నేను అహల్యను కాను – పాలపిట్ట జనవరి సంచికలో కథ

జాజర


నేను అహల్యను కాను ( పాలపిట్ట జనవరి సంచికలో కథ )

కొత్తగా వచ్చిన ఆ కుర్రాడి మీద గట్టిగా అరుస్తున్నాడు డైరక్టరు మూర్తి. పాపం ఆ కుర్రాడు నాటకాలకి కొత్తలా వుంది కాస్త బెదిరాడు. పక్కనున్న సుందర్రావు తగుదునమ్మా అని మూర్తికి నచ్చ చెప్పబోతే అతనికీ నాలుగు పడ్డాయి. విసుక్కుంటూ బయటొకొచ్చేసాడు సుందర్రావు. బయట సిగరెట్టు కాలుస్తూ నేనంతా గమనిస్తూనే ఉన్నాను. నన్ను చూడగానే సుందర్రావు ముందుకెళ్ళబోతూ ఆగిపోయాడు.
“చూడండి సార్! ఈ డైరక్టరు గాడి గోల. చస్తున్నాం” ఆఖరి పదం వత్తి పలుకుతూ అన్నాడు.
“ఆ పిల్లాడు బానే చేస్తున్నాడు కదా? మరి దేనికంతలా రెచ్చిపోతున్నాడు?” సిగరెట్టందిస్తూ అన్నాను.
“తిట్టడానికి కారణం వుండాలా సార్! మీరయినా వెళ్ళి చెప్పండి. లేకపోతే ఆ కుర్రాడు రేపట్నుండి రిహార్సల్స్ కి రాడు. అసలు కోపమంతా ఆ విజయలక్ష్మి రాలేదని..”
పరిషత్తు నాటక పోటీలకి నవోదయా నాటక సంఘం తరపున “నేను అహల్యను కాను” అనే నాటకం చివరి వడపోతలో నెగ్గి నాటకోత్సవాలకి ఎన్నికయ్యింది. ఇంకో రెండు వారాల్లో ఆ నాటక ప్రదర్శనుంది. ఆ నాటకం నేనే రాసాను.
“సర్లే నా మాట వింటాడనుకున్నావా? రాసిన నాటకాన్నే ఎన్ని సార్లు తిరగరాయించాడు. చెబుతే వినే రకం కాదు. ఆ రామకృష్ణొక్కడి మాటే వింటాడు.”
రామకృష్ణ ఈ నాటకంలో హీరో పాత్రధారి. తెలుగు నాటకరంగంలో కాస్త పేరున్న వాడు. నాలుగైదు నంది అవార్డులు కూడా వచ్చాయి. ఈ మధ్య అమెరికా వెళ్ళి కొన్ని ప్రదర్శనలు కూడా ఇచ్చొచ్చాడు. పదిహేనేళ్ళ క్రితం స్థాపించిన మా నాటక సంఘానికి మాంచి పేరే వచ్చిందప్పట్లో. నేనూ, మూర్తీ, సుందర్రావూ, రామకృష్ణా,విజయలక్ష్మి ఎన్నో విజయవంతమైన నాటాకాలు వేసాం. నటన కంటే రాయడమ్మీదే నాకు ఇష్టముండేది. మేం వేసిన అన్ని నాటకాలూ నేనే రాసాను.
ఎప్పుడయితే నంది అవార్డులు రామకృష్ణకొచ్చాయో అప్పట్నుండీ మా నాటకసంఘం చీలిపోయింది. తనవల్లే పేరొచ్చిందని మూర్తీ, లేదు తన నటన వల్లే నాటకం రక్తి కట్టిందని రామకృష్ణా పేచీలు పడ్డారు. దాంతో రామకృష్ణ వేరే నాటక సమాజానికెళ్ళిపోయాడు. ఆ యేడాది మేమొక నాటకం వేస్తే దానికి రచయితగా నాకు నందొచ్చింది. తన ఐడియా చెబితే నేను నాటకం రాసాను కాబట్టి ఆ అవార్డు తనకి దక్కాలని మూర్తి నా మీద ఎగిరాడు. అవార్డు కాకపోయినా కనీసం దాని నిమిత్తమొచ్చే బహుమతి సొమ్మయినా ఇవ్వాలంటూ గొడవ పెట్టాడు. నాటకానికి ఒక పాయింటు చెప్పచ్చు, కానీ ఆ పాయింటు చుట్టూ ఇతివృత్తమూ, పాత్రలూ అన్నే నేను కూర్చినవే కదాని వాదించాను. ఆ విధంగా నేనూ నవోదయా నాటక సమాజాన్నుండి తప్పుకున్నాను. దాదాపు పదేళ్ళ తరువాత మళ్ళీ కలిసాం. మూర్తి ఇంటికొచ్చి బ్రతిమాలాడు నాటకం రాయమని. రామకృష్ణని కూడా లాక్కొచ్చాడు. అలా అందరమూ ఈ నాటకం మొదలెట్టాము.
“విజయలక్ష్మి రాకపోతే ఆ పిల్లాడేం చేస్తాడు? అయినా రామకృష్ణా రాలేదు కదా?” సుందర్రావుతో అన్నాను.
“రామకృష్ణ లేటుగా వస్తానని ముందే చెప్పాడట. విజయలక్ష్మింతవరకూ ఒక్క సారీ రిహార్సల్స్కి రాలేదని ఒకటే గింజుకుంటున్నాడు. పాపం ఆ కుర్రాడు…”
విజయలక్ష్మి చాలా మంచి నటి. రూపం అంతంతమాత్రమే అయినా, ఏ పాత్రిచ్చినా సహజంగా నటిస్తుంది. ఇక్కడున్న నటులందరూ విజయలక్ష్మి తరువాతే, రామకృష్ణతో సహా!
మాటల్లో ఉండగా రామకృష్ణొచ్చాడు. వస్తూనే తనెంత గొప్ప నటుడో, మిగతా అందరూ తనని చూసి ఎలా నేర్చుకోవాలో ఉపన్యాసం ఇచ్చాడు. తెలుగు యూనివర్శిటీ నుండొచ్చిన ఆ కుర్రాడు రామకృష్ణకి బలయ్యి పోయాడు.
ఈ కళా రూపాలికొక మాయ వుంది. ఆవగింజంత తెలిసినా ఆకాశమంత తెలుసున్న ఫీలింగ్ కలగ చేస్తాయి. ప్రతీ కళాకారుడు ఈ మాయలోనే బ్రతుకుతాడు.
వస్తూ వస్తూ రామకృష్ణ విజయలక్ష్మి టీవీలో సీరియల్ ఒప్పుకుందన్న వార్త మోసుకొచ్చాడు. వచ్చే వారం నుండే అది మొదలవుతుందని చెప్పాడు. పిడుగులాంటి కబురు విని ఏం చెయ్యాలిరా దేవుడా అనుకుంటూ కూలబడ్డాడు మూర్తి.
“ఎందుకంత వర్రీ! విజయలక్ష్మితో నే మాట్లాడతానులే! అయినా ఒక్కరోజు రిహార్సల్ చాలు ఆవిడకి. నన్నడిగే అది కూడా అవసరం లేదు. స్క్రిప్టు చదువుకొని డైరక్టుగానే స్టేజి మీద చెయ్య గలదు. మిగతా నటులతో రిహార్సల్స్ కానియ్యి.” అంటూ మూర్తికి సర్ది చెప్పాను.
“ఆవిడ సరే మహానటి. మరి మిగతా ఆర్టిస్టులకీ ఆవిడేసే పాత్రతో సింకుండాలి కదా? పైగా మొత్తం నాటకమంతా ఆ పాత్రే వుంటుంది. ఇప్పటికప్పుడు కొత్త నటెక్కడ దొరుకుతుంది? దొరికినా చెయ్యగలగాలికదా? ఛ! ఈ నాటకం ఇహ స్టేజెక్కినట్లే! నే ముందు నుండీ అనుకుంటూనే ఉన్నాను. విజయలక్ష్మి ఇలా దెబ్బకొడుతుందని. ” విసుక్కున్నాడు మూర్తి.
“ఆ సీరియల్ డైరక్టరుకి పండగ చేసుంటుంది. అందుకే ముందనుకున్న ఆవిణ్ణి కాదని దీనికిచ్చాడు. ఇదిగో ఇలాంటి ‘లం…ల’ వల్లే తెలుగు నాటకం చస్తోంది. ఒకచోట ఒప్పుకుంటారు. ఎవడైనా వందరూపాయిలెక్కువిస్తానంటే అక్కడకి పోతారు. వ్యభిచారుల కంటే హీనం.” రామకృష్ణ దురుసుగా అన్నాడు.
రామకృష్ణకి నోరు జాస్తి. చుట్టుపక్కలెవరున్నదీ అన్న ధ్యాసే ఉండదు. అతనలా అలా నోరు పారేసుకోడంతో కోపమొచ్చింది నాకు.
రామకృష్ణ నోట్లో నోరు పెట్టడం నాకిష్టం లేదు. అందుకని మూర్తినే మందలించాను.
“మూర్తీ! తప్పు. అలా ఆవిణ్ణి తిట్టడం బాగో లేదు. అందరిముందూ అలా నోటి దురుసుతనం మంచిది కాదు. ఏం ఈ నాటకం వెయ్యకపోతే ఏమవుతుంది? వేరే ఇంకో నటిని వెతుకుదాం. అంతే కానీ విజయలక్ష్మిని తిట్టడం న్యాయం కాదు.” గట్టిగా, కటువుగా చెప్పాను.
నా మాటలు విని రామకృష్ణ మరీ రెచ్చిపోయాడు. విజయలక్ష్మి ఎవరెవరితో ఎలా వెళుతుందో బూతులు జోడించి మరీ చెప్పాడు. చుట్టుపక్కల ఆడవాళ్ళు లేకపోయారు కనుక సరిపోయింది. ఎవరైనా వింటే సిగ్గుతో చావాల్సిందే!
నాకెందుకో ఆ చర్చలో పాల్గొనడం ఇష్టం లేకపోయింది. సిగరెట్టు కాల్చుకుందామన్న వంకతో బయటకొచ్చేసాను. విజయలక్ష్మికీ నాటకాలంటే పడిచచ్చేటంతటి మక్కువేమీ కాదు. బ్రతుకు తెరువుకోసం వేషాలేస్తోంది. మొగుడు యాక్సిడెంటులో కాళ్ళు పోగుట్టుకున్నాడు. ఇద్దరు పిల్లలు. విజయలక్ష్మి పదో క్లాసు పాసయ్యిందంతే. కుటుంబాన్ని నెట్టుకు రావడానికి ఆమెకి నటనే ఉపాధి.
మరాఠీ, కన్నడా, మిగతా నాటకరంగాలితో పోల్చితే తెలుగు నాటకం చాలా వెనకబడుందనే చెప్పాలి. ముఖ్యంగా స్త్రీ పాత్రలు వేసే నటులు దొరకడం చాలా కష్టం. దొరికినా సరిగ్గా నటనుండదు. బాగా నటించే ఒకటీ, అరా నటీమణుల కోసం నాటక సమాజాలన్నీ పోటీ పడతాయి. అందరికీ ఒకటే ధ్యేయం;అది నంది గెలవడం. పైగా బాగా నటించే నటీమణులకీ ఈ నాటక సమాజాల గోలంతా తెలుసు. అందుకని వాళ్ళూ ఎక్కువే అడుగుతారు. ఇలాంటి బాలారిష్టాలు చాలా వున్నాయి. అందువల్ల చాలా నాటికల్లో స్త్రీ పాత్రలు తగ్గించేస్తారు. ఉన్నా ఒకటీ అరా వుంటాయి. విజయలక్ష్మి మంచి నటి కాబట్టి ఆమెకోసం ప్రతీ నాటక సమాజమూ ముందుగానే మాట్లాడు కుంటాయి. పైగా టీవీ సీరియెళ్ళ క్రేజెలాగూ ఉంది. ఎప్పుడు అవకాశం వస్తుందాని ప్రతీ నటుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. నాటకం ఒక కష్టమైన కళగా తయారయ్యింది. అందుకే నేనూ గత పదేళ్ళుగా నాటకాలు రాయడం మానేసాను. పాత స్నేహాల కోసం మరలా నాటకం వైపు చూసాను.
ఈ లోగా మూర్తి తనకి తెలుసున్న స్నేహితులకి కాల్స్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఎందుకో అందరికీ మూడ్ చెడిపోయింది.
కొంతసేపయ్యాక అనుకోకుండా విజయలక్ష్మి వచ్చింది. ఆమెతో పాటే ఇంకో అమ్మాయి కూడా వచ్చింది. తెల్లగా, నాజూగ్గా ఉంది. వయసు పాతికేళ్ళు దాటుండచ్చు. చూడ్డానికి పెళ్ళయినట్లుగానే ఉంది.
వస్తూనే విజయలక్ష్మి సీరియల్లో అవకాశమొచ్చిన సంగతి చెబుతూ, తన బదులుగా తెలుసున్న ఒక అమ్మాయిని ఆ పాత్రకి తీసుకొచ్చానని అంది.
“నువ్వులా మధ్యలో హేండివ్వడం ఏమీ బాగోలేదు విజయలక్ష్మీ!” మూర్తి నిష్టూరంగానే అన్నాడు.
“మూర్తిగారూ! మీరందరూ నాటకాన్ని ఎంత ప్రేమిస్తారో నేనూ అంతే! ఏం చెయ్యమంటారు? రాక రాక ఎక్కువ నిడివున్న పాత్ర సీరియల్లో వచ్చింది. ఎలా వదులుకో మంటారు చెప్పండి? ఎప్పుడూ చిన్నా చితకా పాత్రలకే టీవీలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే నాకు తెలుసున్నవాళ్ళ బంధువులామెను తీసుకొచ్చాను. నాటకాలంటే ఇష్టమేనని నాతో ఒకసారంటే ఈవిణ్ణి ఒప్పించి తీసుకొచ్చాను. మీరనుకున్నట్లు నేను హేండిచ్చే దాన్నయితే నా బదులింకొకర్ని తీసుకురాను.”
విజయలక్ష్మికి ధైర్యమెక్కువ. గట్టిగానే చెప్పింది. బహుశా ఈ నాటక సమాజాలతో కలిసి పనిజేసొచ్చిన అనుభవమేమో? మూర్తి కొత్త వాళ్ళని తీసుకోడానికి తటపటాయించాడు. పైగా ఆ వచ్చినావిడకి ఇదే మొడటి సారి నాటకం వెయ్యడం. నేను పరవాలేదు. రెండ్రోజుల్లో ఆవిడకే నటనలో సులువులు తెలుస్తాయని చెప్పాను. ఎంతటి మహానటులైనా ఎప్పుడో ఒక సారి మొదలు పెట్టాలి కదా? రామకృష్ణ నన్ను సపోర్టు చేసాడు.
“మూర్తీ! నీకేం వర్రీ వద్దు. మేమందరం ఉన్నాం కదా? కావాలంటే నేను శిక్షణిస్తాను. మన రైటరు సారెలాగూ ఉన్నాడు. ఆయనా చెబుతాడు. నువ్వూ ఉన్నావు. ఇంకెందుకీ అలోచన?”
చివరకి మూర్తి సరే నన్నాడు. ఆ వచ్చినావిడ పేరు వనజ. కాప్రా మండలాఫీసులో పనిజేస్తుందట. పెళ్ళయ్యింది కానీ పిల్లలు లేరనీ చెప్పింది. నాటకం స్క్రిప్టు ఇచ్చాను. ఆవిడ వేయబోయే పాత్ర గురించీ చెప్పాను. ఈ నాటకంలో పురాణాల్లో ఉన్న అహల్య కథ కొంతుంటుంది. నేటి స్త్రీ ఎదుర్కునే సమస్యా ఉంటుంది. రెండు కథలూ సమాంతరంగా వెళతాయి. చివర్లో రెండు పాత్రలకీ ఘర్షణుంటుంది. ఈ నాటకంలో నే చేసిన ప్రయోగం ఏమిటంటే రెండు పాత్రలూ ఒకామే వేస్తుంది. ఇంకో ఛాలెంజి ఏమిటంటే ఆ స్త్రీ పాత్ర సీను సీనుకీ మధ్య వేషం మార్చుకోవాల్సుంటుంది. చూడ్డానికి కాంప్లికేటెడ్గా అనిపించినా విన్నూత్న ప్రయోగం. వనజకి నెమ్మదిగా నాటకం ఎలా వెళుతుందీ వివరంగా చెప్పాను. ఆమెకూ బాగా నచ్చింది.
విజయలక్ష్మయితే అవలీలగా చేసేయగలదీ రెండు పాత్రలూ. పైగా వైవిధ్యం కూడా చూపించగలదు.
మొదట కాస్త బెరుకుగా నటించినా మూడో రోజుకి బాగానే నటించడం నేర్చుకుంది. మూర్తి అంతగా సంతృప్తి పడకపోయినా నాకు బాగానే చేస్తోందనిపించింది. రామకృష్ణా ఆమెని ప్రోత్సహిస్తూ మధ్య మధ్యలో సొంత నటన గురించి క్లాసులు పీకుతూనే ఉన్నాడు.
ఇలా రెండు వారాలు గడిచిపోయాయి. నాటకం ఒక గాడిలో పడింది. రెండు వారాల్లో వనజ నటనలో చాలా తేడా కనిపించింది. విజయలక్ష్మి లేని లోటు భర్తీ చెయ్యకపోయినా ఆ పాత్రని చెడగొట్టడం లేదన్న నమ్మకం మాకందరికీ కలిగింది, ముఖ్యంగా మూర్తికి.
రవీంద్ర భారతిలో నాటకోత్సవాలు మొదలు కావడానికి ఇంకా రెండ్రోజులున్నాయనగా వనజ నటించడం కుదర్దని కబురొచ్చింది. వాళ్ళాయనకి నాటకాలు వేయడం నచ్చలేదనీ, వెళితే కాపురం చెడుతుందని ఇహ నటించలేననీ ఒకతనిచేత కబురంపింది. ఈసారి మూర్తికి నిజంగానే హార్టెటాకొచ్చింది. మొత్తం అందరమూ డీలా పడి పోయాయాం. ఇన్నాళ్ళూ చేసిన రిహార్సల్స్ వృధా అయ్యాయి కదానుకున్నాము. ఆ వనజగారి మొగుడెవరో ముందే చెప్పేడవచ్చు కదాని అందరూ ఆయన్ని తిట్టి పోసారు. రామకృష్ణ యథాలాపంగా ఆడవాళ్ళందర్నీ తిట్టిపోసాడు. సినిమాలు చూసి అందరూ నటించాలనుకుంటారనీ, తీరా నటన దగ్గరకొచ్చే సరికి ఎవరికీ దాని మీద నిబద్ధతా, ఆసక్తి ఉండవంటూ సొంత బాకా తీసాడు.
ఇహ నాటకం వెయ్యడం కుదర్దని అందరూ ఒక నిర్ణయానికొచ్చే సారు. యుద్ధం చివరవరకూ వచ్చి అక్కడ పలాయనం చెయ్యడం నాకెందుకో మనసొప్పలేదు. ఎలాగయినా ఈ నాటకం ప్రదర్శన చెయ్యాలన్న తపన బయల్దేరింది.
వేంటనే విజయలక్ష్మికి కాల్ చేసాను. ఆమె ఇంటికి వస్తున్నానని చెప్పీ, వనజ చివర్లో మొహం చాటేసిన విషయం చెప్పాను. మొత్తానికెలాగయితేనే విజయలక్ష్మిని ఒప్పించాను. తను రిహార్సల్స్కి రాలేను కానీ ఇంటి దగ్గర ప్రాక్టీసు చేస్తాననీ, నాటకం ప్రదర్శన ముందు రోజు రాత్రి రిహార్సల్స్కి వస్తాననీ చెప్పింది. ప్రదర్శనరోజు మాత్రం తను రిహార్సల్స్ చెయ్యననీ, ఇవన్నీ నచ్చితేనే ఒప్పుకుంటానంది. విజయలక్ష్మి షరతులేం పెట్టినా కాదనే స్థితిలో లేను. సరే నన్నాను. మూర్తికీ, మా వాళ్ళకీ కబురందించాను. మూర్తి మూర్తీ ఒప్పుకున్నాడు. అందరికీ విజయలక్ష్మొచ్చిందన్న ధైర్యమొచ్చింది. ఎందుకంటే ఆమె సహజ నటి. పైగా మొత్తం డైలాగులన్నీ కంఠస్థం చేస్తుంది. ఇన్నాళ్ళ నా అనుభవంలో ఆమె ఎప్పుడూ ఒక్క డైలాగు కూడా దూళ్ళేయడం నేను చూళ్ళేదు.
చివర్లో అనుకున్నట్లుగా అన్నీ సవ్యంగానే జరిగాయి. ప్రదర్శన ముందురోజు రాత్రి రిహార్సల్స్కి విజయలక్ష్మి అన్ని డైలాగులూ బట్టీ పట్టేసింది. ఆ రాత్రి రెండు సార్లు రిహార్సల్స్ వేసాం. రామకృష్ణ కూడా ఆశ్చర్యపోయాడు విజయలక్ష్మి నటనచూసి.
మర్నాడు సాయంత్రం మా నాటకం వంతొచ్చింది. మాదే చివరి ప్రదర్శన. ఆ రాత్రి పోటీలో నెగ్గిన నాటకాలకి బహుమతులిస్తారు.
మా నాటక ప్రదర్శన బాగా వచ్చింది. చూసినందరూ విజయలక్ష్మికి అవార్డు రావడం ఖాయం అనుకున్నారు. నాకయితే యుద్ధం గెలిచినా గెలవకపోయినా వెనుతిరగలేదని గర్వపడ్డాను. నాటకం పూర్తవ్వగానే కంగ్రాట్స్ చెబుదామని డ్రెస్సింగ్ రూం వద్దకెళ్ళాను. వెళ్ళే సరికక్కడ మా వాళ్ళందరూ గుంపుగా మూగారు. ఏమిటాని చూస్తే రామకృష్ణ అందర్నీ తోసుకుంటూ వచ్చాడు. వెనకే విజయలక్ష్మి అరుపులు వినిపించాయి. నాకేం అర్థం కాలేదు. వేంటనే పక్కనున్న సుందర్రావుని అడిగాను. అహల్య పాత్రలో బాగా నటించావంటూ రాంకృష్ణ విజయలక్ష్మ్ని ఏదో చెయ్యబోయాడట. దాంతో ఆవిడ చెంపదెబ్బ కొట్టిందనీ చెప్పాడు. మూర్తికీ, నాకూ ఏం జరిగిందో తెలీలేదు. విజయలక్ష్మి ఏడుస్తూ కనిపించింది. అనవసరంగా పదిమంది ముందూ చులకన అయిపోతామని చెబుతూ ఊరుకోమని సర్ది చెప్పాను. మూర్తి వెళ్ళి రామకృష్ణని బయటకి పంపేసాడు.
మా అందరికీ ఓ పదినిమిషాలు ఏం జరిగిందో తెలీలేదు. ఇంతలో నాటక నిర్వాహకులొచ్చారు. ఏమీ లేదని చెప్పి పంపేసాము.
ఓ గంట వరకూ విజయలక్ష్మి ఎవరితోనూ మాట్లాడలేదు. మేమెవరమూ సాగదీయ దలుచుకోలేదు.
ఆ సాయంత్రం బహుమతీ ప్రదానోత్సవానికి రామకృష్ణొచ్చాడు కానీ ప్రేక్షకుల మధ్యే కూర్చున్నాడు. నేనూ, మూర్తీ, విజయలక్ష్మీ ముందు వరసలో కూర్చున్నాం. విజయలక్ష్మికి ఉత్తమనటి బహుమతొచ్చింది. మంత్రి గారి నుండి బహుమతి తీసుకుంటూండగా మాట్లాడాలంటూ మైకు తీసుకుంది విజయలక్ష్మి.
“అహల్యగా నా నటన చూసి మీరందరూ మెచ్చుకున్నారు. నాకీ బహుమతిచ్చారు. నాటికీ, నేటికీ స్త్రీ పరిస్థితి ఏమీ మారలేదు. మృగ మహారాజుల చేతిలో ప్రతీ స్త్రీ ఒక అహల్యే! నాటకంలో పాత్రలో లీనమయ్యి నటించినందుకు నా సహనటుడు డ్రెస్సింగ్ రూంలో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆనాడు అందం అహల్యకి శాపమయితే, ఈనాడు నాకు నటన శాపం. సిగ్గు విడిచి ధైర్యంగా నేను చెప్పగలిగుతున్నాను కానీ, పైకి గొంతిప్పని వ్యధలెన్నో ఉన్నాయి. అంగుళానికొక అహల్య శాపగ్రస్తురాలవుతూనే ఉంది…దీనికెవరు కారణం? ఆడవాళ్ళుగా పుట్టిన మేమా? పుట్టించినా ఆ భగవంతుడా?” అంటూ ఆవేశంగా మాట్లాడింది.
మేమందరమూ అవాక్కయ్యాం. రామకృష్ణ అక్కడనుండి భయంతో బయటకెళ్ళడం చూసాన్నేను. విజయలక్ష్మి అలా స్టెజీమీద చెబుతుందని ఎవరూ ఊహించలేదు.
జనంలో కాస్త కలకలం బయల్దేరింది. ఏం గొడవ జరుగుతుందోననుకున్నాం. మంత్రిగారు చర్య తీసుకుంటామని పోలీసు కంప్లైంటు ఇవ్వమనీ సెలవిచ్చారు. ఏమయ్యిందో తెలీదు ఆ తరువాత విజయలక్ష్మి మాత్రం పోలీసు ఎస్కార్టుతో వెళ్ళింది. మేమెవ్వరమూ అక్కడకి వెళ్ళలేకపోయాం.
అనవసరంగా గొడవలవుతాయనీ, మీడియా వాళ్ళు మమ్మల్ని వెంబడిస్తారనీ భయపడుతూ గబగబా బయటకొచ్చేశాం నేనూ, మూర్తీ!
అదే ఆఖరు సారి నేను విజయలక్ష్మిని చూడ్డం. ఆ మర్నాడు టీవీలో ఈ వార్తొచ్చినా సాయంత్రమయ్యేసరికి ఎక్కడా లేదు. పేపర్లు కూడా అంతగా ప్రాధాన్యతనివ్వ లేదు.
నేను రాసిన ఆఖరి నాటకం అదే. ఆ తరువాత నాటక ప్రదర్శనల జోలికే పోలేదు.
కాలం గిర్రున తిరిగింది. రామకృష్ణ టీవీ నటుడయ్యాడు. మూర్తిని కలిసి రెండేళ్ళు దాటింది. విజయలక్ష్మి కూడా టీవీ సీరియల్లోనూ, సినిమాల్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది.
ఓ సారి అనుకోకుండా విశాఖపట్నం పెళ్ళికెళ్ళి వస్తూంటే ఎయిర్ పోర్టులో విజయలక్ష్మి కనిపించింది.
దూరం నుండి నన్ను చూడగానే వచ్చి పలకరించింది. తను చెన్నై ఫ్లైటు కోసం వెయిట్ చేస్తున్నాననీ, ఫ్లైటు గంటాలస్యమని చెప్పింది. నాకూ ఇంకా టైముండడంతో ఇద్దరం కబుర్లలో దిగాం. ఆ రోజు నాటకం అయ్యాక ఏం జరిగిందీ అడుగుదామనిపించింది. మళ్ళా ఎందుకు కదపడం అని ఊరుకున్నాను. ఉండబట్టలేక చివరికి నేనే అడిగాను. నా ప్రశ్న విని గట్టిగా పగలబడి నవ్వింది.
“ఓ అదాండీ! ఆ రామకృష్ణ గాడికి నన్ను ముట్టుకునే ధైర్యమా చెప్పండి. వాడొట్టి పిరికి సచ్చినాడు. వాడేం నా మీద చెయ్య వెయ్యలేదు. వేస్తాడేమో ననుకుని నేనే ఒకటిచ్చాను. దాంతో భయపడి చచ్చాడు..” అంటూ గట్టిగా నవ్వింది.
ఎందుకో విజయలక్ష్మిని నమ్మ బుద్ధి కాలేదు. నిజంగానా అన్నట్లు చూసాను. నా భావం గ్రహించిందనుకుంటాను. వెళుతూ తనే అంది.
“మీతో అబద్ధమెందుకు కానీ సారూ! రామకృష్ణ నిజంగానే చెయ్యి వేసాడు. అత్యాచారం చెయ్యబోయాడు. కానీ అది నా మీద కాదు. వనజ మీద. పైకి చెప్పుకోలేక కుమిలి కుమిలి ఏడ్చింది. మొగుడికి తెలిస్తే చంపేస్తాడు. రామకృష్ణిలా చేసాడని చెప్పినా ఎవరూ నమ్మరు. అందరూ ఆమెనే శంకిస్తారు. అందుకే మౌనంగా తప్పుకుంది. నాటకాల మీద ఇంత మక్కువున్న మగాళ్ళు ఎక్కడనుండో ఆడాళ్ళు వచ్చి నటించాలనే ఎందుకుకోరుకుంటారు సార్? వాళ్ళింట్లో ఆడవాళ్ళనే నటించమనచ్చుగా? అలా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళాలు పతివ్రతల్లా ఉండాలి;వాళ్ళు పవిత్రంగా ఉన్నా లేకపోయినా! అంతే సార్! గౌతముడైనా, ఇంద్రుడైనా, రామకృష్ణయినా అందరికీ ఆడదే అలుసు! బండ చేసినా, బలాత్కారం చేసినా బలయ్యేది ఆడదే. రామకృష్ణ గాడిదకి పదిమంది ముందూ బుద్ధి చెబుదామనే ఆ నాటకం ఆడాను. ఊర కుక్కలకి నందులతో పని కానీ, జీవితాలతో కాదు. అందుకే ఆ నందులు అందే చోటే నిప్పంటించాను.”
అదిరిపోయాను.
వెళ్ళొస్తానని చెబుతూ అంది – “ప్రతీసారీ నేను బ్రతకడం కోసం నటించేదాన్ని. ఆసారి మాత్రం ఒక అహల్య కోసం నటించాను.“
మాట పెగల్లేదు.
నేను కేవలం నాటక ప్రయోక్తని మాత్రమే. ఆమె ప్రవక్త. నా నాటకం బ్రతికిందని సంబరపడ్డాను.
0000000000000000000

-సాయి బ్రహ్మానందం గొర్తి

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. Venkat said

    Very Good Story!

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: