హేరీ పాటర్ మాయాజాలం ( ఆంధ్రభూమి – వెన్నెల్లో వచ్చిన వ్యాసం )

జాజర


హేరీ పాటర్ మాయా జాలం ( ఆంధ్రభూమి – వెన్నెల్లో వచ్చిన వ్యాసం )

రెండు వారాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా హేరీ పాటర్ సీరీసులో ఆఖరిదీ, మునపటి సినిమా డెత్లీ హేలోస్ కి కొనసాగింపుగానూ, ముగింపుగానూ విడిదలయిన చిత్రం మరోసారి బాక్సాఫీసు మాయాజాలం చేసింది. ప్రపంచం మొత్తం కలిపి ఒక బిలియన్ వసూళ్ళు చేసిందని అంచనా! హేరీపాటర్ పుస్తకాలకి ఎంత ప్రజాదరణ లభించిందో అంతకంటే ఎక్కువగానే ప్రేక్షకులు ఎగబడి చూసారు. అందులో నాలాంటి భారతీయులూ ఉన్నారు; తెలుగువాళ్ళూ ఉన్నారు. మొదట్లో పిల్లల కోసం బలవంతంగా వెళ్ళినా తరువాత తరువాత ‘ఏవుందీ పుస్తకంలో?’ అనుకుంటూ చదవడం మొదలుపెట్టిన నేను హేరీ మాయాజాలంలో పసిపిల్లాడి కంటే కనాకష్టంగా చిక్కుకు పోయానని గ్రహించడానికి చాలా కాలమే పట్టింది. ఎప్పుడైనా తెలుగువాళ్ళు తారసపడితే ఈ సినిమాదీ, పుస్తకానిదీ ప్రస్తావన వస్తే ఆ స్థాయికి తెలుగు సాహిత్యం వెళుతుందాని ఒకటికి పదిసార్లు ప్రశ్నిస్తే, మిత్రులందరూ నామీద విరుచుకుపడేవారు. ఏవుందీ హేరీపాటర్లో? అదంతా మన భారతీయ కథల్నుండి ప్రేరణ పొంది రాసినవే?మనకి చందమామలో ఎన్ని సీరియళ్ళుగా కథలు లేవనీ? మాయల మరాఠీ, మృత్యులోయా, బేతాళ కథలూ, మంత్రాల దీవీ, ఒకటేవిటి చచ్చేటన్ని కథలు మన తెలుగు సాహిత్యం ఎప్పుడో ప్రపంచానికి అందిచ్చిందని జబ్బలు చరిచి గట్టిగా వాదించేవారు. నిజమే మనకి చాలా చాలా సాహిత్యం వుంది. కాదనను. కానీ ఎన్ని సినిమాలుగా మలిచారు? ఎన్ని నవలలుగా ప్రజలకి చేరాయి? ఎంతమంది చదివారు? ఈ ప్రశ్నలకి వాదించే వాళ్ళ దగ్గర జవాబు లేదు. అంతెందుకూ? పేర్లయితే వల్లె వేసారు కానీ, వాళ్ళూ ఒక్కటంటే ఒక్కటి చదివిన పాపాన పోలేదని వాళ్ళకీ, అందరికీ తెలుసు. వాళ్ళ వాదన చూస్తే ఒక్కోసారి నవ్వొచ్చేది. ఎందుకీ ఆత్మస్తుతి? ఎందుకీ పరనింద? ఒక నవలకి కానీ, తద్వారా మలచబడిన సినిమాకి కానీ అంత పేరు వచ్చిందంటే దానిక్కారణాలు ఆలోచించారా? ఎందువల్ల వాటికంత ప్రేక్షకాదరణా, పాఠకాభిమానమూ లభించాయో గ్రహించారా? పుస్తకం మార్కెటింగనవ్వనివ్వండి. లేదా ప్రచారం కానివ్వండి. ఏదయినా సరే ఆఖరి గమ్యం ప్రజల హృదయమే కదా? అక్కడకి చేరవేయాడానికి వున్న మార్గాలు మనమెందుకు ప్రయత్నించడం లేదు? మనం చెయ్యం. ఎదుటివారు చేస్తే, ఏవుందిందులో? ఆమాత్రం మనకీ వున్నాయని సంతృప్తి దగ్గరే ఆగిపోతున్నామెందుకు? విజయానికి హేతువూ, గమ్యం ఒకటే అయినా పరాజయానికి మాత్రం కారణాలనేకం.
సినిమా గురించి ఒక నిమిషం పక్కన పెడదాం. అసలు అలాంటి నవలలెందు తెలుగు సాహిత్యంలో రావు? రచయితలెందుకు వారి సృజనని అటుగా మళ్ళించడం లేదు? గట్టిగా నిలదీస్తే ఆ నింద రచయితలమీదే పడుతుంది. ‘మన రచయితలు రాయరండీ? సృజన చచ్చిందండీ?’ అనే వాళ్ళొకరు. అసలు తెలుగే చచ్చిపోతోందనుకుంటే ఈ నవలగోలేమిటని అడిగే వారింకొకరు. ఇలాంటి నిందారోపణలకి కొంతవరకూ రచయితలు కారణమే. కాదనను. కానీ రచయితలకంటే పెద్ద కారకులున్నారు.

ఏ రచయితయినా ఎందుకురాస్తాడు? ఎప్పుడు రాస్తాడు? మొదట తను రాసిన వాటిని ప్రజల మధ్యకెలా చేరవేయాలని చూస్తాడు. కాబట్టి పత్రికలవాళ్ళని సంప్రదిస్తాడు. వాళ్ళు అనేక మితులూ, పరిమితులూ బేరీజు వేసి, ‘ఆ ఇలాంటివి తెలుగు పాఠకులు చదవరండీ? ఎక్కవంటూ’ ముందుగానే తీసేస్తారు. ప్రజలకి రుచి చూపిస్తే కదా? బాగుందో, లేదో తెలియడానికి? ఆ రుచి కాస్తా సంపాదకుల వారి అభిరుచి మీద ఆధారపడుంటుంది. ఇది నిష్టుర సత్యం. ఇవి కాకుండా పేజీల కొరత ఎప్పుడూ ఉండేదే? నవలని సీరియల్లుగా అయితే పది లేదా పదిహేను వారాలకు మించి ప్రచురించలేవండీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. రాసేవాళ్ళు కూడా ప్రచురిస్తే చాలనుకుంటూ వాళ్ళు చెప్పినట్లుగానే పదివారాలకీ, పదిహేను వారాలకి వారి సృజనని కుదించేసి సంతృప్తి పడిపోతున్నారు. ఇవి కాకుండా మనకి ఉద్యమాలూ, వాదాలూ అనేకమున్నాయి. సర్క్యులేషన్ పెరగాలంటే మరి సాహిత్యంలో వాటికీ ప్రాధాన్యత ఇవ్వాలి కదాని అడిగే వారూ ఉన్నారు. ఈ వివరణల చట్రంలో హేరీ పాటర్లాంటి నవలకి చోటెక్కడ చెప్పండి?
ఏ సంపాదకులనయినా మంచివి రావడం లేదండీ అని ప్రశ్నిస్తే, ‘అబ్బే! మంచివి మేమెందుకు ప్రచురించవండీ? ఎవరూ రాసి చావడంలేదంతే’ అంటూ తప్పుకు తిరిగుతారు. అచ్చేసే వాడే అసలు దొంగని ఒప్పుకోరు. ఈ విధంగా రచయితల లోపమని పత్రికల వాళ్ళు వాదిస్తే, లేదూ పత్రికల వాళ్ళే కారణమంటూ రచయితలు ఎదురు తిరుగుతున్నారు. విత్తు ముందా? కాయముందా? అన్న చందంగా ఇవి తెలుగు సాహిత్యానికి కావాల్సినంత చేటూ, లోటూ చేకూరుస్తున్నాయి.

ఒక చిన్న సంఘటన చెబుతాను. ఏడాది క్రితం పదమూడో శతాబ్దంలో విజయనగర రాజ్యంలోకి ముస్లిములు అడుగుపెట్టడానికి ఒక అందమయిన అమ్మాయి ఆనాటి మహారాజుని తిరస్కరించడం అన్న కారణమని మన చరిత్రలో ఉంది. అది ఒక నవలగా రాస్తాననీ దాదాపు సగం నవల వరకూ రాసి ప్రతీ పత్రికచుట్టూ తిరిగినా ఫలితం దక్కక వెబ్లో ప్రచురించుకోవాల్సి వచ్చింది. మనకి పాపులర్ రచయితలమీదున్న ఆసక్తి మామూలు రచయితల మీద లేదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం.

ఇటువంటి తరుణంలో హేరీ పాటర్లాంటి నవలెలా వస్తాయి చెప్పండి? ఒకవేళ వచ్చినా ఎవరికీ తెలియనీ, కనీసం వందకాపీలు కూడా అమ్ముడవ్వని పత్రికల్లో వచ్చి వెళిపోతాయి. ఏదయితేనేం, తెలుగు నవల ఎదగకుండా పత్రికలు తమవంతు కృషిని నిరాఘంటాగా చేస్తున్నాయి. మరికొన్ని పత్రికలయితే ఆరువారాల సీరియళ్ళూ, పదివారాల సీరియళ్ళూ అంటొ నవలల కాళ్ళు విరగ్గొట్టి కురచ రూపం ఇస్తున్నారు. మంచి నవలలొస్తే కదా? సినిమాగా తీసినా; పదిమంది చేతా చదివించాలన్నా? ఇటువంటి వాతావరణంలో హేరీ పాటర్లాంటి నవల బ్రతికి బట్టకడుతుందని ఆశపడే తెలుగువాళ్ళుంటారని బుద్ధున్న ఎవరూ అనుకోరు. పీత కష్టాలు పీతవన్నట్లు, పత్రికల వాళ్ళ సమస్యలు వారివి. సర్క్యులేషనూ, అమ్మకాలూ, అడ్వర్టైజుమెంట్లూ, వగైరాలెలాగూ ఉంటాయి. దినపత్రికలకీ, వారపత్రికలకీ ఇవే భూతాల్లాంటి సమస్యలు. కొనేవాడుంటే కదా? రాసినా, రాయించినా. ఇవి కాకుండా తెలుగు పాఠకులకీ కొన్ని జాడ్యాలున్నాయి. ఏ పుస్తకమూ, పత్రికా కొని చదవరు. వీధంతటికీ ఒకే పత్రికన్నది తెలుగువాళ్ళ ఆచారమూ, సంస్కృతీనూ. కాబట్టి కర్ణుడి చావులాగే తెలుగు సాహిత్యమూ అంపశయ్యమీదుంది. ఇది నవలల గురించి. ఇటువంటి సందర్భంలో తెలుగు సినిమా గురించి చర్చించాల్సిన అవకాశం రావడం లేదు. ఎవరూ ఇవ్వడం లేదు కూడానూ.

సరే సాహిత్యం అలావుంటే మన తెలుగు సినిమా సంగతేవిటని అడగండి. సాహిత్యానికి చేతులూడితే, సినిమాకి కాళ్ళూ, చేతులూ రెండూ పోయి అవిటిదయ్యింది. సాహిత్యానికీ, సినిమాకి సంబంధం ఎప్పుడో తెగిపోయింది. పూర్వం హేమా హేమీలయిన రచయితలు అటు సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ రెండు చోట్లా రాణించే వారు. దేవులపల్లీ, శ్రీ శ్రీ, ఆరుద్రా,ముళ్ళపూడి వంటి వాళ్ళు అక్కడా ఇక్కడా రాణించారు. కథలల్లారు;నాటకాలు రాసారు;పాటలు రాసారు;స్క్రీన్ప్లేలు రాసారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సినిమా పాటలు రాసేవాళ్ళు పత్రికల్లో సాహిత్యం జోలికి పోరు. కథలల్లేవారు చక్కగా ఏ గూగుల్నో, పరభాషా డీవీడీలనో ఆశ్రయిస్తున్నారు. ఇహ కొంతమంది దర్శకులయితే కథా, మాటాలూ, పాటలూ, మన్నూ, మశానం అన్నీ వాళ్ళే చేసేస్తున్నారు. ఇహ కొత్తగా సృజన చేసే కష్టం ఇతరలకి కలగనీయకుండా పాపం అన్నీ వాళ్ళే నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. అందుకే మన సినిమాలు వారానికే చతికిలపడుతున్నాయి. ఆ మధ్య తానా సభలకని శేఖర్ కమ్ముల వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వేసాను. పాపం ఆయన వినయంగానే ఒప్పుకొన్నాడు. పక్కనే ఉన్న గొల్లపూడి గారు కాదని అన్నా, లేదంటూ సర్ది చెప్పాడు. తను ఎప్పటికయినా వేరేవారు రాసిన కథని తీస్తాననీ చెప్పాడు.

వేరే వాళ్ళ కథల్నీ, రచనలనీ మన తెలుగు సినిమా దర్శకులెందుకు తీయలేకపోతున్నారు? హాలీవుడ్లో అరవై శాతం పైగా సినిమాలు నవల అధారంగా తీసినవే. అక్కడ దర్శకుడు రచనా ప్రక్రియలో వేలు పెట్టడు. నవలని చిత్రానువాదం చేసేవాళ్ళు వేరే ఉంటారు. అదేం దౌర్భాగ్యమో కానీ తెలుగు దర్శకులు అన్నీ వాళ్ళే వండేస్తున్నారు. ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి ప్రశ్నలడిగితే మంచి కథలూ, నవలలుంటే చెప్పండి. మేము తీయడానికి సిద్ధమేనని చెబుతున్నారు. తెలియకడుగుతాను. ఎవరో చెప్పడం దేనికి? వాళ్ళే తెలుగు పత్రికల్లో వచ్చే కథలూ, నవలలూ చదివి తెలుసుకోవచ్చు కదా? చెయ్యరు. ఎవరైనా చెబితే వింటారు. అందువల్ల నవలలు సినిమాలుగా రావడమన్నది అత్యాశే అవుతుందని నా విశ్వాసం. కాబట్తి తెలుగు పాఠకులకీ, ప్రేక్షకులకీ హేరీ పాటర్ భయమూ, బెంగా పడనవసరం లేదు. హేరీ పాటర్లాంటి నవలా రాదు. వచ్చెనుపో సినిమాగా రాదు. సినిమాగా వచ్చెనుపో, ప్రేక్షకుడు చచ్చెనుపో అని నవ్వుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఎవరైనా ఈ సినిమా గురించి ప్రస్తావన తీసుకొస్తే మాత్రం మనం నోరు మూసుకు కూర్చోం. మన సాహిత్యమెంత గొప్పదో, మనకెన్ని ప్రక్రియలు తెలుసో, ప్రపంచానికి ఎంత సాహిత్య సేవ చేసామో బల్ల గుద్ది చెబుతాం. జబ్బలు చరుచుకుంటాం. హేరీపాటర్ ముర్దాబాద్ అని నినాదాలివ్వడనికి సిద్ధంగా ఉంటాం.

వ్యాఖ్యానించండి