పాలపిట్ట పత్రికలో శ్రీ బాలమురలీకృష్ణపై నా వ్యాసం

జాజర


నాద రవళి – బాల మురళి

తెలుగు వారికీ, తెలుగు భాషకీ సంగీతంతో అవినాభావ సంబంధముంది. సాహిత్యం అంటుంచి, ఒక్క సారి చరిత్ర తరిచి చూస్తే సంగీతంలో తెలుగు వారి అవిరళ కృషి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కర్ణాటక సంగీత పురోగాభివృద్ధిలో తెలుగువారి కృషి హిమాలయం. మొదట్లో సంగీత శాస్త్ర రచనలన్నీ సంస్కృతంలోనే వున్నా, 13వ శతాబ్దం తరువాత తెలుగులో చాలా గ్రంధాలొచ్చాయి. శ్రీనాధుడి కాలం నాటి పెదకోమటి వేమారెడ్డి “సంగీత చింతామణి” అనే గ్రంధాన్ని తెలుగులో రాసాడు. ఆ తరువాత అన్నమయ్యా, నారాయణ తీర్థులూ, వేంకట మఖీ, క్షేత్రయ్యా, రామదాసూ, త్యాగరాజూ ఇలా ఎందరో సంగీతాభివృద్ధికి కారణ భూతులయ్యారు. తమదైన శైలిలో అభివృద్ధి పరిచారు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక సంగీతాన్ని సశాస్త్రీయంగా మలిచి జనరంజకంగా చేయడానికి దోహదపడ్డారు. కర్ణాటక సంగీతాన్నీ, తెలుగు వారినీ, భాషనీ వేరు చేసి చూడడం ప్రస్తుతం అసాధ్యం. ఎంతోమంది సంగీత కారులు తమ రచనలన్నీ తెలుగులోనే చేసారు. భాషా పరంగా తెలుగు పదాలన్నీ అకార, ఇకార, ఉకారాంతాలతో ముగుస్తాయి. సప్తస్వరాలైన స,రి,గ,మ,ప,ద,ని కూడా అకార, ఇకారాంతాలతోనే ఉండడం వల్ల తెలుగు భాష సంగీత భాషలా రూపు దిద్దుకుంది. సంగీతానికి తెలుగు భాష నప్పినంత సులువుగా మరే భాషా నప్పదంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం వున్న కర్ణాటక సంగీతం వెనుక ఎందరో తెలుగు వారి కృషీ, శ్రమా, దీక్షా, అభిరుచీ మిళితమై ఉన్నాయి. వేంకటమఖి లాంటి ప్రముఖులు సంగీత శాస్త్రానికి ఒక రూపు ఇచ్చినా, కర్ణాటక సంగీతాన్ని మాత్రం పెద్ద మలుపు తిప్పిన ఘనత త్యాగరాజుకే దక్కుతుంది. అంతకుముందు క్షేత్రయ్యా, రామదాసూ, నారయణ తీర్థుల వారి కృషి ఉన్నా, యావత్తు దక్షిణ భారతంలోనూ తెలుగులోనే సంగీత రచనలకి శ్రీకారం చుట్టింది త్యాగరాజే! సంగీతాన్ని పదిమంది వద్దకీ చేర్చడమే కాదు, వ్యవహారిక భాషలో రచనలు చేసి సంగీతంపై ప్రజలకి మక్కువ కలిగించింది కూడా త్యాగరాజనే నిస్సందేహంగా చెప్పగలం. ఆ తరువాత ఎంతో మంది సంగీతకారులు తమ రచనల్ని తెలుగులో చేయడం మనకి తెలుసు.

త్యాగరాజు శిష్యగణం ఆయనందిచ్చిన సంగీత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ విశేష కృషి జరిపారు. వారిలో ఎక్కువమంది తమిళులే ఉన్నారు. త్యాగరాజుపై ఉన్న అనన్య గౌరవంతో, తెలుగు మాతృ భాష కాకున్నా, నేర్చుకు మరీ రచనలు చేసారు. త్యాగరాజు తరువాత అంతటి ప్రతిభా, ప్రజ్ఞా ఉన్న తెలుగువారు తక్కువే వున్నా, ఆయన తరువాత అంతటి ప్రతిభ ఉన్న ఏకైక వాగ్గేయ కారుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. తనగాత్ర మాధుర్యంతో ఆబాల గోపాలాన్నీ పరవశింపజేసీ, పండిత పామురుల ప్రశంసలందుకున్న మహా మహా విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ.

నాద మురళి
ప్రస్తుతమున్న అతి కొద్ది మంది వాగ్గేయకారుల్లో మంగళంపల్లి వారిదే ప్రథమ స్థానం. ఒక కృతీ లేదా పాటకి స్వరాన్నీ, సాహిత్యాన్నీ కూర్చడమే కాకుండా తన గాత్రాన్ని కూడా వాటికి అందించే వాడే వాగ్గేయకారుడు. నూటికి పైగా కీర్తనలూ, పలు వర్ణాలూ, తిల్లానాలూ, జావళీలూ స్వరపరిచి కొత్త కొత్త రాగాలని సృష్టించిన తెలుగు వాగ్గేయకారుడు బాలమురళీ కృష్ణ. తెలుగు వారిగా ఆయన్ని చూసి మనమందరం గర్వ పడాలి.

అతి పిన్న వయసులోనే సంగీత సారాన్ని అలవోకగా గ్రహించిన ఉత్పాత ఘనుడాయన. తన ఎనిమిదో ఏటనే కచేరీ ఇచ్చి సంగీత ప్రపంచాన్ని తనవైపుకి మళ్ళించుకున్నాడు. ఆయన గాత్ర పటిమ పండితుల్నీ, విజ్ఞుల్నీ అబ్బురపరిచింది. పదిహేనేళ్ళ చిరు ప్రాయంలోనే వాగ్గేయకార రూపం దాల్చాడు.

అప్పటికే కర్ణాటక మహా మహులైన జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, సాంబమూర్తీ, పార్థ సారధీ వంటి దిగ్గజాల మెప్పుని పొందీ ఎటువంటి రాగాన్నయినా తన గొంతులో పలికించగలడనీ, ఎంత క్లిష్ట సంగీత రచనయినా తన గొంతులో అతి సునాయాసంగా పాడగలడనీ నిరూపించుకున్నాడు.
ఈయన ప్రతిభ గురించి ఒక చిన్ననాటి సంఘటనుంది. సంగీతకారుడైన టి.ఎస్.పార్థ సారధి 1950లో ఆకాశవాణిలో పనిజేసేవారు. అప్పటికి బాలరమురళికి ఇరవై ఏళ్ళు. ఆయన దగ్గర అసిస్టెంటుగా ఆకాశవాణిలో సంగీత కార్యక్రమాలు నిర్వహించే వాడు. ఓ సారి పార్థ సారధికి చేతి వ్రాతతో ఉన్న ఒక పుస్తకం ఇచ్చీ, దాన్ని చదివి ముందుమాట రాయమని అడిగారట. ఏమిటా పుస్తకమని జూస్తే 72 మేళకర్త రాగాల పైనా స్వరాలతో సహా కొన్ని పాటలున్నాయి. ఏమిటని అడిగితే అవి తన స్వీయ రచనలని చెబుతూ ఆ పుస్తకానికి “జనకరాజ కృతి మంజరి” అని పేరు పెట్టానని బాలమురళి చెప్పారట. అది చూసి నమ్మశక్యంకాక అందులో రెండు కృతుల్ని పాడమని పార్థ సారధి అడిగితే సుచరిత, రాగవర్ధని రాగాల్లో పాడి వినిపించి ఆశ్చర్యంలో ముంచెత్తారట. ఈ విషయాన్ని పార్థ సారధి స్వయంగా రాసారు. అలా ఆకాశవాణిలో పనిజేస్తున్నప్పుడే ఎన్నో పాటలకి స్వరాల్ని కూరాచారు. ‘ఏమీ సేతురా లింగా’, ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితీ’, ‘అదిగో భద్రాద్రీ’, ‘శ్రీరామ నామం మరువాం’ వంటి ప్రసిద్ధి చెందిన పాటలకి స్వరకర్త బాలమురళే! స్వరాలు లేని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు “స్మరవారం వారం”, “పిబరే రామరసం” వంటి పాటలకి ఈయనే వరసలు కట్టారు. అవి వింటే ఇవే అసలు వరసలాన్నంత గొప్పగా ఉంటాయి. ఈయన సంగీత సారధ్యంలో వచ్చిన భద్రాచల రామదాసు కీర్తనలు తెలుగు నాట ప్రతి ఇంటా ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉన్నాయి.
పాట పాడడంలో బాలమురళిది ప్రత్యేక శైలి. గాయకులందరూ హిందోళం పాడతారు. తోడి రాగం పాడతారు. కానీ బాలమురళి పాడితే అవే రాగాలు కొత్తగా వినిపిస్తాయి. పరిచయమున్న రాగాలని కూడా ప్రత్యేకంగా పాడి తనదైన గాయక ముద్ర వెయ్యడం ఆయన కచేరీల్లో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. పలు రాగాలలో ఎంతో పట్టు వుంటే కానీ అలా తనదైన బాణీలో పాడడం కష్టం. దానికి నిరంతర సాధనా, కృషీ కావాలి. బాలమురళికివి దైవదత్తంగా లభించాయి.

తన గాత్ర శైలిలో ఏ మాత్రం కృత్రిమత లేకుండా స్వరవిన్యాసం చేయడం వింటూనేవుంటాం. మంద్ర స్థాయినుండి తారాస్థాయి వరకూ అలవోకగా గొంతుని ఎటుకావాలంటే అటు, ఎలాకావాలంటే అలా, ఎంతసేపు నిలపాలంటే నిలుపుతూ, అలా పాడడం ఆయన ప్రత్యేకత. స్వరాలనూ, అక్షరాలనూ స్పష్టంగా ఉచ్ఛరిస్తూ ఎక్కడ నిలుపులు కావాలంటే అక్కడ నిలుపుతూ, తొట్రు లేకుండా వేగంగా పాడడం అందరికీ తెలుసు. ఎనభై ఏళ్ళు పై బడినా ఆయన గొంతులో శ్రావ్యతా, స్పష్టతా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే గొంతు. అదే మాధుర్యం.

వాగ్గేయ మురళి

సాధారణంగా కర్ణాటక సంగీత రాగాల్లో కనీసం అయిదు స్వరాలుండాలని వేంకటమఖి “చతుర్దండి ప్రకాశిక”లో చెబుతారు. చాలామంది ఈ పుస్తకాన్ని ఒక శాస్త్రీయ గ్రంధంగా భావిస్తారు. అయిదు స్వరాలే ఉన్న రాగాలని ఔడవ ( ఔడవం అంటే అయిదు ) రాగాలంటారు. అందరికీ తెలుసున్న మోహన, హంసధ్వనీ, మధ్యమావతి రాగాలు దీని క్రిందకే వస్తాయి. ఈ పద్ధతికి విరుద్ధంగా బాలమురళి కృష్ణ కేవలం నాలుగంటే నాలుగు స్వరాలతో కొన్ని రాగాలు స్వరపరిచారు. మహతి, గణపతి, సర్వశ్రీ, లవంగి వంటి కొత్త రాగాల్ని కనుక్కున్నారు. వీటి ఆరోహణా, అవరోహణా సంచారంలో మూడు లేదా నాలుగు స్వరాలు మించుండవు. ఉదాహరణకి మహతి రాగంలో స,గ,ప,ని స్వరాలే మాత్రమే వాడారు. లవంగి రాగంలో స,రి,మ,ద మాత్రమే ఉంటాయి. సర్వశ్రీ ( స,మ,ప ) రాగంలో కేవలం మూడు స్వరాలే ఉంటాయి. ఇవన్నీ ఆయన గొంతుతోనే వింటే వాటి గొప్పదనం తెలుస్తుంది. ఇలా రాగ ప్రకరణకి కొత్త సొబగులందించారు.

కానీ కొంతమంది సంగీతకారులు ఈ ప్రయోగాలని ఖండిస్తూ విమర్శించారు. ఇలా రాగాల్లో కేవలం నాలుగే స్వరాలు వాడడం త్యాగరాజు స్వరపరిచిన వివర్ధని (ఆరో. స,రి,మ,ప ) నవరస కానడ (ఆరో. స, గ,మ,ప ) రాగాల ఆరోహణలో చేసాడనీ, ఇందులో కొత్తగా కనుక్కుకున్నదేమీ లేదని అంటారు. త్యాగరాజు ఆరోహణలో నాలుగు స్వరాలు మాత్రమే వాడడం నిజమే అయినా, అవరోహణలో కూడా నాలుగు స్వరాలే వాడిన ఘనత బాలమురళి గారికే సొంతం. ఎన్ని వాదనలు చేసినా బాలమురళి ప్రతిభా, సంగీతాన్వేషణా ఏమాత్రం తగ్గ లేదు. ప్రపంచం నలుమూలలా ఆయన గాత్ర మాధుర్యం వినిపిస్తూనే ఉంది.

బాలమురళి స్వీయ రచనల్లో ముఖ్యంగా చెప్పుకో తగ్గవి తిల్లానాలు. పదికి పైగా తిల్లానాలు స్వరపరిచారు. హిందోళం, బృందావని, ద్విజావంతి, కుంతలవరాళి, కదనకుతూహలం, బేహగ్, గరుడధ్వని, గతి భేద ప్రియ రాగమాలిక, ఠాయ రాగమాలికలు వీరి తిల్లానా రచనలు.కదనకుతూహల రాగంలో స్వరపరిచిన తిల్లానా చాలా ప్రసిద్ది చెందింది. తరచూ కచేరీల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈయన కచేరీల్లో ఎక్కువగా ఈయన స్వీయ రచనలే పాడుతున్నారన్న అభియోగం కూడా వుంది. అలా పాడడంలో తప్పేమీ కనిపించదు. పదిమందికీ ఆయన రచనలెలా తెలుస్తాయి? ఇది అర్థం లేని వాదన.

కొత్త రాగాల్లో స్వీయ రచనలే కాకుండా గ్రహ భేదం ( దీన్నే శ్రుతి భేదం అని కూడా అంటారు ), ఠాయము అనే సంగీత ప్రక్రియల్ని కూడా ప్రవేశ పెట్టారు. ఠాయము అంటే స్వర స్థాయి. రాగానికున్న ఆధార షడ్జమం కాకుండా మరొక స్వరాన్ని ఆధార శ్రుతి చేసుకొని వేరే రాగచ్ఛాయల్ని తీసుకు రావడాన్ని గ్రహభేదం అంటారు. ఉదాహరణకి మాయా మాళవ గౌళ రాగ స్వరాలని ఆధారంగా చేసుకొని గ్రహ భేదంలో పాడితే రసిక ప్రియ, సింహేంద్ర మధ్యమ రాగాలొస్తాయి. ఇంతకు మించి వివరణ ఇక్కడ అనవసరం. ఒకర్ ఆగం తీసుకొని గ్రహభేదం చేస్తూ మరొక రాగంలో పాడుతూ ఆ రాగంలో కొన్ని స్వరాలని వదిలేసి వేరొక రాగంలో పాడాడాన్ని ఠాయమంటారు. ఈ పద్ధతిలో బాలమురళీ కృష్ణ ప్రియ రాగమాలికనే తిల్లానానీ, కళ్యాణి రాగ ఆధారంగా ఠాయ భేద రాగమాలికనీ రచించారు. ఇవన్నీ కూలంకషంగా అర్థం కావాలంటే సంగీత పరిజ్ఞానం కాస్తయినా ఉండాలి. రాస్తే అర్థమయ్యేవి కావు. లెక్కకు తీసుకుంటే 120పైగా కృతులూ, ఓ డజను వర్ణాలూ, పదికి పైగా తిల్లానాలూ, జావళీలు ఈయన స్వరపరిచారు. రాగాలున్నా స్వరాలు లేని అన్నమయ్య కృతులూ, రామదాసు కీర్తనలకి స్వరం కట్టారు.

సాహితీ జావళీ

సంగీతం పరంగా ఎన్నో రాగాలలో వందకు పైగా కృతులను కూర్చినా, సాహిత్య వరకూ వచ్చేసరికి వీటిల్లో త్యాగరాజు రచనా శైలిని అనుసరించినట్లుగా అనిపిస్తుంది. పందులు లేక మన సందులు బాగౌనా ( నిందలు మోపు వారు కావలె కృతి ) వంటి నిరసన ప్రయోగాలూ, భూమిని మోయుట మిన్న – భూమిపై పన్నుల భారము మ్రోయుట మిన్నా” ( తెలుసుకొనుమన్నా, స్వాతంత్ర్యమన్నా కృతి ) వంటి సామాజిక వేదనలూ, తను వలచినదే వనిత-తను తలచినదే కవిత ( తన హితవే తన మతము కృతి ) వంటి సామెతలూ, కళల వెలుగుకు భాషా భేదము-కళంకమై హాని కలిగించును ( తెలుగు తమిళ సమ్మిళితమే కృతి ) వంటి ఆవేదనలూ స్పష్టంగా కనిపిస్తాయి. కృతిలో వాడిన పద ప్రయోగ శైలీ, తీరూ త్యాగరాజు కీర్తనలని అనుసరించినట్లుగానే కనిపిస్తుంది.
తమిళవారు ఆదరించినంతగా తెలుగువారు బాలమురళిని ఆదరించలేదు. ఇది మాత్రం యదార్థం. ఇదే బాధని ఆయనొక కృతిలో (తెలుగు వెలుగు కిరణాలు) పరోక్షంగా ఇలా చెప్పుకున్నారు.
అన్నమునకు ఆంధ్రము – ఆదరణకు అరవము
కన్నతల్లి కన్నడము – మలయానిలయము మళయాళము
ఆరంభమునకు ఆంధ్రము – ఆచరణకు అరవము
కన్నడకు కన్నడము – మరులు కొలుపు మళయాళము
మనమంతా ఒకటైతే మహినే మనమేలగలము

సాధారణంగా సంగీత విద్వాంసులు కచేరీల్లో పాడేటప్పుడు కృతులకి చివర్న స్వరకల్పన చేస్తారు. ఇది వారి విద్యనూ, సంగీతంలో ప్రతిభనూ, రాగాలపై పట్టునూ చూపడానికి ఉపయోగిస్తుంది. చాలా కచేరీల్లో ఇవి ఆశువుగా స్వరకల్పన చేసినట్లు భ్రమ కలిగిస్తూ పాడతారు. కానీ నిజానికివన్నీ వారు ముందుగానే సాధన చేస్తారు. వేదిక మీద మాత్రం వారు పాడుతూంటే మనకి అలా అనిపించదు. ఆశువుగానే అనిపిస్తాయి. బాలమురళి ప్రతిభ గురించి చెబుతూ స్వాతి తిరుణాల్ వంశీకుడైన రాజా రామవర్మ ఈ మధ్య అమెరికాలో జరిగిన కచేరీలో –
“సాధారణంగా కచేరీల్లో ఏ ఏ పాటలు పాడతారో గాయకులకి తెలుసు. దానికనుగుణంగా వారు తయారవుతారు. స్వరకల్పన కూడా సాధన చేస్తారు. చాలామంది ఈ పద్ధతినే అవలంబిస్తారు. బాలమురళిగారు మాత్రం ఈ పద్ధతిని పాటించరు. ఏ రాగం ఎంచుకున్నా ఆశువుగానే స్వరకల్పన చేస్తారు తప్ప ముందుగా సాధన చేయడం నేనెప్పుడూ చూళ్ళేదు. విదేశాల్లో కచేరీకి ఆయన కలిసి నేనూ చాలా సార్లు ప్రయాణించాను. ఎంతో దగ్గరగా ఆయన్ని చూసాను. ఎప్పుడూ ఇలా సాధన చేసినట్లుగా కనిపించలేదు. ఒక్కోసారి ప్రేక్షకుల కోరికమీద పాడిన పాటలక్కూడా ఆశువుగా స్వరకల్పన చేయడం చూసి ఆశ్చర్య పోయాను. ఆయన ప్రతిభ అద్భుతం. అసాధారణం. త్యాగరాజు తరువాత ఆయన స్థాయిలో ఉన్న ఏకైక వాగ్గేయకారుడు బాలమురళీ కృష్ణే” అంటూ వినమ్రంగా చెప్పారు. ఒక సంగీత విద్వాంసుడు మరొక సంగీత కారుని గురించి ఇంతగా చెప్పడం చాలా అరుదు.

తారా రవళి

ఎందుకో తెలుగు సినీపరిశ్రమ బాలమురళి వంటి అత్యంత ప్రతిభావంతుణ్ణి సరిగ్గా వినియోగించుకోలేదు. రాజేశ్వర రావు గారి సంగీత సారధ్యంలో గతంలో చాలా సినిమాల్లో పాడినా, ఒక్క బాపూ, బాలచందర్ వంటి దర్శకులు తప్ప ఇంకెవ్వరూ ఆయన చేత పాడించలేదు. సంగీత ప్రధానంగా ఎన్నో సినిమాలు తీసిన కె.విశ్వనాధ్ ఒక్క సినిమాలో కూడా బాలమురళి చేత పాడించలేదు. ఇది నిజంగా మనందరి దురదృష్టం. ఆది శంకరాచార్య ( సంస్కృతం ), హంసగీతె ( కన్నడ ) వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినా ఎందుకో తెలుగు వారు మాత్రం ఆయనికి సరిగ్గా గౌరవం ఇవ్వలేదు. వ్యక్తిగత కారణాలూ, ప్రవర్తనలూ కారణాలు చూపించే వారుంటారు. కానీ ఏ వ్యక్తీ పరిపూర్ణం కాదు. అందరిలోనూ లోపాలుంటాయి. ప్రతిభా, సంగీత జ్ఞానం ముందు అవన్నీ వెనక్కి వెళ్ళుంటే బావుండేది.

హంసగీతె సినిమాకి బాలమురళికి “ఉత్తమ గాయకుడు” అవార్డొచ్చింది. శంకారభరణం సినిమాకి మొదట ఆయన్నే పాడమని కోరారనీ, శంకరశాస్త్రి పాత్ర కోరడంతో ఆ అవకాశం బాల సుబ్రహ్మణ్యానికి వెళిపోయిందన్న ప్రచారమొకటుంది. నిజా నిజాలు ఆ దేముడికెరుక. భక్త ప్రహ్లాదలో నారదుడిగా నటించారు. ఎందుకో నటనచ్చి రాలేదు.

నర్తన శాలలో “సలిలిత రాగ సుధారస సారం”, వసంత యామినీ, మౌనమే నీ భాష ఓ మూగ మనసా, పలుకే బంగారమాయెనా అందలారామా, ఆదియునాదిగా నేవే కాదా వంటి పాటలు ఇప్పటికీ అపాత మధురాలే! జయదేవుల అష్టపదులు పాడినా, రామదాసు కీర్తనలు పాడినా, అన్నమయ్య అక్షర సుమాలు ఆలాపించినా బాలమురళే పాడాలన్నంతగా తెలుగు వారి మనసుల్లో నాటుకుపోయింది. వేరెవరైనా బాగా పాడవచ్చునేమో కానీ బాలమురళి గాత్రం కన్నా ఒక స్థాయి తక్కువగానే ఉంటుంది.

ప్రస్తుతమున్నదంతా సినిమా సంస్కృతే తప్ప అసలు సంస్కృతి ఎప్పుడో పోయిందన్న ఆవేదన్ని ఆయన స్వీయ రచనలో ఈవిధంగా తెలిపారు.

ఆకాలం అది అంతే
ఈ కాలం ఇది ఇంతే

అది వేదాల కాలం
ఇది భేదాల కాలం

అది నియమాల కాలం
ఇది సినిమాల కాలం

కామవర్ధిని రాగంలో స్వరపరిచిన ఈ కృతి బాలమురళి గొంతులోనే వినాలి. పాడేటప్పుడు విరుపులూ, నొక్కులతో అర్థవంతగా పాడతారు.

నేటి పత్రికల తీరుతెన్నుల పైనా, తనపై వచ్చిన విమర్శల పైనా ఆయన అభిప్రాయం “తెలుసుకొనుమన్నా స్వాతంత్ర్యమన్న సరిగా” కృతిలో ఇలా చెబుతారు.

బ్రహ్మ రాసిన వ్రాతలకెదురు లేదానాడు
పత్రికల వ్రాతకెదురు లేదీనాడు

ముచ్చటైన మురళీ గానము
నచ్చిని వారు అరుదుగా నుందురన్నా
మచ్చ లేదా స్వచ్ఛమైన చందమామకైనా

సంగీతమున్నంత తారాస్థాయిలో సాహిత్యం కనిపించదు. త్యాగరాజు కృతుల్లో పలురకాల శబ్దాలంకారాలూ, సంధులూ, సమాసాలూ ఎక్కువగా కనిపిస్తాయి. వాడుక భాషలో ఉన్నా భాష సరళంగా, భావ యుక్తంగా ఉంటుంది. బాలమురళి గారి కృతుల్లో ఇటువంటివి కనిపించవు. సంగీతాన్ని మాత్రమే విని ఆనందించి, సాహిత్యాన్ని మాత్రం సరిపెట్టుకోవాలి. అన్నమయ్యా, రామదాసూ, త్యాగరాజు కృతుల్లో సాహిత్యం సంగీతంలో ఒదిగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన రచనల్లో సాహిత్య విలువలు తక్కువగానే ఉన్నాయనిపిస్తుంది. సంస్కృతం, తమిళ, తెలుగు భాషల్లో బాలమురళి సంగీత రచనలు చేసారు. తెలుగు సాహిత్య రీతిలోనే ఇవీ ఉన్నాయి.

వీరికి త్యాగరాజంటే అపారమైన గౌరవమూ, అభిమానమూ! “త్యాగరాజులాంటి సంగీత కారుడు ఆయన ముందు లేడు, ఆయన తరువాత రాడు” అన్నంతగా ఈయన అభిప్రాయపడతారు. ఇదే విషయాన్ని చాలా కచేరీల్లో ప్రస్తావించారు కూడా.

త్యాగరాజు సంగీతాన్ని ప్రస్తుతం సంగీత విద్వాంసులు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో నంటూ త్యాగరాజు పై అమృత వర్షిణి రాగంలో కూర్చిన ఈ క్రింది కృతి చూస్తే తెలుస్తుంది.

సామ గాన సార్వ భౌమ
స్వామి త్యాగరాజ నామ

ఈ మహిలో నీ కృతులను
మేమతా పాడి పాడి
పేరు ధనము కీర్తి పద్మ
గౌరవముల నందేము

తామే పెద్దలట సంప్రదాయ సంసిద్ధులట
శ్రీమన్ మురళీ గానము రసిక జనులు మెచ్చరాదట
ఏమేమో పలు మాటలు నేర్పరి పలు గాయకులు నేడు
నీ మహిమ జూపి సత్సంగీతము సంరక్షింపుము

ఈ కృతిలో చెప్పిన విషయం మాత్రం నేడు జరుగుతున్నదే! సంగీత కచేరీల్లో త్యాగరాజు కృతులే పలు విద్వాంసులూ పాడతారు. ఆయా కచేరీలకీ భారీగా సొమ్ము వసూలు చేస్తారు. త్యాగరాజు పెట్టిన స్వర భిక్షే చాలామంది సంగీత కారులకి జీవనోపాధయ్యిందన్నది అక్షర సత్యం.
తన స్వీయ కృతులనన్నీ “సూర్యకాంతి” అనే పుస్తక రూపంలో విడుదల చేసారు. ప్రతీ కృతీ తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో స్వర యుక్తంగా ఉన్నాయి. ఈ పుస్తకంలో మరో విశేషమేమటే తెలుగులో మాత్రం ఆయన స్వదస్తూరీతోనే రాసారు. మిగతా పుస్తకంలో వేరే భాషలకి మరొకరి చేతి రాత కనిపిస్తుంది. ఈ విధంగా బాలమురళి తెలుగు భాషపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పుస్తకం మాత్రం తమిళ సోదరులే ప్రచురించారు. తెలుగువారెవరూ పట్టించుకున్నా పాపాన పోలేదు. ఈ పుస్తకం తెలుగు నాట దొరకదు. ఇదీ ఒక తెలుగు వాగ్గేయకారునికి మన తెలుగు వాళ్ళిచ్చే గౌరవం. అందరం సిగ్గు పడాల్సిన విషయం.

బాలమురళి కృష్ణకున్న ప్రతిభకి ఏ తమిళవాడుగానే పుట్టుంటే ఈ పాటికి భారతరత్న ఆయనింటికి నడుచుకుంటూ వచ్చేది. తెలుగువారికి అభిమానం తక్కువ. సినిమాలూ, రాజకీయాలపై ఉన్న మక్కువ సంగీత సాహిత్యాలపై లేదు. ఇది మన దౌర్భాగ్యం. పండిట్ భీం సేన్ జోషీ, రవిశంకర్ వంటి సంగీత విద్వాంసుల స్థాయి ఉన్న ఏకైక దక్షిణ భారత సంగీతకారుడీయన. పండిట్ రవిశంకర్కి ప్రచారకులు ఎక్కువగా ఉండడం వల్ల విదేశాల్లో మరింత పేరొచ్చింది. బాలమురళికృష్ణ విషయంలో ఇది పూర్తిగా కొరవడింది. ఆయన ప్రతిభకి ప్రపంచ వ్యాప్తంగా రావలసినంత గుర్తింపు రాలేదు.
“సంగీత కళానిధి” అని బిరుదిచ్చి బాలమురళిని అవమాన పరిచారనిపిస్తుంది. నిజానికది ఆయన ఇంటిపేరు. ఆయన విశేష సంగీత ప్రతిభ ముందు “భారత రత్న”లు కూడా వెల వెలబోవలసిందే! అవార్డులూ, రివార్డులూ ప్రతిభకి కొలమానం కాదు. ముఖ్యంగా సంగీతానికి.

మనిషి మరణించినా కవులూ, గాయకులూ కలకాలం బ్రతుకుతారు.
సంగీతమున్నంతకాలమూ త్యాగరాజూ, బాలమురళీ కృష్ణా తరతరాలకీ గుర్తుండే తీరుతారు. వీరిద్దరూ తెలుగువాళ్ళుగా పుట్టడం మన అదృష్టం. ఇది వారి దురదృష్టం.

00000


ఈ వ్యాసాన్ని స్కాన్ చేసి పంపిన ప్రముఖ చిత్రకారుడు అన్వర్ గారికి కృతజ్ఞతలతో – సాయి బ్రహ్మానందం

జాజర

జాజర

జాజర

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. నిజమేనండి!

  ఈమధ్య తిరుపతి దేవస్థానంలో వారిని ఆస్థాన గాయకులుగా గుర్తింపునిచ్చి మనకు మనం గుర్తింపు తెచ్చుకున్నాం అనిపిస్తుంది.

  తెలుగు భాషకు, సంగీత భాషకు పొత్తు కుదిరిన వైనం బావుంది.

 2. బాలమురళి కృష్ణకున్న ప్రతిభకి ఏ తమిళవాడుగానే పుట్టుంటే ఈ పాటికి భారతరత్న ఆయనింటికి నడుచుకుంటూ వచ్చేది. తెలుగువారికి అభిమానం తక్కువ. సినిమాలూ, రాజకీయాలపై ఉన్న మక్కువ సంగీత సాహిత్యాలపై లేదు. ఇది మన దౌర్భాగ్యం. పండిట్ భీం సేన్ జోషీ, రవిశంకర్ వంటి సంగీత విద్వాంసుల స్థాయి ఉన్న ఏకైక దక్షిణ భారత సంగీతకారుడీయన. పండిట్ రవిశంకర్కి ప్రచారకులు ఎక్కువగా ఉండడం వల్ల విదేశాల్లో మరింత పేరొచ్చింది. బాలమురళికృష్ణ విషయంలో ఇది పూర్తిగా కొరవడింది. ఆయన ప్రతిభకి ప్రపంచ వ్యాప్తంగా రావలసినంత గుర్తింపు రాలేదు.

  chaalaa correctgaa cheppaaru. mee vyasam to nainaa teluguvaadilo vaadi vedi ragulutundemo choodaali..

 3. Chandrasekhkara Sharma said

  మా నాన్న గారు కర్ణాటక సంగీత రత్నత్రయం అనే దాని మీద పీ.హెచ్.డీ చేశారు. కర్ణాటక సంగీత రత్నత్రయం అంటే త్యాగరాజు, శ్యామశాశ్త్రి , ముత్తుస్వామి దీక్షితులు – వారి కీర్తనలు, సాహిత్యం, జీవన వైశిష్ట్యం గురించి. ఈ రెసెర్చ్ విషయమై మంగళంపల్లి వారిని కూడా కలిశారు. Vaaritho muchhatimchina vishayaalannee maa naannagaaru maaku cheptoo unde vaaru.

  మా నాన్న గారి ఆ సిధ్ధాంత వ్యాసానికి (థీసిస్) కి డా||తూమాటి దొణప్ప పురస్కారం మరియు బంగారు పతకం కూడా ఆంధ్రా యూనివర్సిటీ వారు బహూకరించారు.

  మీ పోస్ట్ మూలాన ఈ రోజు నాకు అది గుర్తుకు వచ్చింది. ధన్యోస్మి.

  http://maverick6chandu.wordpress.com

 4. Chandrasekhkara Sharma said

  మా నాన్న గారు కర్ణాటక సంగీత రత్నత్రయం అనే దాని మీద పీ.హెచ్.డీ చేశారు. కర్ణాటక సంగీత రత్నత్రయం అంటే త్యాగరాజు, శ్యామశాశ్త్రి , ముత్తుస్వామి దీక్షితులు – వారి కీర్తనలు, సాహిత్యం, జీవన వైశిష్ట్యం గురించి. ఈ రెసెర్చ్ విషయమై మంగళంపల్లి వారిని కూడా కలిశారు. Vaaritho muchhatinchina vishayaalu maa naaanna gaaru maato cheptoo unde vaaru.

  మా నాన్న గారి ఆ సిధ్ధాంత వ్యాసానికి (థీసిస్) కి డా||తూమాటి దొణప్ప పురస్కారం మరియు బంగారు పతకం కూడా ఆంధ్రా యూనివర్సిటీ వారు బహూకరించారు.

  మీ పోస్ట్ మూలాన ఈ రోజు నాకు అది గుర్తుకు వచ్చింది. ధన్యోస్మి.

 5. prabhala SrInivaas said

  caalaa cakkagaa raasaru..
  baalamurali gaaru mana jaati garvincadagga advitIya kaLaa mUrti..
  kaLaakaarulandariki aayana kaLasaadhana spUrti…
  manci vyaasamtO aayana goppatananni.. maa munduki teccinanduku dhanyavaadaalu..

 6. “బాలమురళి కృష్ణకున్న ప్రతిభకి ఏ తమిళవాడుగానే పుట్టుంటే ఈ పాటికి భారతరత్న ఆయనింటికి నడుచుకుంటూ వచ్చేది. తెలుగువారికి అభిమానం తక్కువ.సంగీతమున్నంతకాలమూ త్యాగరాజూ, బాలమురళీ కృష్ణా తరతరాలకీ గుర్తుండే తీరుతారు. వీరిద్దరూ తెలుగువాళ్ళుగా పుట్టడం మన అదృష్టం. ఇది వారి దురదృష్టం”- మరన్న మాటలు అక్షరాల నిజం .చాలా మంచి వ్యాసం అందిచారు.సంగీతాన్ని గురించి చాలా కొత్త సంగతులు కూడా తెలుసు కున్నాము.ధన్యవాదాలు సాయి బ్రహ్మానందం గొర్తి

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: