ఎవరికోసం ఈ సంక్రాంతి శుభాకాంక్షలు? సంక్రాంతి “శుభా”స్పామ్

జాజర


సంక్రాంతి శుభాకాంక్షల పేర ఇప్పటివరకూ వందకి పైగా మెయిళ్ళొచ్చాయి. కొన్ని స్నేహితులనుండీ, మరికొన్ని బంధువులనుండీ, తెలుసున్నవాళ్ళ నుండీ, మిగతావి ముక్కూ మొహం తెలియని వారినుండీ. చివరిన రాసిన వారినుండి వచ్చిన సంఖ్యే చా…..లా పెద్దది.

అందరూ సంతోషాన్ని పంచుకోవడానికే ఈ శుభాకాంక్షలు పంపుతారనీ తెలుసు. మీరు కూడా అలా భావించి పంపి వుండచ్చు.

కానీ మీరు పంపే రెండు లేదా మూడొందల మంది ఈమెయిళ్ళల్లోకి SPAM పంపుతున్నారన్న చిన్న విషయం గమనించండి. ఇలాంటి స్పాముల వల్లే వైరసు పాములు మన కంప్యూటర్లలోకి చొరబడతాయి. కంప్యూటర్ నిండా విషం చిమ్ముతాయి. ఈ చిన్న విషయం తెలుసుకుంటే అందరికీ మంచి చేసిన వారవుతారు. ఎదుటివారికి మంచి చేద్దామనుకుంటూనే తెలియ కుండా ఎంత చెడు జరుగుతోందో ఒక్క సారి ఆలోచించండి.

భూమ్మీద ఈమెయిలున్న ప్రతీ తెలుగువాడికీ శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదు.
నిజంగా మీరు చెప్పాలనుకుంటే అమ్మకో,నాన్నకో, చెల్లెకో, అన్నకో, అక్కకో లేదా మీ సన్నిహితులకో చెప్పండి.
ఈమెయిలు ద్వారా కాదు.
వాళ్ళని పలకరించి పండగ చేయండి.
ఓ చిన్న కరచాలనం ఇవ్వండి.
వాళ్ళ మొహాల్లో చిరునవ్వు వెలిగించండి. వారితో కొన్ని క్షణాలు గడిపి సంతోషం కలగచేయండి.

నాకు తెలుసున్న ఒకాయన ఉన్నారు. ప్రతీ పండక్కీ అందరికీ ఈమెయిలు ఠంచనుగా పంపుతారు. ఫోను చేస్తే తీయరు. ఆయనంతట ఆయన సొంత గొంతుతో పలకరించరు. ఎప్పుడైనా మన ఖర్మ కాలి ఏ పార్టీలో నయినా, మరెక్కడయినా కలిస్తే “మీకు గ్రీటింగ్స్ పంపాను.జవాబివ్వలేదేం?” అంటూ నిష్టారంగా, వెక్కిరింపుగా మాట్లాడతాడు. ఇలాంటివారికి ఏం చెప్పాలో తెలియదు. సాంకేతిక విజ్ఞానం మనందరినీ దగ్గర చేస్తోంది. ఊహకందనంత దగ్గరగా మనుషుల్ని కలుపుతోంది. కానీ దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో ఆలోచిస్తే బావుంటుంది.

మేం ఎవరినీ తిట్టలేదు కదా? శుభాకాంక్షలు చెబితే కూడా తప్పా? ఈ గోలేవిటని మీకనిపించవచ్చు. ప్రపంచమంతటికీ మంచి జరగాలనీ, అందరూ సంతోషంగా ఉండాలన్న ఆశా, ఆశయమూ, ఆలోచనా మంచివే. కానీ ప్రతీ మనిషి ప్రపంచం అంటే సన్నిహితుల, స్నేహితుల, బంధువూల సమూహం చిన్నదిగానే ఉంటుంది. ఎంతో మంది పరిచయమున్నా, మన ప్రపంచంలోకి అందర్నీ కాలెట్టనివ్వం. రకరాకల గీతలు గీసి ఎదుట వారిని నిలువరిస్తాం. ఈ చిన్న విషయం గమనిస్తే మనందరికీ మంచిది.

అంతే కానీ ఇలా అందరికీ పంపడంలో ఎవరికీ ఒరిగేదేమీ లేదు. సగానికిపైగా అందరూ చూడకుండానే చింపి పారేస్తారు. ఇలా రాస్తున్నానని మీరు నన్ను తిట్టుకోకండి. ఈ కంప్యూటర్లో స్పాముల పాములోళ్ళకి ఇలాంటి ఈమెయిళ్ళే పండగ. మన అవివేకాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. మరోలా భావించకండి. దయచేసి సామూహిక శుభాకాంక్షలకి శలవు ఇప్పించండి.

మీ అందరికీ సంక్రాంతి సందర్భంగా సూక్తిముక్తావళి వినిపించడం నా వుద్దేశ్యం కాదు. నిన్న ఒక మిత్రుడికి సంక్రాంతి శుభాకాంక్షల మెయిలుతో వచ్చిన గ్రీటింగ్ చూద్దామని విప్పగానే వైరస్ బాంబు పేలి, కంప్యూటర్ నాశనమయ్యిందనీ, దాన్ని బాగుచేసుకోవడానికి పది గంటలు కాలం వెచ్చించినా బాగుపడలేదనీ, తనకీ విధంగా భోగి పండగ జరిగిందనీ, మెయిలు పంపిన మహాశయుణ్ణి తిట్ల శతమానంతో దీవించాడు. ఈ విషయం నాకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుదావని చేసిన ఫోను సారాంశం. అతన్ని చూస్తే జాలేసింది. కానీ ఏవీ చెయ్యలేం. ఇదే పరిస్థితి మరికొంతమందికి కలగవచ్చు.

ఈ ఈమెయిళ్ళన్నది కూడా ఒక పెద్ద అంతుచిక్కని వల లేదా మాయా వలయం. ఒకాయన అయిదొందలమందికి “హేపీ పొంగల్” అంటూ సంక్రాంతి శుభాకాంక్షలు పంపుతాడు. వేంటనే మరొకాయన చూసీ చూడగానే “రిప్లై ఆల్” నొక్కేసి కసి తీర్చుకుంటాడు. ఇలా మొదటి వ్యక్తి పంపిన మిగతా నాలుగొందల తొంభై తొమ్మిది మందో లేదా వేలమందో “రిప్లై ఆల్” కొట్టారనుకోండి. తెల్లారి చూస్తే మీ ఈమెయిలు ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా ఒక్కోటి అందిస్తుంది. అవన్నీ డిలీట్ చేసుకోడానికి మీకు అరగంట పైగా పట్టచ్చు. కాదని కంప్యూటర్ వాడే నాధుడెవడూ అనలేరు. ఒక్కోసారి ఈ ట్రాష్లోకి మనకి పనికొచ్చే మెయిలో, సమాచారమో కూడా కట్ట కట్టేసే ప్రమాదముంది. కాదంటారా?

ప్రపంచానికి కంప్యూటర్ శుభాకాంక్షలు చెప్పడానికి రకరకాల పద్ధతులున్నాయి. బ్లాగులూ, ఫేసుబుక్కులూ, ట్విట్టర్లూ, మన్నూ, మశానమూ చాలా వున్నాయి. అవి వాడితే అందరి కంప్యూటర్ జీవితాలకీ మంచిది.

నా మాటల పటాసులు మీకు గోలనిపిస్తే దీన్నీ మసో, మటాషో చేసి పారేయండి.

సంక్రాంతి అనే కాదు. ఏ పండగొచ్చినా ఈమెయిల్ “శుభా”స్పామ్ కి స్వస్తి చెప్పడం అందరికీ శ్రేయస్కరం.

-సాయి బ్రహ్మానందం గొర్తి

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

 1. vinod1092 said

  మీరు చెప్పింది కరస్టే …….
  మన ఖర్మ ఏంటంటే ఆన్లైన్లో మెయిల్ పంపిన వాడు ఎదురుగా ఉంటె మాట్లాడడు, పక్క పక్కన ఇల్లు ఉన్న మేసేజులు, ఫోన్లో సొల్లు చెప్పే వాడు ఊళ్ళో ఉన్న మొహం చాటేస్తాడు…….
  టెక్నాలజీ దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నా మనం(మనలో కొందరు) మాత్రం మిథ్య కి బలవుతున్నాం.

 2. Zilebi said

  సాయి గారికి,

  అందుకే నండీ నేను ఈమైలు వద్దే వద్దని మనకివన్నీ అచ్చి రావని పోస్టు కార్డు ముక్క రాయండీ అని మాకు తెలిసిన వారికి జెప్పా.

  వారికి నామోషీ, పోస్టాఫీస్సు కి వెళ్లి ఎవరు కార్డు ముక్క కొంటారప్పా, డబ్బులు దండగ అని వూరుకునేసారు

  సంక్రాంతీ శుభాకాంక్షలతో ( ఇందులో వైరస్సాసురుడు లేడు !)

  చీర్స్
  జిలేబి.

  • Admin said

   I get scarred if any festival or event comes on the calender. Believe it or not, I got more than 300 Happy New year messages on Jan.1st and the list started getting more and more with “REPLY ALL” anger.

   Now, it is Sankranti mania!

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: