పరిపూర్ణ ద్రౌపది

వ్యాసుని దృష్టిలో ద్రౌపది

జాజర


ప్రస్తుతం తెలుగు నవలా సాహిత్యంలో ద్రౌపది నవల ఒక చర్చనీయాంశంగా మారింది. ద్రౌపదిని ఒక కామ వాంఛా భోగితురాలిగా చిత్రీకరించారనీ, ఆమె వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపించారనీ పలువురి విమర్శానూ! మహాభారతం దృష్ట్యా ద్రౌపది వ్యక్తిత్వాన్ని పరికించి చూస్తే ఒక అభిమానవతిగానూ, పౌరుషం కల వ్యక్తిగానూ అందరికీ తెలుసు. ఇవి కాకుండా ద్రౌపది మనస్తత్వాన్నీ, భర్తలతో జీవితాన్నీ, ప్రవర్తననీ, ఇతరులతో తన బాంధవ్యాన్నీ, ఇవన్నీ వ్యాసుడు అరణ్యపర్వంలో ఆమె నోటే చెప్పిస్తాడు. అయిదుగురు భర్తలూ ఆమెను ఎందుకు అమితంగా ప్రేమిస్తారన్నది ద్రౌపది చేతే స్వయంగా పలికించాడు.

ఒక భర్తతోనే జీవించడం కష్టం అనుకునే స్త్రీలకి అయిదుగురు భర్తలతో ద్రౌపది ఎలా జీవించిందన్నది ఒక అర్థంకాని ప్రశ్నే! కేవలం జీవించడమే కాదు, భర్తల అనురాగాన్నీ సమంగా పొందింది. అలాగే తనూ వారినీ ప్రేమించింది. లేదు, ద్రౌపదికి భీముడంటే ఇష్టం;కాదు నకుల సహదేవులంటే ఇంకాస్త ఇష్టమంటూ అనేక కథనాలొచ్చాయి. అసలు ద్రౌపది అయిదుగురు భర్తల్నీ ఎలా సముదాయించేదన్నది వ్యాసుడు ఆమె ద్వారానే చెప్పిస్తాడు. కేవలం అనురాగాన్ని పంచడమే కాదు, భర్తలందరూ తన మాటల్నీ అమితంగా గౌరవిస్తారనీ అమెకు తెలుసు. ఆ గౌరవాలకి కారణాలు కూడా అమెకు తెలుసు. బయటనుండి చూసే వారికి అయిదుగురు భర్తల్నీ తన గుప్పిట బంధించిందన్న అపోహ కలగచ్చు. ఎందుకంటే వారెప్పుడూ ద్రౌపదిని అందరి ముందూ అమిత గౌరవంతోనే చూసారు. వ్యక్తికి, ముఖ్యంగా స్త్రీకి, వన్నె తెచ్చేది శారీరిక సౌందర్యం కాదనీ, గుణ సౌందర్యమేనని అంతర్లీనంగా చెప్పిస్తాడు. దానికి సంబంధించి అరణ్యపర్వంలో ఒక ఘట్టముంది.

మహాభారతంలో అరణ్యపర్వం చాలా విశిష్టమైంది. ముందు జరగబోయే సంఘటనలన్నింటినీ ఇందులో చిన్నగా సూచిస్తాడు వ్యాసుడు. ముందు రాబోయే సంఘటనలకి ఒక రంగాన్ని సిద్ధం చేయడమన్నమాట. వ్యాసుణ్ణి మించిన కథకుడు లేరు. తను చెప్పబోయే ప్రతీ ముఖ్య ఘట్టానికీ ముందుగా ఒక వేదకపై చెప్పబోయే ముఖ్యాంశాన్ని సూచన ప్రాయంగా ఏదో విధంగా చెప్పిస్తాడు. యుద్ధ సమయంలో అర్జనుడికి బోధించిన భగవద్గీత లోని విషయాలు చిన్నగా కథల రూపంలో అరణ్యపర్వంలో చెబుతాడు వ్యాసుడు. ఈ అరణ్య పర్వంలో చెప్పిన కథలన్నీ భగవద్గీతా సారానికి సూక్ష్మ రూపం.

జూదంలో రాజ్యం కోల్పోయి, ఓడిన పందానికి కట్టుబడి అరణ్యవాసానికని పాండవులు బయల్దేరుతారు. ఆ సందర్భంగా కామ్యకవనంలో కొంత కాలం ఉండడానికి నిశ్చయించుకుంటారు. ఈ విషయం తెలిసి శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై కామ్యకవనానికి వెళతాడు. సరిగ్గా అదే సమయానికి మార్కండేయ మహర్షి కూడా పాండవుల రాక తెలుసుకొని వారి ఆశ్రమానికి వస్తాడు. మార్కండేయ మహర్షికి అతిధి సత్కారాలు చేస్తారు పాండవులు. మార్కండేయ మహర్షిని చూసి కొద్ది రోజులు అక్కడే ఉందామని శ్రీకృష్ణుడు నిశ్చయించుకుంటాడు. ద్రౌపది తోడుగా ఉంది కాబట్టి సత్య భామా సరేనంటుంది.

ఆ సమయంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకి రాజ ధర్మాల గురించీ, న్యాయశాస్త్రం గురించీ, మనిషి చావు, పుట్టుకల గురించీ, మనో ధర్మం గురించీ ఇలా పలు అంశాలనీ స్పృశిస్తూ కథల రూపంలో చెబుతాడు. ఇందులోనే రాజు కుండాల్సిన లక్షణాలూ, రాజ ధర్మాలూ, ప్రజా ధర్మాలూ, కాల పరిణామంలో మనిషిలో వచ్చే మార్పులూ, యుగాల తీరూ ఒకటేమిటి అన్నీ మార్కండేయుడు ధర్మరాజుకి భోదిస్తాడు. అక్కడే శ్రీ కృష్ణుడు కూడా ఉంటాడు. పాండవులతో కలిసి శ్రద్ధగా అన్నీ వింటాడు.

అదలా ఉంచితే, ఆ సందర్భంలో పాండవులు ద్రౌపదిపై చూపించే ప్రేమకీ, ఆమె మాటలకీ, నిర్ణయాలకీ అత్యంత ప్రాముఖ్యతనివ్వడం చూసి సత్యభామ ఆశ్చర్యపోతుంది. అసూయ చెందుతుంది. ద్రౌపది ఒక్కామె తన భర్తలయుదుగురినీ భలే చెప్పు చేతల్లో పెట్టుకుందిగదాని నెవ్వరబోతుంది. తనెంతో ప్రయత్నంతో శ్రీకృష్ణుణ్ణి తన చెప్పు చేతల్లో బంధించాననుకుంటే, తనకే తెలీయకుండా వేళ్ళ సందుల్లో ఇసకలా జారిపోతున్నాడని అనుకుంటుంది. ఒక భర్తనే వశం చేసుకోడం వల్ల కావడం లేదు. అలాంటిది అయిదుగుర్నెలా పాదాక్రాంతుల్ని చేసుకుందో కదాని సమాధానం దొరక్క సతమతమవుతుంది. ఎవరూ లేని సమయం చూసి ద్రౌపదినే అడుగుతుంది.

నీ భర్తలయిదుగురికీ నువ్వంటే అమితమైన అనురాగముంది. ఒకరిని మించి మరొకరు నీపై ప్రేమ కురిపిస్తున్నారు. వాళ్ళందరి ఎడలా నువ్వు ఒకే విధంగా ఆసక్తి చూపిస్తూ మసలుకుంటున్నావు.. పాండవులంతటి మహా వీరులు నిన్ను ఎంతో మురిపంగా చూడ్డం చాలా వింతగా వుంది. వాళ్ళందరూ నీకు అడుగులకి మడుగులొత్తుతున్నారు. ఈ అద్భుత మహిమ నీకెలా వచ్చింది? ఏం నోవులు నోచావు? మంత్ర తంత్రాలు నేర్చుకున్నావా? ఏ ఏం మూలికలు ప్రయోగించావు? ఇలా నీ భర్తలు నీపై అనురాగం చూపించగల నేర్పరితనం ఎక్కడ నేర్చుకున్నావు? ఇంతటి మహాపురుషుల్ని ఆకట్టుకునే చతురత ఎలా సంపాదించావు? నాకంతు బట్టడం లేదు. నీ భర్తల అభిమానాన్ని ఎలా పొందగలిగావు? అందులో ఉన్న కిటుకూ, లోగుట్టూ ఏమిటి? అవి నాకు చెబితే నా భర్తయిన శ్రీకృష్ణుణ్ణి కూడా అదే విధంగా వశపరుచుకుంటాను. ద్రౌపదీ! నీ వ్యక్తిత్వం అసాధారణమైంది. అందుకే చెప్పమని ప్రాధేయపడుతున్నా! ” నంటూ సత్యభామ మనసులో ఉన్నదంతా కక్కుతుంది.

ఇటువంటి మాటలు వింటే ఏ స్త్రీకైనా కోపం వస్తుంది. ద్రౌపదికీ కోపం వచ్చింది. కానీ పైకి ఏమాత్రం కనబడనీయకుండా నవ్వుతూ సమాధానం చెప్పింది. ఇక్కడ కోపం అణచుకోడమనే గుణాన్ని ద్రౌపదిలో చూపించాడు. ముఖ్యంగా ఇంటికొచ్చిన అతిధుల్ని గౌరవించాలన్న ఉత్తమ లక్షణాలు కలిగిన యువతిలా ద్రౌపది కనిపిస్తుంది. సత్యభామడిగిన ప్రశ్నలు విని ఆమె తెలివి తక్కువ తనాన్నీ, డొల్లతనాన్ని చూపిస్తూ ఇలా అంటుంది.

సత్యభామా! నీవెంత అందంగకత్తెవైతే మాత్రం నన్ను తక్కువస్థాయి స్త్రీలతో జమకట్టి ఇలా అడగచ్చా? నీవిలా అడిగావన్నదే నమ్మశక్యం కావండం లేదు. శ్రీకృష్ణుడి లాంటి పురుషోత్తముడి భార్య అడగాల్సిన ప్రశ్నలేనా ఇవి?” అంటూ సత్యభామతో చనువుగా నవ్వుతూ, మెల్లగా చీవాట్లు పెట్టింది. సత్యభామకేమీ అర్థం కాక ఆశ్చర్యబొతే మరలా ద్రౌపదే సుదీర్ఘంగా చెప్పింది.

మంత్ర తంత్రాలతోనూ, మూలికలతోనూ, ఔషధాలతోనూ భర్త వశమవుతాడనుకోడం తెలివి తక్కువ తనమే కాదు. మూర్ఖత్వం కూడాను. ఔషధాలు ప్రయోగిస్తే, అవి బెడిసి కొట్టి వికటిస్తే భర్తలకి రోగాలు సంక్రమిస్తాయి. తద్వారా అపకీర్తీ, బాధా మిగులుతాయి. ఇలాంటి స్వయంకృతాపరాధాల వల్ల ఒరిగేదీ పుట్టెడు దుఃఖం మాత్రమే! కాబట్టి భర్తల్ని మోసగించే పనులు భార్యలు చెయ్యకూడదు. వారి మనసు తెలుసుకొని మసలాలి. అదే అనుకూల దాంపత్యానికి దారి తీస్తుంది. ఇదే భర్తని ఆకట్టుకునే ఉత్తమ లక్షణమని గ్రహించు. పాండవుల పట్ల నేనెలా ప్రవర్తిస్తానో, ఎలా వారి అనురాగాన్నీ పొందగలిగానో చెబుతాను. విను.

భర్తలు పరాయి స్త్రీలపై అనురక్తులయి ఉంటే వారిపై నేను కోపగించుకోను. కోపగించుకున్నంత మాత్రంచేత నేను వారిని ఆపలేను. ఇవన్నీ చూసి వింతపనులు చేయను. మాటలతో దెప్పను. అది నా నైజం కాదు. ఇవేమీ జరగనట్లుగానే ప్రవర్తిస్తాను. వాళ్ళని ఎప్పటిలాగే చూస్తాను. నా భర్తలు ఒకరి గురించి ఇంకోకరికి నేరాలు చెప్పను. ఒకరి ఎదుట ఇంకొకరి ప్రస్తావనే తీసుకురాను. నాకేదయినా నచ్చనిదుంటే అందరినీ కూర్చోబెట్టి నా మనసులో ఉన్నది నిష్కర్షగా చెబుతాను. నేను నా భర్తల ఎడల తప్పుగా ప్రవర్తించను. అదేవిధంగా వారూ నడచుకునేలా చూస్తాను.

వారికి కావల్సిన సదుపాయాలు అంటే స్నానం, తిండీ, నిద్రలకి కావల్సిన వన్నీ అమరుస్తాను. వీరికేం కావాలన్నా నేనే స్వయంగా చూస్తాను కానీ సేవకుల్ని నియోగించను. అలాగే ఇంటిలో ధాన్యాన్ని కానీ, ధనం కానీ, బంగారం కానీ వ్యర్థం చేయను. అనవసరంగా వెచ్చించను. ఇంటినీ, వంటింటినీ శుభ్రంగా ఉంచుతాను. చుట్టాలందరితోనూ ఎల్లప్పుడూ మంచిగా ఉంటాను.

ఇహ నా సంగతంటావా, నేను పరపురుషులు దేవతలైనా సరే, యక్షులూ, గంధర్వులూ అయినా సరే వారిని గడ్డిపోచతో సమంగా చూస్తాను. వారి యెడల పతిభావన ఎప్పటికీ చేయను. అటువంటి ఆలోచనే రానీయను.

అలాగే ఇతరులతో వాదులాడ్డం, మితిమీరి హాస్యం చెయ్యడం, పరపురుషుల్ని ఆకర్షించుకోవడానికి వారి ఎదుట పలుమార్లు తిరగడం వంటి పనులు చేయను. అలాంటి చర్యల జోలికే పోను.

మా అత్తగారితో పూజ్యభావం కలిగి ఆమెను నొప్పించకుండా నడచుకుంటాను. ఇంటికొచ్చిన అతిధుల్ని పూజ్య భావంతో మర్యాదలు చేస్తాను. క్షమ, సంప్రీతి, వినయం, మంచితనం వంటి గుణాలు వదిలేయకుండా ప్రవర్తిస్తాను. నా భర్తలు చేసే యజ్ఞ యాగాదులకి కావల్సినవన్నీ నేనే స్వయంగా సమకూరుస్తాను. ఇంట్లో ఉన్న అందర్నీ సంతోషంగా ఉంచడం నా కర్తవ్యగా భావిస్తాను.

ధర్మరాజు అంతఃపురంలో నూరువేలమంది సేవకులు పగలూ,రాత్రీ సేవ చేస్తూ ఉంటారు. వారందర్నీ ఓ కంట కనిపెడతాను. వారేం ఉపచారాలు చేస్తున్నారో, అపచారాలు చేస్తున్నారో ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాను. వారందరూ క్రమశిక్షణతో మసలుకునేలా చూస్తాను. అలాగే సేవకులందరికీ భోజన సదుపాయాలందుతున్నాయా, వారికి భత్యాలు అందుతున్నాయా అంటూ ప్రతీ ఒక్కరినీ అడిగి తెలుసుకుంటాను. పనిచేయని వారిని విధుల్నుండి తప్పిస్తాను. వారు తప్పుచేస్తే శిక్షించడానికి వెనుకాడను. ధనాగారంలో వస్తువులూ, నిత్యమూ జరిగే ఆదాయ వ్యయాలన్నీ నాకు తెలీకుండా జరగవు. అంతటా జాగరూకతతో ఉంటాను. కుటుంబాన్నంతటినీ ఈదే దాన్ని నేనే!

ఓ సత్యభామా, ఇలాంటి చర్యల వలనే నా భర్తల అనురాగాన్ని చూరగొలుగుతున్నాను. నీవు చెప్పినట్లుగా వశీకరణ విద్యలూ, ఇంద్రజాల కళలూ నాకు తెలీవు. వారిని వశబరుచుకోడానికి ఏ మూలికలూ వాడను. నా ప్రేమతోనే వారిని బంధిస్తాను.” అంటూ ద్రౌపది తనగురించి చెబుతుంది.

ఇదంతా విని సత్యభామ సిగ్గుతో తలవంచుకుంటుంది. ద్రౌపదిని క్షమాపణడుగుతుంది. ఏదో తెలివితక్కువ తనం వల్ల వశీకరణవిద్యలంటూ అడిగానని, దయతో వాటిని పరిహాసాలుగానే అనుకోమని వేడుకుంటుంది. ద్రౌపది సరేనని శ్రీకృష్ణుణ్ణి ఎలా ప్రేమగా చూసుకోవాలో, తన సవతులతో ఎలా మసలుకోవాలో వివరంగా చెబుతుంది.

ఆ మర్నాడు శ్రీకృష్ణుడూ, సత్యభామా ద్వారకకి శలవు తీసుకున్నట్లుగా చెబుతూ ఆ అధ్యాయం ముగుస్తుంది.

ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి. సత్యభామెప్పుడూ భర్తని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ఆరాటపడుతూ ఉంటుంది. ద్రౌపది దీనికి విరుద్ధంగా కుటుంబాన్ని చక్కదిద్దుతూ భర్తలు తన చెప్పుచేతల్లో నడుచుకునేలా పరిస్థితులు కలగజేస్తుంది.

రెండోది. ద్రౌపది ఇంటినీ, తన చుట్టూ ఉన్న వారినీ, నొప్పించకుండా మెప్పించే చాకచక్య గుణంతో వ్యవహరించడం కనబడుతుంది. అదొక్కటే కాకుండా వినయం, విధేయత ఎక్కడుండాలో చెబుతుంది. పెద్దల ఎడల ఎలా ఉండాలో విశదీకరిస్తుంది. పనివారల ఎడల ఎలా వ్యవహరిస్తుందో చెబుతుంది. కుటుంబ వ్యవహారాలన్నీ తనే నడుపుతున్నాననే భావన కలగజేస్తుంది. భర్తలు తనతో ఎలా ఉండాలని కోరుకుంటుందో, తనూ అదే విధంగా వారితో ఉంటుంది. భర్తలు పరస్త్రీలపట్ల ఆకర్షితులయ్యారని తనూ అదే దారి అవలంబించనని సూటిగానే చెబుతుంది. అలాగే ఎదుటివారి మనస్సు, భర్తలయినా సరే, మార్చడం అంత సులభంకాదని గ్రహింపున్న వ్యక్తిగా ద్రౌపది కనిపిస్తుంది. ఇదంతా చూస్తే ద్రౌపది చాలా తెలివయిన వ్యక్తిగా, ఇంటా, బయటా వ్యవహారాలన్నీ చాకచక్యంతో చక్కబెట్టే స్త్రీ మూర్తిగా వ్యాసుడు చూపించాడు. అరణ్యపర్వంలో కామ్యకవనానికి పాండవుల్ని చూడ్డానికి శ్రీకృష్ణుడొక్కడే రావచ్చును. కానీ వెంట సత్యభామని తీసుకురావడంలో అర్థమూ, ప్రయోజనమూ వేరే ఉన్నాయి. ద్రౌపది ఎంతటి ఉదాత్తమైన స్త్రీయో సత్యభామకీ, తద్వారా మహాభారతం చదివే వారికీ చెప్పడానికే వ్యాసుడు ఇది రాసాడనిపిస్తుంది.

మహాభారతంలో ఈ “సత్యభామా, ద్రౌపదుల సంవాదం” అనే అధ్యాయం ద్వారా ద్రౌపది వ్యక్తిత్వాన్ని వ్యాసుడు ఆమె గొంతుకతోనే పలికించాడు. ఆమె ప్రవర్తననీ, గడిపిన జీవితాన్ని బట్టి చూస్తే ఆమె ఎలాంటి స్త్రీయో తెలుస్తూనే ఉంటుంది. వ్యాసుని దృష్టిలో ద్రౌపది పరిపూర్ణ వ్యక్తి. ఇంతకు మించి భాష్యం అవసరంలేదు. మరోసారి ద్రౌపది వ్యక్తిత్వాన్ని మనం కొత్తగా నిర్వచించ నక్కర్లేదు.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. అబ్రకదబ్ర said

  మహాభారతం ఎవరు ఎలా అర్ధం చేసుకుంటే అలా అర్ధమయ్యే ఉద్గ్రంథం. ద్రౌపది గురించి యార్లగడ్డవారు రాసిన కోణంలో ఇంతకు ముందే ఇతరులూ రాసి ఉన్నారు. నాకు ఇప్పటికిప్పుడు గుర్తొస్తున్న ఉదాహరణ ‘దాన వీర శూర కర్ణ’ సినిమాకి గానూ కొండవీటి వేంకట కవి రాసిన డైలాగులు. ఆ సినిమాలో ద్రౌపది శ్రీకృష్ణుడితో కర్ణుని సైతం భర్తగా పొందాలన్న కోరిక వ్యక్తం చేసే సన్నివేశంపై అప్పట్లోనే నిరసనలు చెలరేగటం, దానికి వేంకట కవి ఏదో వివరణీయటం నేనెక్కడో చదివిన గుర్తు.

 2. ramakrishnarao said

  దీనినిబట్టి మహాభారతం లో ద్రౌపది పాత్ర గురించి యార్లగడ్డ వారు వ్రాసిన రచనకి ఎన్ని మార్కులు వస్తయ్యో ! మూలాన్నే అధికమించారు !

 3. చాలా వివరణ గా వ్రాసారు . నేను శ్రీ మదాంధ్రమహాభారతం – ఆణిముత్యాలు అనే బ్లాగునొకదానిని నిర్వహిస్తున్నాను. ఆ బ్లాగును ఇక్కడ చూడవచ్చు.
  http://sreemadaandhramahaabharatam.blogspot.com/.

  దానిలో ఇప్పటివరకూ ఆది పర్వము మాత్రమే పూర్తి చేయగలిగాను.ప్రస్తుతం గీతామృత తరంగిణి http://sreemadaandhramahaabharatam.blogspot.com/

  అనే బ్లాగును వ్రాసే పనిలో భారతం బ్లాగులో ఈమధ్యన పోస్టులను వేయలేదు. అరణ్యపర్వం పోస్టుచేసేటప్పుడు అరణ్య పర్వంలోని ఈ ఘట్టాన్ని వివరంగా వ్రాద్దామని అనుకున్నాను. ఈ లోపునే ద్రౌపది నవల పైన జరుగుతున్న వాదోపవాదాలలో భాగంగా వాటికి సమాధానరూపంగా మీరు మీ బ్లాగులో ఆ ఘట్టాన్ని చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ఒక చిన్న విన్నపం. మీరు అనుమతిస్తే మీ ఈ బ్లాగు పోస్టునుండి కొన్ని కొన్ని పేరాలు నేను అరణ్య పర్వం లోని ఈ ఘట్టం వ్రాసే సమయంలో కాపీ పేస్టు చేసుకుందామని వుంది.మీరు మీ అనుమతిని కాని అభ్యంతరాన్ని కాని బ్లాగుముఖంగా తెలియజేయ గలరు.

 4. రవి said

  బ్రహ్మానందం గారు, ఇది మీ బ్లాగని తెలియదు. ఇప్పుడే చూస్తున్నాను. నేను మీ అభిమానిని.

  మీ వివరణ చాలా చక్కగా ఉంది. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఇదివరకు దూరదర్శన్ లో ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. అప్పుడు ఆయన ద్వారా ఈ వివరణే విన్నట్టు గుర్తు. ఆయన చెప్పిన వివరణలో ద్రౌపది కర్ణుని మీద మనసుపారేసుకోవటం అపోహ అన్న విషయం కూడా ఉన్నట్టు గుర్తు.

 5. srivasuki said

  మీరు రాసిన విషయం బాగుంది. ఇప్పటి వాళ్ళకి ఏది నిజమో తెలియక పుస్తకలలో చదివినదే నిజమని అనుకొంటున్నారు. ఒక వుదాత్తమైన విషయాన్ని అతి చెత్తగా రాసారు యార్లగడ్డ గారు. నేను ద్రౌపది నవల చదివాను. అంతా కంపు ఆలొచనలు తప్ప పనికొచ్చే విషయం లేదు. దానికి మళ్ళీ అవార్డు ఒకటి. అదిగేవాడు లేడనే ధైర్యం. మీ వివరణ బాగుంది.

 6. madhavaraopabbaraju said

  బ్రహ్మనందంగారికి, నమస్కారములు.

  మీ వివరణాత్మిక వ్యాసం చాలా చక్కగా వున్నది. ఒక పురుషుడుగా, రాజైన దశరధుడు నలుగురు స్త్రీలను వివాహం చేసుకుంటే, పురుషాధిపత్యం కనిపించే సమాజం దానిని తప్పుపట్టదు, కానీ, ఒక స్త్రీ, నలుగురు పురుషులను వివాహం చేస్తుకుంటే మాత్రం తప్పుబట్టి, రంకుని ఆపాదిస్తుంది. సమాజం అప్పటికీ, ఇప్పటికీ మారలేదోమో అని అనిపిస్తుంది.

  భవదీయుడు,
  మాధవరావు.

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: