ద్రౌపది అవార్డు వెనుక కథ – జవాబుదారీలు

జాజర


తెలుగు సాహిత్యంలో ఈ మధ్యకాలంలో వేడి వేడి చర్చాంశం ద్రౌపది నవల. ఈ నవలకి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారన గానే తెలుగు నాట ఈ పుస్తకంపై రాని విమర్శలేదు. రాయని పత్రికలేదు. ఎవరి వాదన్ని వారు వినిపిస్తూ ఎవరి దృక్పథం ప్రకారం వాళ్ళు రాస్తున్నారు. ద్రౌపది నవల చదివాక వేరే కోణంలో అర్థం చేసుకునే భాగ్యం కలిగిందని కొంతమంది రాస్తే, మూలాన్ని వక్రీకరించీ సొంత అభిప్రాయాలూ, విలువలూ ద్రౌపదికి ఆపాదించారంటూ మరికొంతమంది విరుచుకు పడుతున్నారు. మంచి నవలా అని వకాల్తా ఇచ్చే వాళ్ళు ద్రౌపది నవల చదవండీ, మనకి తెలీని కొత్త ద్రౌపదిని చూడచ్చని సలహా ఇస్తున్నారు. ఈ సలహా ఇచ్చే వారే వ్యాసుడు ద్రౌపదిని ఎలా చిత్రీకరించాడో చదివరా? చదివితే ఇలాంటి ఉచిత సలహాలిచ్చుండే వారు కారు. పోనీ వ్యాసుడక్కర్లేదు. కనీసం కవిత్ర విరచిత భారతాన్నయినా పూర్తిగా చదివి ద్రౌపది గురించి తెలుసుకొని అప్పుడు మూలంలో ఉన్నవీ, నవల్లో లేనివీ రెండూ బేరీజు వేస్తూ విమర్శ చేస్తే బావుంటుంది. కానీ తెలుగు సాహిత్యంలో విమర్శ కేవలం అభిప్రాయ పరామర్శగానే మారుతోంది. బావుందీ, బాగోలేదూ అని చెప్పడానికి మరో పేరుగా విమర్శ చెలామణీ అవుతోంది. పుస్తక సమీక్షలో విమర్శ కూడా ఒక భాగం. సమీక్ష అంటే ఏమిటి? పుస్తకం మంచీ చెడుల గురించి చెప్పడమే కదా? అంటే ఏఏ అంశాలు బావున్నాయో, ఏవి గాడి తప్పయో, ఎక్కడ విషయ వక్రీకరణ జరిగి అపోహలకీ, అనుమానాలకీ దారి తీస్తోందో చెప్పగలగాలి. ప్రస్తుతం పుస్తక సమీక్ష అంటే ఆహా ఓహో వ్యవహారంలా తయారయ్యింది. రాసిన వారి బంధువులో,మిత్రులో సమీక్ష చేయడానికి నడుం కడుతున్నారు. అందువల్ల తొంభై శాతం చప్పట్లతోనూ, మరీ అంతగా పొగిడేస్తే బావుండదని మొహమాటానికి ఒకటో అరో చిన్న చిన్న తప్పులు సూచించి చేతులు దులిపేసుకుంటున్నారు. అంతే తప్ప సమీక్షలో సరైన విమర్శ భాగం కావడం లేదు.

సమీక్షకులూ, విమర్శకులూ సరే! అసలు రచయిత వీటికి ఎలా స్పందిచాడు. ఆయన జవాబులేమిటి? ఏ దృక్పథంతో నవల రాసారు? రాసిన వాటికి అన్నీ కాకపోయినా మూల గ్రంధంలో ఏ విషయాన్ని బట్టి పాత్రల చిత్రీకరణ జరిగిందీ వంటి విషయాలు వచ్చినట్లు లేదు. ఎంత విమర్శా, రభసా జరిగితే రచయితకి అంత మంచిది. చక్కగా ఓ పది కాపీలెక్కువ అమ్ముడవుతాయి. ద్రౌపది నవల మీద వచ్చిన అన్ని వ్యాసాలూ చూసాక రచయిత మీడియా మైకుల ముందు స్పందించడమే తప్ప, ఎక్కడా లిఖిత పూర్వకంగా రాసినట్లు చూళ్ళేదు. నేను రాయదల్చుకుంది రాసాను. ఇష్టముంటే చదవండి. లేకపోతే లేదని రచయిత చెప్పచ్చు. దీన్నెవరూ కాదనరు.

రచయిత సరే, అసలీ అవార్డుని సిఫార్సు చేసిన ప్రముఖులయినా స్పందించారా అంటే అదీ లేదు. ఎందుకొచ్చిన గొడవా, ఊరుకోడమంత ఉత్తమం లేదు; బోడిగుండంత సుఖం లేదని అనుకున్నారో ఏమో, రాతలు సరే కనీసం ఎవరూ నోరు కూడా మెదపడం లేదు. అసలీ అవార్డు అప్పగింతలో ఒక విషయం మాత్రం అంతుబట్టడం లేదు. అందరూ రాసిన రచయితపై అవాకులూ, చివాకులూ పేలుస్తున్నారు తప్ప, ఈ అవార్డుకి సిఫార్సు చేసిన వారిని మాత్రం ఎవరూ ప్రశ్నించడం లేదు. ఏ ప్రతిపాదికన ఈ పుస్తకాన్ని నిర్ధారించారు? ఏ విషయంలో ఇదొక మంచి నవలని అనుకున్నారు? లేక వచ్చిన వాటిల్లో అల్లులో మల్లులా భావించి ఇచ్చారా? వీటన్నింటికీ జవాబుదారీలు ఈ సాహిత్య అకాడమీ అవార్డు సభ్యులు. అందరూ రచయిత మీద అరుస్తున్నారు తప్ప వీళ్ళనెవరూ నిలదీయడం లేదు. అసలు సంజాయిషీ రచయిత కాదు. వీళ్ళిచ్చుకోవాలి. రచయిత తను మెచ్చిందీ, నచ్చిందీ రాస్తాడు. రాసే హక్కూ, ప్రచురించే హక్కూ రచయితకుంది. అందరికీ ఆమోద యోగ్యంగా రాయనవసరం లేదు. కొన్ని వర్గాలకి నచ్చచ్చు. మరికొంతమందికి నచ్చకపోవచ్చు. ఏటా కొన్ని వందల నవల్లొస్తున్నాయి. అందులో అత్యుత్తమమైనవాటిగా భావించిన కొన్నిటికి అవార్డుకి ప్రతిపాదించచ్చు. కానీ ఆ ప్రతిపాదనకి ప్రేరేపించిన అంశాలు ఏమిటి? ఎందుకీ నవల వచ్చిన వాటిలో అత్యుత్తమమైనదని భావించారు? సభ్యులందర్నీ అంతగా ఆకట్టుకున్న అంశాలేవిటి? ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత సభ్యులకీ వుంది. కేవలం నోటి పలుకులేనా లేక లిఖిత పూర్వకంగా చెప్పారాన్నది తెలీదు. అమెరికాలో అయితే అవార్డు కమిటీ సభ్యులు లిఖిత పూర్వకంగా రాసిస్తారు. మరి సాహిత్య అకాడమీ వారి పద్ధతేమిటో స్పష్టంగా తెలీదు.

పత్రికల్లో పనిజేసే ఒక మిత్రుడితో పైన చెప్పినవని, ఇదే విషయం ఆరా తీస్తే, ఆంధ్రాలో పత్రికల వాళ్ళ మధ్య తిరుగుతున్న ఓ వార్తని చెప్పాడు. ప్రతీ భాషలోనూ సాహిత్య అకాడమీ వాళ్ళు ఆ ఏడు వచ్చిన నవలల్లో ( ద్రౌపది నవల గురించి కాబట్టి నవలల గురించే ప్రస్తావిస్తాను. ) ఓ పది నవలలు ఎంపిక చేస్తారు. ఆ జాబితాని ఆయా భాషల్లో నియమితులైన సభ్యులకీ, ఆ కమిటీ అధ్యక్షులకీ పంపుతారు. సభ్యులు ఆ వచ్చినవన్న్నీ కూలంకషంగా చదివి అందులో ఓ నాలుగు నవలల్ని ఒకటి రెండు మూడు క్రమంలో సూచిస్తూ మార్కులేస్తారు. సభ్యులు ఎంపిక చేసిన వాటిల్లో ఎక్కువ వోట్లొచ్చిన పుస్తకాన్ని సదరు అధ్యక్షుల వారు సాహిత్య అకాడమీ వారికి అందజేస్తారు. అది చూసి వాళ్ళు అవార్డు ప్రకటిస్తారు. ఇదీ ఎంపిక జరిగే పద్ధతి. కానీ ఈ ద్రౌపది విషయంలో జరిగింది వేరు. కమిటీ సభ్యులందరూ వారి వారి జాబితాని అందజేసారు. వాటిల్లో ఏ సభ్యుడూ ద్రౌపదిని మొదటి స్థానంలో ఇవ్వలేదు. ఒకళ్ళు రెండో స్థానం ఇస్తే, మరొకరు నాలుగో స్థానం ఇచ్చారు. మరొకరు మూడో స్థానమిచ్చారు. మొదటి, రెండు స్థానాల్లోనూ వచ్చిన నవలలు ఏ ఒక్కరివీ కలవలేదు. కానీ అందరి జాబితాల్లోనూ ఈ ద్రౌపది నవలుంది. ద్రౌపది తప్ప, మిగతా ఒక్కరి జాబితా కలవలేదు. ఇటువంటప్పుడు ఒకరు మొదటి స్థానమిచ్చిన నవలని అవార్డుకి ప్రతిపాదిస్తే, మా జాబితాలో మొదటి నవలకెందుకివ్వలేదన్న ప్రశ్నొస్తుంది. గొడవలు మొదలవుతాయి. అందరికీ ఆమోద యోగ్యంగా ఉన్న నవలిదొక్కటే మిగిలింది కాబట్టి దీన్నే అవార్డుకి ఎంపిక చేయడం జరిగిందని చెప్పాడు. ఆ కమిటీ సభ్యుల్లో ఒకరు ఈ నవలకి అవార్డివ్వడం దండగని అభ్యంతరం పెడితే, ఎంపికయిన వాటిల్లో అందరికీ ఏకాభిప్రాయం లేదు కనుక సాహిత్య అకాడమీ వారు ఈ ఏటికి పూర్తిగా అవార్డు రద్దు చేసే అవకాశముంది కాబట్టి, తెలుగు నవలకి కనీసం ఒక్క అవార్డు ఇవ్వలేదని అందరూ నవ్వుకుంటారనీ, వేలెత్తి చూపుతారనీ భావించి ద్రౌపదిని సూచించడం తప్పలేదని చెప్పాడు. అలా ద్రౌపది ఎన్నికయ్యిందని చెప్పాడు. మిగతా విషయాలెలా వున్నా ఇందులో ఒకటి మాత్రం నిజం. సభ్యులెవరూ ఇంతగా ప్రతిఘటనొస్తుందని ఊహించలేదు. ఆంధ్రభూమిలో వచ్చిన విమర్శా వ్యాసమే ఈ ప్రతిఘటనకి కొబ్బరికాయ కొట్టిందనీ, మిగతా పత్రికలన్నీ దాన్ని అంది పుచ్చుకున్నాయనీ వివరించాడు. తరువాత జరిగిన సంగతి అందరికీ తెలుసు. ఇవేమీ కాదు. ఈ అవార్డుకి పైరవీలు చాలా జరిగాయన్న వాదన కూడా ఒకటుంది. జరిగింది కమిటీ సభ్యులకీ, కేంద్ర సాహిత్య అకాడమీ వారికీ తప్ప మరొకరికి తెలీదు.

ఇప్పటి వరకూ వచ్చిన వ్యాసాలు చూస్తే అందరూ రచయిత మీదే దాడి చేస్తున్నారు. కనీసం ఈ సభ్యుల్ని ప్రశ్నించిన పాపాన పోలేదు. ఆంధ్రభూమిలో ఒక వ్యాసంలో చిన్నగా కారా మాస్టారుని (కాళీ పట్నం రామారావు) ప్రశ్నించారు తప్ప, మిగతా సభ్యులు అక్కిరాజు వారినీ, బేతవోలు గారినీ, మాజీ గవర్నరుగా పనిజేసిన రమాదేవి గారినీ ఎవరూ నిలదీయ లేదు. రచయిత నవలవరకే జవాబు దారీ! కానీ వీళ్ళు అవార్డు ఎంపికకు జవాబుదారీలు. కాదంటారా? నవల నచ్చిందీ, నచ్చలేదన్నది పక్కనబెట్టి ఇందులో నాణ్యతాంశాల ప్రతిపాదికా వివరాలు చెబితే బావుండేది. అందరూ తాంబూలిచ్చేసాం తన్నుకు చావండన్నట్లున్నారు.

నిజానిజాలు పక్కనబెడితే, ఈ ఎంపిక విధానానికి సాహిత్య అకాడమీ కూడా ముందు ముందు సరైన పద్ధతి అవలంబిస్తే బావుంటుంది. ఎంపిక చేసిన పుస్తకాలపై కనీసం రెండు పేజీలు తక్కువకాకుండా ఆ పుస్తకం ఎందుకు అవార్డుకి అర్హత కలిగిందో సభ్యులని రాసిమ్మని కోరితే ( ఎందుకంటే సభ్యులందరూ విధిగా రచయితలే అయ్యుంటారు కాబట్టి ) ఇటువంటి వివాదాలు ముందు ముందు వచ్చే అవకాశం లేదు.

మహాభారతంలోనే కాదు, సాహిత్యంలో కూడా వివాదానికి గురవుతోంది ద్రౌపది. బహుశా ఆ పేరులోనూ, వ్యక్తిత్వంలోనూ ఉన్న గొప్పదనం వల్లనేమో?

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

 1. mgvlaxman said

  miku ravardu ravadamu karacte

 2. Malakpet Rowdy said

  Very well said. I havent read the novel and cant say anything about it and after I reading the reviews, assuming them to be accurate, I dont think its worth spending that reading effort on that piece of crap – so I have nothing to say about that novel and I dont care whether the writer is innovative or sexually perverted. But as you pointed out, I dont understand why no critic is criticizing the members of the committee who gave that award.

 3. అబ్రకదబ్ర said

  ఇంతకీ ఈ ‘సాహిత్య అకాడమీ’ కేంద్ర అకాడమీయా, రాష్ట్ర అకాడమీయా? కేంద్ర అకాడమీ ఐతే అందులో అందరూ తెలుగు వాళ్లే సభ్యులుగా ఉన్నారేంటి? అందువల్లే ఓ తెలుగు నవలకి ఈ ఏడాది అవార్డొచ్చిందంటారా?

  • gorthib said

   ఏ భాషకి సంబంధించిన వాళ్ళు ఆ భాషా సాహిత్యపు కమిటీల్లో ఉంటారు. తెలుగులాగే, కన్నడ, తమిళ మొదలగు భాషలక్కూడా వేర్వేరు కమిటీలుంటాయి. తెలుగు కమిటీ సభ్యులు తెలుగు నవలల్నే సమీక్షిస్తారు. అందరూ తెలుగు వాళ్ళే కేంద్ర కమిటీలో కనకే ఉంటే ఏ బెంగాలీ నవలకో, మళయాళీ నవలకో వస్తుంది. ఈ చిన్న విషయం ఇప్పుడే పుట్టిన పసివాణ్ణడిగినా చెబుతాడు.

   కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డొస్తే మిగతా అన్ని భాషల్లోకీ తర్జుమా చేస్తారా పుస్తకాన్ని. అదీ బోనస్!

 4. అబ్రకదబ్ర said

  అంటే ఈ అవార్డు జ్ఞానపీఠ్ తరహాలో దేశమ్మొత్తంలో అన్ని భాషల్లో వచ్చిన పుస్తకాల్లోనూ ఉత్తమమైనదానికి ఇచ్చేది కాదన్నమాట. ఒక్కో భాషలో ఒక్కో పుస్తకానికి ఇచ్చేదా?

 5. సాహిత్య అకాడమీ నిర్ణయం గురించి మొత్తానికి మీరుకూడా ఎవరో చెప్పిన మాటలు విని మీ నిర్ణయాన్ని వినిపించేశారు. బాగుంది.

  “నవల” అనేది ఒక imaginary extension మాత్రమే. వ్యాసుడు రాసాడని చెబుతున్న మహాభారతాన్ని మక్కీకిమక్కీ దింపడానికి ఎవరూ నవల రాయనక్కరలేదు. వ్యాసుడు ద్రౌపది పాత్ర గురించి చెప్పింది మళ్ళీ ఉటంకించడానికి మరో నవల రాయనఖ్ఖరలేదు. వ్యాసుడు ఐదు భర్తల్ని పెళ్ళిచేసుకోవాలని ద్రౌపదికి తెలిసినప్పుడు “ఖిన్నురాలైనది” అని వదిలేసాడనుకోండి…ఆ పరిస్థితిలో ఒక మహిళగా ద్రౌపది ఎలాంటి భావోద్వేగాల్ని అనుభవించింది అని ఒకరు ఊహించి రాస్తే అది పాత్ర వక్రీకరణ ఎలా అవుతుంది? That only becomes a different creative work అంతే. యార్లగడ్డ ద్రౌపది అలాంటిదే. కాబట్టి వ్యాసుడి పాత్రకు సరిపోలదు వంటి ఆర్గ్యుమెంట్లు అర్థరహితాలు.

  ఇదే విషయంపై ఇప్పటికే యుగాంతం,యాజ్ఞసేని,పర్వ లాంటి నవలలు వచ్చాయి. వాటినీ సాహిత్య అకాడమీలు వరించాయి. అప్పుడు ఇంత గొడవలేదు. ఎందుకంటే అవి తెలుగు భాషకు వచ్చినవి కావు. మన తెలుగోడి గొప్పతనం ఎవరు అంగీకరించినా, వాడి గొప్ప చెల్లదు అని ఎలుగెత్తి అరిచి వీలైతే కాలుపట్టిలాగి కూలదోసే మహగొప్పజాతి మనది. వ్యక్తిగతంగా నవల నచ్చడం నచ్చకపోవడం అభిరుచిని బట్టి ఉంటుంది. కానీ నాకు నచ్చలేదు కాబట్టి అందరూ మోసం చేశారనే తరహా వాదన మనకే సొంతం. కానివ్వండి.

  ps: నాకు ఈ నవల పెద్దగా నచ్చలేదు. యాజ్ఞసేని, పర్వలతో పోల్చుకుంటే వందోవంతుకూడా బాగుండదు.

  • gorthib said

   ద్రౌపది మీద నా అభిప్రాయాలు చెప్పలేదు. ఈ మొత్తం వ్యవహారం గురించే రాసాను. విన్నది రాసాను. నిజానిజాలు పైవాడికెరుక. కానీ ఈ మొత్తం ప్రహసనంలో కమిటీనొదిలేసి రచయితని తప్పు పట్టడమొక్కటీ నాకు నచ్చ లేదు. అదే ధ్వనితో వ్యాసం మొత్తమూ వుంది. వ్యాసుడిదైనా, కవిత్రయానిదైనా మహాభారతం చదవకుండా, మన విన్నదీ, సినిమాల్లో చూసిందాన్ని బట్టీ ద్రౌపదిని ఎలా అంచనా వేయగలం? మూలం చదవకుండా అందులో ఉన్నదానికి కొనసాగింపుగా రాసారని ఎలా చెప్పగలరు? సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె వ్యక్తిత్వం అద్దంలా కనిపిస్తూనే ఉంటుంది. కావ్యాలనీ, ఇతిహాసాలనీ మామూలు నవల్లు చదివే దృష్టితో చూస్తే వేరేగా ఉంటుంది. భారతంలోనూ, నవల్లోనూ ఉన్న అంశాలని చూపిస్తూ ఎవరూ విమర్శనాత్మకంగా రాయలేదన్నదే చెప్పాను. నవల చదవడం సులభం. కానీ భారతం మొత్తం చదవాలంటే చాలా సమయం వెచ్చించాలి. అంత ఓపికా తీరికా ఇప్పుడెవరికీ లేవు. నేను ద్రౌపది నవల బాగుందని కానీ, బాగోలేదని కానీ చెప్పలేదు. అవార్డు పై వచ్చిన ప్రహసనం గురించే రాసానని అనుకుంటున్నాను. అలాగే రచయితంటే గౌరవంగానే రాసాను. ఎవర్నీ తూలనాడలేదు. నాకు తెలుగోడి కొచ్చిందన్న దుగ్ధలేదు. రావడం మంచిదే! మోసం లాంటి పెద్ద పదాలు నేను రాయలేదు. ఏదేమయినా నాకు అవార్డొచ్చిందన్న బాధలేదు. ఈ రభసకీ, విమర్శకీ జవాబివ్వవలసిన వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నారన్నదే ఈ వ్యాసం ఉద్దేశ్యం. యాజ్ఞసేని చదివాను. మరాఠీ నాటకం కూడా చూసాను. అదీ తెలుగులో అనువదించి వేసారు. అనువాదంలో అసలు కొట్టుకుపోయింది.

 6. రవి said

  సమీక్ష గురించి మీరన్నది నిజమే కానీండి, కానీ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నది పుస్తక పరిచయాలు మాత్రమే, కొంచెం గమనించగలరు. (ద్రౌపది నవల గురించి నేను చెప్పట్లేదు)

  వ్యాసుల వారి, కనీసం కవిత్రయ భారతం చదివి సమీక్షించాలన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ద్రౌపది రచయితే వ్యాసభారతం చదివారో లేదో మరి.

  (మీ ఇదివరకు టపాలో సత్యభామ, ద్రౌపది ల సంభాషణ, తెనుగులో ఎఱ్ఱనామాత్యుని విరచితం. ఆ ఘట్టాన్ని ఓ పుస్తకంలో బేతవోలు రామబ్రహ్మం గారే వివరించారు.)

  నా అనుమానం ప్రకారం ఈ పుస్తక ఎంపికలో ఏదో పైనుంచి వత్తిడి ఉంది. బేతవోలు వారు, కాళీపట్నం స్థాయి వ్యక్తులు స్వతఃసిద్ధంగా ఇటువంటి రచన ఎంపిక చేశారన్నది నమ్మశక్యంగా లేదు. అలా చేసి ఉంటే, కనీసం వివరణయినా ఇచ్చి ఉండేవారు.

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: