నాటకరంగం భుజం తట్టుదాం!

 

నాటకరంగం తీరుతెన్నులపై మరో వ్యాసం


ఏడాది క్రితం నాటకరంగంపై ఆంధ్రభూమిలో వచ్చిన వ్యాసం. ఇది చదివి చాట్ల శ్రీరాములు గారు ఇండియా నుండి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు.

ఆంధ్రభూమిలో వచ్చింది ఇక్కడ కూడా చూడచ్చు.
నాటకరంగం భుజం తట్టుదాం!

*******
సుమారు అయిదు నెలల క్రితం మరాఠీ నాటకరంగంలో స్రష్ట లాంటి వ్యక్తి “విజయ్ టెండూల్కర్” చనిపోయారు. ఆయన మరాఠీ నాటక రంగానికందించిన సేవలు అనన్యమన్నది జగద్విదితం. అటువంటి వ్యక్తి మరణించి మరాఠీ నాటక రంగ పెద్దలు సంతాప సభ జరిపితే ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. తోటీ కళాకారుడిపై ఉన్న అభిమానంతో, గౌరవంతో మరాఠీ నాటక రంగానికి చెందిన ప్రతీ కాళాకారుడూ విచ్చేసారు. మహారాష్ట్రాలో మారుమూలునున్న గ్రామాలనుండి నటులూ, అభిమానులూ వచ్చారు. ఇది మరాఠీ నాటకరంగానికి చెందిన ఒక మిత్రుడి ద్వారా తెలిసి చాలా సంతోషించాను. నాటక కళపైనా, తోటి కళాకారునిపై ఉన్న వారి ప్రేమాభిమానాలు చూసి ఆనందించాను. వారి ఐకమత్యం చూసి ముచ్చటేసింది.

అమెరికానుండి పని మీద ఈ మధ్య నేను హైదరాబాదు రావడం జరిగింది. నాటకరంగ మిత్రుల్ని కలవడంకోసం యాదృచ్చికంగా తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. అక్కడ దుగ్గిరాల సోమేశ్వర రావు గారి 77వ జన్మదినోత్సవ సందర్భంగా ఒక కార్యక్రమం జరుగుతోంది. అనుకోకుండా వెళ్ళిన ఈ కార్యక్రమంలో రెండు సంఘటనలు చూసి ఆనందించాను. మరో నాలుగు చూసి నిరాశ పడ్డాను. ఆనందం కలింగించిన వాటిల్లో మొదటిది. తెలుగు నాటకరంగం ప్రముఖ వ్యక్తుల్లో ఒకరైన దుగ్గిరాల వారి పుట్టిన రోజుని పురస్కరించుకొని తోటి కళాకారుడైన కె.యస్.టి.శాయి గారికి ఆత్మీయ పురస్కారం పేరున సత్కారం. రెండోది. నాటకరంగ ప్రముఖుని జన్మదిన సందర్భంగా ప్రముఖ నటులు రావి కొండలరావు బృందంచే నాటక ప్రదర్శన. వయసు శరీరానికి కానీ మనసుకి కాదు అని నిరూపిస్తూ ఇరవై ఏళ్ళ వ్యక్తిలా ఎంతో ఉత్సాహంతో రావి కొండల రావూ, ఆయన సతీమణి రాధా కుమారీ నటించారు. ఈ చిన్న నాటికతో సభ ప్రారంభించడం మెచ్చుకోదగ్గ విషయం. ఈ రెండూ చూసాక తెలుగు నాటకరంగానికి కాస్తైనా జవసత్వాలున్నాయనిపించింది.

ఇహ నీరు కార్చిన మరో నాలుగు విషయాలు. ఈ సభకి పది పుంజీల మంది కూడా జనం లేరు. వచ్చిన వారిలో దాదాపు సగానికి పైగా దుగ్గిరాల వారి అభిమానంతో వచ్చిన వారే! ఇది చూసి పక్కనే ఉన్న నాటకరంగంలో మరో ప్రముఖ వ్యక్తి చాట్ల శ్రీరాములు గార్ని మొత్తం హైద్రబాదులో తెలుగు నాటకరంగానికి చెందిన కళాకారులెంత మందని అడిగితే, దాదాపు రెండు వేల పైగా ఉన్నారని చెప్పారు. అంతమంది ఉంటే అదేమిటి నాటకరంగంలో ఓ కళాకారుడి జన్మదిన సందర్భంగా మరో తోటి కళాకారుణ్ణి సత్కరిస్తుంటే పట్టుమని పదిమంది కూడా లేరేమిటని అడిగితే, ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వులో నిరాశా, నిర్వేదం కనిపించాయి. ఇదే ఏ అమెరికాలోనైనా జరిగితే మొత్తం నాటకరంగంవాళ్ళతోనే సభ నిండిపోతుంది. వారి మధ్య ఎన్ని విబేధాలున్నా ప్రతీ ఒక్కరూ కళనూ, కళాకారుణ్ణీ గౌరవిస్తారు. అది వారి విద్యుద్ధర్మం గా భావిస్తారు. కానీ ఇక్కడ అలా లేదు. ఈ వేడుకలో ఖాళీ కుర్చీల సంఖ్యే నాటక రంగంలో ఉన్న ఐకమత్యాన్ని చెప్పకనే చెబుతోంది. హైద్రాబాదు నగరంలో ఉన్న రెండు వేలమంది కళాకారులూ రావాలని ఆశించడం లేదు. కనీసం అందులో పదో వంతుకూడా రాకపోవడం విచారించదగ్గ విషయం.

నాటకరంగానికి సంబంధించిన నాటకమైనా, కార్యక్రమమైనా తమ సొంత కుటుంబంలో పెళ్ళిలా ప్రతీ కళాకారుడూ అనుకోవాలి. మనింట్లో పెళ్ళికైనా, ఏదైనా కార్యక్రమానికైనా ఎవరైనా రాకపోతే ఆ మర్నాడు వారు ఎదురుపడగానే రాలేదేం? అని అడుగుతాం. అలా అడగడంలో అధికారంకంటే, ఆత్మీయతే ఎక్కువుంటుంది. ఇదే విధంగా ప్రతీ కాళాకారుడూ స్పందించాలి. రాని వారిని ఎందుకు రాలేదో నిలదీయాలి. అప్పుడే తెలుగు నాటకరంగం నిలదొక్కుకుంటుంది. తోటి కళాకారుల్ని గుర్తించలేని ఏ కళా రాణించదు. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఇది ఆ సభకు రాని వాళ్ళ ద్వారా కలిగిన నిరాశ.

ఇహ రెండోది. సభకు విచ్చేసిన ప్రేక్షకుల ద్వారా కలిగింది. వృద్ధాప్యంలో కూడా ఎంతో ఉత్సాహంగా రావి కొండల రావు నాటక ప్రదర్శనిచ్చారు. నాటకం అయిపోయాక నటుల పరిచియం జరిగింది. పరిచయమక్కరలేని రావికొండల రావు గారికి ఓ పంది మంది అతి బలవంతమ్మీద తప్పట్లు కొట్టారు. ఈ తప్పట్ల శబ్దం పాత్రల సంఖ్య పెరిగే కొద్దీ క్షీణిస్తూ వచ్చింది. ఆఖరి నటుని పరిచయమొచ్చేసరికి ఒక్కటంటే ఒక్కటి వినిపించింది. అదీ ఆ సభకు విచ్చేసిన వారి గోలలో కలిసిపోయింది. ఇది మరీ నిరుత్సాహ పరిచిన విషయం. నాటకం ముగిసాక నటుల పరిచయం చేయడానికి ఎంత సేపు పడుతుంది. మహా అయితే అయిదు నిమిషాలు. లేదా పదినిమిషాలు. విచ్చేసిన వారిలో దుగ్గిరాల వారి కుటుంబ సభ్యులూ, మిత్రులూ మినహాయిస్తే సగానికిపైగా నాటకరంగ కళాకారులే! కనీసం తోటి కళాకారుడు చేసిన ప్రయత్నాన్ని హర్షించడాని నోరెలాగూ రాదు. కనీసం చేతులు కూడా రావా? ఇదే పాశ్చాత్య దేశాల్లో అయితే హాలు దద్దరిల్లేలా కరతాళ ధ్వనులుంటాయి. అందరూ నిలబడి మరీ మెచ్చుకుంటారు. దీన్నే “స్టాండిగ్ ఒవేషన్ ” అంటాం. మరీ అంతగా ఆశించడం అన్యాయమైనా కనీసం కూర్చునైన ప్రదర్శనలో పాల్గొన్న కళాకారుల్ని మెచ్చుకోవాలి. అది కళాకారులుగా వారి సభ్యతా సంస్కారానికి గుర్తు. కవులైనా, కళాకారులైనా ఎదుటి వారు మెచ్చుకుంటే ఆనందిస్తారు. అందునా తోటి కళాకారుడు మెచ్చుకుంటే మరీ ఆనందం కలుగుతుంది. ఉత్తేజమొస్తుంది. ఎందుకంటే వారికీ పడ్డ శ్రమ తెలుసు కాబట్టి. మరాఠీ, బేంగాలీ నాటకరంగాలు ఆహా ఓహో అన్నట్లుగా ఉంటాయని వారి తరపున మనం చంకలు గుద్దుకుంటాం. వారి నాటకాలు అరువుతెచ్చుకొని మరీ ప్రదర్శిస్తాం. అంత వరకే ! కానీ వారు పాటిస్తున్న చిన్న చిన్న విషయాలు మనం గమనించం. వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోం. ఇదీ మన నాటకరంగంలో పేరుకుపోయిన దౌర్భాగ్య స్థితి ని చూపిస్తోంది. మెచ్చుకోవడం ఖర్చు లేని పని. దానిక్కూడా నోరు రావడం లేదు. మనం చేయని పనిని ఎదుటివారూ చేయరు. మన సంస్కారాన్నే వారూ పాటిస్తారు. ఇదే విషయాన్ని చాట్ల శ్రీ రాములు గారితో అంటే భుజం తట్టి మళ్ళీ నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వులో నాటకరంగ పరిస్థితి ధ్వనించింది.

నాటకరంగంలో ఉన్న ఏ వ్యక్తిని కదిపినా తెలుగు నాటకరంగం కుళ్ళిపోయిందంటూ, కాళ్ళు విరిగి పోయాయంటూ గుండెలు బాదుకుంటారు. అది మంచిదే! కానీ బాగుపడడానికి మనం ఏం చేస్తున్నాం? ఆలోచించుకోవాలి. చిన్న చిన్న విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తే నాటక రంగం దానంతట అదే బాగుపడుతుంది. కేవలం నాటకం చూడ్డానికి నాలుగు వందల మైళ్ళు కారు నడుపుకొచ్చిన నాటకాభిమానుల్ని అమెరికాలో చూసాను. నలభై డాలర్ల టిక్కట్టుని రెండు వందల డాలర్లకి కొనుక్కుని వెళ్ళిన వాళ్ళనీ చూసాను. ఇక్కడ నాటకాలు చూడ్డానికి ఖర్చు ఎలాగూ లేదు. మరెందుకు నాటకరంగ స్థలాలు వెలవెలబోతాయి. ప్రతీ చోటా గిట్టని వాళ్ళుంటారు. రాజకీయాలుంటాయి. గ్రూపింజాలుంటాయి. కానీ వాటికన్నిటికీ అతీతంగా కళాకారుల సభ్యతా సంస్కారం ఉండాలి. మనల్ని మనమే ప్రోత్షహించుకోక పోతే ఇతరులెలా మెచ్చుకుంటారు?

ఇహ మూడోది. నాటకం అధ్బుతంగా వేసారు. నటులందరూ చక్కగా చేసారు. కానీ ఈ నాటకానికి సంగీతం లేకపోవడం నిరుత్సాహ పరిచింది. ఆహార్యాల్లో ప్రధానమైంది సంగీతం. అది సన్నివేశ నేపథ్యానికీ, పాత్రల ఆహభావాలకి ప్రత్యేకత కలిగిస్తూ నాటకాన్ని మరో మెట్టుకి తీసుకెళుతుంది. సాంకేతిక పరంగా సంగీతం లేని నాటకాలు హత్తుకోవు. ఆహ్లాదం గా ఉండవు. ఈ విషయం అందరికీ తెలుసున్నదే! ఇది అంత ముఖ్యమైనది కాదు అని అనిపించినా నాటకాన్ని జనరంజకం చేయడానికివే ఆయువు పట్టు. సంగీతసహకార లోపం కొట్టచ్చినట్లు కనిపించింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవాలి. అప్పుడే నాటకాలు చూడ్డానికి జనం వస్తారు. ఏదో తూ తూ మంత్రంగా చేస్తే పడ్డ శ్రమా, కష్టం రాణించదు.

చివరగా నాలుగోది. ఇది ఈ కార్యక్రమానికి సంబంధించినది కాకపోయినా చెప్పల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ సభలో కవిత్వానికి సంబంధించిన పుస్తకావిష్కరణ జరిగింది. ఒకప్పుడు సాహిత్యంలో ఉన్న నాటకం ఇప్పుడు వేరయిపోయింది. కవులూ, కథకులూ, నాటక రచయితలూ, సినిమా రచయితలూ, వ్యాసకర్తలూ, విమర్శకులూ అంటూ సాహిత్యాన్ని మనం ముక్కలు ముక్కలుగా చేసి ఆనందిస్తున్నాం. చరిత్ర చూస్తే తెలుగు నాటకాలు కేవలం వందేళ్ళ నాడే ప్రారంభం కాలేదు. దాదాపు 1400 శతాబ్దం నుండీ తెలుగు నాటకాలు ఉన్నాయి. తంజావూరు మరాఠీ పాలకులూ, మధుర నాయకరాజులూ తెలుగు నాటకాల్నీ, యక్షగానాల్నీ ప్రోత్స్తహించారు. ప్రసిద్ధి చెందిన ప్రతీ కవీ నాటకాలు రాసారు. తంజావూరు రాజైన శాహాజీ తెలుగులో ఎన్నో నాటకాలు రాసాడు. అవేకాదు అప్పట్లో రాసిన నాటక ప్రతుల్లో చాలా భాగం ఇప్పుడు లభించడం లేదు. అంతెందుకూ, దాదాపు పదేళ్ళ కాలంలో కొన్ని వందల నాటకాలొచ్చుంటాయి. ఎన్ని ప్రచురణకి నోచుకున్నాయో అందరికీ తెలుసు. అన్ని నాటకాలూ ప్రచురించనవసరం లేకపోయినా కనీసం ప్రసిద్ధి చెందిన నాటకాల ప్రతులు ముందు తరాలవారికి అందాలి. ఎవరైనా నాటకం వేద్దామంటే నాటక ప్రతుల ( స్క్ర్తిప్టు ) కొరత ఎక్కువే. కనీసం నాటకరంగ పెద్దలు నాటక ప్రచురణికి నడుంకడితే ముందు తరాలవారికుపయోగా పడతాయి. నాటకాలు ఎలా రాసేవారూ, ఎలా రాయాలో బోధపడతాయి. కొత్త ఆలోచన్లకి దోహదం చేస్తాయి. నాటక సభల్లో వాటికి సంబంధించిన పుస్తకావిష్కరణలు జరిగితే బావుంటుందన్న ఒక ఆలోచనమాత్రమే!

తెలుగునాటకం చాలా గొప్పది. మిగతా భాషల నాటకరంగాలకి లేని ఒక ప్రత్యేకత తెలుగు నాటకరంగానికుంది. అది పద్య నాటకాలు. పద్యం తెలుగు వారి సొత్తు. పద్య నాటకాలు తెలుగు సాహిత్యంలో కంఠాభరణాలు. ఇంత ఎత్తైన సంపందనీ అందరూ తలో చేయి వేసి కాపాడుకోవాలి. అందుకు నాటకరంగానికి చెందినందరూ ముందుకు రావాలి. ఒకర్నొకరు మెచ్చుకుంటూ, సహకరిస్తూ, ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే పరభాషా నాటక రంగాల స్థాయికి మనమూ చేరుకుంటాం. ఇది ప్రతొక్కరూ, ముఖ్యంగా నాటక కళాకారులు గమనించాలి.

– సాయి బ్రహ్మానందం గొర్తి

ప్రకటనలు

5 వ్యాఖ్యలు »

 1. నమస్కారము 31-1-2010–> 7-2-10 న౦ది నాటకపోటీలు => ఖమ్మ౦ లో
  ~~~~

 2. sai garu!
  Naatakarangam patla meekunaa prema ardhamaindi. aa padi vachinanduku
  santhoshimchalsinde. ippudu kavulu naatakam choodaru..matladaru. nata/darsakulu poetry gurinchi talavaru. prakriyalu vidi poyaae. manushulu
  vidipotunnaru. kalaakarulu manushulekadaa! chooddam..manchi rojulu
  raaka potaya?

 3. బాగుంది.

 4. Bharadwaza said

  saigaru
  meeru ekkada vuntaro naku teliyadu. Kani kevalam oke okka pradarshana to telugu nataka ranganni anchana veyadam tappu. meeru chebutunna nataka ranga peddalu vallu tappa vere vallu vesina natakalaku enni sarlu vacharu? every action has equal and opposite reaction. so ee paristhiti maralanti mukhyamga youth ni encourage cheyali. appadivaraku paristhilo peddaga marpulu vundavu.
  nenu telugulo type cheyalenu. anduke lipi english di vadina bhavan matram telugodige.
  vuntanu.
  Bharadwaza
  Kotha Delhi

  • Admin said

   భరద్వాజ గారూ,

   నేను ఒక నాటకాన్ని ఉదాహరణగా మాత్రమే తీసుకొని చెప్పాను. పరిస్థితి దాదాపు అన్ని నాటకాలదీ అదే! మిగతా నాటకాలూ చూసాను. వాస్తవం ఎప్పుడూ ఘాటుగానే ఉంటుంది. నేను చెప్పినవి ఒకటీ రెండే కనిపిస్తున్నాయి. బయటకి రానివి చాలా వున్నాయి.
   ఏదో రాసెయ్యాలని రాసింది కాదు. నాకు నాటకరంగంతో బాగానే పరిచయాలున్నాయని మాత్రం చెప్పగలను.

   -బ్రహ్మానందం

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: