కోనసీమ ప్రభల తీర్థం – మా కుటుంబం – అనుబంధం

జాజర

దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది.
కొబ్బరాకుల నడుమనున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చే వన్నె వేరు.
సంక్రాంతికి మాత్రం కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది.
ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచు జిల్లై కురుస్తుంది. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి.

సంక్రాంతి వేడుకల్లో కోనసీమకొక ప్రత్యేకత ఉంది. అది – భోగి, పెద్ద పండుగల తర్వాత కనుమనాడు జరిగే జగ్గన తోట ప్రభల తీర్థం. అదొక ప్రత్యేకమైన వేడుక. విశేషమైన పండగ సంబరం.
కోనసీమ వాసులకి జగ్గన్న తోట ప్రభల తీర్థం పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధం. అందిరికీ పరిచయమున్న ఈ ప్రభల తీర్థానికీ మా కుటుంబానికీ తరతరాలుగా పెనవేసుకున్న ఒక అమూల్యమైన అనుబంధం ముడిపడుంది. అది పదిమందితో పంచుకోవాలన్నదే నా వుద్దేశ్యం.

కోనసీమ చుట్టుపక్కనున్న సుమారు 90 గ్రామాల నుండీ ప్రజలు ఈ ప్రభలతీర్థంలో పాలుపంచుకుంటారు. అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఉన్న ఏడెకరాల కొబ్బరితోటలో ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. ఇక్కడ ఏ గుడీ ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలూ కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరితోట. రైతులు నమ్మే భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం.

శివుని వాహనంగా భావించబడే వీరభద్రునిగా కోనసీమ వాసులు ఈ ప్రభలని భావిస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పరమేశ్వర రూపాలని ఈ ప్రభలని అలంకరించి మేళ తాళాలతో “అహోం- ఓహోం” అని తలస్తూ, తమ భుజ స్కంధాలపై మోస్తూ ఊరేగింపుగా ఈ జగ్గన్న తోటకి తీసుకొస్తారు. ఈ ప్రభలని వెదురు కర్రలతో చేసి, రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరించీ, వేదమంత్రాల మధ్యా గంటలు మ్రోగిస్తూ మోసుకు వస్తారు. కుల మతాలకతీతంగా ఈ ప్రభలని మోయడం పరమేశ్వర సేవగా భక్తులు తలుస్తారు.

జాజర

సుమారు నాలుగొందల ఏళ్ళపైగా ఈ జగ్గన్నతోట తీర్థం జరుగుతోందని అంటారు. నాలుగొందల ఏళ్ళగా జరుగుతోందన్నది చెప్పలేంగానీ సుమారు వందేళ్ళగా ఖచ్చితంగా జరుగుతోందని చెప్పగలను. దానికి మా కుటుంబమే ఒక పెద్ద ఆధారం. ఈ ప్రభల తీర్థం గురించి చదివాకా ఎందుకోనన్నది అందరికీ అర్థమవుతుంది. ఈ ప్రభల తీర్థానికొక పురాణ గాధ కూడా వుంది. మొసలపల్లి గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు తరలివస్తాయనీ, లోక కళ్యాణార్థమై వారందరూ ఇక్కడ కలుస్తారని ప్రజల విశ్వాసం. దీన్ని ఏకాదశ రుద్రసమావేశంగా ప్రజలు భావిస్తారు.

ఈ ప్రభల తీర్థానికి జగ్గన్నతోట ప్రభల తీర్థమన్న పేరురావడానికీ వేరొక కథ చెబుతారు. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఒక ఏక సంధాగ్రాహి ఉండేవాడట. ఆ గ్రామాన్నానుకుని ప్రవహించే కౌశికలో స్నానం చేసీ, పూజాపునస్కారాలు ముగించుకొని అక్కడే ఉన్న మర్రి చెట్టుకింద భోజనం చెసేవాడట. అలా చేస్తూ ఈ చెట్టునానుకున్న అమ్మ వారిని మైల పరుస్తున్నాడని భావించీ కొంతమంది స్థానికులు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఈయన్ని అడ్డుకున్నారట. ఈ సందర్భంలో జగ్గన్న నిజాం నవాబుని కలిస్తే, జగ్గన్న పాండిత్యాన్ని చూసి మెచ్చుకొని ఆ మర్రిచెట్టుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చారట. తనపై ప్రజలు ఫిర్యాదు చేయబట్టే తనకీ భూమి లభించింది కాబట్టి వారికోసమే ఈ ప్రభల తీర్థం జరిపాడనీ అంటారు. దేవుడికీ గుళ్ళూ గోపురాలూ అవసరం లేదనీ, మైలా మాపూ దేవుడికుండవనీ పదిమందికీ చెప్పడంకోసం ఈ ప్రభలపై దేవుణ్ణి ఎవరైనా మోసుకు రావచ్చని చెప్పే నిమిత్తమై ఈ తీర్థం మొదలయ్యిందనీ అంటారు.

జాజర

ఈ ప్రభలు ప్రజలు నడిచే దారంట రావు. రాళ్ళూ, రప్పలూ తోసుకుంటూ, గోతులనూ, కుప్పలనూ దాటుకుంటూ పొలాల మధ్యగా ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.
చుట్టు పక్కలగ్రామాలనుండీ ప్రభలు మోసుకు రావడమొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ తీర్థానికి మరొక వేశేషం కూడా వుంది. అదేమిటంటే పాలగుమ్మి పక్కనే ఉన్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలు పీకల లోతు కౌశిక దాటుకుంటూ, పొలాల మధ్యనుండి వస్తాయి. ఈ ప్రభలు కౌశిక దాటడం చూడ్డం కోసం వేలాది మంది తరలి వస్తారు. ఒక్కసారి ఎత్తేకా ఈ ప్రభలు క్రిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలని తాకించకూడదు. కౌశిక దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవ కూడదు. నీళ్ళ చుక్క కూడా ప్రభ మీదా, పైనున్న దేవుడి మీదా పడకూడదు. ఇవి మోయడానికి పాతిక మంది వ్యక్తులు సరిపడ్డా, కౌశిక దాటించడానికి మాత్రం నలభైమంది పైగా ఉంటారు. ఎంతో ఏకాగ్రతతో ఏ మాత్రం కంగారు లేకుండా జాగ్రత్తగా కౌశిక దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి చేరుస్తారు. తీర్థమయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలు ఎంతో బరువున్నా కౌశిక దాటించేటప్పుడు అవలీలగా దాటించడం మాత్రం దైవానుగ్రమే అంటారు అది మోసే వాళ్ళు. ఈ కౌశిక దాటించడం మాత్రం చూసి తీరాల్సిన ఘట్టం. గంగలకుర్రూ, అగ్రహారం ప్రభపై చెన్నమల్లేశ్వర స్వామీ, వీరేశ్వర స్వామీ విగ్రహాలని అలంకరిస్తారు.
జాజర

ఇహ మాకుటుంబానికి సంబంధించిన ఒక గాధ:

మా పూర్వీకుల స్వగ్రామం గంగలకుర్రు అగ్రహారం. మా పితామహుల ( తాత గారి) పేరు గొర్తి పళ్ళయ్య పంతులు. ఈయన సుమారు వందేళ్ళు బ్రతికారు. ఈయన 1956లో పోయారు. ఈయన బడిపంతులు. మొదట్లో అంబాజీ పేటలో బ్రిటీషు వాళ్ళు కట్టించిన ఒక హైస్త్కూలు ఒక్కటే ఈ చుట్టు పక్కల గ్రామాలకున్న విద్యా సౌకర్యం. అప్పట్లో రోడ్లూ, రహదారులూ సరిగా లేక వర్షాకాలంలో విద్యార్థులు స్కూలుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడే వారట. ప్రభుత్వానికి చెబితే ఫలితం లేకపోతే మా తాత గారు అంబాజీపేట స్కూల్లో ఉద్యోగం వదిలేసి ఆయనింట్లోనే ఒక స్కూలు మొదలుపెట్టారు. ఆ స్కూలికి ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఉచిత పాఠశాల. ఉపాధ్యాయునిగా మా తాతగారికున్న పేరు చూసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పిల్లలు ఈయన దగ్గరకే వచ్చి చదువుకునేవారట. రెండేళ్ళు గడిచాక ఈ విషయం బ్రిటీషు వారికి తెలిసి మా తాతగార్ని స్కూలు మూసేయమని ఆర్డరిస్తే, చుట్టుపక్కలెక్కడైనా ఒక స్కూలు కట్టిస్తే తన స్కూలు మూసేస్తానని మా తాతగారు చెబితే వాళ్ళు ఒప్పుకొనీ ఆ స్కూలికి మా తాతగారినే హెడ్ మాస్టారుగా నియమించారు. ఆయన చలవ వల్లే పాలగుమ్మి హైస్కూలు వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఆ స్కూలు శతసంవత్సర వేడుకలు కూడా జరిపారు. ఇదంతా 1905 ప్రాంతంలో జరిగింది. మా నాన్నగారూ కూడా అప్పటికి పుట్ట లేదు.

అప్పట్లో పిల్లలకి పుస్తకాలు కొనుక్కోవడమూ కష్టంగా ఉండేది. అలాగే వాళ్ళకి చెప్పడానికీ ఏ మాత్రం పరికరాలూ ఉండేవి కావు. మా తాతగారు బొమ్మలు బాగా వేసే వారట. ఆయనే స్వయంగా బొమ్మలేసి దేశ చిత్రపటాలూ, సైన్సుకి సంబంధించిన పటాలూ గీసి చెప్పేవారట. ఆయన లెక్కల్లో మేధావి. ఆయన దగ్గర చదువుకున్న ప్రతీ కుర్రాడికీ లెక్కలు మాత్రం బాగా వచ్చేవని మా నాన్న చెప్పేవారు. అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కాలేజీకి జి.పి.రామేశంగారని ఒక ప్రినిస్పాలుండేవారు. నేను కాలేజీలో చదివినప్పుడు కూడా ఆయనే ప్రిన్సిపాలు. ఆయన లెక్కల్లో మద్రాసు యూనివర్శిటీ ఫస్టట. ఆయన మా తాతగారి వద్దే చదువుకున్నారు. ఇంటర్ లో నాకు లెక్కలు కాలేజీ ఫస్టు వచ్చింది. ఆ సందర్భంగా కలిసినప్పుడు ఆయన మా తాతగారి గురించే చెబుతూ ఆయన మనవణ్ణిని తెలిసీ చాలా సంతోషించారు. ఇది మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఇదిక్కడాపి ప్రభల తీర్థం విషయానికి వస్తాను.

ఈ గంగలకుర్రు అగ్రహారం ప్రభ కట్టే పని పెద్ద పండగనాడు మొదలుపెడతారు. రాత్రి తెల్లవార్లూ కూర్చుని ప్రభని కడతారు. గత వందేళ్ళుగా మా తాతగారు కట్టించిన ఇంటిముందే ఈ ప్రభని కట్టడం ఒక పెద్ద ఆనవాయితీగా వస్తోంది. మా నాన్న్న 1976లో ఆ యిల్లు అమ్మేసినా ఇప్పటికీ ఆ యింటిముందే ప్రభకడతారు. ఈ ప్రభ కట్టడం మా తాతగారు బ్రతికున్నన్నాళ్ళూ ఆయన ఆధ్వర్యంలోనే జరిగేదట. ఇప్పటికీ ఆ గ్రామానికీ, చుట్టుపక్కల ఊళ్ళకీ ఆయన చేసిన సేవకి చిహ్నంగా గంగలకుర్రు అగ్రహారం ప్రభపై ఆయన చిత్రం పటం పెడతారు. అది లేకుండా ప్రభ కదలదు. ఒకసారి ఆ ఫొటో వర్షానికి తడిసి పాడయితే కొత్త ఫోటో కావాలంటూ, కుటుంబ కారణాల రీత్యా కాకినాడలో ఉన్న మా అమ్మగారి వద్దకొచ్చి ఫొటో కావాలని రాత్రికి రాత్రి కాకినాడ వచ్చి మరీ పట్టుకెళ్ళారట. ఇదీ తరతరాలుగా మా తాతగారు ఆ వూరికి చేసిన మంచి పనికి దక్కిన గౌరవం. మనిషి పోయి ఏభై ఏళ్ళు దాటినా ఇంకా ఆ గ్రామం మర్చిపోలేదంటే ఎంత నిస్వార్థ సేవో అయితే కానీ ఇన్ని తరాలు గుర్తు పెట్టుకోరు.
ఈ ప్రభల ఫొటోలని పరీక్షగా చూస్తే మా తాతగారి ఫోటో కూడా కనిపిస్తుంది. ఇదీ జగ్గన్న తోట తీర్థానికీ మా కుంటుంబానికీ ఉన్న బంధం.
జాజర

మా తాత గార్ని నేను చూడ లేదు. ఆయన పోయిన పదేళ్ళక్కానీ నేను పుట్టలేదు. అందువల్ల ఈ సంగతులన్నీ మా మామ్మా, నాన్నా, అమ్మా చెబితే తెలిసినవే తప్ప చూసినవి కావు. ఇంకో విషయం. ఈ ప్రభలు కౌశిక దాటించి తీసుకెళ్ళడానికింకో కథ చెబుతారు ఆ వూళ్ళో వాళ్ళు. అగ్రహారానికీ, పాలగుమ్మికీ మధ్య ఈ కౌశిక ఉంది. దానిపై డెబ్భైఏళ్ళ క్రితం వంతెన కట్టారు. అంతవరకూ కౌశికలోంచి తీసుకెళ్ళిన ప్రభని ఆ ఏడాది మాత్రం వంతెన మీదుగా తీసుకెళ్ళారట. ఆ ప్రభ తిరిగి తీసుకొచ్చిన రాత్రి ఎవరైతే ఆ ప్రభని మోసారో వాళ్ళందరి ఇళ్ళూ అంటుకు పోయాయట. అది ఒక అశుభంగా తలచి మరుసటి ఏడాది నుండి మాత్రం యధావిధిగా కౌశిక దాటించే ప్రభని తీసుకెళతారు. ఇప్పటికీ ఇదే ఆచారం నడుస్తోంది.
క్రమం తప్పకుండా 1985 వరకూ వెళ్ళాను. ఆ తరువాత మళ్ళీ ప్రభల తీర్థానికి వెళ్ళడం పడలేదు. ఎప్పటికైనా మా పిల్లలకిది చూపించాలని వుంది. చూద్దాం. ప్రతీదానికీ ఒక సమయం వుంటుంది.
జగ్గన్నతోట ప్రభల తీర్థం చెబితే తెలియదు; చూసి తీరాలి. ఇదివరకూ వార్తా పత్రికల్లో ఎక్కడో ఒక మూల చిన్న వార్తొచ్చేది. ప్రస్తుతం టీవీల పుణ్యమాని అందరికీ తెలుస్తున్నాయి.
జగ్గన్నతోట ప్రభల తీర్థం అదొక అనిర్వచనీయమైన వేడుక. మరలా ఎప్పుడు చూసే అదృష్టం దొరుకుతుందో? ఏమో? కాలమే కరుణించాలి.
అంతవరకూ…అంతే!

(ఈ ఫొటోలు క్రితంసారి ఎవరో బ్లాగులో పెడితే “కాపీ యే రైటు” అని సిగ్గు విడిచి తస్కరించాను )

4 వ్యాఖ్యలు »

  1. Shyam Chirravoori said

    బాగుంది.

  2. తాడిగడప శ్యామలరావు said

    మీ యీ వ్యాసం చదివి చాలా ఆనందించాను. నేను కూడా కోనసీమవాడినే. అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కాలేజీకి జి.పి.రామేశంగారు ప్రినిస్పాలు గా ఉన్నప్పుడే చదువుకున్నాను.

    కొన్నేళ్ళక్రితం మా కొత్తపేట మిత్రబృదం అంతా సకుటుంబంగా మళ్ళీ కొత్తపేట వెళ్ళి సంక్రాంతి నాటి రాత్రి జరిగే బాణాసంచా ఉత్సవం అంతా చూసి, ప్రభలతీర్ధానికి జగ్గన్నతోట వెళ్ళి వచ్చాము. చాలా బాగా అనిపించించింది.

  3. kastephale said

    చిన్న విన్నపం. మీ అనుబంధాన్ని, కొనసాగించండి, మీముందు తరాలవారితో సహా, ఇది నా కామన.

  4. అద్భుతంగా ఉన్నదండీ! పంచుకున్నందుకు శతకోటి ధన్యవాదాలు

RSS feed for comments on this post · TrackBack URI

వ్యాఖ్యానించండి