పండంటి కథనానికి పన్నెండు సూత్రాలు:

జాజర

పండంటి కథనానికి పన్నెండు సూత్రాలు:

వేంపల్లి షరీఫ్, అరిపిరాల సత్య ప్రసాద్ ఫేసుబుక్ కథా చాయ్ గ్రూపు తరపున హైద్రాబాదులో ఒక చాయ్ మీట్ పెట్టుకున్నారు.
కొత్తగా కథలు రాసే వారికేమయినా సూచనలు ఇవ్వగలారా? అని అడిగితే రాసిందిది. సరదాకి నవ్వుకోడానికి.
ఎవరికైనా చురకలు తగల్తే నా తప్పేమీ లేదు. గమనించగలరు!

పండంటి కథనానికి పన్నెండు సూత్రాలు:

1. కలం, కాగితం ఉన్నా లేకపోయినా అర్జంటుగా బజారు కెళ్ళి ఒక చెత్త బుట్ట కొనుక్కురండి. దీని ఉపయోగం చాలా ఉంటుంది. కలం కంటే ఇదే మీ ఆత్మ బంధువు.

2. కథ రాద్దామనుకొని నిర్ణయం తీసుకున్న ఒక రెణ్ణెళ్ళ వరకూ కలం ముట్టకండి.

3. వార్తా పత్రికల్లో వార్తలు చదవనని ఒట్టేసుకోండి. అల్జీమర్స్ వచ్చి మీకొచ్చిన నాలుగు ముక్కలూ మర్చిపోవడం ఖాయం. కాదని మొండిగా చదివితే మీ పేరు మర్చిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.

4. తెలుగు సినిమాలు చూడ్డం మానేయండి. ఎందుకంటే కథలు రాయాలంటే మీ ఆరోగ్యం బావుండాలి కదా?

5. ఇంగ్లీషు రాకపోతే అర్జంటుగా నేర్చుకోండి. పేరుపొందిన విదేశీ రచయితల రచనలు చదివినా చదవకపోయినా, వాళ్ళ పేర్లూ, వాళ్ళు వాడిన కొటేషన్స్ మాత్రం బట్టీ కొట్టేయండి.
పనిలో పనిగా, అస్థిత్వం, వైయక్తికం, తాత్వికత, ఆధిపత్యవాదం, ఆ వాదం – ఈ వాదం అన్నీ ఎలా వాడాలో నేర్చేసుకోండి.
ముందు ముందు చాలా ఉపయోగపడతాయి.

6. మీరు మగ రచయితలయితే – మీకు పొగత్రాగడం, మందుకొట్టడం వంటి అలవాట్లు లేకపోతే అర్జంటుగా బోణీ కొట్టేయండి. చేతిలో సిగరెట్టు భవిష్యత్తులో మీరు మేధావిగా చెలామణీ అవడానికి ఉపయోగించవచ్చు. మందిలో చేర్చుకోవడానికి మందుకొట్టడం ఒక ప్రత్యేక అర్హత.
మీరు స్త్రీ రచయితలయితే – ఈ సూత్రం మినహాయించుకొని ముందుకు సాగండి.

7. సాహిత్య సభలకీ, సమ్మేళనాలకీ దూరంగా ఉండండి. కాదని మొండిగా వెళితే పైన చెప్పిన 3 – 4 పాయింట్లకొచ్చే పరిణామాలు రెండూ కలిపి బోనస్ గా వస్తాయి. అదనంగా మీ సంపాదన మొత్తం డాక్టర్ బిల్లుకే అంకితమయ్యే చాన్సుంది.
కలిసొచ్చే అదృష్టం ఏవిటంటే మీకు పి.హెచ్.డీ రావడం ఖాయం – సాహిత్యంలో కాదు; పొలిటికల్ సైన్సులో!

8. కథా సంకలనాల సమీక్షలకీ, విమర్శలకీ దూరంగా ఉండండి. ఇవి చదవడం మొదలు పెడితే మీకు డిప్రషన్ వంటివి రావడం ఖాయం. మెంటల్ ఇంబాలెన్స్ వంటివి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

9. పైసా ఖర్చు లేకుండా మీ ఇల్లు గ్రంధాలయంలా తయారవుతుంది – మీ తోటి రచయితల పుస్తకాలతో! తరచు మీ ఇంటికి చిత్తు కాగితాలవాడి విజిట్స్ ఎక్కువవుతాయి.

10. ఆవు ఎంత పౌష్టికాహారం తింటే అంత కమ్మని పాలు ఇస్తుంది. కనిపించిన ప్రతీ కథని మింగేయండి, భాషతో నిమిత్తం లేకుండా! కొన్నాళ్ళ తరువాత మీరు చెత్త ఏరివేయడంలో ఎక్స్పర్ట్ అవడం ఖాయం.

11. పైన చెప్పిన పదీ చదివాకా, ఇంకా మీకు కథ రాయాలన్న దురద మిగిలుంటే శుభం. రాయండి. రాసి, చదవండి. వారం రోజులు దాని జోలికి పోకండి. చెత్త బుట్ట పక్కనే పెట్టుకొని మరలా మరలా చదవండి. ఎవరికయినా ఇచ్చి చదవమనండి. వారం తరువాత వాళ్ళని పరామర్శించి వాళ్ళింకా ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తే అప్పుడు కథని పోస్టు చెయ్యండి.
మీ అమ్మానాన్నలకీ, అన్నకీ, తమ్ముడికీ, అక్కకీ, చెల్లెలకీ, పెళ్ళయితే మీ బెటర్హాఫుకీ పొరపాటున కూడా చూపించకండి. వాళ్ళ పొగడ్త మింగారో అంతే! కళ్ళు పొగ చూరుకుపోయి గుడ్డి వాళ్ళయ్యే ప్రమాదముంది. తస్మాత్ జాగ్రత్త.

12. కథ బాగా రాసావు గురూ అన్న తోటి రచయితల్ని నమ్మకండి. మీకు తెలియకుండానే మీ వీపుమీద చెత్త పోస్టర్లు అతికించేయగలరు.

ముఖ్యంగా – పత్రికల్లో పనిచేసే వాళ్ళతో స్నేహంగా ఉండండి. లేకపోతే మీ కథలకి పుట్టగతులుండవు.

చివరాఖరుగా –
ఈ పన్నెండు సూత్రాలు మీరు తు.చ తప్పకుండా పాటించగలను అనుకుంటే, మీకు కథలు రాయాలన్న దురద తామర పద్మంలా మీ మనసులో వికసిస్తే, ఆలస్యం ఎందుకు. దున్నేయండి. ఏ సాహితీ పొలంలో అవార్డు బిందెలు తగుల్తాయో?

ఏ ముఖ పరిచయం లేని పాఠకులెవరయినా మీ కథ పేరు గుర్తుపెట్టుకొని నచ్చిందని చెబితే అది గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు కథకుడిగా కాళ్ళొచ్చినట్లు తెలుసుకోండి. అంతవరకూ ఎవరెన్ని చెప్పినా మీరు కథాంగవైకల్యంతో ఉన్నట్లే భావించండి.

చివరాఖరు చివరగా – సన్మానాలకి మురిసిపోకండి.
మునగ చెట్టు బరువుని మోయలేదు. పడితే కాళ్ళే కాదు, నడ్డీ విరుగుతుంది.

చివరకి మీ మాట వినే మనిషే మీకు దొరకరు. తస్మాత్ జాగ్రత్త!

లాస్ట్, బట్ నాట్ లీస్ట్ – ఎందుకయినా మంచిది అర్జంటుగా బజారెళ్ళి ఒక పేద్ద కర్చీఫ్ కొనుక్కోండి.
చెకోవ్, కాఫ్కా, టాల్స్టాయ్, గురజాడ, చలం, కొడవటిగంటి వాళ్ళ పక్కన వేసుకోడానికి ఉపయోగించవచ్చు.

అచ్చు కాదు – అస్తు – తథాస్తు!

ఇంకా చెప్పాలంటే – కథాస్తు!!

వ్యాఖ్యానించండి