కథ-2009 – నేను రాసిన “అతను” కథ

జాజర

జాజర

ఈసారి కథ-2009 ఆవిష్కరణ ఈ నెల 21న తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతుంది.

ఈ కథ-2009 లో నేను క్రితం ఏడాది రాసిన “అతను” కథ కూడా చోటు చేసుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

ఆ వివరాలిక్కడ ఇస్తున్నాను. హైద్రాబాదులో ఉంటే ఔత్సాహికులైన వాళ్ళు వెళ్ళండి. కథలగురించి చర్చలు జరుగుతాయి. కాస్తో కూస్తో కొత్త విషయాలు తెలుస్తాయి.


ఆహ్వానం

ఈ “అతను”కథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ మధ్య కథల క్రింద రచయితల ఫోన్ నంబరు కానీ, ఈమెయిలు కానీ ఇస్తున్నారు. అందువల్ల పాఠకులు నేరుగా రచయితతో తమ అభిప్రాయాలని పంచుకునే అవకాశముంది. ఈ “అతను” కథకి అప్పట్లో పాఠకులనుండి చాలా అంటే 200 పైగా ఈమెయిళ్ళు వచ్చాయి. ఆ పరంపర చూసి చాలా ఆశ్చర్యపోయాను. అవన్నీ దాచిపెట్టాను. ఎప్పటికయినా కథా సంకలనం వేస్తే అందులో అవి ప్రచురిస్తాను.

పరిచయంలేని పాఠకులు కథపై విశ్లేషణలు చేస్తూ రాసారు. వ్యక్తుల పరిచయం లేనప్పుడు నిర్భయంగా, నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పడానికి వీలుంటుంది. అదే పరిచయమున్న వ్యక్తులూ, మిత్రులయితే భిన్నంగా ఉంటుంది. తోటి రచయితలయితే చెప్పనవసరం లేదు. నొచ్చుకుంటారనో, ఎక్కడ రిలేషన్లు చెడుతాయనో అసలేం చెప్పరు. ఎప్పుడైనా కలిసినప్పుడు కొంతమందిని “నా కథ ఆంధ్రజ్యోతిలోనో, ఆంధ్రభూమిలోనో వచ్చిందని చెప్పామనుకోండి, “అలాగా? చదవలేదంటారు”. మరికొంతమంది రచయితలయితే “మేం ఇంకోళ్ళ రచనలు చదవం; చదివితే వాళ్ళవి చూసి ఇంఫ్లూయన్స్ లేదా ప్రభావితమయ్యే అవకాశముందని” చెప్పడంతో ఎవరికీ నా రచనల గురించి చెప్పడం మానేసాను. కనిపిస్తే వాళ్ళే చదువుతారులే అనుకుంటాను.

చాలాసార్లు రచనకీ, పాఠకుడికీ మధ్య రచయితొచ్చి కూర్చుంటాడు. రచన్ని దాని వస్తు నాణ్యతని బట్టి కాకుండా రచయితమీద పాఠకుడికుండే అభిప్రాయాన్ని బట్టి బేరీజు వెయ్యడం తరచు చూస్తూ ఉంటాం. అందువల్ల వ్యక్తిగతంగా కిట్టనివాళ్ళు ఏం రాసినా చెత్తలాగానే ఫీల్ అవుతారు. అభిప్రాయాలు మారితే తప్ప అలాంటివాళ్ళని ఓపట్టాన ఒప్పించలేరు. అలాంటి ప్రయత్నం చేయడం కూడా వ్యర్ధం. ఇంకొంతమందుంటారు. ఎదుటివారి రచన బావుందంటే వాళ్ళు ఓ మెట్టు క్రిందకి పడిపోయామనుకొని బెట్టుగా “బానే వుంది; ముగింపే ఇంకోలా ఉండివుంటే బావుండేది. మీరు పలానా వారి కథలు చదవండి. కథలెలా రాయాలో తెలుస్తుంది.” అంటూ కథోపదేశం చేస్తారు.
ఏ రచన్నయినా రచయిత తన భుజాల మీద ఎంతకాల మొయ్యగలడు? రచనలు నిలవాల్సింది రచయితల భుజాల మీద కాదు; పాఠకుల మనసుల్లో!

ఏ రచనయినా దానికాళ్ళ మీద అది నిలబడినప్పుడే దాని గొప్పతనం బయటపదేది. మొహమాటపు మెచ్చుకోళ్ళూ, బలవంతపు పొగడ్తల కంటే దూరంగా ఉన్న నిశ్శబ్దపు చప్పట్ళే రచయితలకి కాస్త వూతమిస్తాయి.

కొంతమంది చదవకుండానే పొగడ దండలేసి ఉక్కిరిబిక్కిరి చేస్తేస్తారు. పొగడ్త ధూపమయితే పరవాలేదుకానీ, పొగయితే ఊపిరాడదు.

ఈ ప్రపంచంలో పొగడ్తలు కిట్టని వారెవరుంటారు? పైకి వద్దాన్నా మనసెప్పుడూ అర్రులు చాచుతూనే వుంటుంది. స్థితప్రజ్ఞత అన్న పదం కళాకారుల నిఘంటువులో ఉండదు. దీనికి మినహాయింపెవ్వరికీ వుండదు; నాతో సహా!

పొగడ దండలేసినా వెయ్యకపోయినా, ఏ రచనయినా, ముఖ్యంగా కథలు, ఏ ఒక్క పాఠకుణ్ణయినా ఒక్క నిమిషంపాటు ఆలోచింపచేసినా ఆ రచనకి సార్ధకత లభించినట్లే!

ప్రకటనలు

5 వ్యాఖ్యలు »

  1. అబ్రకదబ్ర said

    ఇంతకీ నేను పొగిడే రకమా, తెగిడే రకమా, ఇన్‌ఫ్లుయెన్సౌతానకుకునే రకమా, ఇనన్నీ కాని ఉంకో రకమా.

    మీరు దీనికిచ్చే సమాధానాన్నిబట్టి మిమ్మల్నీ పై రకాల్లో ఓ దాంట్లో వేసెయ్యాల్సొస్తుంది మరి 😀

  2. కామేశ్వర రావు said

    బ్రహ్మానందం గారు,
    నా అభిప్రాయం కరకుగా అనిపిస్తే క్షమించండి. కథ చదివిన తర్వాత కలిగిన భావాలు కచ్చితంగా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను.
    ఆడవాళ్ళ గురించిన సెంటిమెంటు తప్పిస్తే, ఈ కథ ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడడానికీ కథ సీరీస్‌లో చోటు చేసుకోడానికీ వేరే ఏ కారణమూ నాకు కనిపించ లేదు. ఈ కథలో పస్తావించిన సమస్య గురించి ఇందులో కొత్తగా చూపించిన కోణం కాని, కొత్తగా చెప్పిన విధానం కాని నాకు కనిపించ లేదు. ఒక పాత్ర వ్యక్తిత్వం ఎంత బలహీనంగా ఉన్నా, కేవలం ఆడదైన కారణంగా, ఆ పాత్ర మీద సింపతీ, సపోర్టు కలిగించాలనుకోవడం సమంజసంగా లేదు. వర్మ పాత్ర హిప్పోక్రసీని చూపించడం, ఉత్పల భర్త పాత్ర ద్వారా మగాళ్ళందరూ చాలా వరకూ ఒక రకమే అని నిరూపించడం, ఉత్పల పాత్రలో పెద్ద లోపం లేదని చూపించడం – వీటి కోసమే కథ అల్లారని అనిపించింది.
    ఉద్యోగం విషయమై, పెళ్ళికి ముందే ఉత్పల తన భర్తతో చర్చిందో లేదో స్పష్టంగా లేదు. అంత ముఖ్యమైన విషయం గురించి, ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉండి కూడా, మాట్లాడకపోవడం చాలా అసహజమైన విషయం. లేదా ఆ పాత్ర లోపం. ఒక వేళ చర్చించి, దానికి ప్రభాకర్ ఒప్పుకొని తర్వాత మాట ఫిరాయించి ఉంటే, ఉత్పల అతన్ని “మంచివాడే” అనడం హాస్యాస్పదం.
    అమెరికాలో పై చదువుకోసం అక్కడ స్థిరపడ్డ అతన్ని పెళ్ళి చేసుకుంటూ, తను చదివిన చదువు “నిస్వార్థంగా” ప్రజలకు ఉపయోగపడుతుందని ఉత్పల ఎలా అనుకుందో అర్థం కాదు. ఒకవేళ అప్పుడు అమెరికాలో డాక్టరు ఉద్యోగం చెయ్యాలన్న ఉద్దేశమే ఉంటే, హఠాత్తుగా నిస్వార్థ సేవ ఎందుకు గుర్తుకు వచ్చినట్టు?
    ఇవన్నీ ఉత్పల పాత్రలో జాగ్రత్తగా కప్పివేయబడ్డ లోపాలు. ఇలాంటి లోపాలతో ఉన్న పాత్ర పట్ల సహానుభూతి ఎలా కలుగుతుంది? ఒకవేళ కలగకపోతే కథ పరమార్థం ఏమిటి?

    • gorthib said

      కామేశ్వర రావు గారూ,

      మీరు కథ చాలా హడావిడిగా చదివారనీ, అంతకంటే హడావిడిగా కామెంట్ రాసారని చెప్పగలను. మీరు లేవనెత్తిన ప్రశ్నలన్నీ కథలో ఉన్నాయి. కాస్త ఓపిగ్గా చదవండి. మంచితనానికి మీరిచ్చే అర్థం ఏమిటి? ఉత్పల నిస్వార్థంగా ప్రజలకి సేవ చేస్తుందని ఎక్కడా లేదు. అది మీ ఊహ. కథలో లేనిది మీరు వేలెత్తి చూపడం భావ్యం కాదు. మనుషులకి అవసరం మాత్రమే వుందని అంటే అది నిస్వార్థమెలా అవుతుంది. పనిచేస్తూ అందుబాటులో ఉండకూడదా?

      కథకి ఉండాల్సిన లక్షణాల్లో వస్తొవొక్కటేనా? ఇంకేమీ ఉండవా? అవేవీ మీకు కనిపించలేదా?
      మీకు కథ నచ్చకపోతే నేనేమీ అనుకోను.

  3. కామేశ్వర రావు said

    బ్రహ్మానందంగారు,

    చదవడంలో హడావిడి లేదు కాని బహుశా వ్యాఖ్య హడావిడిగానే రాసాను . ఒక పాఠకుడిగా ఒక కథ చదివి వెంటనే నాకు కలిగిన ఆలోచనలను యథాతథంగా పెట్టాను. సాధారణంగా ఏ పాఠకుడైనా అదే చేస్తాడనుకుంటాను.
    మీరు చెప్పాక మళ్ళీ రెండు సార్లు కథని సావధానంగా చదివాను. కాని నా ప్రశ్నలకి జవాబులు దొరకలేదు. బహుశా నేను సరిగా అర్థం చేసుకోడం లేదేమో.

    “కథకి ఉండాల్సిన లక్షణాల్లో వస్తొవొక్కటేనా? ఇంకేమీ ఉండవా? అవేవీ మీకు కనిపించలేదా?”
    వస్తువొక్కటే కాదనే నేనూ అనుకుంటాను. కాని వేరే ప్రత్యేకతలు ఏవీ కనిపించలేదనే నేనన్నాను. Again, may be I am missing something. కొందరు మిత్రుల చేత కూడా ఈ కథ చదివించి వారేమైనా నేను చూడని కొత్త విషయం చూడగలరేమో తెలుసుకుంటాను.

    కథలో ఉన్నది – “అమెరికాలో మెడికల్ చదువుదామని అనుకున్నాను. ఈ పెళ్ళికి అంగీకరించడానికి అదీ ఒక కారణం కూడా. తీరా అమెరికా వచ్చాక నేననుకున్నవేవీ జరగలేదు.”

    దీనిబట్టి పెళ్ళికి ముందే తన ఆలోచనలని ఉత్పల ప్రభాకర్ తో చర్చించిందా లేదా అన్న విషయం స్పష్టమవ్వ లేదు.

    “మంచితనానికి మీరిచ్చే అర్థం ఏమిటి?”

    మంచితనానికి నేను అర్థమో నిర్వచనో చెప్పలేను. కాని, జీవితానికి సంబంధించి ముఖ్యమైన విషయంలో మాట మీద నిలబడనివాడు, భార్య తన కంటే ఎక్కువ సంపాదిస్తే భరించలేనివాడు, డాక్టరు మొగుడినని చెప్పుకోవడం ఆత్మన్యూనతగా భావించేవాడు, ముఖ్య విషయంలో కూడా భార్య ఇష్టాయిష్టాలు పట్టించుకోనివాడు నా దృష్టిలో “మంచివాడు” కాడు.

    “ఉత్పల నిస్వార్థంగా ప్రజలకి సేవ చేస్తుందని ఎక్కడా లేదు. అది మీ ఊహ. కథలో లేనిది మీరు వేలెత్తి చూపడం భావ్యం కాదు.”

    కథ చివరి పేజిలో ఉన్నదిది: “మేం చదివిన చదువు నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడాలని మెడిసిన్ చదివేటప్పుడు మా చేత ప్రమాణం చేయిస్తారు. కాని నేనేం చేస్తున్నాను?” దీనిబట్టి ఉత్పలకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చెయ్యాలన్న ఆలోచన వచ్చిందని అనుకోవడం తప్పా? కానప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు?

    నా ప్రశ్నలకి మీరు జవాబు చెప్పాలని నేను ఆశించడం లేదు. ఇక్కడికి వచ్చే ఇతర పాఠకులెవరైనా (ఉదా. అబ్రకదబ్రగారు) నేను మిస్సవుతున్న అంశాన్ని వివరిస్తారేమో అన్నదే ఆశ.

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: