నామ మాత్రపు నంది నాటకాలు – ఆంధ్రజ్యొతి

 

నంది నాటకం తీరుతెన్నులపై వ్యాసం


ఆంధ్రజ్యోతిలో మార్పులతో వచ్చిన వ్యాసం ఈ క్రింది లింకులో కూడా చదవచ్చు.

ఆంధ్రజ్యొతి – నవ్య


ఆగస్టు నెల వచ్చేసరికి నాటకరంగం వాళ్ళు ఆశగా ఎదురుచూస్తూ వుంటారు, ఎప్పుడు నంది నాటకాల ప్రకటన వెలువడుతుందాని. రెండు రోజుల క్రితమే నంది నాటకాల నిమిత్తమై ప్రభుత్వం ఖర్చు పెట్టే దన్నాన్ని పెంచినట్లుగా ప్రకటన వెలువడింది. ఇంతవరకూ వున్న ఏడు లక్షల్ని రెట్టింపు చేస్తూ పధ్నాలుగు లక్షలకి పెంచారు. ఇదొక మంచి పరిణామం. పారితోషిం పెంచినట్లుగానే నాటకాల ఎంపికలో నాణ్యతని కూడా పెంచేలా చూసే బాధ్యత తెలుగు సాంస్కృతిక విభాగానికీ వుందని ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే నంది నాటకాలు ఎంపికలోనూ, చివరి వడబోతలోనూ, బహుమతుల పంపకాల్లోనూ స్నేహాలూ, చుట్టరికాలూ, లావాదేవీలూ, సిఫార్సులూ, ఒత్తిళ్ళూ ఇవన్నీ సర్వ సామాన్యం అన్న ఒక అభిప్రాయం నాటకరంగంలోనూ, ప్రజల్లోనూ పాతుకుపోయింది. ఏమాత్రం క్వాలిటీ లేని నాటకాలని నందులు వరిస్తున్నాయన్న ఆరోపణ ఎక్కువగానే వుంది.

నంది నాటకాల పేరు చెప్పి పద్యనాటకాలూ, సాంఘిక నాటకాలూ, నాటికలూ వేస్తూ వున్నారు. ఈ నాటకోత్సవాలకీ కొన్ని నియమాలూ, నిబంధనలూ ఉన్నాయి. ముందుగా ఒక రిజిస్టరయిన నాటక సమాజం ద్వారా దరకాస్తు చేసుకోవాలి. దానితోపాటే వారు వేయబోయే నాటక ప్రతి కూడా పంపాలి. వీటిని కొంతమంది ప్రముఖులు వడబోసి కొన్ని నాటకాల రిహార్సల్స్ చూసి, అందులో బావున్న వాటిలో 3 విభాగాలకీ 9 నాటకాల చొప్పున ఎంపిక చేస్తారు. ఈ రిహార్స్లస్ చూసి ఎంపిక చేయడానికొక బృందం నియమిస్తారు. వాళ్ళు ఆంధ్రదేశం నలుమూలల్నుండీ వచ్చిన నాటకాల రిహార్సల్స్ కి వెళతారు. వారి వసతీ, ప్రయాణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. అలా ఎంపికైన 9 నాటకాలూ ఎక్కడ నందినాటకాలు జరిపితే అక్కడ ప్రదర్శిస్తారు. అందులో బావున్న మూడు నాటకాలకి బంగారు, వెండి, కాంస్య నందుల్ని బహుమతులుగా ఇస్తారు. అలాగే నటీనటులకీ, మిగతా కళాకారులకీ బహుమతులుంటాయి. ఈ ఎంపిక విధానం నిజంగా ఒక మంచి పద్ధతి. నాటక సమాజాలవాళ్ళు అందరూ హైద్రాబాదు వచ్చి ప్రదర్శించలేరు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. నాటకరంగానికీ, కళాకారులకీ ఇది చాలా మంచి ప్రోత్సాహం. ఇదొక్కటే కాదు, నంది నాటక ప్రదర్శనకెంపికైన నాటకాలకి ప్రయాణ ఖర్చులు నిమిత్తమై రైల్వే కన్సిషన్లు ఇస్తారు. సుమారు పాతికవేలు ( నాటకాన్ని బట్టి రొక్కం మారుతుంది ) నాటకాలంకరణ నిమిత్తమై ఇస్తారు. ఇన్ని రాయితీలిస్తుంటే నంది నాటకాలు ఎందుకు అంత పల్చబడుతున్నాయి అన్నది నాటకాభిమానుల ప్రశ్న. మంచి నాటకాలు ఎందుకు రావడం లేదు? నాటకరంగం ఎందుకింకా కొన ఊపిరితోనే కొట్టుకుంటోంది? ఈ భేతాళ ప్రశ్నలకి అందరి దగ్గరా సమాధానాలున్నా పైకి చెప్పరు. చెప్పినా పూర్తి నిజం చెప్పరు. చెబితే వాళ్ళ మనుగడకే ముప్పొస్తుందన్న భయమో లేక ఎందుకొచ్చిన సంతన్న అభిప్రాయమో తెలీదు. వెనకాల సణుగుళ్ళే తప్ప ఎవరూ నోరు విప్పరు. నాటకరంగ పెద్దలూ చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఎప్పటికైనా మంచి నాటకాలు రాకపోతాయా అని కొంతమంది నాటకాభిమానులు శబరిలా ఎదురుచూస్తూ వుంటారు. నిన్న వెళ్ళింది, నేడొచ్చింది, రేపొస్తుంది అన్న చందంగా నంది నాటకోత్స్వవాలు తయారయ్యాయి. ఈ నంది నాటకాలే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే తీరు.

నాటకరంగ పెద్దలనెవరినయినా కదిపి చూస్తే – “మంచి నాటకాలు రావడం లేదు. టీవీ చానల్సొచ్చాక నాటకం అంటే ప్రజల్లో ఆసక్తి పోయింది. కాలుకదపకుండా సోఫాలకతుక్కుని టీవీ సీరియల్స్ చూస్తారు కానీ, ధియేటర్ కొచ్చి నాటకం ఎవడు చూస్తాడండీ?” అంటూ వారి నిరాస్క్తతకి వారే జవాబిచ్చేసుకొని సర్దిబెట్టుకుంటారు తప్ప వాళ్ళు ఏం చేస్తే నాటకరంగానికి జవసత్వాలొస్తాయో ఆలోచించరు. పోనే ఏం చెయ్యాలీ అన్నది పదిమందినీ సంప్రదించరు. ఇందులో కులాలూ, కుమ్ములాటలూ, వర్గాలూ, వాదనలూ ఇవన్నీ షరా మామూలే! మరోసారి వాళ్ళనే ప్రశ్నిస్తే “తెలుగు నాటకం ఎప్పుడో చచ్చి పోయింది. మీకు మంచి నాటకాలు కావాలంటే మరాఠీ, బెంగాలీ నాటకాలు చూడండి” అంటూ చేతులు దులుపేసుకుంటారు. నిజమే, మరాఠీ, బెంగాలీ నాటకాలు చాలా బాగా రాణిస్తున్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. మరి మనకున్న టీవీ చానల్స్ వాళ్ళకీ వున్నాయి కదా? మనకున్న కుహనా రాజకీయాలకి ఆ నాటకరంగాలూ అతీతం ఏమీ కావే? అక్కడా లొసుగులూ, కుమ్ములాటలూ ఉన్నాయే? ఇన్ని వున్నా ఆ నాటకరంగాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి? మన నాటకాల్లా ఎందుకు చతికలబడలేదు? ఇవేమీ భేతాళ ప్రశ్నలేం కాదు. నిదానంగా ఆలోచిస్తే ఎవరికైనా తడతాయి. ఎందుకు అవి ఆదరణ పొందుతున్నాయంటే, ఆయా నాటకరంగాల్లో ఎన్ని కుళ్ళు రాజకీయాలున్నా, వాటికంటే అమితంగా నాటకం అంటే అభిమానముంది. ప్రేముంది. ఆరాధనుంది. ఇవేమీ లేకే తెలుగు నాటకరంగం కాటికి కాళ్ళు జాపుకొని కూర్చుంది.

గత పాతికేళ్ళుగా నంది నాటకోత్సవ నిర్వాహకులు నాటకరంగ పెద్దల సంప్రదింపులతోనే ప్రభుత్వం జరుపుతూ వస్తోంది. అప్పుడైనా ఈ పెద్దలు చొరవతీసుకొని నాటకరంగం బాగుపడడానికేమైనా సూచనలిచ్చారా? కేవలం నోటి మాటే కాకుండా ఈ విధంగా జరపండి అని ఒత్తిడి తెచ్చారా? ఈ ప్రశ్నలకి జవాబు అందరికీ తెలుసు. ఇప్పటికీ హైద్రాబాదులో నాటక ప్రదర్శనకి రవీంద్ర భారతి తప్పితే మరో దిక్కు లేదు. తెలుగు లలిత కళాతోరణంలో వున్న చిన్న ధియేటరుకి పట్టుమని వంద మంది వస్తే ఊపిరాడదు. ప్రత్యేకంగా నాటకాలకంటూ హైద్రాబాదులో అన్ని సాంకేతిక హంగులతో ఒక్క ధియేటరు కూడా కట్టించుకోలేకపోయాము. మాకు నంది నాటకాలొద్దు, ఒక్క ధియేటరు కట్టివ్వండి చాలు, మా నాటకాన్ని మేం బ్రతికించుకుంటామన్న నాధుడు లేడు. తెలుగునాటకానికి సొంతిల్లు లాంటి ధియేటరు లేదు. మహారాష్ట్ర లో మరాఠీ ధియేటర్లున్నాయి. బెంగాలులో బెంగాలీ నాటక ధియేటర్లున్నాయి. నాటకం అంటే ఇష్టమున్నవారు అక్కడికే వెళతారు. ఎటొచ్చీ తెలుగునాటకరంగానికే ప్రదర్శించుకోడానికో థియేటరులేదు. ఇది నాటకరంగం యావత్తూ సిగ్గుపడాల్సిన విషయం. రవీంద్ర భారతిలో నానా కార్యక్రమాలూ జరుగుతాయి. ఖాళీ వుంటే నాటకాలు వేస్తారు. ఇదీ పరిస్థితి. తెలుగు నాటక థియేటరు నిర్మించుకునే దిశగా నాటకరంగ పెద్దలు కృషి చేస్తే బావుంటుంది. కంప్యూటర్ సాంకేతిక ఇంజనీర్లని పరాయి దేశాలకి ఎగూమతి చేసే రాష్ట్రాల్లో మన రాష్ట్రమే ముందుంటుంది. కానీ తెలుగు నాటకరంగానికొక వెబ్ సైటు లేదు. అదుంటే నాటకరంగ విశేషాలూ, వార్తలూ, నాటకాలూ అన్నీ పొందుపరచవచ్చు. తెలుగునాటకానికొక వెబ్ సైట్ కావాలి. పదిమందికీ తెలిసేలా ప్రచారం చెయ్యాలి.

నంది నాటకోత్సవాలకి కూడా ఒక వెబ్ సైటుని చేయ్యాలి. ప్రభుత్వం తలుచుకుంటే ఇవేమీ కాలేనివేం కావు. అలాగే నంది నాటకాల ఫైనల్స్ కెళ్ళిన నాటకాలని పుస్తకరూపంలో వచ్చేట్లా చూడాలి. తద్వారా ఆ నాటకాలను భద్రపరిచడమే కాకుండా, ఎవరైనా ఆ నాటకాలు వేయదలుచుకుంటే కనీసం ప్రతులుంటాయి. వివిధ పరిషత్తుల్లో ఏటా కనీసం ఓ ఏభై కొత్త నాటకాలయినా వస్తాయి. అవి వచ్చి వెళతాయి. ఎక్కడా ఎవరికీ ప్రతులు లభ్యం కావు. పుస్తకరూపంలో వుంటే వేరే వూళ్ళలో నాటక సమాజాల వారికి సౌకర్యంగా వుంటుంది.

అలాగే ప్రతీ శనాది వారాల్లోనూ నాటక ప్రదర్శన ( కనీసం హైద్రాబాదు లాంటి నగరాల్లో ) ఖచ్చితంగా జరిగేలా చూస్తే మంచిది. అలాగే సెంట్రల్ యూనివర్శిటీ, తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులకి నాటకంపై ఆసక్తి కలిగించడానికి వారికి కూడా ఈ నంది నాటక పోటీల్లో అవకాశమివ్వాలి.
అంతే కాదు ఈ నంది నాటక పోటీల్లో నిష్పక్షపాతంగా ఎంపిక జరిగేలా చూడడానికి తోడ్పడాలి. మంచి నాటకాలకే బహుమతులొచ్చాయని అందరూ అనుకునేలా ప్రయత్నించాలి. అలాగే ప్రతీ ఏటా ఒకే వర్గానికి నందుల సరఫరా ఆపి, కొత్తవారిని ప్రోత్సహించాలి. నంది నాటకాల్లో నాటకాలకే కాకుండా రచయితలకూ బహుమతులు చేర్చేలా చూస్తే బావుంటుంది. ప్రస్తుతం ఉత్తమ రచన ( స్క్రిప్ట్ ) అంటూ ఒకే బహుమతితో కానిచ్చేస్తున్నారు. అలాకాకుండా ప్రతీ విభాగంలోనూ మూడు బహుమతులు పెడితే ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త నాటకాలు రాయడానికొక ఉత్తేజం వస్తుంది. అలాగే నంది నాటకాలు ఎక్కడ జరిగినా అవి మరలా రవీంద్ర భారతిలో ఒక్క ప్రదర్శనకైనా ఉచితంగా ఏర్పాటు చెయ్యాలి. ఇలా ఒక్కొక్కటీ చేస్తే నాటకం చూడ్డానికి జనం వస్తారు. మంచి నాటకాలతో జనాలని రప్పించుకునేలా చేసే బాధ్యత నాటకరంగంలో ఉన్న ప్రతీ ఒక్కరిదీ! చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. విబేధాలూ, అభిప్రాయబేధాలూ పక్కన బెట్టి నాటకరంగంలో అందరూ కలిసిగట్టుగా కృషి చేస్తేనే నాటకరంగం బాగుపడుతుంది. లేదంటే తెలుగునాటకం చరిత్రలో కలిసిపోతుంది.

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. mee opinion chaala correct. Bhasha/yaasa meeda pattu lekapovadam,
    balamaina scenes create cheyakapovadam, writers problem. actors ki rehaursals kosam manchi place lekapovadam maro problem. acting ni profession ga accept cheyakapovadam maro problem. vyaktigata viluvalu,samaajamlo viluvalu pramaadakara staayee lo padipotunna rojullo manchi natakam ela vastundi? aina ravalane asiddaam.

  2. సాయిబ్రహ్మానందం గారూ, బ్లాగు తెరిచిన సందర్భంగా శుభాకాంక్షలు. స్వాగతం.

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: