భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి – 2


జాజర

ఆరాధనా కవిత్వం :

కేవలం విరహమూ, ప్రేమ మాత్రమే కాదు – భగవంతుని స్తుతినీ,ఆరాధన్నీ కవితా పుష్పాలతో అలంకరించిన తత్వం కృష్ణ శాస్త్రిది. భాగ్య రేఖ చిత్రం లో రాసిన ఈ క్రింది పాట భక్తి భావానికి పీట వేసిన ఓ సుమధుర గీతం.

నీవుండేదా కొండపై
నా స్వామీ. నే నుండే దీ నేలపై
నీ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో

శ్రీ పారిజాత కుసుమాలెన్నో పూచే
ఆ పేద రాలి మనస్సెంతో వేచే
నీ పాద సేవా మహా భాగ్యమీవా

నా పై నీ దయ జూపవా నా స్వామీ || నీవుం డేదా ||

భగవంతుని కృప కోసం ఆర్తితో అర్థించే భక్తురాలి విన్నపంలో జాలి ఉంది. అందులో కవి హృదయ నివేదన దాగుంది. అలాగే రామాయణ కావ్య గొప్పతనం అతి సులభంగా చెప్పిన ఈ పాట చూస్తే మనసు కరుణ ప్రాయంగా మారుతుంది.

ఏమి రామ కథ శబరీ, శబరీ
ఏదీ మరియొక సారీ
ఏమి రామ కథ – రామ కథా సుధ
ఎంత తీయనిదీ శబరీ – శబరీ || ఏమి రామ కథ ||

భక్త శబరి చిత్రంలో ఈ పాటలో రెండు దృశ్యాల చిత్రీకరణ దాగి ఉంది. శబరి రాముడికి ఎంగిలి చేసిన పళ్ళని సమర్పిస్తే – “అవి ఎంతో తీయగా ఉన్నాయి, ఏదీ మరియొక సారీ ” అంటూ అవి తినే రాముడు కనిపిస్తాడు. రామ దర్శనం కోసం ఎదురు తెన్నులు చూసిన శబరి ఆనందం కనిపిస్తుంది. ఇది ఒక చిత్రం. రెండోది. రామా కథా మృతం – ఎన్ని సార్లు తాగినా దాహం తీరదు. ఇంకా ఆ సుధని సేవించాలానే మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇలా రెండు దృశ్యాల్ని నాలుగు వాక్యాల్లో కమనీయం గా చుట్ట గలిగిన ప్రతిభ ఈ పాటలో కనిపిస్తుంది.

సంపూర్ణ రామాయణం సినిమాలో “అదిగో రామయ్యా – ఆ అడుగులు నా తండ్రివి..” పాటలో రాముడి రాక కోసం పరితపించే శబరి ఆత్రుతని ఎంతో కమనీయంగా రాసారు.

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతోంది.
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది.

ఎందుకో – ఎందుకో – ప్రతీ పలుకూ ఏదో చెప్పబోతుంది.
వనము చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది.
ఉండుండీ నా వళ్ళు ఊగి ఊగి పోతుంది.
అదిగో రామయ్య – ఆ అడుగులు నా తండ్రివి,

ఇదిగో శబరీ శబరీ వస్తున్నదీ

రాముడొస్తాడన్న ఆశతో జీవించే శబరికి ఆయన రాక ముందుగానే ప్రకృతిలో కనిపించింది. రాముని రాక శబరికే కాదు, ఆ వనానికి కూడా సంతోషమే!

అలాగే బంగారు పంజరంలో ఈ పాట అద్వితీయం – ఆపాత మధురం.

పదములు చాలు రామా
నీ పద ధూళులే పదివేలు
నీ పదములు చాలు రామా || పదములు ||

ఇందులో పదాల పొందికా, భావాల ఒద్దికా చక్కగా కనిపిస్తుంది!

అలాగే భక్త తుకారాం చిత్రంలో –

ఘనా ఘన సుందరా – కరుణా రస మందిరా
అది పిలుపో మేలుకోలుపో
అతి మధుర మధురమౌ ఓం కారమౌ
పాండు రంగ పాండురంగ

అనే పాట భక్తులకు నిజంగా ప్రాభాత మంగళాలతో ఓ మేలు కోలుపే !

దేముడు కరుణిస్తే ప్రకృతి కూడా తన స్వభావాన్ని మార్చుకుంటుందంటూ చెప్పే ఈ భక్తి గీతం చూస్తే దేవులపల్లి వారి భావుకత తెలుస్తుంది.

శ్రీ శైల మల్లన్న శిరసొంచేనా
చేనంతా గంగమ్మ వానా !
తిరుమలపై వెంకన్న కనిపిస్తేనా
కరుణించు ఎండా వెన్నెల నైనా

శిరస్సోంచితే గంగా, కరుణిస్తే ఎండా వెన్నెలగా కురుస్తుందన్న పల్లె ప్రజల భక్తి భావాన్ని ఎంతో సహజంగా చెప్పిన పాటది.

“ఉండమ్మా బొట్టు పెడతా” సినిమాలో ఈ పాట మనిషిలో దాగున్న దైవత్వాన్ని చూడమనీ పరోక్షం గా తెలుపుతుంది.

అడుగడుగున గుడి ఉందీ
అందరిలో గుడి వుందీ
ఆ గుడిలో దీపముంది
అదియే దైవం

హృదయమే ఒక గుడి అంటూ అందరిలోనూ ఆత్మ ఒక్కటే అన్న తత్వ చింతన ఉందీ పాటలో.

అదే సినిమాలో ఇంకో పాటలో “రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా” అంటూ, తెలుగు వాకిట ముగ్గేసి, సంక్రాంతి రంగులు వెదజల్లీ, పండగ సందడి చూపిస్తుంది.

ఈ గంగ కెంత దిగులూ
ఈ గాలి కెంత గుబులూ
కదలదయా రామా,
నా హృదయంలా నావా

అంటూ రామ వనవాసం లో గుహుడు నది దాటించే ఘట్టాన్ని అతి దయనీయంగా వర్ణించిన తీరులో ఆవేదన ఉంది. కష్టాలకెవరూ అతీతం కాదు అన్న వేదాంతం దాగుంది. ఈ పాట ఎన్ టి రామారావు తీసిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోది. అనారోగ్యంలో ఉన్నా రామారావు గారి అభ్యర్థన కాదన లేక రాసిన పాట. ఇందులో కృష్ణ శాస్త్రిగారి జీవితమూ ఉంది.

సుఖ దుఖాలు:

ఎంతటి మహా వృక్షాన్నైనా చిన్న వేరు పురుగు ఎలా దొలిచేస్తుందో, అలాగే ఎంతటి మహా వ్యక్తినైనా కష్టాలు కుంగదీస్తాయి. చిన్న వయసులో కూతురి హఠాన్మరణం, కేన్సర్ వ్యాధి బారిన బడడం, వెంబడి 1964 లో స్వర పేటిక తొలగించబడడం అన్నీ ఒకదాని వెనుక ఒకటి ఆయన్ని కుంగదీసాయి. కవిత్వాన్ని వెనక్కి నెట్టేసాయి. చివరకి ఆకాశవాణి హైద్రాబాదు ఉద్యోగాన్ని కూడా వదులుకునేలా చేసాయి. సరిగ్గా ఆ సమయంలోనే పాలగుమ్మి పద్మరాజు గారు “సుఖ దుఖాలు” అనే సినిమాకి పాటలు రాస్తున్నారు. ఊరికే ఖాళీగా ఉండే బదులు పాటలు రాయచ్చు కదా అని అడిగితే సరేనని తిరిగి చిత్ర రంగ ప్రవేశం చేసారు. “సుఖ దుఖాలు” సినిమాలో రెండు పాటలు – “ఇది మల్లెల వేళయనీ, వెన్నెల మాసమనీ”, “మేడంటే మేడా కాదూ, గూడంటే గూడూ కాదూ” రాసారు. కొంత విరామం తర్వాత ఆయనలో కవిత్వం మళ్ళీ మొగ్గతొడిగింది. పరిమళాలు వెదజల్లింది.

ఇది మల్లెల వేళయనీ – ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ – విందులు చేసింది
కసిరే ఏండలు కాల్చునని

ముసిరే వానలు ముంచునని
యెరుగని కొయిల యెగిరింది
చిరిగిన రెక్కల వొరిగింది – నేలకు వొరిగింది

మరిగి పోయేది మానవ హ్రుదయం – కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు – వాడని వసంత మాసం
వసి వాడని కుసుమ విలాసం

ద్వారానికి తారా మణి హారం – హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో – మొగసాల నిలిచెనీ మందారం

“ఇది మల్లెల వేళయనీ – ఇది వెన్నెల మాసమనీ “ అనే పల్లవి చూసి చాలామంది ఇదేమిటి? ఎక్కడా మల్లెల వేళ ఉండదు. వెన్నెల మాసముండదు. ఉంటే వెన్నెల వేళ ఉండాలి లేదా మల్లెల మాసముండాలంటూ అనేక మంది విమర్శించారు. దానికి జవాబుగా – ” తొందర పడి ఒక కోయిలా ముందే కూసిందని – ఈ పాట పల్లవిలోనే సందర్భం చెప్పడం జరిగింది. వెన్నెల మాసం, మల్లెల వేళా అన్న భావం తొందర పడే కోయిలదే నని స్ఫురించేలా రాసిందంతే అంటూ దేవులపల్లి చెప్పారు. ఇక్కడ “వసి వాడని కుసుమ విలాసం” అన్న వాక్యంలో వసి పద ప్రయోగంతో మరింత అందం వచ్చింది. వసి అంటే “ఉత్సాహమూ లేదా తాజాదనం ( ఫ్రెష్ )” అని అర్థం వచ్చేలా వాడడంతో వాక్యానికి నవ్యత చేకూరింది.

ఈ పాటతో మళ్ళీ తెలుగు సినిమా పాటకి మళ్ళీ వసంతాన్ని తీసుకొచ్చారు కృష్ణ శాస్త్రి.

శృంగార గీతాలు – యుగళ గీతాలు:

ఆశ్లీలత మరకలు అంటకుండా మనసుల మధ్య సున్నిత బంధాల్నీ ప్రణయ గీతికలుగా మార్చడంలో ఆయనకి ఆయనే సాటి. చీకటి వెలుగులు అనే సినిమాలో ఓ యుగళ గీతం ఉంది. అది –

చీకటి వెలుగుల కౌగిలిలో
చిందే కుంకుమ వన్నెలు
ఏకమైన హృదయాలలో
పాకే బంగరు రంగులు

ఆ మెడ చుట్టూ గులాబీలూ
ఈ సిగ పాయల మందారాలూ

ఎక్కడివీ రాగాలూ
చిక్కని ఈ అరుణ రాగాలూ

అందీ అందని సత్యాలా
సుందర మధుర స్వప్నాలా

మరచిపోకుమ తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ

భావుకత కౌగిలిలో ఇరుక్కుపోయిన ప్రేయసీ ప్రియుల హృదయాల్లో అరుణ రాగాలు పూయిం చిన ఈ అందమైన పాటలో కవితాత్మ పుష్టిగా ఉంటుంది.

గోరింటాకు అనే చిత్రంలో ఇంకో యుగళ గీతంలో ప్రేయసీ ప్రియులిద్దరూ ప్రేమ దొంగలుగా వర్ణించ బడుతూ, వారిద్దరి అభిమానాన్నీ చమత్కారంగా రాసారు.

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం – ఇన్నాళ్ళూ – ఇన్నేళ్ళూ

పిలిచి పిలిచినా పలుకరించినా పులకించదు కదా నీ ఎద
వుసురొసుమనినా, గుసగుస మనినా ఊగదే నీ మది

తలుపులు మూసుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా
మూసువున్నవని తలపులు చొర బడతారా ఎవరైనా
మరి దొరవో – దొంగవో దొరికావు ఈనాటికీ
దొరనూ కానూ – దొంగను కానూ – నంగనాచి నసలే కానూ

అవ్యక్తమైన ప్రేమని ప్రకటించడం ఈ పాటలో ఉన్న గమ్మత్తు. పదభూయిష్టమైన ఈ పాటలో తలపుల్నీ, తలుపుల్నీ మార్చి మార్చి రాయడం వల్ల మరింత కొత్తదనం ఉట్టిపడింది

పెళ్ళికాని ప్రేయసీ ప్రియుల విరహం వేరు, పెళ్ళైన దంపతుల విరహం వేరు. రెంటికీ ఉన్న సన్నని తేడాని, బలిపీఠం సినిమాలో ఓ విరహ గీతంలో సరళంగా చెప్పిన తీరు అద్భుతం.

వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తూ, పిల్లలున్న భార్యా భర్తల మధ్య విరహాన్ని, కుటుంబం చుట్టూ చెప్పిన ఈ పాట ఆయన సభ్యతా శృంగారానికి చిహ్నం. ముద్దుని పిల్లల మీదుగా ప్రేయసికి జార్చే ఈ పాటలో విరహం ఉంది. వేదన ఉంది.

కుశలమా నీకు కుశలమేనా?
మనసు నిలుపుకో లేక మరీ మరీ అడిగాను – అంతే అంతే

చిన్న తల్లి ఏమంది?
నాన్న ముద్దు కావాలంది.

పాలుగారు చెక్కిలిపైనా పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవులపైన దేవి గారికొకటి

ఇదే పాటలో ఇంకో చరణంలో “పూలగాలి రెక్కలపై పంపిన కబుర్లూ, నీలి మబ్బు పాయల్లో వొంపిన కళ్ళూ” వద్దన్నా విరహాన్ని మనసుకి చుట్టేస్తాయి.

ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేన
పూల గాలి రెక్కల పైన నీలి మబ్బు పాయల పైనా
అందేనా అందేనా ?

ఇలా ఎన్నో ప్రేమ గీతాల్ని రాసారు. ఒక్కొక్కటీ ఒక ఆణిముత్యం. రాసిన ప్రతీ పాట ఒక ప్రత్యేకతని సంతరించుకున్న పాటే!

ముందు తెలిసినా ప్రభూ
ఈ మందిరమెటులున్నదో
మందమతిని – కాస్త ముందు తెలిసినా ప్రభూ

ఈ పాటలో అనుకోకుండా విచ్చేసిన ప్రియుడి రాకతో కంగారు పడ్డ ప్రేయసి అభిమానం కనిపిస్తుంది.

కేవలం ప్రేమ గీతలకే పరిమితం కాలేదు. విరహ గీతాలూ రాసారు. ప్రేయసీ ప్రియుల బాధల్నీ, ఆవేదల్నీ ఆయన పాటలో చుట్టేసారు.

రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం
రాలిన సుమాలు ఏరుకొనీ
జాలిగ గుండెల దాచుకునీ
ఏ దూరపు సెమనో చేరుకొనీ

అంటూ విరహాన్ని కూడా తనదైన శైలి లో చెబుతూ మనసుని గిచ్చ గలిగిన కవుల్లో దేవులపల్లి ఒకరు. ఈ పాట మాయని మమత అనే సినిమాలోది.

భార్య భర్తల మధ్య కోపాలనీ, తాపాలనీ చివరకి విడిపోవడాన్ని కూడా ఎంత హృద్యంగా చెప్పచ్చో ఈ పాట చూస్తే తెలుస్తుంది.

నేలతో నీడ అన్నది
నను తాక రాదనీ
పగటి తో రేయి అన్నదీ
నను చూడ రాదనీ
తన భర్తనే తాకరాదనీ
ఒక భార్య అన్నది..

భార్యా భర్తల బంధం విడదీయ రానిదని ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలరు? ఈ పాట “మంచి రోజులొచ్చాయి ” సినిమాలోది.

ఒకే కుటుంబం అనే సినిమాలో రాసిన ఈ క్రింది పాటలో వయసొచ్చీ, మొదటి సారి ప్రేమ స్పర్శ కు గురైన అమ్మాయి లో ఏదో తెలియని తనం కనిపిస్తుంది.

అవునే – తానే – నన్నేనే – నిజమేనే

అంతా కధలేనే – అమ్మో – ఎనెన్ని వగలోనే

అబ్బ – ఎమని చెప్పేనే – నేనేమని చెప్పేనే

జరిగేనే – ఇల ఒరిగేనే – వొళ్ళు తగిలేనే – అయ్యో నా కళ్ళు తిరిగేనే

ఈ బుగ్గ పైనే – ఆ గోటితోనే

ఇదిగోనే – ఇదిగోనే – పగలేనే – ఎన్నెని వగలోనే

వొట్టేనే – కొంగు పట్టేనే – బలె పట్టేనే అంటూ – గిలిగింత పెట్టేనే

అంతా గుట్టేనే – అంటూ ఎత్తేనే

ఆ పైనే – ఆ పైనే – పగలేనే – ఎన్నెని వగలోనే

ఈ పాటలో వయసు బాధని మాటల గారడీతో ఎలా చిత్రీకరించారో తెలుస్తుంది.

ఎన్ని పాటల గురించని రాసేది? ఏ పాట చూసినా కృష్ణ శాస్త్రి హృదయం కనిపిస్తుంది. అంతర్లీనంగా ఆయన ముద్ర ఉంటుంది.

ప్రకృతి గీతాలు:

ఏ కవైనా ప్రకృతిని తన కవిత్వంలో చూపిస్తాడు. కానీ కృష్ణ శాస్త్రి తీరు వేరు. ప్రకృతిలోకి ఆయన కవిత్వం సుతారంగా దూరిపోతుంది. అక్షరాల్ల్లో ఒదిగి పోతుంది. ఆకులూ, పూవులూ, కొమ్మలూ, రెమ్మలూ, చిగుళ్ళూ, కోయిల్లూ, మొగ్గలూ, వెన్నెల్లూ వీటిని కవితా వస్తువుగా చేసుకొని దేవులపల్లి చేసినట్లుగా రస సృష్టి ఇంకెవరూ చేయలేదు. లలిత గీతాలయినా, సినీ గీతాలయినా సరే అతి మధురంగా సాగుతుంది ఆయన కవితా ఝరి.

ఆకులో ఆకునై
కొమ్మలో కొమ్మనై
నునులేత కొమ్మనై
ఈ అడవిని సాగి పోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా?

అప్పట్లో రేడియోలో వచ్చిన ఈ లలిత గీతం విన్నప్పుడల్లా వసంతాన్ని తీసుకొస్తుంది. ఇదే పాట “మేఘ సందేశం” సినిమాలో కూడా వచ్చింది. సీతామాలక్ష్మి అనే సినిమాకి రాసిన ఈ కింది పాటలో ఎంత తియ్యదనం ఒట్టిపడుతుందో చెప్పనలవి కాదు.

మావి చిగురు తినగానే
కోవెల పలికేనా

కోవెల గొంతు వినగానే
మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమవునో కానీ – ఆమనీ, ఈమనీ

అంటూ కోయిల గొంతులో వసంతాన్ని పలికించడం ఆయనకే సాధ్యం. ఈ పాటలో “కోయిల పలికేనా” అని ఉండాలి. కోవెల అంటే గుడి అని అర్థం ఉంది కదా? మరి ఈ కోవెల పలకడం ఏమిటి? ” అని సినీ ప్రముఖులు విమర్శిస్తే, “పల్లెటూరి భాష ఒక రకమైన యాసతో ఉంటుంది. ఆ యాసలో కోయిలనీ, కోవెల గానే పలుకుతారు. సినిమాలో ఈ పాట పాడే నాయికా, నాయకులిద్దరూ చదువురాని వాళ్ళు. కాబట్టి వారి గొంతులోంచి కోవెల అనే రావాలి కానీ, కోయిల అని రాస్తే సందర్భోచితంగా ఉండదు. అయినా కోయిలకి పర్యాయ పదంగా కోవెల అని కూడా వాడచ్చు. ఎందుకంటే కోవెల అంటే కోయిల అనే అర్థం కూడా ఉంది.” అని దేవులపల్లి జవాబిచ్చారు.

ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకూ
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ

అంటూ “ఈనాటి బంధం ఏనాటిదో” సినిమాకి రాసిన పాట ఆయనకీ ప్రకృతిపై ఉన్న మమకారం తెలుస్తుంది.

ఇంకా “గోరింటాకు” అన్న సినిమాలో రాసిన ఈ పాటలో ఎన్ని పద చిత్రాలున్నయో చెప్పనవసరం లేదు.

గోరింటా పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
ఎంచక్కా పండీన ఎర్రన్ని చుక్క
చిట్టీ చేమంతానికి శ్రీ రామ రక్ష
కన్నె పేరంటానికి కలకాలం రక్ష

ఆకులు కూడా పూస్తాయన్న భావంలో ఎన్ని రంగులు చూపించారో అనిపిస్తుంది.

దేవులపల్లి వారిని చాలా మంది కవులు ఆదర్శంగా తీసుకొని కవిత్వం రాసారు కానీ ఆయన స్థాయికి వెళ్ళ లేకపోయారు. వేటూరి సుందరామ్మూర్తి పాటల్లో కూడా ఇటువంటి చాయలు కనిపిస్తాయి కానీ అయన శైలి వేరు.

దేశ భక్తి గీతాలు:

కేవలం భావ గీతాలతో, శృంగార గీతాలతో ఆగిపోలేదు. వస్తువేదైనా ఆయన పాట మాత్రం వీనూల విందే. అందర్నీ ఉత్తేజ పరిచే ఎన్నో దేశ భక్తి గీతాలు రసారు.

జయ జయ ప్రియ భారత జనయిత్రీ ధివ్య ధాత్రి
జయ జయ సత సహస్ర నర నారీ హృదయ నేత్రి

జయ జయ జయ సుశ్యామల
సుశ్యామ చలచ్చేలాంచల

జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా

ఈ పాట తెలియని తెలుగు వాళ్ళు లేరూ అంటే అతిశయోక్తి కాదు. ఈ పాట కూడా ముందు రేడియోలో వచ్చింది. తరువాత “రాక్షసుడు” సినిమాలో వాడుకున్నారు. ఈ పాటలో వందేమాతరం, జనగణమన గీతాల ఛాయలు కనిపిస్తాయి. కృష్ణ శాస్త్రిగారు కొంత కాలం శాంతినికేతన్ లో గడిపారు. ఆయనపై రవీంద్ర నాధ్ ఠాగూర్ ప్రభావం ఉందని అంటారు.

అలాగే – తెలుగు పాట పై పాట రాసిన ఘనత కూడా వీరిదే ! తెలుగు తనం గురించీ, తెలుగు భాష గురించీ ఆయన రాసిన పాట ఇప్పటికీ, ఎప్పటికీ అజరామరం.

పాడనా తెలుగుపాట పరవశమై – మీ ఎదుట – మీ పాట
పాడనా తెలుగు పాట

కోవెల గంటల గణ గణలో – గోదావరి తరగల గల గలలో

మావుల పూవుల మోపులపైనా – మసలే గాలుల గుసగుసలో

మంచి ముత్యాల పేట – మధురామృతాల తేట – ఒక పాట || పాడనా

త్యాగయ క్షేత్రయ రామదాసులు – తనివితీర వినిపించినది

నాడు నాడులా కదిలించెది – వాడ వాడలా కనిపించెది

చక్కెర మాటల మూట – చిక్కని తేనెల వూట – ఒక పాట || పాడనా

వళ్ళంత వయ్యారి కోక – కళ్ళకు కాటుక రేఖ

మెళ్ళో తాళి – కాళ్ళకు పారాణి – మెరిసే కుంకుమ బొట్టు

ఘల్లు ఘల్లున కడియాలందెలు – అల్లనల్లన నడయాడె

తెలుగుతల్లి పెట్టని కొట – తెనుగును నాటె ప్రతిచోట – ఒక పాట || పాడనా

మాటలతో కోటలు కట్టి, పదాల గారడీ లో తెలుగు తనానికి మంచి ముత్యాల పేట కట్టీ, మధురా మృతాల తేట రుచి చూపించిన పాటిది. తెలుగు పాట అంటే “చక్కెర మాటల మూట – చిక్కని తేనెల వూటంటూ” ప్రతీ హృదయం లోనూ తెలుగును నాటిన ఈ పాట అజరామరం అనడంలో సందేహ మెవరికీ ఉండదు. ఈ పాట అమెరికా అమ్మాయి సినిమాలోది. ఒక విదేశీ వనిత తెరపై పాడుతూ కనిపించే ఈ పాట పి. సుశీల పాడారు.“మావుల పూవుల మోపులపైనా – మసలే గాలుల గుసగుసలో“ అన్న వాక్యాల్లో ఎంత భావుకత నిండి యుందో కదా?

ఇలా ప్రతీ పాట గురించీ ఎన్ని వాక్యాలైనా రాయచ్చు. ఎంత రాసినా మిగిలే వుంటుంది.

మిగిలినవి:

దాదాపు 350 సినిమా పాటలకు పైగా రాసారు. రాశిలో ఇప్పటి సినీ కవులతో పోలిస్తే తక్కువేమో కానీ ఒక్కొక్క పాట వంద పాటల ఎత్తు. అందుకే ఇప్పటికీ తెలుగు వాళ్ళ నోళ్ళలో కృష్ణ శాస్త్రి పాటలు నానుతూనే ఉంటాయి. తత్వం అయినా, వేదాంతం అయినా, ఆశావాదం ఏదైనా సరే ఆయన కవిత్వంలో చొరబడితే చాలు వాటికొక కొత్త అర్థం, రూపూ వస్తాయనడంలో సందేహం లేదు.

రాజ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ సినిమాలో పాటలో, నిరుద్యోగంతో సతమత మవుతూ ఉండడానికి ఇల్లు లేకా, తన వాళ్ళంటూ ఎవరూ లేని ఒక నిరుపేదలో కూడా ఆశలు పండించగల మహాకవి దేవులపల్లి.

నా పేరు బికారి
నా దారి ఎడారి
మనసైన చోట మజిలీ
కాదన్న చోట బదిలీ

తోటకు తోబుట్టువునూ
ఏటికి నే బిడ్డనూ
పాట నాకు సైదోడు
పక్షి నాకు తోడు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు
అసలు నా మరో పేరు ఆనంద విహారీ

కూటికి నే పేదనూ
గుణములలో పెద్దనూ
సంకల్పము నాకు ధనము
సాహసమే నాకు బలము
ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
అంతవరకు నేనొక నిరంతర సంచారీ !

ఆ నిరుద్యోగి ఏకాకి అన్న బెంగ లేదు. తోడునీ, నీడనీ, తోబుట్టువుల్నీ, స్నేహితుల్నీ అందర్నీ చూపించడమే కాదు, ఇన్ని ఉన్న నాకంటే ఆనందంగా ఎవరు విహరించ గలరూ అంటూ ఈ విశ్వంలో ఒంటరి తనం అనేదే లేదంటూ ఎంత ఘనంగా చెప్పారో అనిపిస్తుంది. రెండవ చరణంలో బాహ్య ప్రపంచంలో వస్తువులు గొప్పా, లేక గుణాలు గొప్పా అన్నది సున్నితంగా చెబుతూ నిరాశావాదంలో కూడా ఆశవాదాన్ని నిండుగా నింపగల మహా కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి.

రాసుకుంటూ పోతే ఎన్ని రోజులైనా పట్టచ్చు. అందుకే కొన్ని పాటల విశిష్టతైన చూస్తే చాలు మనసు వెన్నెల డోలలూగుతుంది.

రాలిన వసంతం:

ఈ కవికోకిల ని కళా ప్రపూర్ణ బిరుదుతో ఆంధ్రా యూనివర్శిటీ వాళ్ళు సత్కరించారు. సాహిత్య అకాడమీ అవార్డు తో అలంకరించారు. భారత ప్రభుత్వం 1976 లో పద్మ భూషణ్ బిరుదు నిచ్చారు. ఇలాంటివెన్నిచ్చినా ఆయన ప్రతిభకి తక్కువే అవుతుంది.

1981 వ సంవత్సరంలో “వెళ్ళొస్తానంటూ” కవితా వసంతాన్ని మనకొదిలేసి శలవు తీసుకుంది ఆయన కవిత్వం. మనిషి మన మధ్యలేకపోయినా ఆయన కవిత్వం ఉంటుంది. తెలుగు చిత్ర సీమలో తారలెన్ని ఉన్నా జాబిల్లి మాత్రం ఖచ్చితంగా దేవులపల్లే! వెన్నెలా, జాబిల్లీ, వసంతం, ఇవన్నీ ఆయన సొంతం. తెలుగు సినిమా పాట ఉన్నంత కాలమే కాదు, వసంతం ఉన్నన్నాళ్ళూ కృష్ణశాస్త్రి కవిత్వం చిరస్మరణీయంగా ఉంటుంది.

( దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఎన్నో రచనలు చేసారు. ఆయన రాసిన కృష్ణ పక్షం” అందరికీ సుపరిచితమే ! కేవలం సినిమా పాటల్లో ఆయన కవితా ప్రతిభని మరో సారి స్మరించుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. )

(ఈ వ్యాసం నవతరంగంలో వచ్చింది.)

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

  1. jaggampeta said

    devulapalli mahaneeyudi.thank you

  2. kvrn said

    దేవులపల్లి గారికి మంచి నివాళి.

  3. చక్కగా వివరిస్తూ రాశారు. నాకెంతో ఇష్టమైన పాటలన్నీను. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి ఎంతసేపు చదివినా తనివి తీరదు. దాచుకొని చదువుకోవాల్సిన వ్యాసం.

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: