్వితీయాక్షర ప్రాసా, అంత్య ప్రాసా వాడాడు. సామెతలూ, జాతీయాలూ విరివిగా కనిపిస్తాయి. యక్షగానాలైన ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరిత్రంలో కంద, సీస పద్యాలు కనిపిస్తాయి. దరువులున్నాయి. వీటన్నింటినీ మించి సరళమైన భాష వుంది. వ్యవహారిక భాషలో సామాన్యులకర్థమయ్యేలా ఈ కృతులుంటాయి. రామదాసూ, అన్నమయ్యల పద్ధతిలోనే తేట తెలుగులో రచించాడు.

సంగీతం వరకూ త్యాగరాజు ప్రతిభకి దీటు లేదనేది పండితుల, సంగీత కారుల అభిప్రాయం. సంగీతమున్నంత స్థాయిలో సాహిత్యం లేదన్నది తెలుగు సాహితీకారుల వాదన. ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలతో పోలిస్తే సాహిత్యం ఓ అడుగు వెనకబడే వుందన్న అభిప్రాయం వెలిబుచ్చారు.

సంగీతంలో సాహిత్యాన్ని ఎంతగానో మేళవించినా తెలుగు సాహితీకారులెందుకు త్యాగరాజ కృతుల్లో సాహిత్యాన్ని తగినంతగా మెచ్చలేదు? సంగీతంలో ఒక్క అపస్వరమొచ్చినా సంగీతకారులు ఎలా తట్టుకోలేరో, అలాగే సాహిత్యంలో ఒక్క వ్యాకరణ దోషం కనిపించినా సాహితీ వేత్తలు ఒప్పరు. సంగీతంలో సాహిత్యం బంధించే ప్రక్రియలో త్యాగరాజు కొన్ని వ్యాకరణ నియమాలు ఉల్లంఘించాడన్న ఒక వాదనుంది. రామభక్తినీ, సంగీతాన్నీ ఒక ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్ళిన త్యాగరాజు, సాహిత్యంలో కవిత్వాన్ని పెంపొందిచలేకపోయాడు అంటూ ప్రముఖ సంగీత విద్వాంసుడూ, సాహిత్యకారుడూ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు అభిప్రాయపడ్డారు. సంగీతంలో తాళానికి సరిపడేందుకు కొన్ని పదాలు కుదించాడని వీరి వాదన. నృత్యనాటికల్లో రాసిన కొన్ని కంద, సీస పద్యాల్లో చందస్సు భంగమయ్యిందని వేలెత్తి చూపించారు. వ్యాకరణ దోషాలున్నా, త్యాగరాజు కృతుల్లో భావ ప్రకటన్ని అందరూ మెచ్చుకున్నారు. సాహిత్యం అతి సరళంగా ఉండడం వల్లా, నిత్యమూ వాడుకలో ఉన్న పదాలుండడం వల్లా త్యాగరాజు సంగీతం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది.


కన కన రుచిరా…


త్యాగరాజు అసమాన ప్రతిభ చూసి కొంతమంది సంగీత విద్వాంసులకి అప్పట్లో అక్కసుగా ఉండేది. ఆ రోజుల్లో సంగీతకారులు కీర్తనలూ, స్వరజతులూ, లక్షణ గీతాలూ, వర్ణాలు ఎక్కువగా స్వరపరిచేవారు. వర్ణం స్వరపరచని వాడు వాగ్గేయకారుడు కాలేడని ఒక నిందా ప్రచారం మొదలు పెట్టారు. త్యాగరాజు తన సంగీతాన్ని కేవలం కీర్తనలకీ, సంకీర్తనలకీ, కృతులకే పరిమితం జేసాడు. ఒక్క వర్ణం కూడా స్వరపరచలేదు. దాంతో త్యాగరాజు కృతులు జనరంజకంగా ఉన్నా పండితుల్ని అంతగా మెప్పించలేదు. ఒకసారి ఓ సంగీత విద్వాంసుడు వర్ణాలు త్యాగరాజు వల్లకాదని ఒక శిష్యుడి వద్ద హేళన చేసాడు. ఇది విన్నాక తాన వర్ణాల రీతిలో పెద్ద కృతుల్ని రచించాలని అనుకున్నాడు. వాటి కంటే ఘనంగా స్వర పరచాలన్న ధ్యేయంతో – ఆరభి రాగంలో ‘సాధించెనే’, శ్రీ రాగంలో ‘ఎందరో మహానుభావులు’, గౌళ రాగంలో ‘దుడుకుగల’, వరాళి రాగంలో ‘కన కన రుచిరా’, నాట రాగంలో ‘జగదానంద కారక’ అనే కృతులు కూర్చాడు. వీటినే ఘనరాగ పంచరత్న కీర్తనలనీ అంటారు.
త్యాగరాజ కృతులకీ ఎన్నో ప్రక్షిప్తాలున్నాయి. ప్రతీ సంగీతకారుడికీ, సాహిత్యకారుడికీ పాడే విధానంలోనయినా, రాసే సరళిలోనైనా వారికి ప్రత్యేకతను తెచ్చే ఒక ఒరవడుంటుంది. అలా పేరొందిన వారి సరళిని అనుసరించి వారి ముద్రతోనే ఉన్న రచనలని ప్రక్షిప్తాలంటారు. మహాభాగవతం రాసిన పోతనకీ, పద సంకీర్తనలు చేసిన అన్నమయ్యకీ, ఇలా ఎంతో మంది కవులకీ, వాగ్గేయకారులకీ ఈ ప్రక్షిప్తాల బెడద తప్పలేదు.
త్యాగరాజు ఈ ఘనరాగ పంచరత్న కీర్తనలన్నీ నలభై ఏళ్ళు దాటాకనే కట్టాడు. ఈ రీతిలోనే కోవూరు పంచరత్న కీర్తనలు కూడా. ఉత్తరాది యాత్ర సందర్భంగా తిరుపతీ, కంచీ, మద్రాసూ, శ్రీరంగపట్టణం వంటి క్షేత్రాలని దర్శించీ కృతులు స్వరపరిచాడు. మద్రాసులో బస చేసిన వీణకుప్పయ్యర్ ఇల్లు మొన్నమొన్నటివరకూ ఉంది కూడా. ఈ ఉత్తరాది యాత్ర మాత్రం 65ఏళ్ళు దాటాకనే చేసాడు. ఈ యాత్రకు సంబంధించీ అనేక కథలున్నాయి.


గాన మూర్తే…


త్యాగరాజు కాలంలోనే నివసించిన ముత్తుస్వామి దీక్షితారూ, శ్యామ శాస్త్రిలని కలిపి సంగీత త్రిమూర్తులంటారు. చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురూ ఒకే ఊళ్ళో అంటే తిరువారూరులోనే జన్మించారు. అందరిలోకీ త్యాగరాజు వయసులో పెద్ద వాడు. అందరికంటే ముందు చిన్నవాడైన దీక్షితార్ పోయాడు. శ్యామశాస్త్రి తరువాత పోయాడు. త్యాగరాజు మాత్రం ఎనభైనాలుగేళ్ళు జీవించాడు. చివర్లో సన్యాసం స్వీకరించి పరమహస పరివ్రాజక శ్రీ బ్రహ్మానంద స్వామి గా సిద్ధిపొందాడు.

ఒకే ప్రాతంలో జీవించారు కాబట్టి ఈ త్రిమూర్తులు ఎప్పుడైనా కలిసారా? అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. శ్యామశాస్త్రీ, త్యాగరాజు మంచి స్నేహితులని చెబుతూ తరచు వీళ్ళిద్దరూ కలిసే వారన్నట్లుగా అనేకమంది రాసారు. ఈ విషయం 1930 తరువాతొచ్చిన రచనల్లోనే ఇది ఎక్కువ భాగం కనిపిస్తుంది. త్యాగరాజు శిష్యులు పొందుపరిచిన వివరాల్లో ఇది లేదు. ఇద్దరూ దగ్గరూళ్ళలోనే ఉండడం వల్ల ఒకరి గురించొకరికి ఖచ్చితంగా తెలిసే అవకాశముంది. అది కేవలం ముఖ పరిచయమేనా లేక సంగీత పరిచయం కూడా ఉందన్న విషయం రూఢిగా తెలీదు. కాకపోతే శ్యామశాస్త్రి కొడుకు సుబ్బరాయశాస్త్రి తండ్రిపోయాక త్యాగరాజు వద్ద శిష్యరికం చేసాడు.

ఈ సంగీత త్రిమూర్తులన్న ప్రచారం 1920 తరువాతనే మొదలయ్యింది. త్యాగరాజుతో సమంగా ఆయన పక్కనే పీటవేసి శ్యామశాస్త్రినీ, దీక్షితార్ని కూర్చో బెట్టడాన్ని చూసి మంచాళ జగన్నాధరావూ, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మా అభ్యంతరాలు తెలిపారు. త్యాగరాజుతో సమంగా క్షేత్రయ్య, అన్నమయ్య ఉండాలని వారి అభిప్రాయం.గురు లేకయెటువంటి గుణికి…

తిరువయారులో త్యాగరాజు సమాధి ప్రంతంలో ప్రతీ ఏటా జనవరి మాసంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు గత డెబ్బయ్యేళ్ళగా జరుగుతున్నాయి. దీనికి మూల కారణం ఒక మహామనీషి. ఆమెని గుర్తుచేసుకోకుండా త్యాగరాజు గురించి చెప్పుకోవడం భావ్యం కాదు.
ఆవిడ పేరు బెంగుళూరు నాగరత్నమ్మ. మైసూరు సంస్థానంలో దేవదాసీగా ఉండేది. ఈవిడకి కర్ణాటక సంగీతం బాగా వచ్చు. త్యాగరాజు కృతులూ నేర్చుకుంది. అప్పట్లో మద్రాసు సంగీత విద్వాంసులకి నిలయంగా ఉండేది. చివరికి ఈ బెంగుళూరు నాగరత్నమ్మ మద్రాసులో స్థిరపడి సంగీత కచేరీలు ఇచ్చేది. ఓ రోజున ఉమైయాల్పురం పంచాపకేశ భాగవతార్ సంగీత కచేరీకని మద్రాసు వచ్చి కలిసినపుడు నాగరత్నమ్మ ఆయన వద్ద త్యాగరాజు చిత్రపటాన్నొకటి కొనుక్కుంది. ఓ రోజు రాత్రి నాగరత్నమ్మకి కలలో త్యాగరాజు కనిపించాడడన్న విషయాన్ని సంగీత సమాజ కార్యదర్శి మునుస్వామి నాయుడుకి చెప్పింది. సరిగ్గా అదే సమయానికి తంజావూరు నాగరాజ భాగవతార్ హరికథా కాలక్షేపం నిమిత్తమై మద్రాసు వచ్చారు. వారితో కలిసి నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళి, సమాధిని సందర్శించింది. సమాధి సమీపంలో తుప్పలూ, మొక్కలూ పెరిగి అస్తవ్యస్తంగా కనిపించి, ఇక్కడ త్యాగరాజు మందిరం నిర్మిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన చేసి, 1925లో పదిమందినీ సంప్రదించి, తన దగ్గరున్న కొంత ధనాన్ని వెచ్చించి సమాధి కట్టించింది. ఆ ప్రాంతంలోనే త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరగడానికి ఎంతో కృషి చేసింది.

ప్రస్తుతం తిరువయ్యారు తిరుమంజన వీధిలో త్యాగరాజు నివసించిన ఇల్లు వుంది. దాన్ని మరమ్మత్తు చేయించి అదొక మ్యూజియంలా మలచాలన్న ఆలోచనతో కొంతమంది పూనుకొన్నారు. వేరెవరో కోర్టులో కేసు వేసి ఆ పనులు ఆపించేసారు. తీర్పు ఎప్పుడొస్తుందో ఆ రాముడికే ఎరుక.

త్యాగరాజు కర్ణాటక సంగీతానికి అపారమైన సేవ చేసాడు. అడిగినవారికి కాదనకుండా ఏమీ ఆశించకుండా సంగీతం నేర్పాడు. నిధికన్నా రాముని సన్నిధి మిన్న అని భావించాడు. నాదలోలురైతేనే సంగీత సిద్ధి లభిస్తుందని నమ్మాడు. ప్రస్తుతం సంగీత కచేరీల్లో త్యాగరాజు కృతులే పలు విద్వాంసులూ పాడతారు. ఆయా కచేరీలకీ భారీగా సొమ్ము వసూలు చేస్తారు. త్యాగరాజుని స్తుతిస్తారు కానీ, ఆయన పాటించిన విలువల్ని వదిలేస్తున్నారు. కొన్ని కచేరీల్లో అయితే త్యాగరాజు కృతులు పాడతారు కానీ, స్వరకర్త పేరు చెప్పడానికి వెనకాడతారు. త్యాగరాజు పెట్టిన స్వర భిక్షే చాలామంది సంగీత కారులకి జీవనోపాధయ్యిందన్న అక్షర సత్యాన్ని విస్మరిస్తున్నారు.

ప్రస్తుతం త్యాగరాజుకి దక్కిన స్థానానికీ, గౌరవానికీ మూల కారణం తమిళ సోదరులే! తెలుగువారికి త్యాగరాజంటే మనవాడన్న అభిమానం లేదు. శాస్త్రీయ సంగీతమంటే అసలు ఆసక్తే లేదు. సినిమా సంగీతమే సంగీతమన్న భ్రమలో తెలుగుజాతి వుంది.

ఎవరేమన్నా, కర్ణాటక సంగీతం ఉన్నంత వరకూ త్యాగరాజూ జీవిస్తాడు. త్యాగరాజున్నంతవరకూ తెలుగు నుడికారమూ అందరి గొంతులోనూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది కర్ణాటక సంగీత గళానికి త్యాగరాజు ప్రసాదించిన రాగ రత్న మాలిక.

00000000000000000000

త్యాగరాజు గురించి ఇంకా సమగ్రంగా చదవాలనుకుంటే –


మనకు తెలియని మన త్యాగరాజు – 1

మనకు తెలియని మన త్యాగరాజు – 2

మనకు తెలియని మన త్యాగరాజు – 3

మనకు తెలియని మన త్యాగరాజు – 4

మనకు తెలియని మన త్యాగరాజు – 5

Comments (1)

విశాలాంధ్ర పత్రికలో – 2012లో కథలపై సమీక్ష

విశాలాంధ్ర పత్రికలో – 2012లో కథలపై
నండూరి రాజగోపాల్ సమీక్ష

పిల్లలని నిద్రపుచ్చడానికో – పెద్దల కాలక్షేపానికో, సమాజ హితానికో, మనిషికి నీతి నేర్పడానికో పుట్టిన కథ కాలంతోపాటే పెరుగుతూ, తన పరిధిని ప్రపంచమంత విశా లం చేసుకుంది. కాలమంత విస్తారమయింది. మనిషితోపాటే నడుస్తూ… తను నడిచిన సమాజాన్ని గమనిస్తూ.. ఆ గమ నికలోని పరిణామాలని భద్రపరుస్తూ… ‘నేటి’ గురించి మాట్లాడటానికి, రేపటిని అంచనా వేయడానికి తెలుగుకథ ఒక చారిత్రక అవసరంగా మారిన సందర్భం ఇది. ఎప్పటికప్పుడు కాలాన్ని, సమాజాన్ని, మనిషిని, మనుగడని అంచనా వేయడానికి ఇవాళ ‘కథ’ మనకి గొప్ప వనరు. మన గురించి, మన ప్రయాణం, దానిలోని నిజాయతీ, చేరబోయే గమ్యం గురించి సూటిగా, నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా, నిరహంకారంగా, నిర్లిప్తంగా… చెబుతున్న ‘కథ’ ఇప్పుడు జాతి అవసరం. ఇంతటి బలాన్ని తనలో ఇముడ్చుకున్న ‘కథ’ ద్వారా 2012లో మన నడకని, నడతని అంచనా వేయడానికి చేస్తున్న చిరుప్రయత్నమిది.

ఈ ఏడాది కొన్ని వందల కథలు వచ్చాయి. కొన్ని మామూలువీ, కొన్ని గొప్పవీ, ఇంకొన్ని ఇంకా గొప్పవి ఉన్నాయి. ఒక వస్తువు మీద వచ్చిన, వస్తువైరుధ్యాన్ని చూపెట్టిన కథలు ఉన్నాయి. నిర్మాణాత్మకమైన సొగసు, శైలీ విన్యాసం విలక్షణంగా జత కూడిన కథలూ ఉన్నాయి. కుల, మత, జెండర్‌, ప్రాంతీయ అస్తిత్వాలను దాటి, 2012 ‘కథ’ మనిషి జీవితంలోకి చొచ్చుకు వెళ్ళింది. ప్రాంతం, కులం, మతం వంటి విషయాలకన్నా…. మనిషి జీవించడమనే ప్రధాన విషయంపైనే దృష్టి పెట్టింది. ‘మనిషి’ చుట్టూ అల్లుకున్న సంబంధాలు, బాధ్యతలు కాపాడుకోలేకపోతే జరిగే విచ్ఛిన్నతను గురించి హెచ్చరించాయి. ఎక్కడివాడైనా ‘మనిషే’ లేకపోతే ఎదురయ్యే ‘శూన్యం’ పట్ల భయాన్ని వ్యక్తం చేశాయి. 2012 కథలను నాలుగు రకాలుగా మనం వర్గీకరించవచ్చు.

చాలామంది కథకులు బాల్యాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గురించి ఎక్కువగా చెప్పారు. చదువులు, పోటీ, కెరీర్‌, ప్రెస్టీజ్‌వల్ల పిల్లలనుండి మనం లాగేసుకుని, పారేస్తున్న ‘బాల్యం’ వాళ్ళకి తిరిగి అందించడానికి చాలా కథలు ప్రయత్నించాయి. ఈ కథలు చదువుతున్నప్పుడు మన చుట్టూ పెరుగుతున్న బేబీ కేర్‌ సెంటర్‌లు, నర్సరీ స్కూళ్ళు, ఈ టెక్నోలు, ఐఐటి కోచింగ్‌లు కళ్ళముందు కదిలి… మన పిల్లల పట్ల భయాన్ని పెంచుతాయి. ‘స్పెల్‌ బీ’ లో జాతీయస్థాయి ప్రథమ స్థానాన్ని సాధించిన సిద్ధూ అనే కుర్రవాడు (గలుబె, సాయి బ్రహ్మానందం గొర్తి) ఆ విజయానికి పొంగిపోకుండా… బాధపడతాడు, ఏడుస్తాడు. ‘తను కోల్పోయిన బాల్యం’ గురించి చింత పడతాడు. ఆ బాల్యానికి ప్రతీకగా నిలిచిన ‘ఎరిక్‌’ అనే నల్లజాతి స్నేహితుడు కోసం ఎదురు చూస్తాడు. అతని వల్లే తనకి తెలిసిన ‘గలుబె’ అన్న పదం తనకి విజయాన్ని తెచ్చిపెట్టిందన్న సంగతి గుర్తిస్తాడు. దక్కిన విజయం కన్నా, దక్కించుకున్న బాల్య స్నేహానికి, బాల్యానికి కదిలిపోతాడు. బాల్యాన్ని, పసిపిల్లల మనసులని తల్లిదండ్రులు తమ ఆశలు, ఆశయాల కోసం చంపేస్తున్న సందర్భం ఒక పక్క, మన చుట్టూ పిల్లలని సమిధలని చేస్తూ నిర్వహిస్తున్న రియాల్టిషోలు మరో పక్క బాల్యాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. ఈ కథ ఫిబ్రవరిలో వచ్చింది. తరువాత సెప్టెంబర్‌లో ‘అరచేతిలో చందమామ’ ద్వారా కొవ్వలి రామకృష్ణ పరమహంస.. పిల్లల వల్ల మనకి దగ్గరవుతున్న చందమామని, వెన్నెలని గురించి చెబుతాడు. పిల్లలతో గడవడం వాళ్ళలో పెరిగే సృజనశక్తిని కాపాడడమే అన్న సత్యాన్ని చెప్పే కథ ఇది. ‘నింగిలో చందమామ ఉన్నంత కాలం మనమంతా సెంటి మెంటల్‌ ఫూల్సేరా..’ అంటున్న ఈ కథ.. బాల్యాన్ని అనుభవించడం, ఆనందించడంలో సహచరించడంలోని మాధుర్యాన్ని గురించి చెబుతోంది. స్వాతి శ్రీపాద ‘లేని ఆకాశానికి నిచ్చెన’, సురేంధ్రనాధ్‌ ‘ఐస్‌క్రీం’, జి.లక్ష్మి ‘ఆనంద అపార్ట్‌మెంట్స్‌’ లాంటి మరికొన్ని కథలు ఈ కోవలోవే.

చాలా కథలు మానవసంబంధాలలో పెరుగుతున్న ఖాళీని గుర్తించడమే కాదు, పూరించే ప్రయత్నం చేశాయి. ఇది రెండో దశ. మనిషి జీవితంలో పెరిగిన వేగం తాలూకు ‘అనీజీనెస్‌’ కొన్ని సౌకర్యాల్ని పెంచినా, శాంతిని – సుఖాన్ని చంపేసిన దారుణ సత్యాన్ని తెలిపే కథలు. ‘నాకు కొంచెం వెసలుబాటు, కొంచెం ఊపిరి పీల్చుకోగల విరామం కావాలి. నా మీద నాకు నమ్మకం, ధైర్యం కావాలి’ అంటున్న ఈ తరహా ప్రతినిధుల బతుకులలోని సంఘర్షణతో జి.లక్ష్మి ‘పూలు పూయని నేల’ ద్వారా పాఠకుల మనసును కదిలిస్తారు. అమ్మమ్మకి ఒక మనవరాలు రాసిన ఉత్తరమే ఈ కథ. ‘నన్ను పెంచడానికి నువ్వున్నావు. నా పిల్లలని పెంచడానికి ఎవరుంటారు. అమ్మ కూడా బిజీనే కదా’ అంటున్న ఈ కాలపు అమ్మాయి పెళ్ళి చేసుకోవడం కూడా ఒక అసౌకర్యంగానూ, బరువుగానూ భావిస్తున్న లేదా అలా భావించేలా చేస్తున్న ఈ కాలపు ఉద్యోగాల నల్లటి రేఖలను ఈ కథ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. లక్షలలో జీతాలు వస్తూ లైఫ్‌ కంఫర్ట్‌గా ఉన్నా, భద్రతగా శాంతి లేదనే నిజాన్ని చెప్పిన కథ. ఇదే రచయిత్రి ‘అమ్మ’ అని ఇంకో కథ రాశారు. అమ్మాయిలు కెరీర్‌ కోసం కుటుంబాన్ని, పిల్లలని వదిలేసుకుంటున్నారని, అబార్షన్‌లు చేయించుకుని పిల్లలని వద్దనుకుంటున్నారని, ఇలా అనుకోవడం వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడంగా భావిస్తున్నారని చెప్పిన కథ ఇది. రచయిత్రి కూడా ఈ కథలో సుజాతను సపోర్ట్టు చేస్తుంది. ఏ మానవ సంబంధాల బలహీనతలనైతే ‘పూలు పూయని నేల’ ద్వారానూ, ‘సంతోషం అంటే ఏమిటి’ ద్వారాను ‘ఆనంద్‌ అపార్ట్‌మెంట్‌’ ద్వారాను చెప్పిన ఈమె ఎందుకు మళ్ళీ పిల్లలని కెరీర్‌ ప్రతిబంధకాలుగా చూపెట్టే కథ రాశారో అర్థం కాదు. ఈ నాలుగయిదు కథలు ఈ సంవత్సరంలోనే రావడం గమనార్హం.

ప్రతి కథారచయితకు ఒక దృక్పథం అవసరం. అ దృక్పథం సాధారణంగా కథ పుట్టే కాలం నాటి సమాజ అవసరానికి అమరినట్టుంటుంది. ఒకే కాలంలో రెండు దృక్పథాలుగా కథకుడు విడిపోయాడంటే దానికి ఒక పెద్ద మలుపు (్‌బతీఅఱఅస్త్ర) కాని, మార్పు కాని ఉండాలి. అటువంటిది ఏమీ లేకుండానే ఒక రచయిత అన్ని కథలలోనూ ఒకలాగా ఒక కథలో మరోలా కనపడడం పాఠకుడికి ఆ రచయిత కమిట్‌మెంట్‌ పట్ల సందేహం కలుగుతుంది. కె. రాధా హిమబిందు ‘రక్త సంబంధం’, రవీంద్రబాబు ‘పరుగు’, తటపర్తి నాగేశ్వరి ‘మమతల తీరం చివర’ లాంటి మరోకొన్ని కథలు మానవ సంబంధాల పలచనను చెప్పే కథలు.

మూడోది, అతి ముఖ్యమైనది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవితాలలోని aషషఱసవఅ్‌aశ్రీఱరఎని, అది తెచ్చే విషాదాలని చెప్పే కథలు. ఈ విషాదాలు పోలీస్‌ల వల్ల అంటే వ్యవస్థ వల్ల కావచ్చు, కులం వల్ల కావచ్చు, వృత్తుల వల్ల కావచ్చు, భక్తి వల్ల కావచ్చు, మూఢాచారాల వల్ల కావచ్చు, కుటుంబ హింస వల్ల కావచ్చు. ఏమైనా వాటి విస్తృతి చాలా ఎక్కువవుతున్న కాలంలో ఖీతీaఅస శీః షశీఅఅవతీ చెప్పిన ఈ ఃరబbఎవతీస్త్రవస జూశీజూబశ్రీa్‌ఱశీఅ స్త్రతీశీబజూః వ్యథలను రికార్డు చేసిన కథలే ఈ సంవత్సరపు సమాజాన్ని నిలువెత్తుగా తర్వాతి తరానికి అందించబోయే వనరులు. ”ఎన్ని యుద్ధాలు కలిస్తే ఒక జీవితం! ఆధ్యాత్మికత గొప్ప శాంతి కావచ్చు. గొప్ప యుద్ధమూ కావచ్చు. కాని జీవితం మాత్రం అనేక యుద్ధాల గందర గోళమే’ అంటున్న అఫ్సర్‌ ‘ముస్తాఫా మరణం’ బతుకికి – భక్తికి, ఆధ్యాత్మికతకి – ఆడంబరానికి, పూజకి – ప్రచారానికి మధ్య వ్యత్యాసాన్ని, ఘర్షణని చూపెట్టిన కథ. ఇది 2012 జనవరి 29న వచ్చిన కథ. సమాజంలో మనతోపాటే పుట్టి, మనతో పాటే పెరిగిన వాళ్ళు హఠాత్తుగా ‘బాబా’లై పోవడం ‘అమ్మ’లై పోవడం, వారి వెనుక హడావుడి ప్రారంభమవడం లాంటి కథలు మనకు తెలుసు. అయితే, అలా పెరిగిన ‘బాబాల’ కుటుంబ సభ్యుల మానసిక క్షోభకి ఈ కథ గొప్ప ఉదాహరణ. ఇస్లాం చదువుకున్నవాడు, భక్తి అంటే ఏమిటో నిజంగా అర్థమయినవాడు అయిన ముస్తాఫా ఎందుకు ఇరుకు గదికి మారిపోయాడో, ఆకాశం – నేల కనపడని అంధుడయి పోయాడో, ఇబాకత్‌(భక్తి) అంటే కుటుంబాన్ని దిక్కులేకుండా చెయ్యడం కాదని ఎందుకు తెలుసుకోలేకపోయాడో… కథంతా పాఠకుడిని వెంటాడుతూనే ఉంటుంది. డబ్బు పట్ల కూడా ఆశలేకుండా, జ్ఞానమో, విపరీత జ్ఞానమో తెలీని ముస్తాఫా ఆధునిక సమాజానికి ప్రతిరూపం. ఒక సింబల్‌. సమాజం కూడా అంతే. పెరుగుతోందో, విరుగుతోందో తెలియని స్థితి. ఆకాశానికి, భూమికి మధ్య త్రిశంకుగా వేళ్ళాడుతున్న దుస్థితి. వెతికి చూస్తే శూన్యం తప్ప ఏమీ కనపడని పరిస్థితి. ఇంతటి అనిశ్చితి మధ్య జీవితం అంటే అనేక యుద్ధాల వేదికని, కాలమే దానికి ఓదార్పు అని చెప్పే గొప్ప తాత్వికత ఇముడ్చుకున్న కథ.

ఈ మూడో దశలో సామాన్య రాసిన కథ ‘ఆలం కాందోకార్‌’ గొప్ప కథ. ఆగస్టులో వచ్చిన ఈ కథ పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా పనిచేసి, విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడిన ‘అలం’ను విశ్రాంతి తీసుకోనివ్వకుండా కట్టడి చేసి, ఒప్పుకోకపోతే అతని కొడుకుని ఇన్‌ఫార్మర్‌గా తయారుచేయమని ఒత్తిడి చేసి, అదీ కుదరకపోతే అతనిపై డెకాయిట్‌ కేసు పెట్టిన పోలీస్‌ వ్యవస్థవల్ల అలం పడ్డ వేదన, అవమానం వ్యవస్థను ప్రశ్నిస్తూనే ఉంటుంది. చివరికి తన బతుకుకు చావుని ముగింపు చేసిన అలం ఓడిపోయిన మానవత్వానికి పరాకాష్ఠ. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ల జీవితాలు ఎంత ప్రమాదంలో ఉండి పోతున్నాయో, ఎలాంటి హింస ఎదుర్కొంటున్నాయో ఈ కథ చదివితే అర్థం అవుతుంది. బతకడం కోసం ఒక మార్గాన్ని వెతుక్కునే క్రమంలో అనుకోకుండా ఇన్‌ఫార్మర్‌గా మారడం, ఎంతోమంది డెకాయిట్‌లను మార్చడం, తన ఊళ్ళోవాళ్ళకి సహాయం చేయడంలాంటి మంచిపనుల ‘అలాం’ ను ఎవ్వరూ రక్షించలేకపోవడం ఒక ఎత్తైతే, ప్రభుత్వ యంత్రాంగంలోని పెద్దలలో అలముకున్న ఉదాసీనత మరొక ఎత్తు. అన్ని సమస్యల్లాగానే ఈ సమస్యను రొటీన్‌ లోంచి చూడడం వల్ల, ‘అలాం’ వ్యక్తిత్వాన్ని గుర్తించకపోవడం వలనే మోసానికి, దుర్మార్గానికి శిక్షపడటం చాలా ఆలస్యమవుతోంది. ఒక్కొక్కసారి జరగడము లేదు కూడా. ఈ రెండింటిని చాలా గొప్పగా చెప్పిన ఈ కథ ఈ సంవత్సరంలో వచ్చిన అతి మంచికథలలో ఒకటి.

సానపెట్టే వాళ్ళని, మాట్లు వేసేవాళ్ళని, కూరలమ్మేవాళ్ళని, పాత పేపర్లని కొనేవాళ్ళని, రగ్గులమ్మే వాళ్ళని, అందరూ అనుమానంగానే చూస్తారు. ఎవరూ మామూలుగా చూడరు. ఏది పోయినా వాళ్ళనే ముందు దోషులని చేస్తారు. ఇది ఇప్పటి విషయం కాదు. ఎప్పటినుండో ఉన్నదే. ఊళ్ళల్లో ఏది జరిగినా పోలీసులు ముందు వీళ్ళనే నేరస్తులను చేస్తారు. అలాంటి వేధింపులతో తన తండ్రి నేర్పిన విద్య ‘సానపెట్టడాన్ని’ , సానపెట్టే మిషన్‌ని వదిలి దిక్కుతోచని స్థితిలో దిక్కులేకుండా వెళ్ళిపోయిన పకీరప్పని ‘తూర్పు మండపం’ కథలో వేంపల్లి గంగాధర్‌ మనకి పరిచయం చేస్తారు. ఉన్న వృత్తిని కూడా వదిలేసేంత వేధింపులకు గురిచేస్తున్న వ్యవస్థ పట్ల అహంకారం ఈనాటి కథకులలో కనపడుతుంది. అదే సమయంలో.. అందరినీ ఒక చోటకి చేరుస్తున్న ‘తూర్పు మండపం’ ఇవాల్టి అవసరంగా చూపెట్టడం ఈ కథలోని శిల్ప నైపుణ్యానికి నిదర్శనం.

మనం చేసే ఏ వృత్తిలోనైనా ఆఖరికి ‘వేశ్యావృత్తి’లోనైనా సరే ‘ఎథిక్స్‌’ పాటించడమనే సంప్రదాయాన్ని వదిలివేస్తున్న ఈనాటి సమాజానికి ‘శివపురి’ (శరత్‌చంద్ర) ఒక ప్రతీక, ఒక వృత్తి, ఒక కుటుంబ ఆచారం ఇవాళ వ్యాపార సామ్రా జ్యంగా మారి నీతిని వదిలేస్తున్న సందర్భంలో.. అందరూ కూడా ‘జీవించడం’ కోల్పోవడమే జరుగుతోందని అర్థమ వుతుంది. చావలేదు కాబట్టి బతికున్నామని అనుకోబట్టే స్పం దించడం మర్చిపోయిన జనం మధ్య బతుకుతున్నాం. టశ్రీa్‌ జీవితాలని ఆవిష్కరించిన ఈ కథలు ఎక్కువగానే వచ్చాయి.

ఇక నాల్గవ దశలో తరాల మధ్య తేడాను, సంఘర్షణను చెప్పే కథలు చోటు చేసుకున్నాయి. ఒక దశాబ్దకాలంలో సమాజంలో వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే, ఈ తరం పిల్లలు డబ్బుతోపాటు గుర్తింపునూ కోరుకోవడం. తమ తల్లి దండ్రుల ద్వారా వాళ్ళకి ఆ గుర్తింపు రావాలనుకోవడం. ఒక హౌదా కావాలనుకోవడం. చాలా చిత్రంగా డబ్బుకన్నా కూడా ఇప్పుడు ఈ కోరిక ఈ తరానికి ఎక్కువయిపోయింది. దీనిని సరిగ్గా పట్టుకున్న కథ జి.ఉమామహేశ్వర్‌ ”నీ లీల పాడెద లేలా”. సన్నాయి వాయించడం, క్షురకర్మ చేయడం వృత్తి అయిన తండ్రి నుండి ఆ వృత్తి స్వీకరించడానికి కొడుకు సిద్ధపడడు. పెళ్ళిళ్ళలో తండ్రి అద్భుతంగా వాయిస్తున్న సన్నాయిలోని మధురిమని ఆస్వాదించకుండా… ఇష్టం వచ్చినపుడు ఆపమనడం, భోజనాలకి కూడా ఆఖరుగా పిలవడం, తండ్రిలోని కళని గుర్తించకపోవడం కొడుకుకు ఆగ్రహంగా మారుతుంది. ఎలాంటి గుర్తింపు లేకపోయినా, తన వృత్తిని ప్రేమించడం, దానిని జీవితంగా స్వీకరించడం, అలా చెయ్యని కొడుకుకి సన్నాయిపట్టుకునే హక్కులేదని నిందించడం చేసిన తండ్రి నిన్నటి ప్రతినిధి. గుర్తింపు లేని సన్నాయి నుండి అందరూ గుర్తించే ‘వీడియోగ్రాఫర్‌’గా మారిన కొడుకు నేటి ప్రతినిధి. ఈ రెండు తరాల మధ్య ఉన్న తేడాని చాలా విశేషంగా చెప్పిన జి. ఉమామహేశ్వర్‌కి అభినందనలు. ఒక గుర్తింపును కోరుకోవడం, దాని కోసం పోరాడడం, సాధించడం నేటి తరం నైజంగా ఈ సంవత్సరం వచ్చిన కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

‘మనకి ప్రమాదం జంతువు నుండి కాదయ్యా, నిన్న అలిపిరిలో దించిన కారు డ్రైవరూ, కొండమీద కిళ్ళీ కొట్టువాడూ, కొండపై పనిచేసే ఆఫీసరు, దేవుడి ముందు క్యూ కాపల కాసే ఆమెలాంటి వాళ్ళకి మనం భయపడాలి’ అంటున్న సాయి బ్రహ్మానందం గొర్తి ‘చిరుత’ కథ మనుషులలో పేరుకుపోయిన మోసాన్ని, అవినీతిని, యాంత్రికతని చెబుతుంది. పది గంటలు క్యూలో నిలబడి దేవుడిని దర్శించుకోలేని ‘వడివేలు’ లాంటి వాళ్ళ బతుకులలో… కాలం వాళ్ళకి సంపాదించడానికి, బతకడానికే సరిపోదు. ఏ పనైనా సరే. .. తినడానికి ఉపయోగపడుతుందంటే, దానికి రెడీ అయిపోయే మనుషులలోని అమాయకత్వం, దానికి దోచుకుంటున్న వ్యవస్థ దుర్మార్గం చాలా మంది కథకులని కలవరపరుస్తున్న విషయం.

కుప్పిలి పద్మ ‘మదర్‌ హుడ్‌ ఏ రియాల్టిచెక్‌’, కొల్లూరి సోమశంకర్‌ ‘ఎం.ఆర్‌.పి’, స్కైబాబా ‘ఊహ’, సన్నపురెడ్డి వెంకటరెడ్డి ‘బిలం’, నేహ ‘పట్నం బతుకులు’, ఓల్గా ‘ఆశల బరువు’… ఆ సంవత్సరం వచ్చిన మంచి కథలలో కొన్ని. ఇలాంటివే చాలా వున్నా… స్థలాభావం కొన్ని పరిమితులను సృష్టించింది. మనుషులను దగ్గరకు తీసుకోవడం కోసం, సమాజాన్ని సుస్థిరపరచడం కోసం, రేపటి తరాన్ని అందించే ‘బాల్యాన్ని’ పరిరక్షించడం కోసం ‘కథ’ తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉంది. దీనికి భంగం కలిగించిన ప్రతిసారీ తెలుగు కథకుడు తన కలాన్ని ఎక్కుపెట్టి… యుద్ధం చేస్తూనే ఉన్నాడు. గత దశాబ్దకాలంలో… తెలుగు నేలపై సమస్యను సృష్టిస్తున్న మానవ సంబంధాల బలహీనత, పిల్లల పట్ల నిర్లక్ష్యం, మధ్యతరగతి జీవితాలపై హింస, తరాల మధ్య అంతరం ఈ సంవత్సరం కథలలో చోటుచేసుకున్నాయి.

కాబట్టే, ఒక పోరాటం నుండి, ఒక ఉద్యమం నుండి ఇవాళ తెలుగు కథ మనిషిని కాపాడుకోవడం ముఖ్యమనుకుంటోంది. మనిషి దగ్గరికి చేరడానికి, మనిషిని చేరడానికి ప్రయత్నిస్తోంది. కనపడకుండా పోతున్న ఆత్మీయ జాడలను వెతికి పట్టుకునే దిశగా ప్రయాణిస్తోంది. అపురూపమైన బాల్యానికి ప్రేమనద్ది కాపాడే ప్రయత్నం చేస్తోంది. సమాజంలో మనుషుల జాడను సిద్ధం చేస్తోంది.

– నండూరి రాజగోపాల్‌

Thanks to Shariff Vempalli for forwarding this link.

Comments (1)

కథ – 2010 పై సమీక్ష – పాలపిట్టలో

జాజర


క్రితం ఏడాది నవంబరులో రాసిన వ్యాసం ఈ ఏప్రిల్ నెల పాలపిట్టలో వచ్చింది.

కథ – 2010 పై సమీక్ష

OOOOOOOOOOOOOOOOOOOOOOOOOO

సుమారు నలభయ్యేళ్ళ క్రితం నండూరి రామ్మోహన రావు గారు “మన కథా పరిశ్రమ” అని ఒక వ్యాసం రాసారు. అందులో మంచి ప్రతిపాదనొకటి చేసారు. అదేవిటంటే ఏటా దాదాపుగా అన్ని పత్రికల్లో మూడువేల పై చిలుకు కథలు వస్తున్నాయి కదా, వాటిలో కొన్ని మంచి కథలు ఏరి ఒక పుస్తకంగా వేస్తే బావుంటదన్నది ఆయన సూచన. ఇది అందిపుచ్చుకోవడానికి మరో ఇరవయ్యేళ్ళ జాప్యం జరిగినా, వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకరూ గత ఇరవయ్యేళ్ళగా నిరాటంకంగా ఈ పని చేస్తున్నారు. ఇది మెచ్చుకో తగ్గ విషయం. ఏటా వచ్చిన కథల్ని కాచి వడబోసి “కథా సాహితి” పేర ఒక సంకలనం తీసుకొస్తున్నారు. ఈ వడబోత కార్యక్రమంపై అనేక విమర్శలు వచ్చినా, నిరాటంకంగా ఎంతో చిత్తశుద్ధితో ఈ పనిజేయడం ముదావహం. నండూరి వారు ఇంకో సలహా కూడా చెప్పారు. సరియైన అభిరుచి గల సంపాదకులని నియమించి, అంతర్జాతీయ ప్రమాణాలతో కథల నిర్ణయం జరిపిస్తే, కథా సాహిత్యం ఏటా సాధించిన విజయాలు ముందుతరాలకి రెండు అట్టల మధ్య శాశ్వతంగా ఒక విలువైన జ్ఞాపిక అవుతుందని చెప్పారు. ఈ కథాసాహితి ప్రచురణగా “కథ – సంవత్సరం” పేరున ఒక పుస్తకం కథాప్రియులని అలరిస్తోంది. ఈ పరంపరలో కథ-2010 ఈ మధ్యనే విడుదలయ్యింది. అందులో వివిధ అంశాలపై మొత్తం పదమూడు కథలున్నాయి. కథాభిమానిగా ఆ కథల గురించి ఒక పరిశీలనే ఇది. కేవలం కథలమీదే ఈ పరిశీలనా, సమీక్షా తప్ప ఆయా రచయితలమీదా, ప్రచురణకర్తల మీదా కాదని ముందే మనవి చేసుకుంటున్నాను. ఇది కేవలం వస్తు విమర్శే; వ్యక్తి విమర్శ కాదని గమనించండి. ఈ పుస్తకంలో కథలు ప్రచురించబడ్డ రచయితలందరూ గతంలో ఎన్నో మంచి కథలు రాసారు;రాస్తున్నారు;రాయబోతారు కూడా. కానీ ఈ వ్యాస లక్ష్యం కేవలం కథా పరామర్శే తప్ప మరొకటి కాదన్నది దయచేసి గమనించ ప్రార్థన.

ఈ కథా సాహితి ప్రచురణల్లో ఇంతవరకూ వచ్చిన పుస్తకాలలో చాలావరకూ మంచి కథలున్నా, వాటి ఎన్నికపైన చాలా విమర్శలొచ్చాయి. కథల మీద విమర్శకంటే ఎంపిక మీదే విమర్శలొచ్చాయి. ఈ ఎంపిక విధానానికి ప్రమాణాలు ఏవిటి? ఏ ఏ అంశాలు పరిగణనలోకి తీసుకొని కథల్ని ఎన్నుకున్నారన్న ప్రశ్నలు తలెత్తాయి. కథలకి ప్రమాణాలు ఇవీ అంటూ వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి వారు విమర్శా వ్యాసాలు రాసినా, అవి ఎంపికైన కథలకి ఎలా నప్పాయో ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. అందరూ ప్రమాణాలు అంటూ పదే పదే వల్లిస్తున్నారు తప్ప ‘మంచి కథలకి ఇవి ఉండి తీరాలి’ అని ఎక్కడా నిర్థారించడం కనిపించదు. కాబట్టి ఈ ఎంపిక వస్తు పరంగా జరుగుతోందా, లేక ఇంకేమయినా అంశాలు చూస్తున్నారా? అన్నది ఇదమిత్థంగా పదిమందిమందికీ తెలియదు. ఒకటికి వందమార్లు మంచి కథలు, ఉత్తమ కథలూ అంటూ వల్లె వేస్తున్నారు తప్ప, ఆ మంచి గురించీ ఎక్కడా ముచ్చటిస్తున్నట్లుగా లేదు. రెండు మూడు సభల్లో ఎవరైనా ఒకటి రెండు కథల గురించి ప్రస్తావించ వచ్చు గాక. కానీ ఎక్కడా వీటిపై సమగ్ర విశ్లేషణ జరగడం లేదు.

కథ అనేది మన ప్రపంచాన్ని వదిలి మరొక కొత్త ప్రపంచంలో చేసిన ఒక గాఢమైన, సంక్షిప్త సందర్శన. మనల్ని మనం వదిలేసి వేరొక రూపంలో పరకాయ ప్రవేశం చేయించే సరికొత్త వాతావరణాన్నే కథ కల్పిస్తుంది. అందులో వ్యక్తులూ, ప్రదేశాలూ, కాలమూ, పరిస్థితులూ, సంఘటనలూ – ఇవన్నీ గాఢమైన సాన్నిహిత్యాన్నీ, సంవేదననీ అందిస్తాయి. కథలో ప్రవేసించనంత సేపూ ఆ ప్రపంచానికి సాక్షిగా, ఒక అదృశ్య పాత్రగా పాఠకుణ్ణి మిగులుస్తుంది. ఆ పాత్రలతో కలిసి పాఠకుడూ పరవశిస్తాడు;ఆనందిస్తాడు;దుఃఖిస్తాడు. ఇదీ చిన్న కథ కల్పించే ఒక అనిర్వచనీయమైన అనుభూతి. కానీ పాఠకుడి అనుభూతికి ప్రథాన హేతువు కథ చెప్పే గొంతు – అందులోంచి వచ్చే భాష. కథకుడి గొంతులో ఎంతో నిజాయితీ, వాస్తవమూ కనిపిస్తే కానీ పాఠకుడు ఆ స్థితికి చేరడు.

కథకుడి నిజాయితీ, కథ చెప్పే తీరులోనూ, ఎన్నుకున్న వస్తువులోనూ అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది. పాత్ర చిత్రీకరణలోనూ, సంఘర్షణలోనూ వాస్తవాన్ని పాఠకుడే పసిగడతాడు. కాబట్టి కథకుడి ప్రభావం ముందు కథా వస్తువు మీద పడి తద్వారా పాఠకుడిమీదకు పరావర్తనం చెందుతుంది. వస్తువు ఎంత నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటే, పాఠకుడికీ దృశ్యం అంతే అందంగా కనిపిస్తుంది. కానీ వస్తువొక్కటే పాఠకుణ్ణి ఆకట్టుకోదు. దానికీ ఒక కథనం కావాలి. అదీ సహజంగా ఉండాలి. అలాగే కథ నడిపించే పాత్రలూ పొసగినట్లుండాలి. నేపథ్యం అమరాలి. చివరదీ, ముఖ్యమైనదీ – కథకుడి గొంతు, అంటే కథకి వాడే భాష సహజంగా, సున్నితంగా, క్లుప్తంగా సాగాలి.

పైన చెప్పిన వన్నీ సమపాళ్ళల్లో కుదిరితేనే కథ పాఠకుల మస్తిష్కంలో నిలుస్తుంది. పాఠకుణ్ణి వెంటాడుతుంది. కాకపోతే పాఠకులని వెంటాడే కథలనీ మంచి కథలా అన్నది నిర్ధారణగా చెప్పలేం. జిహ్వకో రుచి అన్నట్లు కొన్ని వస్తువులు కొంతమందికి నచ్చుతాయి. మరికొన్ని వేరేవారికి నచ్చుతాయి. కేవలం వస్తువే కాకుండా కథనం మెప్పించవచ్చు. మనిషి జీవితంలో మంచీ చెడులు ఎంత సాపేక్షమో, ఈ చిన్నకథల్లో ప్రమాణాలు కూడా అంతే! ఒకరికి మంచి అనిపించింది, వేరొకరికి కాకపోయే అవకాశం ఉంది. కాబట్టి మంచీ, చెడుల నిర్ణయాలకి కొన్ని ప్రమాణాలు ఎంచుకోవాలి. ఈ ప్రమాణాలు వెతికి, పరిశీలించే వాళ్ళనే విమర్శకులూ అంటూంటాం. విమర్శ అనేకంటే పరామర్శ అంటే బావుంటుందేమో? మంచీ అనబడే లేదా అనుకునే కథలో ఏ ఏ ప్రమాణాలు అనుసరించ బడ్డాయో పరామర్శించడమే విమర్శకుల ప్రథాన లక్ష్యమూ, ధ్యేయమూ కావాలి.

పాఠకుడు కథని ముందు నుండి వీక్షిస్తే, విమర్శకుడూ పైనుండి పరామర్శిస్తాడు. అందులో పాఠకుడూ ఒక పాత్రే! ప్రపంచంలో మిగతా భాషల్లో వచ్చినంత కథా విమర్శ తెలుగులో అంతగా జరగడం లేదు. కారణాలు ఏమయినా కథా పరమర్శ సవ్యంగా సాగడం లేదు. ఈ కథాసాహితి వారు కూడా మంచి కథలూ, లేదా ఈ ఏటి ఉత్తమ కథలూ అని అచ్చువేస్తున్నారే కానీ, వాటిని పరామర్శించడం లేదు. అందువల్ల మంచి కథల పేరున కథలు నిక్షిప్తమవుతున్నాయి కానీ ముందు తరాలకీ, కొత్త కథకులకీ దిశా నిర్దేశం చెయ్యలేకపోతున్నాయి. ముందు మాటలోనో, వెనుక మాటలోనో వస్తుపరంగా మంచి కథలని ముక్తాయింపుగా చెబుతున్నారే తప్ప, అంతకు మించి మాట్లాడడం లేదు. కథకులు విమర్శని తట్టుకోలేక పోవడం కూడా ఒక కారణం కావచ్చు. లేదా అనవసర సంఘర్షణలకి దారితీస్తాయన్న మీమాంస అయ్యుండచ్చు.

ఈ సారి కథ-2010 మా మాటలో – “…ఇవి మాత్రమే ఉత్తమ కథలూ అనలేం కానీ, ఇవి మా దృష్టిలో ఉత్తమ కథలు. కథల ఎంపికలో మా పద్ధతిలో మేం కొన్ని ప్రమాణాలు పాటిస్తున్నాం…” కథా సాహితి వారు ఎప్పటిలాగే చెప్పారు. కానీ ఆ పద్ధతిలూ, ప్రమాణాలూ చెబితే బావుండేది. అవి అందరికీ ఉపయోగపడేవి. ఈ సంకలనాలకీ ఒక సార్థకత కలిగించేవి. ఈసారి కథ-2010లో వచ్చిన పదమూడు కథల్లో దాదాపు సగానికి పైగా కథలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ తక్కువ స్థాయి అని ఎందుకు అంటున్నానది ముందు ముందు వివరిస్తాను. వస్తుపరంగానూ, కథన పరంగానూ, శైలి పరంగానూ, అన్నిటికన్నా ముఖ్యంగా భాష పరంగానూ తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇది చాలా నిరాశ కలిగించిన విషయం.

దాదాపుగా అన్ని కథలూ సమకాలీన సమస్యల మీద రాసినవే! పైగా సింహభాగం కథకులు వస్తువు మీదే దృష్టి కేంద్రీకరించి అందరికీ పరిచయమున్న సమస్యలనే ఆవిష్కరించారు తప్ప, ఆయా సమస్యల్లో కొత్త కోణాలు చూపడానికి ప్రయత్నించినట్లు కనబడలేదు. చాలా మంది సమస్యని చూపెట్టడమే కాకుండా వాటిపై కథకుల వ్యాఖ్యానాలు కూడా కథలో భాగం కావడంతో మొత్తం చదివాక ఒక వ్యాసం చదివిన అనుభూతి కలిగింది. ఎప్పుడైతే కథకుడు పాత్రల మధ్య ప్రవేశించాడో అక్కడే కథ సగం వీగిపోతుంది. కథలో పాత్రలు మాట్లాడాలి. వాటి తరపున కథకుడు వకాల్తా పుచ్చుకోకూడదు. ఈ చిన్న విషయం కథా ఎంపికలో పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఎన్నుకున్న వస్తువుల్లో కూడా ఎక్కడా వైవిధ్యం కనిపించలేదు. తెలంగాణా వాదం, బీటీ వంకాయ సమస్యా, ప్రసార మాధ్యమ పాత్రా, అపార్టుమెంటు కల్చరూ, గ్లోబలైజేషనూ వంటి అందరికీ పరిచయమున్న కథా వస్తువులే ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. మనిషి జీవితం కేవలం సమస్యల మయమేనా? ఇంకేవీ ఉండవా? జీవితంలో ప్రేమా, ఎదుగుదలా, సామరస్యం, సంతోషం, ఆప్యాయతా, ఉద్యోగ పరిణామాలూ, మారుతున్న సాంఘిక వాతావరణమూ, సమాచార ప్రవాహమూ, ప్రేరణా, ఇవేవీ కథలకి వస్తువులు కావా? కాకూడదా? సమాజంలో సమస్యలు చర్చించడానికి వార్తా పత్రికలున్నాయి. మేధావులున్నారు. ప్రసార మాధ్యమాలున్నాయి. అయినా మనకి తెలిసిన సమస్య చుట్టూనే కథా వస్తువు తిరగడం ఆశ్చర్యం కలిగించింది. పోనీ కథనమయినా విభిన్నంగా ఉందా అంటే అదీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే పాత కథా వస్తువుల్నే మరో సారి జాడించినట్లుగా అనిపిస్తుంది.

ముఖ్యంగా కథకులకి ఉండాల్సిన ప్రథమ లక్షణం సునిశిత పరిశీలన. కేవలం సమస్యనే కాకుండా చుట్టూ ఉన్న అన్నింటినీ పరిశీలించినప్పుడే మంచి కథని అల్లగలుగుతారు. ఈసారి ఎన్నుకున్న చాలా కథల్లో, ముఖ్యంగా చిత్రలేఖ, ట్రోజన్ హార్స్, ఇన్సైడర్, అతీతం వంటి కథల్లో పరిశీలనా లోపాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. కథల్లో పాత్రలకంటే మితిమీరిన వ్యాఖ్యానాలు కథని దెబ్బతీసాయి. కొన్ని కథల్లో అక్కర్లేని అసందర్భ ఉపమానాలు కొట్టచ్చినట్లు జొప్పించారు.

ఈ మొత్తం సంకలనంలో బాగున్నాయి అని చెప్పగలిగిన కథలు ముచ్చటగా మూడంటే మూడు; అవి వి.చంద్రశేఖర రావు హెచ్.నరశింహం ఆత్మహత్య, తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారడీ, వాడ్రేవు చినవీరభద్రుడు గారి “పాఠాంతరం”. మిగతా కథల్లో పరవా స్థాయికి చెందినవిగా – కాశీభట్ల వేణుగోపాల్ “నిశ్శబ్దస్వరం”, మహమ్మద్ ఖదీర్ బాబు “గెట్ పబ్లిష్డ్”, మథురాంతకం నరేంద్ర “చిత్రలేఖ” వస్తాయి.

ఇహ చదవడానికి ఇబ్బంది కలిగించని కథల్లో రామా చంద్రమౌళి గారి “అతీతం”, భగవంతం గారి “చిట్టచివరి సున్నా”, చింతపట్ల సుదర్శనం గారి “ఇన్సైడర్”, సతీష్ చందర్ గారి “కాక్టెయిల్” వస్తాయి. ఏ రకంగా చూసినా ఇవి కథలు అనడానికి వీల్లేని వర్గానికి చెందినవి – పసుపులేటి గీత “ట్రోజన్ హార్స్”, బెజ్జారపు రవీందర్ “కొత్త రంగులద్దుకున్న కల”, పెద్దింటి అశోక్ కుమార్ గారి “రణనినాదం అను 7 ఎపిసోడ్ల కథ”.

ఈ మొత్తం కథల్లో, బావున్నాయనుకున్న కథలతో కలిపి, ఏ కథలోనూ చెప్పుకోదగ్గ పాత్రలూ వాతావరణమూ కనిపించలేదు. కొన్ని కథల్లో వాక్యాలయితే మరీ అసంబద్ధంగా ఉన్నాయి. చదవడం ముగిసాక ఏ ఒక్క కథా పాఠకుణ్ణి వెంటాడదు. కొంతమంది కథల్లో టెక్నిక్ మీద శ్రద్ధ పెట్టారు కానీ ఇతివృత్తం పట్టించుకోలేదనిపించింది. మరికొన్ని కథల్లో వ్యాఖ్యాన సహిత ఉపన్యాసాలు చికాకు కలిగిస్తాయి. సూటిగా చెప్పిన కథ ఒక్కటీ లేదనిపించింది. ఉన్నవాటిలో కాస్త మెరుగనిపించిన “హెచ్.నరశింహం ఆత్మహత్య” కథా, “గారడీ” కథా పాఠకుల కళ్ళకీ, కాళ్ళకీ అడ్డపడకుండా సజావుగా సాగాయి.

తెలంగాణా నేపథ్యంలో జరిగిన ఆత్మహత్యలు ఇతివృత్తంగా ఎంచుకొని చెప్పబడిన ఒక ప్రేమ కథ – “హెచ్.నరశింహం ఆత్మహత్య”. సాధారణ జన జీవితంలో ఉద్యమాల ప్రభావం మీద ఎంతో సంయమనంతో చెప్పిన కథ. అన్యాపదేశంగా హైద్రాబాదుతో ముడిపడిన జీవితాల గురించి చెప్పిన కథ. కథనం చదివించేలా ఉన్నా, అక్కడక్కడ కొన్నిచోట్ల వాక్యాలమీద శ్రద్ద పెట్టలేదన్నట్లుగా అనిపిస్తుంది. ఈ వాక్యం చూడండి: “…జీతం గురించి, కొలీగ్స్ గురించి ముఖ్యంగా మగ కొలీగ్స్ గురించి, మొదటి నెల జీత వచ్చినప్పుడు, బైక్ను, ఒక మూల రోడ్డు చివరన ఆపి, నన్ను దగ్గరకు తీసుకొని, ముద్దు పెట్టుకొని, ఆ ముద్దులో తీవ్రత లేదు. గాఢమైన, సముద్రం అల ఫెడేల్మని చుట్టిముట్టినట్లుండే నరశింహం మార్కు ముద్దు కాదది…..” అని వుంది. ఇందులో మొదటి వాక్యం చివర ‘నన్ను ముద్దు పెట్టుకొన్నాడు’ తో వాక్యం ముగియాలి. ఆ తరువాత వాక్యం “ఆ ముద్దులో తీవ్రత లేదు” అని వస్తే చదవడానికి బావుండేది. అన్నీ కలిపేసి, ఒక సుదీర్ఘ వాక్యంగా చెప్పేసరికి భావ నిర్మాణం కోల్పోయిందనిపించింది. అలాగే సముద్రం అల ఒకటిగా తాకదు. అలలెప్పుడూ గుంపుగానే ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కథకులు పట్టించుకోలేదనిపించింది ఈ కథలో. ఇదేమంత పెద్ద లోపం కాకపోయినా కథ ఆసాంతం చదివిస్తుంది. చిన్నగా బాధ కలిగిస్తుంది.

కడుపుకోసం గారడీ చేసే బ్రతికే వాణ్ణి గారడీ చేసే మనుష్యుల కథ గారడీ. పాత తరం కథకుల తీరులో రాసిన కథ. ఇందులో చెప్పుకోతగ్గ విషయమేమీ లేకపోయినా కథనం బావుంది. వాక్యాలతోనూ, భాషతోనూ ఎక్కడా పేచీ లేదు ఇందులో.

ఈ మధ్య కాలేజీ అమ్మాయిలపై జరుగుతున్న యాసిడ్ దాడుల మీద రాసిన కథ “పాఠాంతరం”. కథమొదట్లో
షేక్స్పియర్ “హేమ్లెట్” నాటకం మీద చర్చతో మొదలవుతుంది. దానిమీద ప్రథాన పాత్రల మధ్య రెండు మూడు పేజీల చర్చ జరుగుతుంది. ఇది క్లుప్తంగా ఉండి సూటిగా కథలోకి వెళితే మరింత బావుండేది. ఈ హేమ్లెట్ చర్చే కథని సాగతీసి కాస్త గతి తప్పించిందీ అనిపించింది. హేమ్లెట్ నాటకంలో కరప్ట్ స్టేట్ నిర్మూలించే అవకాశం హేమ్లెట్ కి వచ్చినా, అది అతను సరిగా వినియోగించుకోలేకపోయాడన్న ట్రాజిడీ పాయింటునే కథలో చివర్న ముడి వేసినా, మొదట్లో జరిగిన సాగదీపుడు చర్చ వల్ల అది సూటిగా హత్తుకోక పోవడం ఈ కథకి పెద్ద లోపం అనిపించింది.

ఇహ పరవాలేదనుపించుకున్న వాటిల్లో చిత్రలేఖ కథొకటి. అపార్టుమెంటు కల్చరుమీదా, అక్కడ జరిగే సంఘటనలపై ప్రసార మాధ్యమాల స్పందన తీరు మీద రాసిన కథ. ఈ కథలో వైవిధ్యం ఏవిటంటే ఏ పాత్రకీ పేర్లుండవు. జుబ్బా రచయితా, ఇంటి గలాయన, విలేకరీ, అగంతకురాలూ ఇలా పాత్రలుంటాయి. కథ మొత్తమూ చిత్రలేఖ అన్న పేరుగల వ్యక్తి చుట్టూ తిరుగుతుంది తప్ప ఆమె కథలో పాత్ర కాదు. ఈ టెక్నిక్తో గతంలో చాలా కథలొచ్చాయి. సినిమాల్లో కూడా చూసాం. టైలరు అప్పారావు, సిలోన్ సుబ్బారావు వంటి పాత్రలు ( ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, కనక మహలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ) అందరికీ చిర పరిచయమే!
ఇది కాకుండా ఇంకోక ప్రత్యేకత వుంది. అది ఏవిటంటే ఈ కథలో లిఫ్టు కూడా ఒక పాత్రగా మలచడానికి కథకుడు ప్రయత్నించారు. కానీ అది చాలా కృతకంగా అనిపించింది. అసలు కథ మొదలవ్వడమే – “దయచేసి తలుపులు మూయండి…ప్లీజ్ క్లోజ్ ది డోర్స్..థాంక్యూ…” నాలుగో అంతస్థులో తన నోరు తెరవగానే లిఫ్టు మాట్లాడడం మొదలు పెట్టేసింది – వాక్యంతో మొదలవుతుంది. లిఫ్టులోంచి ఎవరొచ్చినా ఇదే వాక్యం లిఫ్టు చెబుతుంది. చూడ్డానికి కొత్తగా ఉన్నా, ఈ ప్రయోగం వల్ల కథకి చేకూరిన లాభం ఏవీ లేదు. కథలో లిఫ్టు కూడా ఒక పాత్రగా భావించండి అన్నట్లు ఒకటికి పదిసార్లు పాఠకుల్ని ఒప్పించడానికన్నట్లుగా వుంది. సాధారణంగా ( నూటికి ఎనభై శాతం ) అపార్టుమెంట్లల్లో రెండేసి డోర్లున్న లిఫ్టులు వుండవు, మరీ పెద్దవి అయితే తప్ప; ముఖ్యంగా చిన్న పట్టణాల్లో. కథ చెప్పిన సందర్భాన్ని బట్టి అది చిన్న అపార్టుమెంటేనని భావిస్తే, లిఫ్టుకి ఒక తలుపే ఉంటుంది. దాన్ని బట్టి – “దయచేసి తలుపు మూయండి…ప్లీజ్ క్లోజ్ ది డోర్!..” అని రాయాల్సుంటుంది. కథకులు కథ చెప్పే తాపత్రయంలో చిన్న చిన్న విషయాలు గాలికి వదిలేయడం ఉత్తమ లక్షణం కాదు. కథకులకి పరిశీలన కావాలి. పరిసరాలని అత్యంత సహజంగా చెప్పగలగాలి.
అలాగే ఈ కథలో అక్కర్లేని ఉపమానాలు చాలా వున్నాయి. వీటి వలన కథకి చేకూరిన ప్రయోజనం శూన్యం. ఉదాహరణకి – “… తూర్పు వైపునుంచి నాలుగు ఫ్లాట్లూ, పడమటి వైపునుండి నాలుగు ఫ్లాట్లూ అదుపులేని కొవ్వులా ముందుకు పెరగడంతో, మధ్యలో మిగిలిన పాసేజ్ అని పిలబడే నడవా రక్త నాళంలా సన్నబడిపోతోంది…”. ఇలాంటివి కథనిండా చాలా ఉన్నాయి. మొదటి సారి చదివితే, కథలో ఏం చెప్పదలిచారో?, ఏం చెబుతున్నారో? అర్థం కాదు. కథలో – “…లోపల ఈడియట్ బాక్స్ నా కొంగు పట్టుకు లాగుతోంది” అంటూ పక్కింటావిడ తల తలుపుల్ని లాక్కోబోయింది, – వంటి వాక్యాలు ఎంతో కృత్రిమమగా అనిపించాయి. పాత్రలు మామూలు భాషే మాట్లాడు కుంటున్నప్పుడు కథ మధ్యలో ఇలాంటి ప్రయోగాలు ఓ పట్టాన మింగుడుపడవు. సరికదా, చెప్పదలుచుకున్న విషయాన్ని పలచన చేస్తాయి. అందువల్ల కథకి కావాల్సిన గాఢత లోపించింది. ఈ తరహా వాక్యాలు కథలో ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించారు. వైవిధ్యంగా చెప్పడమే ఉత్తమ కథ ప్రధాన లక్షణం అనుకుంటే, ఈ కథ ఆ కోవకి చెందుతుందని సరిపెట్టుకోవాలి.

నిశ్శబ్దస్వరం కథలో ఖాదర్ అనే ఒక వేణువాద సంగీతకారుడి యొక్క జీవిత సారాన్ని అతని ప్రత్యేకమైన స్వాభావికమైన గుణాలతో చెప్పిన తీరు బావుంది. కళాకారుడికి మతం ఉండదు. కళని ఆస్వాదించడానికి పెద్ద మనసుంటే చాలు. అది మతాలకతీతంగా గొప్ప వ్యక్తుల్ని తయారు చేస్తుందన్న భావన కలుగుతుంది, ఈ కథ చదివితే.
కాకపోతే ఈ కథలో చాలా భావాలు పునరావృతమయ్యాయి. “వేణూ సుషిరాల్లోంచి…” అన్న పదప్రయోగం పదే పదే వచ్చింది. కథా వస్తువు పక్కన బెడితే, ఈ కథలో అసంపూర్ణ వాక్యాలు చాలా ఇబ్బంది కలిగించాయి. “…పిచ్చిదాన్ని భరించలేక తానే తుంగభద్రలో తోసేసి చంపేసి పీడ వదుల్చుకున్నాడనే కొందరి అపవాదును…ముళ్ళ కిరీటంలా ధరించిన ఖాదర్ ఏసయ్య…” వంటి రీతిలో కథ సాగుతుంది. ఈ కథలో నిరాశ కలిగించిన విషయం కూడా ఇదే.

వాక్యాలు రాసేటప్పుడు ప్రతీ భాషకీ కొన్ని గుర్తులూ, విరామ చిహ్నాలూ ఉంటాయి. అవి సరైన పద్ధతిలో వాడితేనే వాక్యానికి తగిన అర్థం వస్తుంది. చాలామంది కథకులు “…” అనే గుర్తుని తప్పుగా వాడుతున్నారు. “…” అనే గుర్తు ఒక పాత్ర పలికే సంభాషణలో జాప్యాన్ని చూపించడానికి వాడతారు. అంటే మనం మాట్లాడుతున్నట్లుగా అనిపించడానికీ, లేదా అసంపూర్ణ సంభాషణ చెప్పడానికే వాడాలి. మిగతా చోట్ల ఎక్కడా వాడకూడదు. కానీ ఈ కథా సంకలనంలో సగానికి పైగా కథల్లో వాక్యాలన్నీ “…” గుర్తుతోనే ముగుస్తాయి.

కథలు రాసే వాళ్ళు కథా ప్రక్రియకే కాదు, భాషకీ గౌరవం చూపించాలి. దానిమీద పట్టు సాధించాలి. కథా దర్పణానికి భాషే కళాయి పూత. అదే ఒక దృశ్యాన్ని చూపడానికి దోహదపడుతుంది. ఉత్తమ కథకులెప్పుడూ అది విస్మరించరు. ఇప్పటికీ చాసో, శ్రీపాద, రావిశాస్త్రి, కుటుంబరావూ, చలం వంటి వారి కథా రచనలని ఎంతో హాయిగా ఆస్వాదించడానికి ( వస్తువొక్కటే కాకుండా ) ఇదే ప్రధాన కారణం అని నేను భావిస్తాను.

ముంబై తాజ్ హొటలుపై జరిగిన మారణకాండ నేపథ్యంలో ముస్లిములు ఎలా సమిధలుగా మారుతున్నారో చెప్పిన కథ “గెట్ పబ్లిషెడ్”. సగం మామూలు కథాశైలి లోనూ, మిగతా సగం సినిమా స్క్రీన్ప్లే లాగ సాగుతుందీ కథ. చాలా చాలా పెద్ద కథ. అందరికీ పరిచయమయిన వస్తువే కాబట్టి సులభంగా అర్థమవుతుంది. మత మారణహోమాల మీద జర్నలిస్టుల కోణంలో కథ చెప్పమంటే ఎలావుటుందో అలాగ వుంటుందీ కథ. కానీ నిడివి పెరగడం వలన విసుగు పుట్టే అవకాశముంది.

ఇహ కథలో ఏం చెప్పదలుచుకున్నారో తెలియని అయోమయస్థితికి పాఠకుణ్ణి లాక్కెళ్ళెన కథలు రెండున్నాయి. అవి – ఇన్సైడర్, మరోకటి కాక్టెయిలు. ఈ కథలు చదవించడంలో ఇబ్బంది కలిగించకపోయినా, ఏం చెబుతున్నారో అర్థం కాదు. నిజానికి ఈ రెండు కథలూ అసహజ నేపధ్యంలో, కృత్రిమంగా ఉన్నాయి.

ఇన్సైడర్ కథ ఎందుకు రాసారో అర్థం కాలేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఒక సెల్ఫోను ఆన్ చేసి అడిగితే ఏదైనా ఇస్తుంది. కానీ ఎర్రటి అంకెలు మూడు రాత్రుళ్ళు కనపడితే, ప్రాణాలకే ప్రమాదముంది. ఆ అంకెలు రాకుండా వెలిగినప్పుడే ఏదైనా కోరుకోవాలని చెబుతారు. ఈ సెల్ఫోనో కథానాయక పాత్రధారి గోవాలో కొనుక్కుంటాడు. చివరకి అదే తనకి ముప్పుగా మారితే దాన్ని హుసేన్ సాగర్లో పడేస్తాడు. సాఫ్టువేరు ఉద్యోగుల నేపధ్యంగా రాసిన కధిది. స్థూలంగా ఇదీ వస్తువు. కానీ కథ చివర్లో – “అదృష్టాన్నే నమ్ముకున్నవాళ్ళకోసం, జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశపడేవాళ్ళఅకోసం, ఏ స్ట్రగులూ లేకుండా ఎగ్జిస్టు అవాలనేవాళ్ళకోసం, గుర్రాల్లాంటి కోరికలున్నవాళ్ళ కోసం…” – మీకింకా అర్థం కాకపోతే ఇదీ ఈ కథ ప్రధాన సందేశం అంటూ కథకుడే చెప్పేస్తారు. సాఫ్టువేరు ఉద్యోగలంటే చాలా చులకన అభిప్రాయం వ్యక్త పరిచిన కథది. శ్రమ ఎవరిదైనా శ్రమే! శరీర కష్టం చేసేవాడిదే శ్రమా, విజ్ఞాన శాస్త్ర వేత్తల పరిశోధన శ్రమ కాదన్నట్లుగా వాదన ఉండకూడదు. సాంకేతిక ప్రగతి వల్లే కదా అందరికీ సెల్ఫోనులు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ పనిచేసేది సాఫ్ట్వేరు వల్లే! ఏ సాధనాన్నయినా దుర్వినియోగం చెయ్యడం కనిపిస్తే అది తయారుచేసిన వాడి దోషం కాదు. అది వాడే వారి అవగాహనాలోపం.

పైగా ఈ కథలో కొన్ని వాక్యాలు మరీ పేలవంగా ఉంటాయి. ఉదాహరణకి – “భూమి తన చుట్టూ తాను ఓ రౌండు వేసుకుంది.”, “పొద్దుట్నుంచీ పెట్రోలు తాగుబోతుల్ని మోసి అలసిపోయిన రోడ్లు నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా అక్కదో ఇక్కడో హారను మోతకి ఉలిక్కి పడుతూనె ఉన్నాయి.” వంటి వాక్యాలు కథనిండా పుష్కలంగా ఉన్నాయి. అసలీ కథ ఏ కోవకి చెందుతుందో చెప్పడం కష్టం. ఆసాంతం చదివాక కథ అని అనడానికి మాత్రం మనసొప్పదు.

ఇహ కాక్టెయిల్ కథ కూడా అసహజంగానే సాగుతుంది. “వచ్చింది చావుకి. ఈ పెళ్ళి కళేవిటి?” అని మొదలయ్యే అసహజ ప్రేమకథకి ముక్తాయింపుగా చివర్లో – “చావు దగ్గర పెళ్ళి చూపులా తప్పు కదూ?” అన్న సంభాషణతో కొనసాగిస్తూ, “అమృతం పుచ్చుకున్నవాడు చావును జయిస్తాడు. విషం తాగిన వాడు బతుకుని గెలుస్తాడు. వీళ్ళు రెండూ కలిపి తాగేసినట్లున్నారు.” అంటూ కథా తాత్పర్యాన్ని అరటి పండు వలిచి అందించే ప్రయత్నంలో ముగుస్తుంది. ఈ కథ నిడివి తక్కువవడం పాఠకులకి పెద్ద ఉపశమనం.

ఈ సంకలనంలో చాలా కథలు అనవసర సాగతీతకు గురయినవే! కథకి ప్రధాన లక్షణం క్లుప్తత. అది బాగా లోపించిందనిపిస్తుంది, ఇవి చదివితే! కథని సాగతీస్తే అది పాఠకుడి నెత్తిమీద గుదిబండగా మారుతుందన్న దానికి పెద్ద ఉదాహరణ “చిట్ట చివరి సున్నా” కథ. పాత న్యూస్ పేపరు పొట్లాంలో కనబడిన ఆత్మహత్యా పత్రం కథానాయకుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది. “జీవిత సత్యాన్ని తెలిపే ‘ఆ’ పదార్థంతో పులుసు వండుకొని చివరి సారిగా తృప్తిగా భోంచేసి వెళ్ళపోవాలి,” అన్న వాక్యం చదివి, “ఆ” పదార్థం ఏమిటో కనుక్కోవాలనుకొని అన్వేషణ మొదలెడతాడు. హైదరాబాద్లో, డిల్లీలో ఫుడ్ ఫెస్టివల్సులో ఆ పదార్థం గురించి ఆరా తీసి, అది ఏమిటో తెలుసుకోలేక, చివరకి సొంతూరు కొత్తగూడెం చేరుకున్నాక అతనికి పరిచయమున్న హొటలు సర్వరు ద్వారా తెలుస్తుంది – ఆ పదార్థం – ఆనియన్ అని. జీవితాన్ని ఉల్లిపాయతో ముడేసే తత్వదృష్టితో కథ ముగుస్తుంది. చక్కగా నాలుగైదు పేజీల్లో ముగించాల్సిన కథ, రమారమి పదిపేజీల పైన యధాశక్తి సాగతీయబడింది. చివరికి ఎప్పుడైపోతుందిరా అన్న భావన కలిగిన తరువాత ఇంకా నాలుగు పేజీలు సాగి అప్పుడు ‘శుభం’ కార్డు పడుతుంది. ఇది ఆనియన్ కథ కాదు; జీడిపాకం కథ. ఓ పట్టాన తెమలదు.

జర్నలిస్టులు కథలు రాస్తే ఎలా కథలుంటాయో ట్రోజన్ హార్సూ, గెట్ పబ్లిష్డ్ కథలు వివరిస్తే, కవిత్వం రాసే వాళ్ళు కథలు రాస్తే ఇలా ఉంటుందన్న కోవకి చెందే కథ, “అతీతం”. ఈ “అతీతం” అనబడే కథ అల్జీమర్స్ అనబడే వ్యాధి మనుషుల జీవితాలపై చూపే ప్రభావం మీద చెబుదామని ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది. కాకపోతే ఈ కథలో పాత్రలూ, సంభాషణలూ సహజంగానే వుంటాయి. కొత్త వస్తువు నెంచుకుని కథ చెప్పే తాపత్రయంలో అసలు వస్తువు యొక్క లక్షణాలను ఉపేక్షించినట్లుగా అనిపించింది. కథకులకి అల్జీమర్స్ వ్యాధి గురించిన అవగాహనాలోపం ఈ కథ చెప్పకనే చెబుతుంది. మతిమరపు లేదా గత జ్ఞాపకాలని మరిచిపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. దీని వల్ల మతిభ్రమణా, మాట కోల్పోవడం వంటి లక్షణాలు రావు. కానీ ఈ కథలో ప్రధాన పాత్రధారి రిటైర్డ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్కి, చుట్టూ ఉన్న కుళ్ళిన సమాజంలో పెరుగుతున్న అవకతవక అంశాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ మతిభ్రమణా, మాటకోల్పోవడం వంటివి వస్తాయి. దాన్నే అల్జీమర్స్ అని చెప్పడం జరిగింది. ఇది సరి కాదు. కథా వస్తువు ఎన్నుకునేటప్పుడు దానికి సంబంధించిన విషయాల పైన కూడా కథకులు శ్రద్ధ పెట్టకపోతే కథ పేలవంగా తయారవుతుంది. పైగా పుస్తకాలు చదువుతూ, మనసుని సదా ఉత్సాహంగా ఉంచే వారికి ఈ వ్యాధి సోకడం చాలా చాలా అరుదుగా జరుగుతుంది.

ఈ కథకి వస్తు అవగాహనాలోపమే పెద్ద లోపం. ఇహ ఈ కథలో మరీ ఇబ్బంది కలిగించిన విషయం ఒకటుంది. అవి అసంపూర్ణ వాక్యాలు, అసందర్భ విరామ చిహ్నాలు. తెలుగు కథకులకి “…” వంటి వ్యాకరణ గుర్తు అంటే వల్లమాలిన అభిమానంలా వుంది. కథలో దాదాపుగా ప్రతీ వాక్యమూ ఈ గుర్తుతోనే ముగుస్తుంది. ఉదాహరణకి – “అరవై ఏళ్ళ నిర్మల నీళ్ళు నిండిన కళ్ళతో…అలా…అచేతనంగా..ఆ పక్షుల వంక చూస్తూనే ఉంది” అన్న వాక్యంతో ప్రారంభమయిన కథ – “విలువలు…విలవలకోసం మనిషి జీవించడం…ఒక పరంపర…ఒక నిరంతర పయనం,…” అంటూ ముగుస్తుంది. మొత్తం కథనిండా ఈ చుక్కల ముగ్గే కనిపిస్తుంది. ఈ మూడు చుక్కల వ్యసనం ఆధునిక కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తుంది. చాలామందికి ఈ వ్యాకరణ చిహ్నాలపైన సరైన అవగాహనున్నట్లు కనిపించదు. చుక్కకీ, ప్రశ్నార్ధకానికీ, కామాకీ ఎలాంటి స్థానముందో, “:”, “;”, “….” వంటి గుర్తులక్కూడా ప్రత్యేక స్థానాలు నిర్దేశించబడ్డాయి. ఈ గుర్తులన్నీ మనం పాశ్చాత్యుల నుండే గ్రహించాము కాబట్టి, అవి నిర్దేశించబడినట్లే వాడాలి. మనకి తోచినట్లు మనం వాడడం ఒక్క తెలుగులోనే కనిపిస్తోంది. ఈ దిగువ వాక్యం చూడండి. “శివంకు జ్ఞాపకశక్తి నశించిందా…స్పృహ ఉండి…చేతన ఉండి…ధారణలేని అనుభవం ఒక చర్యాశకలమై…మెరిసి మాయమై, మళ్ళీ సూన్యమై మిగుల్తోందా…” అన్న ఈ వాక్యంలో, ప్రశ్నార్ధకంతో ముగియాల్సిన ‘నశించిందా’, ‘మిగుల్తోందా’ వంటి పదాలు చుక్కలతో సరిపెట్టుకున్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కథకి భాషే వాహకం. అది కథని సజావుగా నడిపించాలి కానీ వక్రభ్రమణం చెయ్యకూడదు. కవిత్వం రాసినట్లుగా కథ రాయాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేమీ అనిపించదు ఈ కథలో.

ప్రత్యేక తెలంగాణా నేపధ్యంలో వచ్చిన మరో రెండు కథలని కూడా పరిశీలిద్దాం. మొదటిది “కొత్త రంగులద్దుకున్న కల”. ఇది కథో, ఉపన్యాసమో, వ్యాఖ్యానమో చెప్పడం కష్టం. చదువుతున్నంతసేపూ ఓ పట్టాన అర్థం కాదు. ఈ కథలో జ్ఞానుల రూపంలో రాజకీయనాయకులూ, జనం రూపంలో తెలంగాణా ప్రజలూ ఉంటారు. ఒక పెద్దమ్మ అనబడే అమ్మలగన్నయమ్మ మెప్పుకోసం మరో జ్ఞాని రాజీనామా, చేసే సన్నివేశం ఒకటుందీ కథలో. ఈ పెద్దమ్మ సోనియాగాంధీ అనీ, ఆ జ్ఞాని కే.సి.యార్ అని మనం అనుకోవాలి. సగం నాటక ఫక్కీలోనూ, మిగతా సగం స్వగత ఉపన్యాసాలతోనూ ముగుస్తుందీ కథ. పైగా ఈ కథకి ఎన్నుకున్న నేపథ్యం నాటకం రిహార్సల్స్. అసంబద్ధపు ఉపమానాలతో చెప్పదలుచుకున్న విషయం పక్క త్రోవ పట్టింది. “…ఉన్నట్లుండి అడవులు మొలుస్తున్నాయి. మొండి గోడల వూర్లు మొలుస్తున్నాయి…” వంటి ఉపమానాలతో విప్లవ కవిత్వ ధోరణిలో సాగుతుందీ కథ. “రిహార్సల్స్ జరుగుతున్న రేకుల షెడ్డు పోత పోసిన దుఃఖంలా మారిపోయింది మళ్ళీ…” వంటి వాక్యాలు ఓ పట్టాన అర్థం కావు. అంతగా ఉపమానాలు వాడాలనుకుంటే పోత పోసిన దుఃఖ మూలం చెప్పి దాన్ని షెడ్డుకి అన్వయించాలి. కేవలం పోలిక లక్షణంతో మాత్రమే ఉపమానాలు ఉండవు. “కాలిన వెదురు వనపు విషాద ఈలలూ, కాంతిని ఖననం చేసిన చోటూ…” వంటి అర్థం పర్థంలేని పద ప్రయోగాలు ఈ కథలో చాలా వాడారు.

ఇంకా, ఈ కథలో ఒక పాత్ర ద.ర అంటూ చూపించడం కనిపిస్తుంది. ద.ర అంటే దర్శక రచయిత అని ముందే చెబుతారు. నాటక దర్శకుడు అంటే అందరికీ సులభంగానే అర్థమవుతుంది. కానీ ఈ పాత్ర ప్రస్తావనొచ్చినప్పుడల్లా ద.ర అనే ఉంటుంది. ఇలా ప్రతీ సారీ ఈ పాత్రని ప్రస్తావించడంలో కథకి ఏం ప్రయోజనమో అర్థం కాలేదు. ఇలాంటి సంక్షిప్త పద ప్రయోగాలు పాఠకుల పఠనాన్ని ఇబ్బంది పెడతాయి. సహనాన్ని పరీక్షిస్తాయి. కథా పఠనం హాయిగా సాగే ప్రయాణం కావాలి కానీ, అమేజాన్ అడవిలో చిక్కుకున్న అనుభవం పాఠకులకి కలగకూడదు. ఇది కథ కోవకి ఎలా చెందుతుందో అర్థం కాలేదు. అలాని ఉపన్యాసమూ అనలేము. నాటకంగానూ భావించలేం.

తెలంగాణా నేపథ్యంలో వచ్చిన రెండవది “రణనినాదం అను 7 ఎపిసోడ్ల కథ”. కథ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. వాడిన టెక్నిక్ బావుంది. ఇది కూడా సగం సినిమా స్క్రీన్ప్లే లాగానే ఉంటుంది. ఎన్నుకున్న వస్తువు కూడా సినిమా కథే. కోడల్ని రాచి రంపాన పెట్టి, బానిసగా, బందీ చేయబడ్డ ఒక కోడలి కథ. జీవితాంతమూ దోచుకోబడ్డ ఆ కోడలు అత్తామావల్ని ధిక్కరించీ, విడాకులొద్దని చివరికి తెరమీద నుండి ప్రజల మధ్యకొస్తుంది. స్థూలంగా ఇదీ కథ. “స్క్రీన్ మీద మాయమైన పాత్ర జనంలో తేలింది. డైరక్టరుకీ జనంకీ మధ్య ఉన్న తెర తొలగిపోయింది. ఆమెను ఆడించి ఆడుకున్న దర్శకుడూ, నిర్మాతా, పాత్రధారులూ, స్పాన్సర్లూ ఇప్పుడు జనంకు ఎదురుగా స్పష్టంగా కనిపిస్తున్నారు. కోట్ల జనం గొంతులో ఇప్పుడు రణనినాదమై ఆమె ఊరేగుతోంది. జై తెలంగాణా నినాదమై మారుమోగుతోంది.” అని కథ ముగుస్తుంది. కథ ఆసాంతమూ ఎక్కడా తెలంగాణా ప్రస్తావన రాకుండా కథ చెప్పిన కథకులు చివర్లో ఉగ్గపెట్టు కోలేకపోవడం చివర వాక్యం చెప్పకనే చెబుతుంది. అన్యాపదేశంగా తెలంగాణా గురించి భావన కలిగేలా చెబితే కథ చెడేది కాదు. ఎప్పుడైతే కథ చివర్లో కథకుడు పాత్రయ్యాడో అక్కడే ఈ కథ వీగి పోయింది. చదువుతున్నంత సేపూ సజావుగానే సాగుతుందీ కథ. ఇంకాస్త ఓపిగ్గా ఈ కథని చిత్రిక పడితే మంచి కథయ్యుండేది.

బి.టి వంకాయ సమస్య పై రాసిన మరో కథ ట్రోజన్ హార్స్ . ఇది కథా పరంగా అన్ని విధాలా నిరాశ పరిచిన కథ. జర్నలిస్టులు కథకులుగా మారితే కధలెలా రూపాంతరం చెందుతాయో చెప్పడానికీ కథే పెద్ద ఉదాహరణగా చెప్పచ్చు. పైగా ఈ బి.టి వంకాయ మీద ఇప్పటికే చాలా కథలొచ్చాయి. ఒక నవల కూడా వచ్చింది. మరి ఈ కథలో కొత్తదనం ఏవిటో చదివిన వారికి అర్థం కాదు కాక కాదు. పైగా కథమొత్తమూ పనికి రాని ఉపమానాలూ, వ్యాఖ్యానాలూ. అన్ని విధాలా అతి తక్కువ స్థాయిలో ఉన్న వ్యాస కథనం, కథ పేరుతో పిలవబడుతూ ఈ సంకలనం ఎక్కిందని మనం భావించాలి. ఈ కథనిండా తప్పుల తడకలు చాలా వున్నాయి. మేజిక్ రియలిజం నేపథ్యంలో సాగే ఈ కథలో బి.టి వంకాయ వలన వ్యవసాయదారులకి కలిగే హాని గురించి చెప్పే ప్రయత్నంగా అనిపిస్తుంది. బి.టి బాక్టీరియా లోని జన్యువుని వంకాయలో ప్రవేశ పెడితే దాన్ని పురుగుల బారినుండి రక్షించవచ్చన్న ధ్యేయంతో బి.టి వంకాయను ప్రవేశ పెట్టాలనుకున్నది గతంలో ప్రభుత్వ నిర్ణయం. దానిపై నిరశన తెలిపుతూ అనేక వ్యాసాలూ, కథలూ వచ్చాయి. అలాంటిదే మరో కథ.

ఈ బి.టి వంకాయల సాగుదల వలన పక్క పంటలకు ప్రమాదం వాటిల్లుతుందన్న ప్రచారం ఒకటుంది. ప్రచారం అని ఎందుకనాల్సొచ్చిందంటే బి.టి వంకాయ వల్ల పక్క పొలాలు నాశనం అవుతాయనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. గాలిలో చేసే సిద్ధాంతాలే తప్ప. వంగతోట ఉన్న ఒక రైతుకి ఓ ఊదారంగు గుర్రం దొరుకుతుంది. అది వంగతోటలో తిరిగినన్నాళ్ళూ ఆ పంట సస్య శ్యామలంగా ఉంటుంది. కానీ పక్కవాళ్ళ పొలాలన్నీ నాశనం అవుతుయి. ఆ తరువాత ఆ రైతుకొక కలలో వంకాయ ప్రత్యక్షమయ్యీ, అందులో ఊదారంగు గుర్రం ఒక ట్రోజన్ హార్స్ లాంటిదనీ, దానిలో బి. టి. ఉన్నాయనీ హెచ్చరిస్తుంది. ఆ తరువాత ఆ ట్రోజన్ హార్స్ ఆ రైతుని వెంబడిస్తే చివరకి అతన్ని “ముసనోబు ఫుకువొకా’ రక్షిస్తాడు. ఇక్కడ ఫుకువొకా అన్నది సహజరీతిలో వ్యవసాయం చేయబడిన జపాన్ దేశంలో ఒక ప్రాంతం. అక్కడుండే మరో రైతు మన రైతుని రక్షిస్తాడు. ఇదీ కథ.

మేజిక్ రియలిజానికి జర్నలిజం జోడిస్తే కథలెలా ఉంటాయో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. కథలో వాడిన కొన్ని వాక్య ప్రయాగాలు చూద్దాం. “…అమెరికన్ తాబేదార్లకి అనుకూలంగానూ, వ్యతిరేకులకి విఫల ప్రయత్నంగానూ కనిపించిన కోపెన్ హేగన్ సదస్సులా ఆ వేళకి మా ఇద్దరి చర్చా అటూఇటూ కాకుండా సాగింది…”, “‘… ఈ ప్రపంచంలో కలలన్నీ మారక ద్రవ్యాలే, వాటికీ ఒక వెల ఉంది…’ అంటూ “బ్రెండేన్ పెర్రీ, లీసా గెరార్డులతో కలిసి సూర్యుడు డెడ్ కెన్ డాన్సుతో సూర్యుడు గొంతు కలిపి ఉద్యమ సంధ్యల్ని అలాపిస్తూ హఠాత్తుగా ఓ రోజు పడమట ఉదయించాడు…” వంటి జర్నలిస్టిక్ వ్యాఖ్యానాలు చాలా వున్నాయి. కొన్ని వాక్యాలకి అర్థం పర్థం లేదు. ఇలాంటివి మచ్చుక్కి మరి కొన్ని. – “…అమ్మలోంచి ఎడ్వర్డ్ మంచ్ ‘స్క్రీమ్’ ప్రతిధ్వనిస్తోంది…”, “…నా రెప్పల కివతల యెహుదా అమిచా కలవరిస్తూ ఉండగానే రెప్పలకవతల హఠాత్తుగా అది మెత్తటి మాంసపు నీలి భీతిలా కదిలింది…”, “దాని మాటల్లో, చూపుల్లో కారిఫోర్నియన్ జిన్ ఫ్రాండెల్ రెడ్ వైన్ నా మీద వెన్నెల వానై కురిసింది…”. రెడ్ వైన్ వెన్నెల వానై కురవడమేమిటో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాదు.

కథకు పెట్టిన పేరు “ట్రోజన్ హార్స్” అంటేనే కథకులకి అవగాహన లేదు. ట్రోజన్ హార్సులో ట్రోజన్స్ ఉండరు. అందులో గ్రీకు సైనికులు దాగుంటారు. కానీ కథలో “ఊదారంగు గుర్రం నుంచి వచ్చిన ట్రోజన్సే” అంటూ రాసి పడేశారు. ట్రోజన్ హార్స్ సరే, మన దేశానికి చెందిన ప్రాణులమీద కూడా కథకులకి అవగాహన తక్కువలా వుంది. కథలో ఒక చోట మండ్ర కప్పలు అని రాసారు. మండ్ర కప్పలు కాదు, మండ్రగబ్బలు అనుండాలి. చివరికి ఇది డి.టి.పి వారి చేతి చలువ అని సరిపెట్టుకోవాలి. అంతే!

ఈ కథకి కొసమెరుపేవిటంటే చివరలో పద సూచిక ( ఫుట్ నోట్స్ ) కూడా జత చేసారు. అందులో రోనాల్డ్ ఎమిరీక్ అంటే ఎవరో, యెహుదా అమిచా అంటే ఎవరో, కిజో మురకమీ అంటే ఏ దేశస్థుడో, నెవర్లాండ్ అంటే ఏవిటో ఇలా చాలా విషయ సూచికలిచ్చారు. ముక్తాయింపుగా “బి.టి వంకాయకు నిరసనగా…” అంటూ కథ ప్రధాన ఉద్దేశ్యం కూడా విడమర్చి మరీ చెప్పారు. కథని కథగా చెప్పడం కాకుండా తమకు తెలుసున్న ప్రతీ విషయాన్ని కథలో చొప్పొంచాలన్న తహతహ నేటి కథకుల్లో తొంగి చూడడం ఎక్కువగా ఉంది. తమ విజ్ఞాన సర్వస్వాన్ని పాఠకులకి అందజేసాయలన్న తపన పాఠకుల మీదున్న గౌరవ స్థాయిని తెలుపుతుంది. చదివే వాళ్ళు రాసే వాళ్ళకంటే ఒక మెట్టు క్రిందనే ఉంటారన్న భ్రమ కథకులకుంటే అది ఎవరికీ మేలు చెయ్యదు. దీనికి పెద్ద ఉదాహరణ ఈ కథే!

చివరగా –
ఇంతకు ముందొచ్చిన వాటికంటే ఈసారి కథా సంకలనంలో కథలు ఏమాత్రమూ ప్రోత్సాహకరంగా లేవు. ఉన్నత ప్రమాణ స్థాయికి చెందిన కథగా ఒకటీ అనుకోలేం. కథకి వస్తువొక్కటే ప్రమాణం కాదు. అలా భావించే అందరూ మన చుట్టూ ఉన్న సమస్యలమీద లేదా రగులుతున్న రాజకీయాలమీద కథలు రాస్తున్నారు. అనేక పార్శ్వాలున్న జీవితం చాలా పెద్దది. అవన్నీ కథలో చూపగలిగినప్పుడే కథ నిలబడుతుంది.

ఈ కథల్లో కొట్టచ్చినట్లు కనిపించేది మితి మీరిన ఇంగ్లీషు పదాల వాడుక. దాదాపు అన్ని కథల్లోనూ ఈ ధోరణి కనిపించింది. ఆఖరికి ఉపమానాలకి కూడా ఇంగ్లీష్ భాషనే ఆశ్రయించడం విచారకరం. ఉన్న పదమూడు కథల్లో నాలుగుకి పైగా ఇంగ్లీష్ శీర్షికలు. కథకి కనీసం తెలుగు పేరు కూడా పెట్టలేరా? అనిపించింది. “ఇంగ్లీషు వ్యామోహంలో పడి తెలుగువారు తెలుగు భాషని పట్టించుకోవడంలేదు; భాష చచ్చిపోతోంది” వంటి ఉపన్యాసాలూ, నినాదాలూ వింటూంటాం. రచయితలే తెలుగుని వాడకపోతే వేరే వాళ్ళని అనుకొని ప్రయోజనం లేదు. కొన్ని పదాలకి తెలుగు పదాలు లేవు. అలాంటి వాటికి ఎవరూ అభ్యంతరం పెట్టరు. ఉదయం అని రాయడానికి బదులు మార్నింగ్ అనీ రాస్తున్నారు. కానీ రాసేది తెలుగు కథ. కాబట్టి కాస్తయినా తెలుగు భాష మీద మమకారం చూపిస్తే బావుంటుంది.

నేను గమనించిన విషయాలూ; కొన్ని సూచనలూ:

• కథా వస్తు విస్తీర్ణత పెరగాలి.

• కథల్లో అనవసర వ్యాఖ్యానాలు తగ్గి తీరాలి. చిన్న కథకి క్లుప్తతే ఊపిరి.

• కథకులు భాషా, వ్యాకరణం విషయంలో మరింత శ్రద్ధ చూపాలి.

• ఎన్నుకున్న అంశాలపై కథకులు మరింత పరిశీలనా, పరిశోధనా చెయ్యాలి.

• కథలు ప్రచురించే సంపాదకులు కథల కుదింపు విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి.
నిక్కచ్చిగా, నిష్కర్షగా మొహమాటం లేకుండా ఎంత పేరున్న రచయితల కథలనయినా సవరించడానికి పూనుకోవాలి.

• కథా విమర్శకి మరింత స్థానం కల్పించాలి. కథలపై నిష్పక్షపాత సమీక్షలు రావాలి. అప్పుడే తెలుగు కథ బతికి బట్ట కడుతుంది. లేదంటే కథ వేరే భాషల్ని వెతుక్కుంటుంది.

క్రమం తప్పకుండా పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్ ఏటా ఈ కథా సంకలనాలని తెస్తున్నారు. ఉత్తమ కథలు అని చెబుతున్నారే తప్ప అవెందుకు ఆ స్థాయిలో ఉన్నాయో చెప్పల్సిన అవసరం కూడా ఉంది. ముందుతరాలకి ఉపయోగపడుతుంది. కొత్త రచయితలు తమ రచనల ప్రమాణాలు పెంచుకోవడానికి దోహద పడతాయి. ఒక పాఠకుడిగా ఈ సంకలనంలో కథల్లో ఇన్ని దోషాలు నాకే కనిపించాయంటే, కథా పరిశీలకులుగా, సంకలనకర్తలుగా, అనుభవజ్ఞులుగా వీరికెన్ని తడతాయో ఊహించగలను. కనీసం తప్పులెంచనవసరం లేకపోయినా ఏ కథలో కథా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయో చెప్పాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవడం భావ్యం కాదనిపిస్తోంది.

ఈ ప్రక్రియలో కొంతమంది నొచ్చుకునే అవకాశముంది. అది పక్కన బెడితే దీని వల్ల మేలు పొందేది మాత్రం భావి తరాల వారే! ఇప్పటికే తెలుగు కథకుల సంఖ్య తగ్గిపోతోంది. రాశి పెరిగినా వాసి ఉండడం లేదు. ఈ కథా సంకలనాలు చదివి కొత్త రచయితలు పుట్టాలి. ఉత్తేజ భరితులై కథలు రాయగలగాలి. ఆ దిశగా ఆలోచిస్తే కథాసాహిత్యానికి మరింత మేలు జేసినా వారవుతారు. కథా ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది మాత్రం అక్షర సత్యం.

-సాయి బ్రహ్మానందం గొర్తి

3 వ్యాఖ్యలు

కోనసీమ ప్రభల తీర్థం – మా కుటుంబం – అనుబంధం

జాజర

దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది.
కొబ్బరాకుల నడుమనున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చే వన్నె వేరు.
సంక్రాంతికి మాత్రం కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది.
ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచు జిల్లై కురుస్తుంది. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి.

సంక్రాంతి వేడుకల్లో కోనసీమకొక ప్రత్యేకత ఉంది. అది – భోగి, పెద్ద పండుగల తర్వాత కనుమనాడు జరిగే జగ్గన తోట ప్రభల తీర్థం. అదొక ప్రత్యేకమైన వేడుక. విశేషమైన పండగ సంబరం.
కోనసీమ వాసులకి జగ్గన్న తోట ప్రభల తీర్థం పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధం. అందిరికీ పరిచయమున్న ఈ ప్రభల తీర్థానికీ మా కుటుంబానికీ తరతరాలుగా పెనవేసుకున్న ఒక అమూల్యమైన అనుబంధం ముడిపడుంది. అది పదిమందితో పంచుకోవాలన్నదే నా వుద్దేశ్యం.

కోనసీమ చుట్టుపక్కనున్న సుమారు 90 గ్రామాల నుండీ ప్రజలు ఈ ప్రభలతీర్థంలో పాలుపంచుకుంటారు. అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఉన్న ఏడెకరాల కొబ్బరితోటలో ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. ఇక్కడ ఏ గుడీ ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలూ కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరితోట. రైతులు నమ్మే భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం.

శివుని వాహనంగా భావించబడే వీరభద్రునిగా కోనసీమ వాసులు ఈ ప్రభలని భావిస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పరమేశ్వర రూపాలని ఈ ప్రభలని అలంకరించి మేళ తాళాలతో “అహోం- ఓహోం” అని తలస్తూ, తమ భుజ స్కంధాలపై మోస్తూ ఊరేగింపుగా ఈ జగ్గన్న తోటకి తీసుకొస్తారు. ఈ ప్రభలని వెదురు కర్రలతో చేసి, రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరించీ, వేదమంత్రాల మధ్యా గంటలు మ్రోగిస్తూ మోసుకు వస్తారు. కుల మతాలకతీతంగా ఈ ప్రభలని మోయడం పరమేశ్వర సేవగా భక్తులు తలుస్తారు.

జాజర

సుమారు నాలుగొందల ఏళ్ళపైగా ఈ జగ్గన్నతోట తీర్థం జరుగుతోందని అంటారు. నాలుగొందల ఏళ్ళగా జరుగుతోందన్నది చెప్పలేంగానీ సుమారు వందేళ్ళగా ఖచ్చితంగా జరుగుతోందని చెప్పగలను. దానికి మా కుటుంబమే ఒక పెద్ద ఆధారం. ఈ ప్రభల తీర్థం గురించి చదివాకా ఎందుకోనన్నది అందరికీ అర్థమవుతుంది. ఈ ప్రభల తీర్థానికొక పురాణ గాధ కూడా వుంది. మొసలపల్లి గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు తరలివస్తాయనీ, లోక కళ్యాణార్థమై వారందరూ ఇక్కడ కలుస్తారని ప్రజల విశ్వాసం. దీన్ని ఏకాదశ రుద్రసమావేశంగా ప్రజలు భావిస్తారు.

ఈ ప్రభల తీర్థానికి జగ్గన్నతోట ప్రభల తీర్థమన్న పేరురావడానికీ వేరొక కథ చెబుతారు. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఒక ఏక సంధాగ్రాహి ఉండేవాడట. ఆ గ్రామాన్నానుకుని ప్రవహించే కౌశికలో స్నానం చేసీ, పూజాపునస్కారాలు ముగించుకొని అక్కడే ఉన్న మర్రి చెట్టుకింద భోజనం చెసేవాడట. అలా చేస్తూ ఈ చెట్టునానుకున్న అమ్మ వారిని మైల పరుస్తున్నాడని భావించీ కొంతమంది స్థానికులు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఈయన్ని అడ్డుకున్నారట. ఈ సందర్భంలో జగ్గన్న నిజాం నవాబుని కలిస్తే, జగ్గన్న పాండిత్యాన్ని చూసి మెచ్చుకొని ఆ మర్రిచెట్టుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చారట. తనపై ప్రజలు ఫిర్యాదు చేయబట్టే తనకీ భూమి లభించింది కాబట్టి వారికోసమే ఈ ప్రభల తీర్థం జరిపాడనీ అంటారు. దేవుడికీ గుళ్ళూ గోపురాలూ అవసరం లేదనీ, మైలా మాపూ దేవుడికుండవనీ పదిమందికీ చెప్పడంకోసం ఈ ప్రభలపై దేవుణ్ణి ఎవరైనా మోసుకు రావచ్చని చెప్పే నిమిత్తమై ఈ తీర్థం మొదలయ్యిందనీ అంటారు.

జాజర

ఈ ప్రభలు ప్రజలు నడిచే దారంట రావు. రాళ్ళూ, రప్పలూ తోసుకుంటూ, గోతులనూ, కుప్పలనూ దాటుకుంటూ పొలాల మధ్యగా ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.
చుట్టు పక్కలగ్రామాలనుండీ ప్రభలు మోసుకు రావడమొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ తీర్థానికి మరొక వేశేషం కూడా వుంది. అదేమిటంటే పాలగుమ్మి పక్కనే ఉన్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలు పీకల లోతు కౌశిక దాటుకుంటూ, పొలాల మధ్యనుండి వస్తాయి. ఈ ప్రభలు కౌశిక దాటడం చూడ్డం కోసం వేలాది మంది తరలి వస్తారు. ఒక్కసారి ఎత్తేకా ఈ ప్రభలు క్రిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలని తాకించకూడదు. కౌశిక దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవ కూడదు. నీళ్ళ చుక్క కూడా ప్రభ మీదా, పైనున్న దేవుడి మీదా పడకూడదు. ఇవి మోయడానికి పాతిక మంది వ్యక్తులు సరిపడ్డా, కౌశిక దాటించడానికి మాత్రం నలభైమంది పైగా ఉంటారు. ఎంతో ఏకాగ్రతతో ఏ మాత్రం కంగారు లేకుండా జాగ్రత్తగా కౌశిక దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి చేరుస్తారు. తీర్థమయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలు ఎంతో బరువున్నా కౌశిక దాటించేటప్పుడు అవలీలగా దాటించడం మాత్రం దైవానుగ్రమే అంటారు అది మోసే వాళ్ళు. ఈ కౌశిక దాటించడం మాత్రం చూసి తీరాల్సిన ఘట్టం. గంగలకుర్రూ, అగ్రహారం ప్రభపై చెన్నమల్లేశ్వర స్వామీ, వీరేశ్వర స్వామీ విగ్రహాలని అలంకరిస్తారు.
జాజర

ఇహ మాకుటుంబానికి సంబంధించిన ఒక గాధ:

మా పూర్వీకుల స్వగ్రామం గంగలకుర్రు అగ్రహారం. మా పితామహుల ( తాత గారి) పేరు గొర్తి పళ్ళయ్య పంతులు. ఈయన సుమారు వందేళ్ళు బ్రతికారు. ఈయన 1956లో పోయారు. ఈయన బడిపంతులు. మొదట్లో అంబాజీ పేటలో బ్రిటీషు వాళ్ళు కట్టించిన ఒక హైస్త్కూలు ఒక్కటే ఈ చుట్టు పక్కల గ్రామాలకున్న విద్యా సౌకర్యం. అప్పట్లో రోడ్లూ, రహదారులూ సరిగా లేక వర్షాకాలంలో విద్యార్థులు స్కూలుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడే వారట. ప్రభుత్వానికి చెబితే ఫలితం లేకపోతే మా తాత గారు అంబాజీపేట స్కూల్లో ఉద్యోగం వదిలేసి ఆయనింట్లోనే ఒక స్కూలు మొదలుపెట్టారు. ఆ స్కూలికి ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఉచిత పాఠశాల. ఉపాధ్యాయునిగా మా తాతగారికున్న పేరు చూసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పిల్లలు ఈయన దగ్గరకే వచ్చి చదువుకునేవారట. రెండేళ్ళు గడిచాక ఈ విషయం బ్రిటీషు వారికి తెలిసి మా తాతగార్ని స్కూలు మూసేయమని ఆర్డరిస్తే, చుట్టుపక్కలెక్కడైనా ఒక స్కూలు కట్టిస్తే తన స్కూలు మూసేస్తానని మా తాతగారు చెబితే వాళ్ళు ఒప్పుకొనీ ఆ స్కూలికి మా తాతగారినే హెడ్ మాస్టారుగా నియమించారు. ఆయన చలవ వల్లే పాలగుమ్మి హైస్కూలు వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఆ స్కూలు శతసంవత్సర వేడుకలు కూడా జరిపారు. ఇదంతా 1905 ప్రాంతంలో జరిగింది. మా నాన్నగారూ కూడా అప్పటికి పుట్ట లేదు.

అప్పట్లో పిల్లలకి పుస్తకాలు కొనుక్కోవడమూ కష్టంగా ఉండేది. అలాగే వాళ్ళకి చెప్పడానికీ ఏ మాత్రం పరికరాలూ ఉండేవి కావు. మా తాతగారు బొమ్మలు బాగా వేసే వారట. ఆయనే స్వయంగా బొమ్మలేసి దేశ చిత్రపటాలూ, సైన్సుకి సంబంధించిన పటాలూ గీసి చెప్పేవారట. ఆయన లెక్కల్లో మేధావి. ఆయన దగ్గర చదువుకున్న ప్రతీ కుర్రాడికీ లెక్కలు మాత్రం బాగా వచ్చేవని మా నాన్న చెప్పేవారు. అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కాలేజీకి జి.పి.రామేశంగారని ఒక ప్రినిస్పాలుండేవారు. నేను కాలేజీలో చదివినప్పుడు కూడా ఆయనే ప్రిన్సిపాలు. ఆయన లెక్కల్లో మద్రాసు యూనివర్శిటీ ఫస్టట. ఆయన మా తాతగారి వద్దే చదువుకున్నారు. ఇంటర్ లో నాకు లెక్కలు కాలేజీ ఫస్టు వచ్చింది. ఆ సందర్భంగా కలిసినప్పుడు ఆయన మా తాతగారి గురించే చెబుతూ ఆయన మనవణ్ణిని తెలిసీ చాలా సంతోషించారు. ఇది మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఇదిక్కడాపి ప్రభల తీర్థం విషయానికి వస్తాను.

ఈ గంగలకుర్రు అగ్రహారం ప్రభ కట్టే పని పెద్ద పండగనాడు మొదలుపెడతారు. రాత్రి తెల్లవార్లూ కూర్చుని ప్రభని కడతారు. గత వందేళ్ళుగా మా తాతగారు కట్టించిన ఇంటిముందే ఈ ప్రభని కట్టడం ఒక పెద్ద ఆనవాయితీగా వస్తోంది. మా నాన్న్న 1976లో ఆ యిల్లు అమ్మేసినా ఇప్పటికీ ఆ యింటిముందే ప్రభకడతారు. ఈ ప్రభ కట్టడం మా తాతగారు బ్రతికున్నన్నాళ్ళూ ఆయన ఆధ్వర్యంలోనే జరిగేదట. ఇప్పటికీ ఆ గ్రామానికీ, చుట్టుపక్కల ఊళ్ళకీ ఆయన చేసిన సేవకి చిహ్నంగా గంగలకుర్రు అగ్రహారం ప్రభపై ఆయన చిత్రం పటం పెడతారు. అది లేకుండా ప్రభ కదలదు. ఒకసారి ఆ ఫొటో వర్షానికి తడిసి పాడయితే కొత్త ఫోటో కావాలంటూ, కుటుంబ కారణాల రీత్యా కాకినాడలో ఉన్న మా అమ్మగారి వద్దకొచ్చి ఫొటో కావాలని రాత్రికి రాత్రి కాకినాడ వచ్చి మరీ పట్టుకెళ్ళారట. ఇదీ తరతరాలుగా మా తాతగారు ఆ వూరికి చేసిన మంచి పనికి దక్కిన గౌరవం. మనిషి పోయి ఏభై ఏళ్ళు దాటినా ఇంకా ఆ గ్రామం మర్చిపోలేదంటే ఎంత నిస్వార్థ సేవో అయితే కానీ ఇన్ని తరాలు గుర్తు పెట్టుకోరు.
ఈ ప్రభల ఫొటోలని పరీక్షగా చూస్తే మా తాతగారి ఫోటో కూడా కనిపిస్తుంది. ఇదీ జగ్గన్న తోట తీర్థానికీ మా కుంటుంబానికీ ఉన్న బంధం.
జాజర

మా తాత గార్ని నేను చూడ లేదు. ఆయన పోయిన పదేళ్ళక్కానీ నేను పుట్టలేదు. అందువల్ల ఈ సంగతులన్నీ మా మామ్మా, నాన్నా, అమ్మా చెబితే తెలిసినవే తప్ప చూసినవి కావు. ఇంకో విషయం. ఈ ప్రభలు కౌశిక దాటించి తీసుకెళ్ళడానికింకో కథ చెబుతారు ఆ వూళ్ళో వాళ్ళు. అగ్రహారానికీ, పాలగుమ్మికీ మధ్య ఈ కౌశిక ఉంది. దానిపై డెబ్భైఏళ్ళ క్రితం వంతెన కట్టారు. అంతవరకూ కౌశికలోంచి తీసుకెళ్ళిన ప్రభని ఆ ఏడాది మాత్రం వంతెన మీదుగా తీసుకెళ్ళారట. ఆ ప్రభ తిరిగి తీసుకొచ్చిన రాత్రి ఎవరైతే ఆ ప్రభని మోసారో వాళ్ళందరి ఇళ్ళూ అంటుకు పోయాయట. అది ఒక అశుభంగా తలచి మరుసటి ఏడాది నుండి మాత్రం యధావిధిగా కౌశిక దాటించే ప్రభని తీసుకెళతారు. ఇప్పటికీ ఇదే ఆచారం నడుస్తోంది.
క్రమం తప్పకుండా 1985 వరకూ వెళ్ళాను. ఆ తరువాత మళ్ళీ ప్రభల తీర్థానికి వెళ్ళడం పడలేదు. ఎప్పటికైనా మా పిల్లలకిది చూపించాలని వుంది. చూద్దాం. ప్రతీదానికీ ఒక సమయం వుంటుంది.
జగ్గన్నతోట ప్రభల తీర్థం చెబితే తెలియదు; చూసి తీరాలి. ఇదివరకూ వార్తా పత్రికల్లో ఎక్కడో ఒక మూల చిన్న వార్తొచ్చేది. ప్రస్తుతం టీవీల పుణ్యమాని అందరికీ తెలుస్తున్నాయి.
జగ్గన్నతోట ప్రభల తీర్థం అదొక అనిర్వచనీయమైన వేడుక. మరలా ఎప్పుడు చూసే అదృష్టం దొరుకుతుందో? ఏమో? కాలమే కరుణించాలి.
అంతవరకూ…అంతే!

(ఈ ఫొటోలు క్రితంసారి ఎవరో బ్లాగులో పెడితే “కాపీ యే రైటు” అని సిగ్గు విడిచి తస్కరించాను )

4 వ్యాఖ్యలు

Older Posts »