చిర స్మర(మ)ణీయం

జాజరచిర స్మర(మ)ణీయం


నవ్వడం ఆరోగ్యం.
నవ్వకపోడం అనారోగ్యం.
నవ్వించడం మహాభాగ్యం.

మొదటిది వెంటపడితే వస్తుంది. రెండోది వద్దన్నా వస్తుంది. మూడోదానికి మాత్రం అదృష్టం కావాలి.
ప్రస్తుతం ఆ మహాభాగ్యం హఠాత్తుగా అదృశ్యమయిపోయింది. తెలుగునాట అక్షర గ్రహణం పట్టింది. ఉన్నట్టుండి సాహితీకారుల మదిలో చీకట్లు కమ్ముకున్నాయి. తెలుగువారికి కానీ ఖర్చులేకుండా ఇన్నాళ్ళూ హాస్యరసాన్ని పంచిచ్చిన అక్షరవైద్యులు బుద్ధిమంతుడిలా,రాజాధిరాజు మల్లే పెట్టేబేడా సర్దుకుని, చెప్పపెట్టకుండా బుల్లెట్లాగా, తిరుపతి వేంకట రమణ సాక్షిగా, ముళ్ళపూడి మీదుగా “శ్రీరామరాజ్యా“నికి చెక్కేసారు.

మొన్నటికి మొన్న తెలుగునాట ముత్యాల ముగ్గులేసీ, నిన్నటికి నిన్న పెళ్ళీడు పిల్లలకి సీతాకళ్యాణమంటూ పెళ్ళిపుస్తకాలు అచ్చేసీ, కళ్యాణ తాంబూలాలు పూలరంగడిలా పదిమందికీ పంచిచ్చీ, మగాడిదలందరూ మిస్టర్ పెళ్ళాలూ, అపార్థసారధులూ అని సెలవిచ్చీ, దాంపత్యపు దాగుడుమూతల్లో ఆడవాళ్ళే జీవనజ్యోతిలని గిరీశం చేత బల్లగుద్ది చెప్పించి, బ్రతుకు గోరంతదీపానికి చిరునవ్వే వెలుగంటూ చడీ చప్పుడూ లేకుండా చీకట్లోకి వెళిపోయారు. తెలుగుమొహాలన్నీ ఒక్కసారి విస్తుపోయాయి. ఇన్నాళ్ళూ అప్పనంగా లభించిన హాస్య సంపదకి చిల్లుపడిందనీ, తెలుగు సాహిత్యానికి “డబ్బు” చేసిందనీ విలవిల్లాడాయి.
గుర్తుగా వదిలిన ఆయన వంశ వృక్ష ప్రతీకలు బుడుగూ, సీగానపసూనాంబ, రెండుజెళ్ళ సీత, రాధ, గోపాళం, పక్కింటి పిన్నిగారి మొగుడు, బుచ్చికక్కిలని అనాధల్ని చేసి పోయారని వాపోయాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదు. మరీ ఇలా ఆయన్ని నమ్ముకున్న అప్పుల అప్పారావునీ, కాంట్రాక్టరునీ, గుర్నాధాన్నీ, తుకారాన్నీ ఇలా తెలుగువారి మీద వదిలేసి ఆయనకాడికి ఆయన రెస్టు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు.

మా అందరికీ అన్యాయం జరిగిపోయింది కదండీ? ఇహ గిరీశంగారికి లెక్చర్లివ్వడానికి స్క్రిప్టెవరు రాసిస్తారూ? అప్పారావుకి అప్పుపుట్టడానికి చిట్కాలెవరిస్తారూ? బుడుగూ, సీగానపెసూనాంబల కోతికొమ్మచ్చి ఆటకి ఎవరు తీర్పు చెబుతారు? మా సంగతి సరే! రక్త సంబంధంకన్నా “సృష్టిలో తీయనిది స్నేహం” అని నమ్మిన ప్రాణస్నేహితుడిక్కూడా చెయ్యిచ్చాసారు కదండీ. పొరపాటనిపించలేదూ?

ఏమో! మీకేం కష్టం వచ్చిందో? ఎవరాకలి వారిదన్నట్లు ఎవరి బాధ వారిది. మీరు బాధపడడం మేం తట్టుకోలేం. బ్రతికినంతకాలమూ హాయిగా నవ్వుతూ “సంపూర్ణ రమణీయం” లా గడిపారు. మా అందరికీ హాస్యం పంచిచ్చారు. అదే పదివేలు మాకు.

మా ఏడుపుమొహాలకి ఇహ నవ్వు టానిక్ ఎక్కడ దొరుకుతుంది? విసుర్లతో నాలుగు మొట్టికాయలు మొట్టీ, వ్యంగ్యంగా చెంప చెళ్ళుమనిపించీ, బాధల కోతి పుండుని మాటల కత్తులతో కోసి, అక్షరలేపనాలు పూసీ, విసుర్ల నొప్పి తెలీకుండా హాస్యపు కుట్లేసి, ఫీజు ఎగ్గొట్టిన్నా చిరునవ్వుతో చెప్పిచ్చుక్కొట్టే డాక్టరు, తెలుగు మొహాలకిక దొరకమన్నా దొరకరు. భలే వైద్యులండీ మీరు?

మీ పేరు ముందు డాక్టర్ అని లేదనుకున్నారో ఏమో మీ ఇంటిముందు ఆ బోర్డయినా తగిలించాలన్న జ్ఞానం ఈ తెలుగు మొహాలకి లేకపోయింది. పుట్టగొడుగుల్లా మాకు చచ్చేటన్ని విశ్వవిద్యాలయాలున్నాయి. అందరూ మీ చేతి హాస్య టానిక్కులు లాగించినవారే తప్ప, ఏ ఒక్కరికీ మీకో నూలుపోగిద్దామన్న ఆలోచన కూడా తట్టలేదు. ఏం చేస్తాం చెప్పండి? టెల్గూ వాడికి టెల్గూ వాడే శత్రువు.

‘‘ఈ భూ ప్రపంచంలో ఎదుటివాడిలో కృతజ్ఞత ఆశించేకన్నా ఆంధ్ర రాజకీయ నాయకుల్లో ఐకమత్యాన్ని ఆశించు… ఆంధ్రుల్లో కార్య శూరత్వాన్ని ఆశించు’’ అని మెరెలాగూ చెప్పారు. అది వినయినా మాకు బుద్ధి రాలేదు. కోతి బుద్ధులుకదండీ? కనీసం మీ “కోతి కొమ్మచ్చి” చదివినా కూడా బుద్ధి రాలేదు. హోలు మొత్తానికే “లేదు” లెండి. అప్పులూ, అవార్డులూ అడుక్కుంటే కానీ ఇవ్వకూడదన్న నియమం తెలుగువారికుందని ఆమాత్రం తెలీని అమాయాకుల్లా వున్నారు మీరు. “బిరుదూలూ, పదవులపైనా, పరనారీ పెదవులపైనా దృష్టంతా నిలిపేవాడు బూడిదై పోతాడన్నా!” అన్న మీ అందాల రాముని మాటలు విని భయపడ్డారా ఏవిటి? కనీసం మీ గడపకి పద్మాలనయినా కట్టలేక పోయారు. మీ ఇంటి ముందు అవార్డు ముగ్గు కూడా వేయలేక పోయారు. తెలుగువాళ్ళకి కొన్ని మంచి గుణాలబ్బాయి. స్వచ్చంగా సంపూర్ణ జీవితంగడిపే వారి జోలికి పోరు. నోట్లో నాలికలేని వాళ్ళని లెక్కపెట్టరు. అయినా మీరు స్థితప్రజ్ఞులు. నా రాతింతేనని సర్దిపుచ్చుకోగల పెద్దమనుషులు.

కన్నప్ప గారు కన్ను పొడిచి వాసాలు విరిచినా ఆ బాధలో కూడా సంతోషం వెతుక్కోగల మహానుభావులు. “కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన” అన్న కృష్ణావతార సారాన్ని ఆచరణలో చూపించారు మీరు. జీవితాన్ని వడకాచి కష్టాలని కాల్చి బ్రతుకు బంగారంలా మలుచుకున్నారు. ఎంతైనా మీరు ధన్యజీవులు. మీ హస్తవాసి అందిన మేం అదృష్టజీవులం.

ఏం రాతండీ మీది? వాగ్దేవిని మీ ఇంట్లో బందీ చేసారా ఏవిటి? అచ్చ తెలుగు నుడికారం మీ ఇంటే పుట్టిందాన్నట్లు అక్షరాకే నడకనేర్పారు. మాటల తూటాలు మీ ఇంట్లోనే తయారవుతాయో ఏమిటో? శివకాశీ టపాసులయినా తుస్సుమంటాయేమో కానీ మీ ఒక్క మాటా ఎప్పుడయినా పేలకపోవడం జరిగిందా? “ఆయనకి డబ్బు చేసింది!”, “వాడు నవ్విచ్చుక్కొట్టాడు!” వంటి తూటాలు ఎవరు పేలుస్తారు చెప్పండి? “సిఫార్సులతో కాపురాలు చక్కబడవన్న” జీవిత సత్యాలు ఇహ ఏ పెళ్ళిపుస్తకంలో దొరుకుతాయి?

వెళితే వెళ్ళారు; వెళ్ళబోయేముందు మాత్రం ఓ మంచి పని చేసారు. మీ బతుకుపుస్తకాన్ని మిఠాయి పొట్లంలా కొమ్మకు కట్టి అందిచ్చారు. కోతికొమ్మచ్చని మీరన్నారు కానీ మాకు మాత్రం అది “కోటి” కొమ్మచ్చి. “తెలుగువాడిగా పుట్టడం అదృష్టం. ఎదగడం దురదృష్టం. నిలదొక్కుకోడం మహాకష్టం” అని ఇంకోటి కొమ్మకొమ్మకూ చుట్టి మరీ సెలవిచ్చారు.

తెలుగువాడిగా మీరు సదా స్మరణీయులు; మీ రాతలు చిరస్మరణీయాలు.
కాదనే దమ్ము ఏ తెలుగువాడికీ లేదు. అందుకే మీరు చిరస్మ”రమణీయులు”.

-సాయి బ్రహ్మానందం గొర్తి

Same Text in BAPU font

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: